NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సమీక్షలోనూ ఈవోను ఏకిపారేసిన సీఎం.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయం..!
టీటీడీ ఉన్నాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్త వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సమీక్షలో టీటీడీ ఈవోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ప్రక్షాళన చేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు.. అసలు దర్శన టోకన్ల కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు..? అని సమావేశంలో నిలదీశారు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఏ మాత్రం సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

తిరుపతి ఘటనపై సీఎం సంచలన ప్రకటన.. వారిపై చర్యలు..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైంకుఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర జరిగిన తొక్కొసలాట ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆ తర్వాత స్విమ్స్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం.. తదనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు.. టీటీడీ ఉన్నాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సమీక్షలో టీటీడీ ఈవోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ప్రక్షాళన చేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు.. అసలు దర్శన టోకన్ల కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు..? అని సమావేశంలో నిలదీశారు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఏ మాత్రం సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం.. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పు పరిహారం ఇస్తామని.. ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తాం అన్నారు.. టీటీడీపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.. నేను చెప్పిన వాటిని టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.. అసమర్ధత, అనాలోచిత నిర్ణయాల వల్ల పవిత్రతకు భంగం కలగకూడదు.. రాజకీయాలకు అతీతంగా.. శ్రీవారికి సేవ చేస్తున్నాం అనే భావన ఉండాలని సూచించారు.. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. డీఎస్పీ రమణకుమార్‌ బాధ్యత లేకుండా పనిచేశారు.. డీఎస్పీ రమణకుమార్‌, గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నాం అని ప్రకటించారు.. ఇక, ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం అన్నారు.. అంతే కాదు.. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించనున్నట్టు వెల్లడించారు..

విద్యుత్‌ ఛార్జీలు పెంచొద్దు.. ఏపీఈఆర్సీకి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే వినతి..
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఇప్పటికే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి.. అయితే, ఇప్పుడు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC)కి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఓ లేఖ రాయడం చర్చగా మారింది.. ప్రజా ప్రయోజనం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచవద్దు అంటూ ఏపీఈఆర్సీకి విజ్ఞప్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. వంద శాతం‌ ఎలక్ట్రిక్ రైళ్లను నడపాలని ధ్యేయంగా పెట్టుకున్నాం.. కానీ, విద్యుత్ ఛార్జీలను పెంచితే సామాన్య ప్రజలపై.. ప్రయాణాల పైనా భారం పడుతుందని పేర్కొంది.. రైలు ప్రయాణం ఛార్జీలు పెరగకూడదంటే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరగకూడదన్న సౌత్ సెంట్రల్‌ రైల్వే.. ఏపీలో యూనిట్ ధర 7.89గా ఉంది.. అదే తెలంగాణలో యూనిట్ ధర 7.13గా ఉందని.. ఇక, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్ధాన్ లలో 6.10 రూపాయల నుంచి 6.60 రూపాయల మధ్యలో యూనిట్ ధర ఉందని తెలిపింది.. అయితే, ఎలా చూసుకున్నా ఇప్పటికే ఏపీలో విద్యుత్ యూనిట్ ధర ఎక్కువగా ఉంది.. కానీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC)కి విజ్ఞప్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే..

