NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

స్టీల్ ప్లాంట్‌ సమస్యలపై ఫోకస్‌ పెట్టిన కేంద్రం.. రేపు విశాఖకు ఉక్కు మంత్రి..
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అందులో భాగంగా రేపు రాత్రికి విశాఖకు రానున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమార స్వామి… ఎల్లుండి స్టీల్ ప్లాంట్ బిజిట్, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.. పెట్టుబడులు ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి విశాఖకు రాబోతున్నారు.. దీంతో.. స్టీల్‌ ప్లాంట్‌ సమస్యలకు క్రమంగా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.. ఇక, విశాఖ పర్యటన తర్వాత హైదారాబాద్ వెళ్లనున్నారు కుమార స్వామి.. అక్కడ NMDC అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు., ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.. అయితే, సెయిల్ లో విలీనం చెయ్యాలని డిమాండ్ చేస్తోంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ.. మరోవైపు, విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో.. కేంద్ర ఉక్కు మంత్రి.. విశాఖపట్నం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది..

ఏది ఏమైనా 2026కి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ టెర్మినల్, రన్ వే తదితర నిర్మాణాలను పరిశీలించిన ఆయన.. జాతీయ రహదారితో విమానాశ్రయ అనుసంధాన రహదారిపై కూడా ఆరా తీశారు.. విమానాశ్రయ నిర్మాణ పనులను జి.ఎం.ఆర్. సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఎంపీ అప్పల నాయుడు, శాసన సభ్యులు లోకం నాగ మాధవి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.. ఇక, ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. జూన్ 9న పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శించడం జరిగింది.. ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే ఈ ఎయిర్ పోర్టు పూర్తి చేసుకోవాలి.. ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.. పదవి చేపట్టిన తర్వాత ఢిల్లీలో సివిల్ ఏవియేషన్ తరుపున మీటింగ్ పెట్టుకున్నాం.. కానీ, క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఈ రోజు వచ్చాం అని వెల్లడించారు. ఇక, గత టీడీపీ ప్రభుత్వంలో 2015 లో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.. 2019 నాటికి కూడా టెండర్ ప్రోసెస్ చేయడం జరిగింది అని గుర్తుచేశారు రామ్మోహన్‌నాయుడు.. అయితే, గత వైసీపీ ప్రభుత్వంలో చాలా ఆలస్యం జరిగిందన్నారు. డిసెంబర్ 26 నాటికి పూర్తిగా చేస్తమని చెప్తున్నారు.. కానీ ఆరు నెలలు ముందే కంప్లీట్ చేయాలని అదేశించాం.. అందుకు ఏమైనా సమస్యలు అంటే నా దృష్టిలో తీసుకు రావొచ్చు.. ఏది ఏమైనా 2026కి ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇరువురూ నేతలు ఉత్తరాంధ్రను అభివృద్ది చేయాలని చూస్తున్నారు.. ఏపీని ప్రపంచం పటంలో పెట్టడానికి కృషి చేస్తున్నారు.. ఈ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా 6 లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

రూ.200, 500 నోట్ల రద్దు.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత.. ఏ కరెన్సీ శాశ్వతం కాదు.. ఏ నోటు.. ఎప్పుడైనా రద్దు కావొచ్చు అనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఎం అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది.. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంపై బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలని.. మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవాలని.. సూపర్ సిక్స్‌లో పీ-4 గురించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. అంతే కాదు.. రూ.200, రూ.500 నోట్లను రద్దు చేయని బ్యాంకర్లకు చెప్పానని.. అంతా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని.. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించారు.. విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రూ.200, రూ.500 నోట్ల రద్దు విషయాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.

తక్కువ ధరకే కందిపప్పు.. క్యూకట్టిన ప్రజలు
మరోసారి బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర క్రమంగా పైపైకి కదులుతోంది.. దీంతో, తక్కువ ధరకే సామాన్యులకు కందిపప్పు అందించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. దీనిలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా పలాసలో రెండు ప్రత్యేక కౌంటర్ల ద్వారా కంది పప్పును పౌర సరఫరాల శాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు.. కంది పప్పు ధరలు కొండెక్కిన నేపథ్యంలో ధరల నియంత్రణలో భాగంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ పలాసలో రెండు ప్రత్యేక కందిపప్పు కౌంటర్లను ఏర్పాటు చేయడంతో.. కందిపప్పు కోసం పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు ప్రజలు. ఈ ప్రత్యేక కౌంటర్లను పలాస ఆర్డీవో భరత్ నాయక్ ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ లో కేజీ కందిపప్పు ధర రూ. 195 నుండి రూ.200 వరకు పలుకుతుండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్లలో కేజీ రూ. 160లకే అందిస్తుండటంతో పట్టణ ప్రజలు కందిపప్పు కోసం కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఈ ప్రత్యేక కందిపప్పు కౌంటర్లు నేటి నుంచి మూడు రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉంటాయని పలాస సీఎస్‌డీటీ రవికుమార్ తెలిపారు. ఇక, కందుపప్పు ప్రత్యేక కౌంటర్ల ప్రారంభోత్సవంలో తహసీల్దార్ వీఎస్ఎస్ నాయుడు, రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. మరోవైపు.. తక్కువ ధరకే కందిపప్పును అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపుతున్నారు ప్రజలు.

