NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

మరో మూడు నోటిఫికేషన్‌లు విడుదల చేసిన TSPSC
న్యూ ఇయర్‌ వేళ టీఎస్పీఎస్సీ మరో మూడు నోటిఫికేషన్ లు విడుదల చేసింది. పురపాలక శాఖలో 78 అకౌంట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. జనవరి 20 నుండి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే.. దీంతో పాటు.. కళాశాల విద్యాశాఖలో 544 పోస్ట్ లు(491 డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లు) భర్తీకి మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది TSPSC. అయితే.. జనవరి 31 నుండి ఫిబ్రవరి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇవే కాకుండా.. ఇంటర్మీడియట్ విద్యలో 40, సాంకేతిక విద్యలో 31 లైబ్రేరియన్ పోస్ట్ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. వీటికోసం జనవరి 21 నుండి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌లకు సంబంధించిన పరీక్షలు మే, జూన్‌ నెలల్లో ఉంటాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న సైతం టీఎస్పీఎస్సీ గ్రూపు-3 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-3కి సంబంధించిన 1,365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీవరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఆటోపై పడిన బండరాయి.. 8 మంది అక్కడిక్కడే మృతి
బండి రాయి రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు తీసింది.. మహబూబాబాద్‌ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.. గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ లోని బండ రాయి.. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై పడిపోయింది… కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. కూలీ పనులకు వెళ్లి.. ఆ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కూలీలు.. ఓ ఆటోలో ఎక్కారు.. అయితే, పెద్ద బండరాయి ఆటోపై పడడంతో.. అక్కడికక్కడే 8 మంది మృతిచెందారు.. ఈ ఘటనలో పలువురు తీవ్రగాయాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది.. మృతులంతా చిన్నగూడూరు మండలం జయ్యారం శివారులోని మంగోరి గూడెంకు చెందినవారిగా చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

1 పైస, 5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం..
నంద్యాల పద్మావతి నగర్‌లోని ఓ రెస్టారెంట్ ఐదు పైసలకే బిర్యానీ ఆఫర్‌ తెచ్చింది.. పాతకాలం నాటి ఒక పైసా, ఐదు పైసల నాణెం ఇస్తే బిర్యాని ఫ్రీ అని ప్రకటించింది యాజమాన్యం.. దీంతో.. వందలాది మంది తరలివచ్చారు.. యువకులు, మహిళలు.. ఇలా పెద్ద సంఖ్యలో క్యూకట్టారు.. అది కాస్తా తోపులాటకు దారితీసింది.. ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.. దీంతో, రెస్టారెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.. ఆఫర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేశారు యువకులు.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో.. గుంపులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీఛార్జ్‌ చేశారు పోలీసులు.. చివరకు రెస్టారెంట్ ను మూయించారు పోలీసులు.. రెస్టారెంట్ పై కేసులు పెడతామని తెలిపారు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి..

పెన్షనర్లకు న్యూఇయర్‌ కానుక..
పెన్షనర్లకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పెన్షన్‌ను దశల వారీగా పెంచుతామని, మొత్తం రూ. 3,000 అందిస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఆ హామీ మేరకు ఏటా రూ. 250 చొప్పున పెన్షన్‌ను పెంచుతూ వస్తున్నారు.. అందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. పాత లబ్దిదారులే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల మందికి కూడా పెన్షన్ మంజూరు చేసింది సర్కార్‌.. ఆదివారం అయినప్పటికీ.. జనవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్‌ పంపిణీ ప్రారంభించనున్నారు.. ఇక, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ వారోత్సవాలు నిర్వహించబోతున్నారు.. జనవరి 1 వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు పెన్షన్ వారోత్సవాలు జరగనున్నాయి.. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలో పెన్షన్ వారోత్సవాలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొనబోతున్నారు. అయితే, పెన్షన్ మొత్తం ఇప్పటి వరకు రూ. 2,500 ఉండగా.. రేపటి నుంచి రూ.250 పెరగనుంది.. దీంతో.. లబ్ధిదారులకు రూ.2,750 చొప్పున పంపిణీ చేయనున్నారు.. 2,31,463 మందికి కొత్త పెన్షన్లు కలుపుకుంటే.. మొత్తం 64.06 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తారు.. దీని కోసం జగన్మోహన్‌రెడ్డి సర్కార్ రూ.1765 కోట్లు ఖర్చు చేస్తోంది.. కాగా, వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్న విషయం విదితమే.. సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా.. అమలు చేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్.

తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ తరువాత డైరెక్ట్‌ సాఫ్ట్‌వేర్‌ జాబ్
ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతి ఏటా ఇరవై వేల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఈ సదుపాయం కల్పిస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం, హెచ్ సీఎల్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం గణిత పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని, ఈ పరీక్షలో కనీసం 60 మార్కులు సాధించిన అభ్యర్థులను వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని సబితారెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఆన్‌లైన్ శిక్షణ అందించి, శిక్షణ పూర్తయిన తర్వాత ఆరు నెలల పాటు హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించడంతోపాటు నెలకు రూ.10,000 స్టైఫండ్ అందజేస్తారు. ప్రొబేషన్‌ తర్వాత ఏడాదికి రూ.2.5 లక్షల వేతనంతో ఉద్యోగం పర్మినెంట్‌ చేయబడుతుంది. అదే సమయంలో, విద్యార్థులు పని చేస్తున్నప్పుడు BITS, సైన్స్ మరియు AT విశ్వవిద్యాలయాలలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీని అభ్యసించవచ్చు. గ్రామీణ పేద విద్యార్థులకు ఇదో సువర్ణావకాశమని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి నిర్వహించే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పటిష్ట పర్యవేక్షణలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

బైరి నరేష్‌కు 14 రోజుల రిమాండ్
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న బైరి నరేష్ నేడు వరంగల్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ, అయ్యప్ప స్వామి పుట్టుకను అవమానిస్తూ, అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు బైరి నరేష్‌. దీంతో అయ్యప్ప స్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నడిరోడ్డుపై బైరి నరేష్‌ అనుచరుడు శంకర్‌పై అయ్యప్ప స్వాములతో పాటు పలువురు దాడి చేశారు. అయితే.. నరేష్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు చేశారు. అంతేకాకుండా.. బైరి నరేష్‌పై పలు చోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటి నుంచి బైరి నరేష్ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నేడు వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడికి కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపర్చడంతో.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బైరి నరేష్‌ను పరిగి సబ్ జైలుకు తరలించారు. జైలుకు తరలించే క్రమంలో పోలీస్ వాహనాలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు జైలు వద్దకు భారీగా తరలిరావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మూడు పిల్లలకు జన్మనిచ్చిన స్నైఫర్ డాగ్‌.. విచారణకు ఆదేశించిన న్యాయస్థానం
మేఘాలయలోని స్నైఫర్ డాగ్‌లలో ఒకటి మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత సరిహద్దు భద్రతా దళం కోర్టు విచారణకు ఆదేశించింది. డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి ఈ విషయంపై నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 19న స్టేషన్ హెడ్ క్వార్టర్స్ బీఎస్‌ఎఫ్‌ షిల్లాంగ్ ఆర్డర్‌కు అనుగుణంగా.. యూనిట్‌లోని డిప్యూటీ కమాండెంట్ ఒక సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని నిర్వహించి ఆడ కుక్క లాల్సీ ప్రసవించిన పరిస్థితులను పరిశోధిస్తారు. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు బోర్డర్ అవుట్ పోస్ట్ బాగ్మారా వద్ద ఆ కుక్క మూడు పిల్లలకు జన్మనిచ్చింది. “అన్ని విధాలుగా పూర్తి చేసిన సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ప్రొసీడింగ్‌ను 30 డిసెంబర్ 2022 నాటికి స్టేషన్ హెడ్ క్వార్టర్స్ బీఎస్‌ఎఫ్‌ షిల్లాంగ్‌కు సమర్పించాలని ఆ ఆర్డర్‌లో వెల్లడించింది. ఉన్నత శిక్షణ పొందిన బీఎస్‌ఎఫ్‌ కుక్కలను వాటి హ్యాండ్లర్ల పర్యవేక్షణలో ఉంచుతామని, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి తెలియజేశారు. “ఈ కుక్కలు ఎప్పుడూ ఇతర కుక్కలతో సంబంధంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో పెంపకం జరుగుతుంది” అని సీనియర్ బీఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. ఈ కుక్కను భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విధుల్లో మోహరించారు.