ప్రభుత్వం, టీటీడీపై జగన్‌ ఫైర్‌.. సీఎం మొదలు, టీటీడీ, ఎస్పీ, కలెక్టర్‌ అందరూ బాధ్యులే..!
ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం.. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ అందరూ బాధ్యులే.. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తిరుపతి పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్‌.. తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ 194–సెక్షన్‌కు బదులు బీఎన్‌ఎస్‌ 105– సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు.. ఇక, దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేవారు.. గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్‌ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలన్నారు.. చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు. భయం లేదు. అందుకే శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదంపైనా ఆరోపణలు చేశారు. దుష్ప్రచారం చేశారు. ఈరోజు కూడా ఆయన వైఖరి వల్లనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదు.. తొక్కిసలాటకు ఇంత మంది బలి కావడం గతంలో ఎప్పుడూ చూడలేదు.. కానీ, ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు జగన్?. ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజు స్వామి వారిని దర్శిస్తే, మహా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షల మంది తరలి వస్తారు. ఆ దర్శనం కోసం టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు? టీటీడీ అధికారులు మొదలు జిల్లా కలెక్టర్‌ వరకు అందరూ దీనికి బాధ్యులే అని విమర్శించారు.. చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులు 6వ తేదీ నుంచి 8వరకు పర్యటించారు. ఆరోజు మధ్యాహ్నం వరకు ఆయన కుప్పంలోనే ఉన్నారు. మొత్తం సెక్యూరిటీ ఆయన దగ్గరే ఉంది. 8వ తేదీ రాత్రి 8.30 గం.కు టోకెన్లు మొదలు పెట్టారు. లక్షల మంది వచ్చినా, తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.. బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్‌లో ఏర్పాటు చేసిన టోకెన్‌ సెంటర్‌ వద్ద, భక్తులను ముందు పార్కులోనే ఉంచేసి, రాత్రి ఒకేసారి వదిలేశారు. నిజానికి ఆ పార్కులో భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేదు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను కట్టడి చేసేందుకు తగిన సంఖ్యలో పోలీసులు లేరు. ఉన్న కొద్దిమంది పోలీసులు వారిని నియంత్రించలేకపోయారని విమర్శించారు..

తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన యూబీఎల్..
తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ (United Breweries Limited) వివరణ ఇచ్చింది. 2019 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ధరలు పెంచలేదని తెలిపింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూ బీర్లు సరఫరా చేశాం.. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను అనేక సార్లు కోరామన్నారు. టీజీబీసీఎల్ నుంచి రావల్సిన బిల్లుల బకాయిలు కూడా భారంగా మారాయని యూబీఎల్ తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు, తక్కువ ధరతో బీర్ల సరఫరాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. బీర్ల ధరలో సుమారు 70 శాతం ప్రభుత్వ పన్నులేనని యూబీఎల్ తెలిపింది. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను మరోసారి కోరుతున్నాం.. టీజీబీసీఎల్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు యూబీఎల్ వివరణ ఇచ్చింది. కాగా.. బుధవారం నుంచి రాష్ట్రంలో బీర్ల సరఫరా నిలిచిపోయింది. భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు బీర్ల ధరలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ కింగ్ ఫిషర్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం వేసవి కాలంలో కింగ్ ఫిషర్ బీర్లు పెద్ద ఎత్తున సరఫరా కాకపోవడంతో మద్యం షాపుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించిన విషయం తెలిసిందే. ఎక్కువగా యువకులు బీర్లను తాగుతారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్‌గా కింగ్ ఫిషరేకు మంచి పేరు వచ్చింది. అయితే.. పండగకు ముందు బీర్ల సరఫరా నిలిచిపోవడంపై యువతకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. ‘ఆరోగ్యశ్రీ’, ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుందని విమర్శించారు. ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు.. కానీ అసలు బిల్లులే చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ సేవలే ప్రజలకు అందకుండా చేస్తుండటం ఎంతవరకు సమంజసం..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మీ ఏడాది పాలనా నిర్వాకం వల్ల రూ.వెయ్యి కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయి.. మీ చేతగానితనం, నిర్లక్ష్యం ఫలితంగా ఆరోగ్యశ్రీ సేవలందక పేదలు అల్లాడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని కూడా మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్‌తోపాటు మీ ప్రభుత్వ నిర్వాకంవల్ల రూ.7 వేల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి.. ఫీజు రీయంబర్స్‌మెంట్ అందక కాలేజీ యాజమాన్యాలు మూతపడే దుస్థితి నెలకొందని తెలిపారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యాలు తెగేసి చెబుతుంటే ఏం చేస్తున్నారు..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మీ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని పేర్కొన్నారు.

