ఏపీ ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల
ఇంటర్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న పరీక్షల తేదీలు రానేవచ్చాయి.. ఏపీ ఇంటర్ 2023 పరీక్షలకు సంబంధించిన టైంటేబుల్‌ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు.. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న పరీక్ష.. మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. మరోవైపు, ఏప్రిల్ నుంచి మే నెల రెండో వారం వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది ఇంటర్మీడియట్ బోర్డు.. ఇక, ఏ తేదీన ఏఏ పరీక్షలు జరగనున్నాయి.. సమయం ఏంటి? ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష తేదీలు ఎప్పుడు..? రెండో సంవత్సరం ఎగ్జామ్స్ ఎన్నడు నిర్వహించనున్నారు.. ఇలా పరీక్షలకు సంబంధించిన పూర్తి టైంటేబుల్‌ను కింది టేబుల్‌లో పరిశీలించవచ్చు.
టీటీడీ ఈవో కీలక సూచనలు.. అలా అయితేనే తిరుమలకు రావాలి..!
తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. తిరుమలలో సర్వదర్శనం క్యూ లైనలను పరిశీలంచిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.. ఇక, సర్వదర్శనం భక్తులకు జనవరి 1వ తేదీన తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ద్వారా టోకేన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.. సర్వదర్శనం భక్తులు టోకెన్ పొందిన తర్వాతే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు రావాలని.. వారికి కేటాయించిన సమయానికి కృష్ణతేజా అతిధి గృహం వద్ద క్యూ లైనులోకి చేరుకోవాలని సూచించారు.. అంటే టోకెన్ పొందిన వారే తిరుమలకు రావాలని స్పష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
కాపులు ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇక దిగరని వారికి భయం..!
విశాఖ వేదికగా జరుగుతోన్న కాపునాడు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… కాపులు ఒకసారి అధికారంలోకి వస్తే ఇక దిగరని తెలిసి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏ సామాజిక వర్గానికి కాపలా కాయాల్సిన అవసరం లేదని అన్ని పార్టీల్లో నేతలు గుర్తించాలన్న ఆయన.. స్టాలిన్ సినిమాలో విలన్‌ను గిరిలో పెట్టినట్టు.. కాపు నాయకులను గిరిగీసి పెట్టారు అంటూ ఆరోపించారు.. అందుకే వంగవీటి రంగా వర్ధంతికి రాకుండా నియంత్రణ చేశారన్న ఆయన.. సామాజిక న్యాయం కావాలంటే పార్టీలు గీసే గిరి దాటి బయటకు రావాలని పిలుపునిచ్చారు.. కాపులకు అధికారం లేని పదవులు వస్తున్నాయి.. సభకు రావొద్దంటే పదవులకు ఆశపడ్డ నేతలు డుమ్మా కొట్టారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నాయకుడు వంగవీటి రంగా అని పేర్కొన్న ఆయన.. రంగా హత్య దారుణమైన హింసాత్మక ఘటన.. రంగా ఎదుగుదలకు భయపడ్డారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన సత్తా ఏంటో.. మూడు సార్లు.. ముప్పై సార్లు గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కనుమరుగయ్యారు.. కానీ, రంగా ఎప్పటికీ నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. ఇక, బీసీ-డీ రిజర్వేషన్లు పొందడం ఉత్తరాంధ్రలో ప్రతీ కాపు హక్కు అని స్పష్టం చేశారు జీవీఎల్ నరసింహారావు.. కులం కోటాలో పోస్టులు తెచ్చుకుంటున్న మంత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికిన ఆయన.. మంత్రులు అధినాయకత్వం గీసిన గిరిదాటి బయటకు వస్తే రాజకీయం ఏంటో అర్ధం అవుతందన్నారు. అసలు, వంగవీటి మోహన్ రంగా పేరు జిల్లాకు ఎందుకు పెట్టలేదు..? అని నిలదీసిన ఆయన.. ఈ డిమాండ్ ను వినిపించడంలో కాపు నాయకులు విఫలం అయ్యారంటూ ఫైర్ అయ్యారు.. వంగవీటి రంగా విగ్రహాన్ని ఆర్కే బీచ్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.. కాపు నాడు తీర్మానం చేయాలని సభలో సూచించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇక, ఎంపీ జీవీఎల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది కాపునాడు సభ.. ఈబీసి రిజర్వేషన్ల గురించి రాజ్యసభలో చర్చించారు జీవీఎల్.. రిజర్వేషన్లపై ప్రధాన పార్టీల ఎంపీలు స్పందించలేదని కాపునాడు అసంతృప్తి వ్యక్తం చేసింది.. జాతి చిరకాల కోరికైనా రిర్వేషన్ల అంశం సాకారం అయ్యేవరకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.. కాపు రిజర్వేషన్ల గురించి పార్లమెంటులో ప్రస్తావించిన జీవీఎల్‌ను సన్మానించింది కాపునాడు.
