బాబు వెళ్లమంటేనే వారాహి బ్యాచ్ ఢిల్లీ టూర్.. బీజేపీతో విడాకులా..? టీడీపీతోనా..?
ఈ మధ్యే హస్తినలో పర్యటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అయితే, వారి పర్యటనపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.. వారాహి బ్యాచ్ ఢిల్లీ టూర్‌కు వెళ్లింది అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు వెళ్లమంటే వారు వెళ్లారని అందరికీ తెలుసన్న ఆయన.. బీజేపీతో విడాకులు తీసుకోవటానికి వెళ్లాడా? లేక టీడీపీతో విడాకులు తీసుకుంటానని చెప్పడానికి వెళ్లాడా? అని ప్రశ్నించారు.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి పవన్ కల్యాణ్ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు అని మండిపడ్డారు.. పవన్‌కు కావాల్సిన ప్యాకేజి చంద్రబాబు దగ్గర ఉంది.. చంద్రబాబు పల్లకి మోసే వ్యూహాన్ని నాదెండ్ల మనోహర్ అమలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. అసలు, 175 సీట్లులో పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు. ఇక, సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం తనకు లేదని చంద్రబాబు ఒప్పుకున్నారని కామెంట్ చేశారు అంబటి… చంద్రబాబు నిర్దేశం మేరకే పవన్ ఢిల్లీ టూరని విమర్శించారు.. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ పార్టీ పెట్టారా? అని ప్రశ్నించారు. మరోవైపు.. జనసేన పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టుపై నాదెండ్ల మనోహర్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అవాకులు, చవాకులు పేలుతున్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు అస్తవ్యస్తం చేశారు. కానీ, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదన్నారు.. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అసెంబ్లీలో స్పష్టం చేశారని గుర్తుచేశారు.. దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్‌వాల్‌ను రిపేర్ చేస్తున్నాం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్లే పనులు ఆలస్యం అయ్యిందన్నారు.. వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేస్తాం అని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇక, 175 సీట్లలో పోటీ చేసే ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు.. ఆయన వెళ్లమంటేనే వారాహి బ్యాచ్ ఢిల్లీ వెళ్లింది. బీజేపీతో విడాకులు తీసుకోమని చంద్రబాబు చెప్పి పంపారు. కానీ, వారాహి బ్యాచ్ కి పనికాలేదు. కాపుల ఓట్లు చీల్చితే కొంత మెరుగు పడవచ్చని చంద్రబాబు ఆశగా చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు.
భారత్‌కు రూ.1.34 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం
కరోనా ప్రపంచదేశాలను అతలాకుతలం చేసింది.. మళ్లీ కొన్ని దేశాలు మినహా చాలా దేశాల్లో సాధారణ పరిస్థితులు సారవడంతో.. విదేశీయానం పెరిగింది.. భారత్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన కిషన్‌రెడ్డి.. 2021 ఆర్థిక సంవత్సరంలో పర్యాటకుల ద్వారా 65 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు చెప్పారు. 2019లో కోవిడ్ ప్రబలడానికి ముందు కోటి మంది విదేశీ పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇమ్మిగ్రేషన్ బ్యూరో అందించిన తాజా సమాచారం ప్రకారం 2022లో దేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 60 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఇక, కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత విదేశీ పర్యాటకం గణనీయంగా పుంజుకుంటోందని వెల్లడించారు మంత్రి కిషన్‌రెడ్డి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తమ మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్, ప్రసాద్ వంటి వినూత్న పథకాలతోపాటు పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతులను మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. విదేశీ పర్యాటకులకు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ 12 విదేశీ భాషల్లో టూరిస్టు హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు.. 166 దేశాలకు సంబంధించిన పర్యాటకులకు అయిదు సబ్- కేటగిరీల్లో ఈ వీసా మంజురు చేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. 1000 నుంచి 7500 రూపాయలు ఉండే హోటల్ గది అద్దెలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించి పర్యాటక ప్రాంతాల్లో వసతి సౌకర్యాల కల్పనకు పోటీని పెంచేందుకు దోహదం పడిందన్నారు.. పర్యాటక మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 59 టూరిజం రూట్లను వివిధ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో 55 ప్రాంతాల్లో జీ 20 సమావేశాలు జరుగుతున్నాయి. పర్యాటకుల కోసం ఈ ప్రదేశాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. జీ 20 ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభలో సమాధానం ఇస్తూ స్పష్టం చేశారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి.
దేశవ్యాప్తంగా 28.78 కోట్ల మందికి.. ఏపీలో 79 లక్షల మందికి ఉచిత బీమా..