డిప్యూటీ మేయర్‌గా పారిశుద్ధ్య కార్మికురాలు
గత 40 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిన మహిళను ఉన్నత పదవికి ఎన్నుకోవడం ద్వారా బీహార్‌లోని గయాలో జరిగిన పౌర సంస్థల ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గయా డిప్యూటీ మేయర్‌గా చింతాదేవి ఎన్నికయ్యారు. అయితే ఇలాంటి మైలురాయి గయాకు కొత్త కాదు. వృత్తి రీత్యా స్టోన్ క్రషర్ అయిన అత్యంత అట్టడుగున ఉన్న ముసహర్ కమ్యూనిటీకి చెందిన భగవతీ దేవి, 1996లో నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) పార్టీ తరఫున పోటీ చేసి గయా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.”గయా అనేది ప్రజలు జ్ఞానోదయం కోరుకునే ప్రదేశం, అలాగే ఒక ముసహర్ మహిళ లోక్‌సభకు వెళ్లే ప్రదేశం కూడా ఇదే. ఈసారి ఇక్కడి ప్రజలు చింతా దేవిని ఎన్నుకోవడం ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ మరుగుదొడ్లు తక్కువగా ఉన్నప్పుడు పారిశుద్ధ్య సిబ్బందిగా తలపై మానవ మలాన్ని మోసుకెళ్లేవారు. ఇది చారిత్రాత్మకం.” అని గయా మేయర్‌గా ఎన్నికైన గణేష్ పాశ్వాన్ అన్నారు. చింతా దేవి పారిశుద్ధ్య కార్మికురాలిగా, కూరగాయల అమ్మకందారుగా కూడా పనిచేశారు. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ కూడా చింతాదేవికి మద్దతు పలికారు. ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించారని, నగర ప్రజలు, అణగారిన వర్గాలకు అండగా ఉంటారని, వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని అన్నారు.

క్రీడా మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తామని చండీగఢ్ పోలీసులు శనివారం తెలిపారు. రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గురువారం ఈ ఆరోపణ చేయగా, ఒక రోజు తర్వాత ఆమె ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించింది.అయితే మంత్రి ఈ ఆరోపణలను నిరాధారమైనదని తోసిపుచ్చారు. దీంతో పాటు స్వతంత్ర విచారణకు పిలుపునిచ్చారు.”ఫిర్యాదు దాఖలు చేయబడింది. అన్ని కోణాల్లో విచారణ నిర్వహించబడుతుంది” అని హర్యానా క్రీడా విభాగంలో కోచ్ అయిన మహిళ ఫిర్యాదును స్వీకరించిన పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. తన ప్రతిష్టను దిగజార్చినందుకు ఆమెపై ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత సందీప్ సింగ్ కూడా చెప్పారు. హర్యానా క్రీడామంత్రి సందీప్ సింగ్ నుంచి కూడా ఫిర్యాదు స్వీకరించబడిందని అదనపు డీజీపీ మమతా సింగ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తుకు అదనపు డీజీపీ నేతృత్వంలో హర్యానా డీజీపీ పీకే అగర్వాల్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఆరోపణలు సోషల్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడా హల్‌చల్‌ చేస్తున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలో పంచకుల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమేర్ పర్తాప్ సింగ్, పంచకుల అసిస్టెంట్ కమిషనర్ రాజ్ కుమార్ కౌశిక్ సభ్యులుగా ఉన్నారు.

Show comments