బీజేపీని ప్రజలు మరోసారి తిరస్కరించారు
వేములవాడ సెస్ ఎన్నికల్లో తమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సెస్ ఎన్నికల ఫలితాలతో బీజేపీని ప్రజలు మరోసారి తిరస్కరించారన్నారు. అడ్డదారుల్లో గెలుపు కోసం బీజేపీ చేసిన కుటిలప్రయత్నాలను ప్రజలు ఓటుతో వమ్ము చేశారన్నారు. సెస్ ఎన్నికలను సాధారణ ఎన్నికల మాదిరి మార్చి.. విచ్చలవిడి డబ్బులతో, ప్రలోభాలతో ప్రజలను మభ్య పెట్టాలనుకున్న బిజెపి ప్రయతాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని మరోసారి ప్రజలు తేల్చి చెప్పారన్నారు. సెస్ ఎన్నికల్లోని బీజేపీ ఓటమి.. తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి పట్ల నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకతకు, తిరస్కారభావానికి నిదర్శనమని తెలిపారు. సెస్ ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
భారీగా ఆయుధాలతో పాక్ ఫిషింగ్ బోటు.. అడ్డుకున్న అధికారులు
పాక్ ఫిషింగ్ బోటులో భారీగా ఆయుధాలను గుర్తించి భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆయుధాలు, 10 మంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్థాన్ ఫిషింగ్ బోటును భారత జలాల్లో కోస్ట్ గార్డ్ అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయుధాలు, పదిమంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ అల్ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. అంతేగాదు ఆ పాకిస్తానీ బోట్‌ను అడ్డగించే ఆపరేషన్‌ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ లేదా ఏటీఎస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్‌లో తెలిపింది. ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది.
ఎలక్ట్రిక్ ‘లూనా’ వచ్చేస్తోంది.
ఎలక్ట్రిక్ వెకిల్స్ హంగామా చేస్తున్నాయి.. వరుసగా మార్కెట్‌లోకి వస్తున్నాయి.. అక్కడక్కడ కొన్ని ప్రమాదాలు జరిగినా.. ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటీలు, కార్లు, ఆటోలు.. ఇలా రకరకాల వాహనాలను కొనుగోలు చేస్తూనే ఉన్నారు.. ఇక, డెబ్బైలలో ఐకానిక్ లూనా ద్విచక్ర వాహనాల తయారీదారులైన కైనెటిక్ ఇంజినీరింగ్ (KEL), మోపెడ్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకొస్తుంది.. దీనికోసం విడిభాగాలను ఉత్పత్తి చేయడాన్ని త్వరలో ప్రారంభించనుంది. పూణేకు చెందిన కైనెటిక్ సెప్టెంబర్‌లో లూనా ఎలక్ట్రిక్ వాహనంతో తిరిగి రానున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ లూనా, లేదా ఈ-లూనాను కైనెటిక్ యొక్క సోదర సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ద్వారా ప్రారంభించబడుతుంది. కైనెటిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ లూనా కోసం ప్రధాన చట్రం, స్టాండ్‌లు మరియు స్వింగ్ ఆర్మ్‌తో సహా అన్ని ప్రధాన ఉపవిభాగాలను అభివృద్ధి చేసింది. ఇది నెలకు 5,000 సెట్ల ప్రారంభ సామర్థ్యంతో ప్రత్యేక ఉత్పత్తి లైన్‌ను ఏర్పాటు చేయబోతోంది. అహ్మద్‌నగర్‌లోని దాని విస్తారమైన కర్మాగారంలో ఏర్పాటు చేసిన 30 కంటే ఎక్కువ యంత్రాల కొత్త లైన్ ద్వారా వివిధ భాగాలకు వెల్డింగ్ చేయబడుతుంది. అవసరాలను తీర్చడానికి, కేఈఎల్ తన పెయింట్ షాప్ మరియు ప్రెస్ మరియు ఫ్యాబ్రికేషన్ షాపులను అప్‌గ్రేడ్ చేయడంలో 3 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టింది. ఈ-లూనా కోసం దాదాపు రూ. 30 కోట్ల వార్షిక అంచనాతో ముందుకు సాగనున్నారు.. ఇది వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతుంది” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెలకు 25,000 కంటే ఎక్కువ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడానికి కైనెటిక్ పూణే సమీపంలోని సూపాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించింది. అహ్మద్‌నగర్‌లోని ప్లాంట్‌లో నెలకు 7,500 ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయగలదు. కైనెటిక్ గ్రీన్ తన ద్విచక్ర వాహన వ్యాపారంలో రూ. 50 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టింది మరియు రాబోయే నాలుగేళ్లలో రూ. 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
