NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు
ప్రధాన మోడీ రేపు తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్‌ రైలును ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి మధ్య నడుపనుంది దక్షిణ మధ్య రైల్వే. అయితే.. ఈ వందే భారత్‌ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వెళ్తున్నాయి. అయితే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో ప్రయాణం సమయం 12 గంటల పడుతోంది. అయితే.. వందే భారత్ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల్లోనే ప్రయాణించవచ్చు. దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. 1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్ లు ఉన్నాయి. ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్ లను పెంచే అవకాశం ఉంది. రేపు ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈనెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు ఈ వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. రేపటి వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు ఉండగా.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలుగా ఉంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలుగా ఉంది. వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోకలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్‌.. కాకాణి కౌంటర్‌ ఎటాక్‌
నెల్లూరు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సోషల్‌ మీడియా వేదికగా సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు.. అయితే, బాబు ఛాలెంజ్‌కు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు నెల్లూరు వచ్చారు అంటేనే జిల్లా వాసులు బెంబేలెత్తుతారన్న ఆయన.. అభివృద్ధి ఏమీ చేయలేదు కాబట్టి సెల్ఫీ ఛాలెంజ్ అని టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ తీసి పెట్టారని ఎద్దేవా చేశారు.. సిగ్గు, శరం ఉండి ఉంటే ఐదేళ్లలో మీరు కట్టిన ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేదు? అని నిలదీశారు.. కమీషన్ల కోసం ఇళ్లు నిర్మించారని ఆరోపించారు.. ఇది అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం సిగ్గుచేటు.. ఈడీ విచారణ చేస్తుంటే మీ అవినీతి బాగోతం ఒక్కకొక్కటి బయటపడుతోంది.. ఐదేళ్లలో ఇళ్లు ఇవ్వలేకపోయాను అని సెల్ఫీ పెట్టాల్సింది అంటూ కౌంటర్‌ ఇచ్చారు. మా ప్రభుత్వ హయాంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చామో తెలుసుకోవాలి.. సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి వద్ద సెల్ఫీ తీసుకుని సిగ్గుపడాలి అంటూ మండిపడ్డారు కాకాణి.. నువ్వు చేయలేకపోయిన పనులు మేం చేసి చూపించాం అని సిగ్గుతో చంద్రబాబు తలదించుకోవాలి అన్నారు. దరిద్రం, అరిష్టం, కరువు, కాటకాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటి ఫైర్‌ అయ్యారు.. అలాంటి బాబు.. సీఎం జగన్మోహన్ రెడ్డిని దరిద్రం, అరిష్టం అనడం సరికాదని హితవుపలికారు. ఓడిపోతాం అని తెలవడంతో పంచాయతీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు.. నిన్ను నమ్మి ఎంతమంది రోడ్డున పడ్డారో, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఇక, వాలంటీర్ల వ్యవస్థ గురించి చంద్రబాబు నీచంగా మాట్లాడటం దారుణమన్న ఆయన.. మీ పక్కన ప్రజలు ఉంటే 2019లో 23 సీట్లకి ఎందుకు పరిమితం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రూపాయికే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. మన దగ్గరే..!
బిర్యానీకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజే వేరు.. మెచ్చిన రెస్టారెంట్‌లో నచ్చిన బిర్యానీ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికైనా.. ఎంత దూరం వెళ్లడానికైనా.. ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఆర్డర్లు చేయడానికైనా వెనక్కి తగ్గరు.. అదే, రూపాయికే బిర్యానీ వస్తుందంటే మాత్రం ఆగుతారా? అదే ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది.. ఒక్క రూపాయికే బిర్యానీ ఆఫర్‌ విషయం తెలుసుకున్న బిర్యానీ ప్రియులు, ప్రజలు.. పెద్ద ఎత్తున తరలిరావడంతో.. తోపులాట.. ట్రాఫిక్‌ జామ్‌.. చివరకు పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురంలో ఓ ప్రైవేట్‌ రెస్టారెంట్‌ ప్రారంభించారు.. ఈ సందర్భంగా రూపాయికే బిర్యానీ ఆఫర్‌ పెట్టారు.. రూపాయి అంటే రూపాయే కానీ.. పాత రూపాయి నోట్‌ ఉండాల్సిందే.. పాత రూపాయి నోట్‌ తీసుకొని వస్తే దమ్‌ బిర్యానీ అంటూ ఆఫర్‌ ఇచ్చారు.. దీంతో.. జనం పెద్దఎత్తున తరలివచ్చారు.. ఆ తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకే బిర్యానీ పంపిణీ నిలిపివేయాల్సి వచ్చింది నిర్వాహకులు.. అయితే, బిర్యానీ కోసం భారీ స్థాయిలో ప్రజలు తరలిరావడంతో.. తోపులాట జరిగింది.. అంతేకాదు.. మార్కాపురం – కంభం రహదారిపై భారీగా ట్రాఫిక్‌ కూడా నిలిచిపోయింది. ఇక, రూపాయికే బిర్యానీ దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. చిన్నా పెద్ద, ఆడ, మగా అని తేడా లేకుండా ఎగబడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

బాలయ్యకు మంత్రి అమర్నాథ్‌ కౌంటర్‌..