ఇంకా వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. ఇదొక లొట్టపీసు కేసు
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం.. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్‌లో తనను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు. ఈ కేసులో అవినీతి ఎక్కడుంది అని అధికారులను అడిగాను.. దీంతో అధికారులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్లు.. రేవంత్ రెడ్డికి అందరూ దొంగలుగానే కనిపిస్తారని విమర్శించారు. తాను ఒక్క పైసా అవినీతి చేయలేదని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి వస్తా.. ఓపెన్‌గా కెమెరా పెట్టు.. ఈ కేసుపై చర్చిద్దామని సవాల్ చేశారు. కావాలంటే లై డిటెక్టర్ పెట్టు అని కేటీఆర్ అన్నారు.

కెవెంటర్స్ స్టోర్‌లో కాఫీ చేసుకుని తాగిన రాహుల్‌గాంధీ.. వీడియో వైరల్
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలోని పటేల్ నగర్‌ ప్రాంతంలోని కావెంటర్స్ షాపును సందర్శించారు. రాహుల్‌ రాకను గమనించి.. సిబ్బంది ఆహ్వానించారు. కాఫీ ఇవ్వాలని సిబ్బంది అడగగా.. రాహుల్‌గాంధీనే స్వయంగా తయారు చేసుకుని ఆస్వాదించారు. అనంతరం కావెంటర్స్ స్టోర్ సహా వ్యవస్థాపకులతో రాహుల్‌గాంధీ సంభాషించారు. ఈ బ్రాండ్ స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి మూలాలు ఉన్నాయి. దాదాపు 65 నగరాల్లో 200 దుకాణాలుగా అభివృద్ధి చెందింది. ఇంత పవర్‌ఫుల్‌గా ఎలా గ్రోత్ అయిందో వ్యవస్థాపకులు వివరించారు. అలాగే 100 ఏళ్ల కెవెంటర్స్ సహ వ్యవస్థాపకులు అమన్ అరోరా, అగస్త్య దాల్మియాతో కూడా రాహుల్ చర్చలు జరిపారు.

భారతదేశం నా హృదయాన్ని దోచుకుంది.. అమెరికా రాయబారి..
భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సిట్టి పదవీ కాలంల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. గురువారం ఆయన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో తన పదవీ కాలాన్ని ‘‘అత్యంత అసాధారణమైనది’’గా అభివర్ణించారు. భారత్ తన హృదయాన్ని దోచుకుందని చెప్పారు. భారత్-అమెరికా మధ్య అంతులేని అవకాశాల ఉన్నాయని అన్నారు. ఇది సరైన సమయంలో సరైన స్థలంలో, సరైన సంబంధాలు ఉండాలని అన్నారు. ‘‘ అధ్యక్షుడు జో బైడెన్ తనకు భారత్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన దేశమని, భవిష్యత్తులో పని చేయాలనుకుంటే, మీరు భారతదేశానికి రావాలని చెప్పారు. ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇలా అనలేదు’’ అని గార్సెట్టి అన్నారు. ‘‘భారత్-అమెరికా సంబంధాలను నిర్వచించే సంబంధాలు. శాంతిని నెలకొల్పడం అంటే యుద్ధాలు నిరోధించడం. యుద్ధాలు జరకుండా చూడటం. సరిహద్దులు పవిత్రమైనవి, శాంతిని కాపాడటానికి నియమాలు మాత్రమే మార్గం’’ అని అన్నారు. రెండు దేశాల సంబంధాలు దృఢంగా ఉండాలని కోరుకుంటూనే, ప్రపంచంలో భారత్ పాత్రను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా వివాదంలో శాంతి అయినా, హిందూ మహాసముద్రంలో గస్తీ అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో భారత్ పోషించే పాత్రను చూడం మాకు చాలా ఇష్టమని గార్సెట్టి అన్నారు. ఇది ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని గర్వించదగ్గ భారతదేశమని చెప్పారు.