తరాలు చూడని,యుగాలు చూడని సమగ్ర శిఖరం వీడే.. వీరయ్య
మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాబీ దర్శకత్వంలో చిరు, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. సినిమా నుంచి ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ ట్రాక్ అనడం కాదు కానీ వీరయ్య వ్యక్తిత్వం గురించి ఈ సాంగ్ లో చెప్పుకొచ్చారు. చంద్రబోస్ రాసిన అచ్చ తెలుగు పదాలు.. ఇప్పుడు వస్తున్న ఇంగ్లీష్ పాటలు విని విని విసుగెత్తిపోయిన చెవుల తుప్పు వదిలించేలా ఉన్నాయి. ‘భగ భగ భగ భగ మండే.. మగ మగ మగ మగ మగాడురా వీడే’ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. తుపాకుల మధ్య వీరయ్య ఎంట్రీ థియేటర్ లో చూస్తే మెగా ఫ్యాన్స్ సీట్లు ఉంచరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సాంగ్ లో చిరు ఎంట్రీ ఆ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా చిరును ఇందులో చూసినవారికి గ్యాంగ్ లీడర్ గుర్తుకురాక మానదు. అప్పటికి, ఇప్పటికి చిరు లో అదే గ్రేస్.. అదే మాస్.. అదే రాజసం.. అదే పౌరుషం.. సాంగ్ మొత్తం కనిపిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, అనురాగ్ కులకర్ణి బేస్ వాయిస్ సాంగ్ ఓ రేంజ్ లోకి తీసుకెళ్లాయి. ఇక మేకింగ్ వీడియోలో చరణ్ కనిపించడంతో మెగా ఫ్యాన్స్ మరింత సంబరపడుతున్నారు. ఈ పాట చూసాకా బాబీ.. మెగా అభిమాని అనిపించుకున్నాడు అని చెప్పకుండా ఉండలేరు.. చిరు ఈ రేంజ్ మాస్ లుక్ లో చూసి ఎన్నో ఏళ్ళు అవుతోంది. నిజంగా ఈ సాంగ్ చూస్తే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది.
మాస్ మీటింగ్ కి మహారాజా ఫాన్స్ రెడీ అవ్వండి..
ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చెయ్యడంతో మాస్ మహారాజా రవితేజ ఫాన్స్ అప్సెట్ అయ్యారు. రెండు సినిమాలతో వచ్చిన నెగటివ్ టాక్ ని కేవలం మూడు రోజుల్లోనే పాజిటివ్ గా మార్చేస్తూ, నీరసంగా ఉన్న రవితేజ ఫాన్స్ ని యాక్టివ్ చేస్తూ ‘ధమాకా’ సినిమా రిలీజ్ అయ్యింది. క్రిస్మస్ కనుకుగా విడుదలైన ఈ మూవీ రవితేజ ఫాన్స్ లోనే కాదు సినీ అభిమానులందరిలోనూ జోష్ నింపింది. సింగల్ స్క్రీన్స్ లో ధమాకా సినిమా చూస్తే ఈ అరుపులు, ఈలలు, గాల్లోకి లేచిన పేపర్లని చూసి ఎన్ని రోజులు అయ్యిందో అనిపించకమానదు. రవితేజ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని రాబడుతున్న ధమాకా సినిమా మండే టెస్ట్ ని సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యింది. అన్ని సెంటర్స్ లో మంచి ఫుట్ ఫాల్స్ పడుతుండంతో ధమాకా సినిమాకి హౌజ్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 32 కోట్లు రాబట్టిన ఈ మూవీ సక్సస్ మీట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మధ్య కాలంలో మార్నింగ్ షో అయిపోగానే సక్సస్ సెలబ్రేషన్స్ చేస్తుంటే… ధమాకా మేకర్స్ మాత్రం వారం రోజుల తర్వాత సక్సస్ మీట్ చేస్తున్నారు. నిజమైన సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్న మేకర్స్, తమకి అంత మంచి హిట్ ఇచ్చినందుకు రవితేజ ఫాన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ‘మాస్ మీటింగ్’కి ఏర్పాట్లు చేస్తున్నారు. JRC కన్వెన్షన్ లో డిసెంబర్ 29న సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ మాస్ మీట్ జరగనుంది. ఈ విషయన్ని అనౌన్స్ చేస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఘనంగా జరగనున్న ఈ మాస్ మీట్ లో రవితేజ, శ్రీలీలతో పాటు ధమాకా చిత్ర యూనిట్ అంతా పాల్గొనబోతున్నారు.