నందమూరి బాలకృష్ణ కామెంట్లపై కౌంటర్‌ ఎటాక్‌ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన… గిగాబైట్ కు మెగా బైట్ కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తేడా తెలియదన్న బాలయ్య వ్యాఖ్యలపై మండిపడ్డారు.. బాలకృష్ణ కూడా జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడడం హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు.. వెన్నుపోటిదారుడికి సహకరించిన వాళ్లా సీఎం వైఎస్‌ జగన్ గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోకేష్ పాదయాత్ర (నారా లోకేష్‌ యుగళం పాదయాత్ర)లో అన్ స్టాపబుల్ కంటే ఎక్కువ కామెడీ జరుగుతోందని సెటైర్లు వేశారు.. అయితే, రాజకీయాల్లో సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అన్ స్టాపబుల్ అంటూ వ్యాఖ్యానించారు. అసలు బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గురించి అవగాహన ఎంత..? అని ప్రశ్నించారు.. ఒక్కరోజైన నియోజకవర్గం గురించి మాట్లాడారా..? అని నిలదీశారు.. రాసిచ్చిన డైలాగులు చెప్పేస్తే జనం ఏదో అనుకుంటారని భావిస్తే బాలకృష్ణ కంటే అమాకుడు మరొకరు ఉండరంటూ హితవుపలికారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. అసంతృప్తి వాస్తవమే..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి ఉంది.. సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులను, ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఏకంగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు కాకరేపారు.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే కాగా.. అరేకల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నేతల్లో అసంతృప్తి వాస్తవమే అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. నాయకుల పట్ల సీఎం వైఎస్‌ జగన్ కి అనుభవం లేదని చెప్పుకొచ్చారు.. అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి రెండోసారి అవకాశం ఇస్తే పూర్తి అనుభవం వస్తుందని తెలిపారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి..

యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో భారీ మోసం.. మహిళకు రూ.8 లక్షల టోకరా
టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి.. సైబర్ నేరగాళ్లు దాన్ని అడ్డం పెట్టుకొని, కొత్త కొత్త వ్యూహాలతో మోసాలకు పాల్పడుతున్నారు. తేలికైన మార్గాల్లో లక్షాధికారులు అవ్వొచ్చంటూ అమాయకపు ప్రజలను మాయ చేసి.. లక్షలకు లక్షలు దోచేసుకుంటున్నారు. రీసెంట్‌గానే.. మొబైల్ యాప్‌లో సినిమాలను చూసి రేటింగ్ ఇవ్వడం ద్వారా భారీ ఆదాయం పొందవచ్చని చెప్పి, ఒక మమిళను సైబర్ నేరగాళ్లు రూ. 76 లక్షలకు కాజేశారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో భారీ మోసం వెలుగుచూసింది. యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళను నిలువునా దోచుకున్నారు. ఆమె నుంచి రూ. 8 లక్షలు లాగేసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇంటి పట్టునే కూర్చొని, ఏదైనా ఉద్యోగం చేసుకునే ఆఫర్ ఉందేమోనని ఒక మహిళ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు ఆ మహిళను వాట్సాప్ ద్వారా సంప్రదించారు. యూట్యూబ్ చానళ్లను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే.. భారీ కమీషన్ వస్తుందని ఆమెను ముగ్గులోకి లాగారు. ఒక్క యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్ర్కైబ్ చేస్తే.. రూ.50 ఇస్తామని ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి నమ్మబలికాడు. ఇదంతా నిజమని నమ్మించడం కోసం.. ఆమె టెలిగ్రామ్ ఐటీ తీసుకొని, ఒక గ్రూపులో జత చేశారు. ఆమెకి కొన్ని టాస్కులు అప్పటించి, ఆ పనులన్నీ చేయాలని కోరారు. ఇదంతా చూసి నిజమని నమ్మిన ఆ మహిళ.. వాళ్లు చెప్పినట్లు ఆయా టాస్కులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె నుంచి ఆ ముగ్గురు సైబర్ నేరగాళ్లు రూ. 8.20 లక్షలు లాగేశారు. అనంతరం కాంటాక్ట్‌లో లేకుండా పోయారు.