బంగ్లాదేశ్ మరో వివాదాస్పద నిర్ణయం.. భారత్, అమెరికాకు ముప్పు..
ఎప్పుడైతే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆగస్టు 05న భారత్ పారిపోయి వచ్చిందో అప్పటి నుంచి ఆ దేశం క్రమంగా పాకిస్తాన్ జిరాక్స్ కాపీలా మారుతోంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌కి మించి అక్కడ ఇస్లామిక్ రాడికల్ శక్తులు ఎదుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రేమికులుగా పేరున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)తో పాటు రాడికల్ ఇస్లామిక్ శక్తులైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి శక్తులు ఆడిండే ఆటగా అక్కడ పాలన సాగుతోంది. ఈ శక్తుల చేతిలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కీలుబొమ్మగా మారాడు. ఇదిలా ఉంటే, తాజాగా యూనస్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇటు భారత్‌తో పాటు అమెరికాకు ముప్పుగా భావిస్తు్న్నారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి తీసేసిన మేజర్ సయ్యద్ జిలా ఉల్ హక్‌ని నిర్దోషిగా ప్రకటించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో అమెరికా ఒత్తిడి మేరకు హక్‌ని బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి తొలగించారు.

ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకులు మీకు రోజుకు రూ. 100 చెల్లింపు!
దాచుకోవడం కోసం, లోన్స్, ప్రభుత్వ పథకాలు ఇలా వివిధ అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దాదాపు బ్యాంకు సేవలన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. బ్యాంకుకు వెళ్లకుండానే పనులు చక్కబెట్టేస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఖాతాకు సంబంధించిన సమస్యలు, డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పరిష్కారం కోసం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు టెక్నికల్ సమస్య కారణంగా ఖాతాలో డబ్బు కట్ అయిపోయి రిఫండ్ అవడం లేట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఖాతాదారుల సమస్యలను పరిష్కరించడంలో బ్యాంకులు జాప్యం చేస్తుంటాయి. దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ జరిమానాను ఖాతాదారులకు పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్యాంకులు ఇకపై రోజుకు రూ. 100 చెల్లించనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి. ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ.100 జరిమానా విధిస్తామని ఆర్బీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది.

అత్యాధునిక ఫీచర్లతో భారత్‌ మార్కెట్‌లోకి వచ్చేసిన ఒప్పో రెనో 13 సిరీస్‌
నేడు (గురువారం) భారత మార్కెట్‌లో ఒప్పో నుంచి కొత్తగా రెనో 13 సిరీస్‌ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకునే ఈ ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెనో 13 సిరీస్ హైలైట్స్ పరంగా చూస్తే.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోన్‌లు డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తున్నాయి. కొత్తగా సిగ్నల్ బూస్ట్ టెక్నాలజీతో వస్తోంది. OPPO X1 సిగ్నల్‌ బూస్ట్ చిప్‌ వల్ల వైఫై ట్రాన్సిమిషన్ పవర్‌ 25% మెరుగుపడుతుంది. ఇక ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో వచ్చింది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ తహా వస్తుంది. ఇక కెమెరా పరంగా చూస్తే.. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా అలాగే ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక 5600mAh బ్యాటరీ, 80W వైర్‌ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక ఏ మొబైల్ ధరల విషయానికి వస్తే.. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ మోడల్ రూ.37,999గా, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.39,999 గా కంపెనీ నిర్ణయించింది.

నార్త్ లో గేమ్ ఛేంజర్ సాలీడ్ బుకింగ్స్.. గంటకు ఎన్ని అంటే ?
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10నాడే మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి స్టార్ట్ కానుంది. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే.. లక్నోలో గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కు రికార్డు సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.
మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ పొలిటికల్ డ్రామాగా రానుంది. అయితే చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇపుడు మన తెలుగు హీరోలు హిందీ మార్కెట్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు.

“బచ్చల మల్లి” ఓటిటి రిలీజ్ డేట్ లాక్
అల్లరి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో నరేష్. ఫస్ట్ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకుని కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. డిఫరెంట్ జానర్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరి నరేష్ తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన బెట్టి కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అలా చేస్తూనే హిట్స్ కూడా కొట్టేస్తున్నాడు అల్లరి నరేష్. మొన్న మధ్య తన ఓల్డ్ ఫార్మేట్ లో ఆ ఒక్కటి అడక్కు అని సినిమా చేసి ప్లాప్ చూశాడు. దాంతో ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలి అని మరోసారి సీరియస్ సబ్జెక్ట్ తో బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. “బచ్చల మల్లి” కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Show comments