NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఏపీకి ప్రత్యేక హోదా.. కట్టుబడి ఉన్నామని ప్రకటన
రాజకీయ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది కాంగ్రెస్‌ పార్టీ.. రాయపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.. ప్లీనరీ వేదికగా చేసిన రాజకీయ తీర్మానంలో ఏపీకి “ప్రత్యేక హోదా” అంశం ప్రస్తావించారు.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి కట్టుబడి ఉన్నట్టు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.. ఇక, కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలకు ప్రత్యేక తోడ్పాటు, సహాయం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని తీర్మానంలో పేర్కొంది కాంగ్రెస్‌.. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్దరిస్తామని ప్రకటించింది.. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను కల్పిస్తామని తీర్మానంలో ప్రస్తావించారు.. లడక్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలోకి చేర్చి, లడక్ ప్రాంత ప్రజల హక్కులను పరిరక్షిస్తామని ప్రకటించింది కాంగ్రెస్‌ పార్లీ ప్లీనరీ..

పిన్నెల్లి సంచలన వ్యాఖ్యలు.. నన్ను ఓడిస్తే రాజకీయాలకు గుడ్‌బై..
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓటమి అంటే తెలియని రాజకీయ చరిత్ర నాదన్న పిన్నెల్లి.. 2004 నుంచి 2024లో కూడా విజయం నాదేనని ధీమా వ్యక్తం చేశారు.. 2024లో నన్ను ఓడించగలిగితే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.. నా మీద నలుగురు అభ్యర్థులను టీడీపీ నాయకులు రంగంలోకి దించారు.. అందరూ నా చేతిలో ఓడిపోయిన వారేన్న ఆయన.. మాచర్లలో జరుగుతున్న ప్రతి చిన్న సంఘటన రాజకీయంగా నాపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలుగుదేశం పార్టీ నేతలు బెదిరింపులు చూసి ఇక్కడ ఎవరూ బెదిరిపోయే వాళ్లు లేరంటూ వార్నింగ్‌ ఇచ్చిన పిన్నెల్లి.. జరుగుతున్న అభివృద్ధిపై అంకెలతో సహా చర్చకు సిద్ధం అంటూ సవాల్‌ విసిరారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న మాచర్ల నియోజకవర్గంలో 930 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు పేదలకు అందించామని ప్రకటించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అని వెల్లడించారు.. టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.. ఇక, మిరియాల గ్రామంలో జరిగిన ట్రాక్టర్ దగ్ధం ఘటన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సంబంధం లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

కామెడీ.. జూ.ఎన్టీఆర్‌ను లోకేష్‌ పార్టీలోకి ఆహ్వానించడం ఏంటి..?
జూనియర్ ఎన్టీఆర్‌ని లోకేష్ పార్టీలోకి ఆహ్వానించడం అతి పెద్ద జోక్‌గా అభివర్ణించారు వల్లభనేని వంశీ.. టీడీపీని స్థాపించింది జూనియర్ ఎన్టీఆర్‌ తాత సీనియర్ ఎన్టీఆర్.. కానీ, లోకేష్ తాత ఖర్జూరపు నాయుడు కాదన్నారు.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేష్ ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన.. లోకేష్ కు ఇంకా బొడ్డూడనప్పుడే జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి టీడీపీ కోసం పని చేశారన్నారు.. తన తాత పెట్టిన పార్టీని జూనియర్ చూసుకోగలరు అని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ మోహన్‌.. మరోవైపు.. చంద్రబాబు గన్నవరమే కాదు.. ఎక్కడికైనా వెళ్లొచ్చు. రాకెట్ నడుముకు కట్టుకుని ఆకాశానికి ఎగరొచ్చు.. గొదాట్లో దూకి కుక్క తోక పట్టుకోవచ్చు.. సెక్షన్ 144 ఉన్నప్పుడు పోలీసులు కొంత మేర నియంత్రిస్తారు.. గతంలో ముద్రగడను.. మంద కృష్ణను పర్యటించకుండా చంద్రబాబు ఆపలేదా..? అని ప్రశ్నించారు..

ఇంద్రకీలాద్రిపై కలకలం.. క్యూలైన్‌లోకి వచ్చిన పాము
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పాము కలకలం సృష్టిచింది.. దుర్గగుడిలో ఉచిత క్యూలైన్‌లోకి పాము పిల్ల వచ్చింది.. కిటికీలో నుంచి క్యూలైన్‌లోకి కట్ల పాము వచ్చినట్టు చెబుతున్నారు.. అయితే, పాము చూసిన భక్తులు.. భయంతో పరుగులు తీశారు.. క్యూలైన్‌లో ఉన్న భక్తులు పామును చూసి వణికిపోయారు.. కొందరు కేకలు వేశారు.. అయితే, వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది.. కర్ర సాయంతో పామును కిటికీలో నుంచి బయటకి పంపించారు.. ప్రమాదం తప్పడంతో క్యూలైన్‌లో ఉన్న భక్తులతో పాటు.. ఆలయ సిబ్బంది, దుర్గగుడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు..