బల్కంపేట తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కుట్ర కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సెక్రటేరియట్లో దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ అత్యవసర సమావేశం నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ కమిషనర్, జీఎచ్ఎంసీ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్, మేయర్, ఎమ్మెల్యేలు, ప్రోటోకాల్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నేడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టండని తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అధికారులకు తెలిపారు. పోలీస్ శాఖ రేపటిలోగా ఈ సంఘటన పై నివేదిక సమర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కాగా.. ఉదయం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో మేయర్ విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే.. కోపంతో ఆలయం బయటే కూర్చొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి. సరైన భద్రత కల్పించడం లేదని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పం.. ఆ సమస్యలకు త్వరలోనే పరిష్కారం
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని.. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బషీర్ బాగ్లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మహమ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఛైర్మెన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అయిన కాంగ్రెస్… ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్దితో ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తించాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి.. వాటిని పరిష్కరించడంలో మీడియాది ప్రముఖ పాత్ర ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో హెచ్.యూ.జేలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.

ఖలిస్తానీ ఉగ్రసంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’’పై మరో 5 ఏళ్లు బ్యాన్..
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూకి చెందిన ఉగ్రసంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’(ఎస్‌జేఎఫ్)పై కేంద్రం మరో 5 ఏళ్లు బ్యాన్ పొడగించింది. చట్టవిరుద్ద కార్యకలాపాలు(నివారణ)చట్టం(UAPA) కింద ఖలిస్తానీ అనుకూల సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం మంగళవారం తెలిపింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) జరిపిన విచారనలో లభించిన కొత్త సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 1,2020లో భారత ప్రభుత్వం పన్నూని టెర్రరిస్టుగా ప్రకటించింది. అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూ ఈ దేశాల్లో సిక్కు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. కెనడా వేదికగా పలు భారత వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై ఎన్ఐఏ అర డజనుకు పైగా కేసులు నమోదు చేసింది. గతేడాది పంజాబ్, చండీగఢ్‌లోని అతని ఆస్తుల్ని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అంతకుముందు, ఖలిస్తాన్ని బహిరంగంగా సమర్థిస్తూ, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను సవాల్ చేసినందుకు జూలై 2019లో ‘సిక్స్ ఫర్ జస్టిస్’పై కేంద్రం నిషేధం విధించింది.

మోడీ సూచనకు థ్యాంక్స్ చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్
గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇక రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి పుతిన్‌తో మోడీ చర్చించి కీలకమైన సూచన చేశారు. దీంతో పుతిన్.. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో వివాదాన్ని ముగించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి కృషి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో జరిగిన ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశంలో శాంతిని నెలకొల్పడానికి రష్యాకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి ఢిల్లీ సిద్ధంగా ఉందని మోడీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌ విషయంలో ఇరువురు నేతలు బహిరంగంగా అభిప్రాయాలు పంచుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహం, సత్సంబంధాలను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలకడానికి ప్రధాని మోడీ చొరవను పుతిన్ అంగీకరించారు. ఈ సందర్భంగా మోడీకి థ్యాంక్స్ చెప్పారు. అలాగే ఇటీవల భారత్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ వరుసగా మూడో సారి విజయం సాధించినందుకు ప్రధాని మోడీకి పుతిన్ అభినందనలు తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త విజయాలు సాధించాలని పుతిన్ ఆకాంక్షించారు.

ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత అవార్డు..
రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీని ఆ దేశం అత్యున్నత పౌరపుస్కారంతో గౌరవించింది. ‘‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’’ని ప్రధాని అందుకున్నారు. భారత్-రష్యాల మధ్య భాగస్వామ్యాన్ని, స్నేహాన్ని పెంపొందించడంలో ప్రధాన మోడీ చేసిన అత్యున్నత ప్రయత్నాలకు గానూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పురస్కారాన్ని అందించారు. ఇలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ నేతగా మోడీ రికార్డు సృష్టించారు. “ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను. నేను దానిని భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నాను” అని అధ్యక్షుడు పుతిన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ రష్యా యొక్క అత్యున్నత దేశ పురస్కారం. “ప్రియమైన మిత్రమా, ఈ అత్యున్నత రష్యన్ అవార్డుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీకు మంచి ఆరోగ్యం, విజయాలు, మంచి జరగాలని కోరుకుంటున్నాను. భారతదేశంలోని స్నేహపూర్వక ప్రజల శాంతి, శ్రేయస్సుని కోరుకుంటున్నాను..” అని అవార్డు ప్రధానోత్సవంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్..
భారత జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. రెండేళ్లు గంభీర్ హెడ్‌ కోచ్‌గా కొనసాగనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హెడ్ కోచ్‌గా టీమిండియాలోకి గౌతమ్ గంభీర్‌ను సాదరంగా ఆహ్వానిస్తోన్నానని చెప్పారు. క్రికెట్‌ కెరీర్‌లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్‌.. ఇండియన్‌ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందని జైషా తెలిపారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గంభీర్ కు బీసీసీఐ ఆయన అన్నివిధాలా సహకరిస్తుందని జైషా చెప్పారు. కాగా.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో ముగిసింది. అయితే.. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2007, వన్డే ప్రపంచకప్‌ 2011 టైటిల్‌ను భారత్‌ గెలుచుకుంది. ఈ విజేత భారత జట్టులో గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. రెండు టోర్నీల ఫైనల్స్‌లో అతను కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో.. అతను 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో 122 బంతుల్లో 97 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే.. గౌతీ మార్గనిర్ధేశంలో కేకేఆర్ టీమ్ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక సారథిగా కేకేఆర్ జట్టుకు రెండు టైటిల్స్ అందించాడు.

ఆ పని చేసిన వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి
`చైల్డ్ అబ్యూజ్ చేసే వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి అన్నారు మంచు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ఆదిపర్వం” ఈవెంట్ లో ఆమె ఈ మేరకు కామెంట్స్ చేశారు. తాజాగా ప్రణీత్ హనుమంతు అంశం మీద ఆమెను ప్రశ్నించగా చైల్డ్ అబ్యూజ్ ఎవరు చేసినా వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి అన్నారు. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా “ఆదిపర్వం” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆదిపర్వం” సినిమా త్వరలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ “ఆదిపర్వం” లాంటి భారీ చిత్రాన్ని ఇంత త్వరగా సీజీ వర్క్ తో సహా కంప్లీట్ చేస్తారని నేను అనుకోలేదు. ఈ సినిమాకు ఒక భగీరథ ప్రయత్నం చేశారు మా దర్శకుడు సంజీవ్. ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాం అంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తవంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం. దేవత అయినా దెయ్యం అయినా నన్నే అప్రోచ్ అవుతున్నారు. “ఆదిపర్వం” మీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పగలనన్నారు.

అనసూయ-సుశాంక్ లను విడదీయడానికి ప్రయత్నాలు.. ఇన్నాళ్లకు బట్టబయలైన నిజం
సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ లాంటి కార్యక్రమంతో ఆమె మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఆమె తాను చదువుకునే రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను వెల్లడించింది. అసలు విషయం ఏమిటంటే అనసూయ జడ్జిగా ఇప్పుడు స్టార్ మా లో ఒక ప్రోగ్రాం నడుస్తోంది. కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోలో ఆమె అమ్మాయిల టీంకి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తూనే జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షో నిర్వాహకులు అనసూయ చదువుకునే రోజుల్లో ఎన్సీసీ ట్రైనింగ్ ఆఫీసర్ అయిన ఒక ఆమెను తీసుకొచ్చారు. నిజానికి అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో ఇలాంటి ఎన్సిసి క్యాంపు లోనే ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్ళామని ఎప్పుడూ చెప్పేది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఆ ఎన్సిసి ఆఫీసర్ అప్పటి విషయాలు గుర్తు తెచ్చుకున్నారు. అప్పట్లో అనసూయ చాలా అందంగా ఉండేది, అందుకే ఆమె అబ్బాయిల కంటపడకుండా దాచేదాన్ని. ఆమెకు ఎవరు లైన్ వేస్తారో అని భయం ఉండేదని అని అన్నారు. అయితే ఎన్సిసి క్యాంపు లోనే సుశాంక్ ని అనసూయ ప్రేమించారట కదా అని అడిగితే అవును వాళ్ళిద్దరినీ విడదీయడానికి నేను అనేక ప్రయత్నాలు చేశాను అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక అనసూయ కూడా ఈ మేడమ్ ఉండబట్టే ఆ రోజుల్లో నేను సుశాంక్ ఒక ఫోటో కూడా కలిసి దిగలేకపోయామని చెప్పుకొచ్చారు. ఇక చాన్నాళ్ల తర్వాత కలిసిన తన ఎన్సిసి టీచర్ ని అనసూయ సన్మానించారు.