నాలుక కోసేస్తా.. రాహుల్‌ గాంధీకి శిక్ష విధించిన న్యాయమూర్తిని బెదిరించిన కాంగ్రెస్ నేత
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ నాయకుడు మణికందన్ బెదిరించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని బెదిరించగా.. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. తమిళనాడులోని దిండిగల్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మణికందన్ ఇలా అన్నారు. “మార్చి 23న సూరత్ కోర్టు న్యాయమూర్తి మా నాయకుడికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. జస్టిస్ హెచ్ వర్మ వినండి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీ నాలుక నరికేస్తాం’’ అని మణికందన్ అన్నారు. మణికందన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు దిండిగల్ పోలీసులు తెలిపారు. గత నెలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక ర్యాలీలో తన “మోదీ ఇంటిపేరు” వ్యాఖ్యపై 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించబడ్డారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడింది.ఇది ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది, అనేక పార్టీలు గాంధీకి మద్దతుగా నిలిచాయి. తన నాయకుడిని దోషిగా నిర్ధారించి, పార్లమెంటుకు అనర్హుడిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తోంది.

లారెన్స్ అన్నా.. ఈసారి ఆత్మలేవీ తీసుకురాలేదానే
కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. లారెన్స్ అంటే.. టక్కున గుర్తొచ్చేవి దయ్యం సినిమాలే. ఆత్మలు.. తీరని కోరికలు.. ఆ కోరికలను తీర్చే హీరో.. ముని దగ్గర నుంచి మొన్నీమధ్య వచ్చిన గంగ వరకు అన్ని ఇలాంటి సినిమాలే తీసి హిట్లు అందుకున్నాడు. ఇక హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమాలను చేయడం అంటే మాములు విషయం కాదు. చాలా గ్యాప్ తరువాత లారెన్స్ నుంచి వస్తున్న చిత్రం రుద్రుడు. కతిరేసన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఇదొక యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. కుటుంబంతో ఎంతో హ్యాపీగా ఉండే యువకుడు రుద్రన్. కానీ, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం రుద్రుడుగా మారిపోతాడు. ఈ నేపథ్యంలోనే ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడి ఆనందంగా జీవితం సాగిస్తున్న రుద్రన్ జీవితంలోకి విలన్ భూమి ఎంట్రీ ఇస్తాడు. డబ్బు అనే పిచ్చితో చేయరాని పనులు చేసే భూమికి, రుద్రన్ కు మధ్య ఒక విషయంలో గొడవ మొదలవుతుంది. అతడి మీద ఉన్న కోపంతో భూమి, రుద్రన్ భార్యా పిల్లలను చంపించి, అతడిని జైలుకు పంపిస్తాడు. ఇక జైలు నుంచి తిరిగి వచ్చిన రుద్రన్, భూమి మీద ఎలా పగ తీర్చుకున్నాడు..? అసలు భూమికి ఏం కావాలి..? ఎందుకు రుద్రన్ తో పెట్టుకున్నాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. భూమిగా శరత్ కుమార్ కనిపించాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే లారెన్స్ అదరగొట్టేశాడు. ఇక జీవీ ప్రకాష్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారగా.. లారెన్స్ అంటే హర్రర్ సినిమాలోతోనే వస్తాడు అనుకున్న అభిమానులు లారెన్స్ అన్నా.. ఈసారి ఆత్మలేవీ తీసుకురాలేదానే అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.