కూల్చుతామంటున్న బీజేపీ కావాలా.. నిలబెట్టే కేసీఆర్ కావాలా?
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మార్కెట్ యార్డ్‌లో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ నాలుగేళ్ల పాలనలో ఒక్క రూపాయి పని చేయలేదని విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనుల్లో 10 కిలోమీటర్ల పనికిగాను 9 కిలోమీటర్ల 700 మీటర్ల పని పూర్తయింది, మిగిలిన 300 మీటర్ల పనిని 45 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పండుగ వాతావరణంలో గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని అన్నారు. హుస్నాబాద్ గడ్డమీద పుట్టిన వాళ్ళు, గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అడ్డుకోరని పిలుపునిచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అంటే చింత అని, కానీ నేడు సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం అంటే నిశ్చింత అని వెల్లడించారు.

కోహ్లీ కన్నా బాబర్ బెటర్.. డేవిడ్ షాకింగ్ కామెంట్స్
ఇప్పుడు క్రికెట్ వరల్డ్‌లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఉత్తమ ఆటగాళ్లు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అఫ్‌కోర్స్.. రికార్డుల పరంగా ఇద్దరి మధ్య భూమికి, ఆకాశానికి అంత తేడా ఉన్నప్పటికీ.. బెస్ట్ బ్యాట్స్‌మెన్ ప్రస్తావన వస్తే మాత్రం వీళ్లిద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే.. కొందరు మాత్రం అప్పుడప్పుడు అత్యుత్సాహంలో కోహ్లీ కంటే బాబర్ బెటర్ అని చెప్తుంటారు. ముఖ్యంగా.. పాకిస్తానీయులైతే తమ బాబరే గొప్ప ఆటగాడంటూ డప్పులు కొట్టుకుంటుంటారు. తమ వాళ్ల గురించి తాము గొప్పగా చెప్పుకోవడం సాధారణమే! కానీ.. క్రికెట్ ఫీల్డ్‌లో ఉంటూ కూడా కొందరు కోహ్లీ, బాబర్‌ని పోలుస్తూ చేసే వ్యాఖ్యలే హాస్యాస్పదంగా అనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు కోపం కూడా తెప్పిస్తాయి. ఇందుకు లేటెస్ట్‌గా సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలనే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్లర్‌కు కోహ్లి, బాబర్‌ సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. కవర్‌డ్రైవ్‌ షాట్‌ విషయంలో ఆ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించారు. అందుకు మిల్లర్ బదులిస్తూ.. బాబర్ ఆజం అని సమాధానం ఇచ్చాడు. అతడు కొట్టే కవర్‌ డ్రైవ్‌ షాట్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. కోహ్లీతో పోలిస్తే బాబర్ చాలా బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో.. కోహ్లీ అభిమానులు డేవిడ్ మిల్లర్‌ను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడుతున్నంత మాత్రాన.. బాబర్‌కు మద్దతుగా కోహ్లీని తక్కువ చేసి మాట్లాడుతావా? అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చూస్తుంటే.. తాను చేసిన ఈ వ్యాఖ్యలు అతనిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌‌లో మిల్లర్ ‘మూల్తాన్‌ సుల్తాన్స్‌’కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఉద్యోగులకు జీతాల్లేవ్.. చెల్లించే స్థితిలో లేని పాక్..
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పొరుగు దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తోంది. 1.1 బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ ఇస్తేనే ప్రస్తుతం పాకిస్తాన్ బతికిబట్టకడుతుంది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన షరతులు కఠినంగా ఉన్నా కూడా పాక్ సర్కార్ అంగీకరించాల్సి వస్తోందని సాక్షాత్తు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ అన్నారు. ఈ షరతుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచుతోంది. ఇప్పటికే ధరలు పెరిగి కష్టాల్లో ఉన్న పాక్ ప్రజలు మరింత కష్టాల్లోకి నెట్టేయబడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ తన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలిచ్చే పరిస్థితిలో లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం జీతాలతో సహా బిల్లుల క్లియరింగ్‌ను నిలిపివేయాలని అకౌంటెంట్ జనరల్‌ను ఆదేశించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు అన్ని బిల్లుల క్లియరింగ్ ను నిలిపివేయాలని ఆర్థిక, రెవెన్యూ మంత్రిత్వశాఖ అకౌంటెంట్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ రెవిన్యూస్ ను ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే రక్షణ సంబంధిత సంస్థల జీతాలు, పెన్షన్లు వచ్చే నెలలకు సంబంధించించి ఇప్పటికే క్లియర్ చేయబడ్డాయి.