ఆంధ్రప్రదేశ్‌లో 79 లక్షల మంది కార్మికులకు ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.. కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్ లో 2023 మార్చి 27 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 79,54,498 మందితో పాటు దేశవ్యాప్తంగా 28,78,93,401 మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారని, వీరందరికీ మొదటి ఏడాది రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు.. రాజ్యసభలో ఈరోజు వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇక, కోవిడ్ మహమ్మారి కారణంగా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం మరో ఏడాదిపాటు పొడిగించే యోచన ఉందా? అంటూ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జవాబిస్తూ.. ఇన్సూరెన్స్ కవరేజ్ పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని, పోర్టల్‌లో నమోదు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ మొదటి సంవత్సరం మాత్రమే ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో పాటు స్పెషల్ డ్రైవ్ లు, క్యాంపులు నిర్వహించి, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు.. అలాగే, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ-శ్రమ్ పోర్టల్ ప్రమోషన్ కోసం నిధులు అందజేస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ పేర్కొన్నారు.
ఎగురుతోన్న విమానంలో నాగు పాము, హడలిపోయిన పైలట్, ప్రయాణీకులు.. ఏం చేశారంటే..?
ఎక్కడైనా పాము కనిపించిందంటే పరుగులు పెడతారు.. అమ్మో పాము అంటూ హడలిపోతారు.. కొన్నిసార్లు వాహనాల్లోనూ పాములు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి.. వెంటనే ఆ వాహనాన్ని ఆపి.. దిగిపోవడానికి అవకాశం ఉంది.. కానీ, గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్‌లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన ప్రత్యక్షమైంది.. దీంతో ఆ పైలట్ హడలిపోయాడు.. కానీ, గందరగోళానికి గురికాలేదు.. ఆ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. కాక్ పిట్‌లో పామును గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు.. సేఫ్‌గా విమానాన్ని ల్యాండ్ చేశాడు.. అయితే, అదేదో పెద్ద విమానం కాదు.. నలుగురు ప్రయాణికుతో వెళ్తున్న చిన్న విమానం.. ఏదైనా విమానమే కదా? వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్‌కు ఈ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ తన వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్టు గుర్తించాడు.. అతడికి నాగుపాము తన సీటు కింద కనిపించింది. గాల్లో విమానం ఎగురుతోన్న సమయంలో.. పామును చూసిన షాక్ తిన్నాడు.. అయితే, సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. పాము ఉన్న విషయాన్ని ముందుగా గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.. ఏటీసీ సూచనలతో విమానాన్ని జోహన్నెస్‌బర్గ్‌లో అత్యవసరంగా దింపివేశాడు.. దీంతో.. అంతా సురక్షితంగా బయటపడ్డారు.. ఇక, ఆ తర్వాత విమానంలో తనిఖీలు చేయగా.. పైలట్ సీటు కింద పామును గుర్తించారు.
జపాన్ సైనిక హెలికాప్టర్ అదృశ్యం.. వారంతా క్షేమమేనా?
జపాన్ కు చెందిన ఓ సైనిక హెలకాప్టర్ అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. నైరుతి ఒకినావా ద్వీపంలో భాగమైన మియాకోజిమా సమీపంలో అనేక మంది సిబ్బంది, ప్రయాణీకులను తీసుకువెళుతున్న సైనిక హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. UH60 ట్రూప్ ట్రాన్స్‌పోర్ట్, సాధారణంగా బ్లాక్ హాక్ అని పిలుస్తారు. మియాకోజిమాలోని గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ స్థావరం నుంచి బయల్దేరిన తర్వాత అదృశ్యమైంది. రాడార్ ట్రాకింగ్ నుండి సంబంధాలు తెగిపోయాయి. రేడియో కమ్యూనికేషన్‌లకు స్పందించలేదు. సాయంత్రం 4:30 గంటలకు విమానం కనిపించకుండా పోయింది. దాని సమాచారాన్ని సేకరించేందుకు గ్రౌండ్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్‌లు గాలిస్తున్నాయి. శోధన మరియు రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని GSDF చీఫ్ ఆఫ్ స్టాఫ్ యసునోరి మోరిషితా విలేకరులతో అన్నారు. జపాన్ కోస్ట్ గార్డ్ నౌకలు తప్పిపోయిన హెలికాప్టర్ కోసం వెతుకుతున్నాయి. హెలికాప్టర్ లో 10 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో సీనియర్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్ కూడా ఉన్నట్లు కొన్ని స్థానిక మీడియా పేర్కొంది.విమానంలో ఉన్నవారిని రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తెలిపారు.