66 గంటలు 37 భూకంపాలు.. వణికిపోతున్న టర్కీ..
టర్కీ దేశాన్ని వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ నెల తొలివారంలో టర్కీని 7.8, 7.5 తీవ్రతతో ఉన్న రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్రంగా దెబ్బతీశాయి. టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియాలో కూడా తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టాలు వాటిల్లాయి. కొన్ని రోజలు వ్యవధిలోనే 1000కి పైగా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం ఏకంగా 5-6 మీటర్ల వరకు పక్కకు కదిలింది అంటే ఎంత శక్తితో భూకంపాలు వచ్చాయో తెలుస్తోంది. ఇదిలా ఉంటే టర్కీని భూకంపాలు వదలడం లేదు. గడిచిన 66 గంటల్లో 37కి పైగా భూకంపాలు టర్కీలో నమోదు అయ్యాయి. దీంట్లో 5.5 తీవ్రతతో శనివారం మరో భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కీ ప్రాంతంతో ఈ భూకంపం సంభవించింది. ఫిబ్రవరి 6న వచ్చిన భూకంపాల వల్ల ఇప్పటి వరకు టర్కీ సిరియాల్లో కలిపి 50,000 మంది మరణించారు. ఇందులో ఒక్క టర్కీలోనే 45 వేల మంది మరణించారు. 1.5 మిలియన్ల మంది నిరాశ్రయులు అయ్యారు. ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపాలలో 5,20,000 అపార్ట్‌మెంట్లతో కూడిన 1,60,000 భవనాలు కూలిపోయాయి. తాజాగా శనివారం టర్కీ ప్రభుత్వం భూకంప బాధితుల కోసం కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇది మొదలుపెట్టిన రోజే మరోసారి భూకంపాలు రావడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏకంగా కొన్ని గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో భూకంపాలు వచ్చాయి.

చేతబడి చేస్తా, యాసిడ్ పోస్తా.. యాంకర్ రష్మీకి బెదిరింపులు
సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు హద్దుమీరుతుంటారు. తారల్ని టార్గెట్ చేసి, వారిపై దారుణమైన కామెంట్స్ చేస్తుంటారు. మంచి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్పందించినా సరే, ‘అవన్నీ నీకెందుకు’ అన్నట్టుగా ఘాటు వ్యాఖ్యలతో ఎగబడుతుంటారు. కొందరైతే బెదిరింపులకు కూడా దిగుతుంటారు. ఇలాంటి అనుభవాల్ని పెద్ద పెద్ద సినీ తారలు సైతం ఎదుర్కున్నారు. ఇప్పుడు రష్మీ గౌతమ్‌కి అలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఓ నెటిజన్ చేతబడి చేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే.. ఇటీవల వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రష్మీ గౌతమ్ తనదైన శైలిలో స్పందించింది. ఈ దాడిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే.. శునకాలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలని ట్వీట్‌ చేసింది. దీనికితోడు.. గోసంరక్షణ మీద కూడా ట్వీట్ చేసింది. ఈ భూమ్మీద కేవలం మనుషులమే బతుకుతున్నామా? జంతువుల పట్ల మనం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? మన స్వార్థం కోసం వాటిని ఇబ్బందులకు గురి చేస్తున్నామంటూ ట్వీటింది. ఈ ట్వీట్లపై కొందరు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొందరు మాత్రం నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడెలా మాట్లాడాలో తెలీదా? అంటూ ప్రశ్నించారు. అయితే.. ఓ నెటిజన్ మాత్రం హద్దు మీరి ప్రవర్తించాడు. బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఆ ఘటన సాధించిన మొదటి ఇండియన్ హీరో చరణ్ మాత్రమే…
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ట్విట్టర్ నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకూ ఎన్ని చోట్ల ఉన్నా ఏకైక మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ ‘రామ్ చరణ్’. RC 15 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన చరణ్, అక్కడ ముందుగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ABC న్యూస్ ఇంటర్వ్యూకి గెస్టుగా వెళ్లి… “రాజమౌళిని ఇండియన్ స్పీల్బర్గ్” అంటూ సూపర్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. ఇక్కడి నుంచి చరణ్ పేరు సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ రోజు రాం చరణ్ తేజ్, జక్కన్నతో కలిసి ‘బెవర్లీ హిల్స్‌’లో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు మెయిన్ కేటగిరిల్లో అవార్డులని గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించింది. HCAలో ‘స్పాట్‌లైట్’ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ తేజ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రెస్టీజియస్ అవార్డ్ గెలుచుకోవడమే కాదు ‘హాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్స్’ ఈవెంట్‌లో అవార్డును అందజేసే అవకాశాన్ని అందుకున్న ఏకైక భారతీయ హీరోగా కూడా రామ్ చరణ్ రికార్డులకి ఎక్కాడు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా రామ్ ట్వీట్ చేసినట్లు “చరణ్‌ నిజంగానే గ్లోబల్ స్టార్ ఇమేజ్”ని సొంతం చేసుకున్నాడు. ఫ్యూచర్ లో చరణ్ మరిన్ని హ్యుజ్ ప్రాజెక్ట్స్ చేసి ఇంటర్నేషనల్ ఐడెంటిటీని నిలుపుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.