కరోనాని సీజనల్ వ్యాధిలాగా చికిత్స చేయలేం: IIT శాస్త్రవేత్త
దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నాయి. కొత్తగా రికార్టు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా మరో వేవ్ వస్తుందన్న భయాన్ని పెంచుతున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. పరిస్థితి ఆందోళనకరంగా లేదని, దగ్గు, జలుబు వచ్చినట్లే తగ్గిపోతుందన్నారు. కేసుల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని ఐఐటీ ప్రొఫెసర్ అంచనా వేస్తున్నారు. కేసుల పెరుగుదల సహజ రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి సంకేతంగా భావిస్తున్నారు. డాక్టర్ మనీంద్ర అగర్వాల్ యొక్క గణిత నమూనా కోవిడ్-19ని అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉంది. అతని గణిత నమూనా చేసిన లెక్కల ఆధారంగా, కోవిడ్‌పై ఇప్పటివరకు అత్యంత ఖచ్చితమైన అంచనా వేయబడింది. అయితే డాక్టర్ అగర్వాల్ మాత్రం ఈ మోడల్‌ని ఉపయోగించాల్సిన అవసరం తనకు ఇంకా కలగలేదని, అలాగే తన మోడల్‌ను క్యాప్చర్ చేసేంత ఎక్కువ కేసులు కూడా లేవని చెప్పారు. రోజువారీ కేసులు 10,000కి మించని వరకు, ఈ గణిత నమూనా దానిని సంగ్రహించదు, కేసులు ఆ పరిమితిని దాటిన తర్వాత మాత్రమే ఖచ్చితమైన అంచనా వేయబడుతుంది.
సంజూ శాంసన్ దెబ్బ.. ఆల్‌టైమ్ రికార్డ్ అబ్బ
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తాజాగా ఒక అరుదైన ఘనత సాధించాడు. అజింక్యా రహానే పేరిట ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌టైమ్ టాప్ రన్ స్కోరర్ రికార్డును అతడు బద్దలుకొట్టాడు. బుధవారం (ఏప్రిల్ 5) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో42 పరుగులతో చెలరేగిన సంజూ.. తన 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ నమోదు చేశాడు. రాజస్థాన్ జట్టు తరఫున రహానే 3098 పరుగులు చేయగా.. నిన్నటి మ్యాచ్‌లో చేసిన 42 పరుగులు కలుపుకొని సంజూ 3138 పరుగులు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సంజూ, అజింక్యా వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. వారి తర్వాత షేన్ వాట్సన్ (2474), జోస్ బట్లర్ (2377) ఉన్నారు. అయితే.. ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగుల రికార్డు మాత్రం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరు మీద ఉంది. మొదటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ.. మొత్తం 224 మ్యాచ్‌ల్లో 6706 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
మాస్ కా దాస్ ‘ధమ్కీ’ ఇవ్వడానికి ఓటిటీకి వస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా..?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ జంటగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ నే దర్శకత్వం వహించాడు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్‌పై విశ్వక్ సేన్, కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటిరోజు నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఆ సమయంలోనే బలగం మంచి విజయం సాధించడంతో ధమ్కీ కలక్షన్స్ తగ్గాయనే చెప్పాలి. విశ్వక్ ఈ సినిమాలో డబుల్ రోల్ లో కనిపించాడు. డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే వ్యక్తి సంజయ్ రుద్ర. పుట్టిన తర్వాత అనాథగా మారి చాలా కష్టపడి పెరిగి పెద్దైన మరో వ్యక్తి కృష్ణదాస్..మధ్య జరిగే పోరాటమే దాస్ కా ధమ్కీ. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ ఇద్దరూ ఒకేలా ఉండటం. విశ్వక్ సేన్, హైపర్ ఆది, మహేష్‌ల నటనతో ఇంటర్వెల్ వరకు సరదాగా సాగిపోయే ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత ఎవరూ ఊహించని టర్న్ తీసుకుంటుంది. అసలు వీరి మధ్య గొడవేంటి? ధనవంతుడు సంఘంలో పేరున్న సంజయ్ రుద్ర ఉన్నట్లుండి కృష్ణదాస్‌ను ట్రాప్ చేయాలనకున్న విషయాలు, కథలో ఉండే ట్విస్టులు, టర్నులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతాయి. ఇక ఈ సినిమా ఓటిటీలో సందడి చేయడానికి రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఏప్రిల్ 14 న ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. థియేటర్ లో రచ్చ చేసిన ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.
సమంత హిట్ కొట్టేసినట్లే.. ఎందుకంటే ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేసినా సంచలనమే.. ఏది మాట్లాడినా సెన్సేషనే. చైతో విడాకులు తీసుకున్న తరువాత సామ్ ఎన్ని విమర్శలు ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని అన్ని తట్టుకొని నిలబడగలిగింది. ఆ తరువాత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. అప్పుడు కూడా ఎన్నో విమర్శలు.. వాటిని కూడా నవ్వుతో జయించింది. ఇక ఇప్పుడిప్పుడే సామ్ ఆ వ్యాధి నుంచి కోలుకొని బయటపడుతూ.. తన కెరీర్ ను గట్టిగ బిల్డ్ చేసుకోవడానికి కష్టపడుతుంది ఈ నేపథ్యంలోనే సామ్ నటించిన చిత్రం శాకుంతలం రిలీజ్ కు రెడీ అయ్యింది. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. శకుంతల- దుశ్యంతుల అందమైన ప్రేమ కావ్యంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో శకుంతలగా సామ్, దుశ్యంతుడు గా మలయాళ హీరో దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు సినిమాపై ఆసక్తిని కూడా పెంచేస్తున్నాయి.