NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారీగా నిధుల పెంపు.. ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పిలుపు..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిధులను భారీగా పెంచింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వెల్లడించారు.. గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.. వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచామన్నారు.. ఆగస్టు 15వ తేదీన కార్యక్రమాలకు గతంలో.. రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను.. ఇప్పుడు రూ.10 వేలు, రూ.25 వేలకు పెంచామన్నారు. ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారన్న ఆయన.. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేశామన్నారు.. ఇక, జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామని వెల్లడించారు. మరోవైపు.. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టతను ఈ సందర్భంగా చెప్పాలని సూచించారు.. పారిశుధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలన్నారు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.

ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం.. అసలు విషయం బయటపెట్టిన మాధురి..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది.. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాధురి అనే మహిళతో ఎఫైర్‌ ఉందంటూ శ్రీనివాస్‌ భార్య వాణి చేసిన ఆరోపణలపై అదే రేంజ్‌లో స్పందించారు దివ్వల మాధురి.. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. నన్ను అనవసరంగా బయటకు లాగొద్దు అని వార్నింగ్‌ ఇచ్చారు.. శ్రీనివాస్‌ భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అది వారి కుటుంబ వ్యవహారం.. వారితోనే తేల్చుకోవాలి.. కానీ, తనను మధ్యలోకి లాగొద్దు అన్నారు.. ఇక, దువ్వాడ వాణి తన భర్తను వద్దనుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన మాధురి.. అసెంబ్లీ టిక్కెట్ తనకే ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ను కలిశారని చెప్పుకొచ్చారు.. అయితే, తాను దువ్వాడ శ్రీనివాస్‌కు ఎందుకు దగ్గరయ్యాననే విషయాన్ని కూడా బయటపెట్టారు దివ్వల మాధురి.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ దశలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు.. ఆయన ఓ ఫ్రెండ్, ఫీలాసపర్ ఇంకా అన్నీ అని చెప్పుకొచ్చారు. ఆయన చాలా నిజాయితీ పరుడని ప్రశంసించారు.. మరోవైపు.. తాను దువ్వాడను ట్రాప్ చేయడానికి ఆయన వద్ద ఆస్తులేమీ లేవన్నారు. అతని ఆస్తులన్నీ కుటుంబానికి రాసిచ్చారని.. అలాంటప్పుడు ఇంకా నేను ఏం ఆశించి ట్రాప్ చేస్తామని ప్రశ్నించారు దివ్వల మాధురి..

చంద్రబాబుతో ముగిసిన విశాఖ నేతల భేటీ.. ఇంకా తేలని ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీ..!
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార, ప్రతిపక్షాలు ఫోకస్‌ పెట్టాయి.. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాంప్ రాజకీయాలకు తెలరలేపగా.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఈ రోజు విశాఖ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. అయితే, ఆ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. కానీ, టీడీపీలో ఇంకా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీ తేలనట్టుగా తెలుస్తోంది.. ఇవాళ రాత్రి లేదా రేపటికి అభ్యర్థి ఎన్నిక.. ఎన్నికల్లో పోటీపై క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది అంటున్నారు.. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారట చంద్రబాబు. అర్బన్‌లో ఎన్ని ఓట్లు.. రూరల్ ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశంపై సమీక్ష నిర్వహించారు.. మరోవైపు.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే క్యాంపులకు తరలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారట పార్టీ నేతలు.. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలా బలాలపై నేతలతో చర్చించారు చంద్రబాబు. అయితే, విశాఖ రూరల్ నుంచి మరింత సమాచారం తీసుకోవాలని చంద్రబాబు.. విశాఖ నేతలను ఆదేశించారట.. కాగా, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల బలం.. తమకు ఎక్కువగా ఉన్నందున.. గెలుపు మాదేననే ధీమాలో వైసీపీ ఉంది.. మరి.. కూటమి నేతలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి ప్లాన్‌ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కలలో కూడా వారికి రెడ్ బుక్ గుర్తుకు వస్తుంది.. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా..!
ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పర్యటనలు.. ఆయన కామెంట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కక్ష్యలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘‘జగన్ రెడ్డి’’గా పేర్కొన్న ఆయన.. రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వంపై అంట గట్టాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.. మా గెలుపు చూసి ఓర్వలేక తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచనలు చేస్తున్నారన్న ఆయన.. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా సరే జగన్ రెడ్డికి రెడ్ బుక్ కనిపిస్తుంది… అంతెందుకు ఆయనకు కలలో కూడా రెడ్ బుక్ గుర్తుకు వస్తుందని సెటైర్లు వేశారు.. దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్‌ను అతి కిరాతకంగా హత్య చేసి కారులో డోర్ డెలివరి చేసినప్పుడు వైఎస్‌ జగన్ ఎందుకు పరామర్శకు వెళ్లలేదు? అని నిలదీశారు.. సొంత బాబాయి గొడ్డలి వేటు పడి చనిపోతే ఆయన కుమార్తె అయినా సునీత పక్షాన కాకుండా ముద్దాయిల పక్షాన ఎందుకు ఉన్నావు జగన్ రెడ్డి? అంటూ మండిపడ్డారు మంత్రి నిమ్మల రానానాయుడు..

ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్‌..
వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. అయితే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది.. దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి ఎదుట కారులో నిరీక్షిస్తున్నారు టెక్కలి జడ్పీటీసీ, శ్రీనివాస్‌ భార్య దువ్వాడ వాణి.. అయితే, గత రాత్రి కుమార్తెలు నిరీక్షించి.. దువ్వాడ శ్రీనివాస్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాగా.. ఈ రోజు ఆయన భార్య కూడా వచ్చారు.. దువ్వాడ శ్రీనివాస్‌ అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన దువ్వాడ వాణి.. దివ్వల మాధురి అనే వైసీపీ నేతపై సంచలన ఆరోపణలు చేసింది.. ఇక, ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడంతో మరింత ఆగ్రహానికి గురవుతున్నారు దువ్వాడ వాణి.. ఏ క్షణంలోనైనా ఇంటిలో ప్రవేశించేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న దువ్వాడ గృహానికి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. దువ్వాడ నూతన గృహం ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది.. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గేట్‌ను పలుమార్లు కొట్టారు ఆయన కుమార్తె హైందవి.. ఇక, కారులోనే దువ్వాడ వాణి నిరీక్షిస్తున్నారు..

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం..
నీటి పారుదల ప్రాజెక్టులలో పూడిక తీత అంశంపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖా సలహాదారుడు ఆదిత్యా దాస్, మైన్స్ మరియు జియాలజీ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ సుశీల్ కుమార్, ఇ. యన్.సి అనిల్ కుమార్, డిప్యూటీ ఇ.యన్.సి కే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పూడికతీతకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని అధికారులకు తెలిపారు. అనుమతులు ఇచ్చిన సమయంలో పర్యావరణ అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసిందన్నారు. అందుకు అనుగుణంగా ముందుకు పోదాం.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు పోదామని అధికారులకు మంత్రి సూచించారు. పూడికతీత అంశంపై నీటిపారుదల మరియు మైన్స్&జియాలజీ సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు. ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేలా పూడిక తీత పనులు చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుల రక్షణలో రాజీ పడొద్దు.. పూడిక తీత సమయంలో సారవంతమైన మట్టి లభ్యత ఉంటే రైతాంగానికి ఉచితంగా ఇవ్వాలన్నారు. అందుకు గాను రవాణా చార్జీలు రైతులే భరించే విధంగా విధి విధానాలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.

ఏసీబీ వలకు చిక్కిన రెవెన్యూ అధికారి.. భారీ మొత్తంలో నగదు సీజ్
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపట్టారు. మొత్తంగా రూ.6.7 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు.. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. అంత మొత్తం డబ్బును లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాల్ని తీసుకొచ్చారు. అలాగే.. బంగారు ఆభరణాలు, ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు చేపట్టారు. మొత్తంగా ఏసీబీ సోదాల్లో రూ. 2,93,81,000 నగదు పట్టుబడగా.. నరేందర్ భార్య, తల్లి బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షలను ఉన్నట్లు గుర్తించారు. అలాగే 51 తులాల బంగారు ఆభరణాలు, కోటి 98 లక్షలు విలువ చేసే ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. నరేందర్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

“స్క్రబ్ టైఫస్” కారణంగా హిమాచల్‌లో మొదటి మరణం..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఆ రాష్ట్రంలో తొలి మరణం సంభవించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజిఎంసి)లో స్క్రబ్ టైఫస్‌కు చికిత్స పొందుతూ పంథాఘటి ప్రాంతానికి చెందిన 91 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు వారు తెలిపారు. ఆగస్టు 2న స్క్రబ్ టైఫస్‌కు పాజిటివ్‌గా తేలిన తర్వాత అతడికి చికిత్స ప్రారంభించారు. ఆ వ్యక్తి బుధవారం మరణించినట్లు వెల్లడించారు. సిమ్లాలో ఇప్పటి వరకు 44 కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ అనేది కీలకాలు కుట్టడం వల్ల వచ్చే బ్యాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధి. దీని ద్వారా దద్దుర్లు, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, ఇతర సమస్యలకు దారితీస్తాయి. పొలాల్లో పనిచేసే ప్రజలు తమ శరీరాలను కప్పి ఉంచుకోవాలని, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

గాజా గురించి మాట్లాడే రాహుల్ గాంధీ బంగ్లా హిందువులపై మౌనం ఎందుకు.?”
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. పాలస్తీనా, గాజా పట్ల ఆందోళన చెందే కాంగ్రెస్ పార్టీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. శుక్రవారం లోక్‌సభలో మట్లాడుతూ..బంగ్లాదేశ్‌లోని హిందువులు మరియు మతపరమైన మైనారిటీల శాంతి, భద్రత మరియు అభివృద్ధికి హామీ ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతికి గుర్తు చేశారని అన్నారు. మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇటీవల సంఘటనల గురించి మనమంతా ఆందోళన చెందుతున్నామని, ప్రధాని మంత్రి మోడీ ఆ దేశంలో హిందువుల భద్రతకు హామీ ఇవ్వాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేతకు నొక్కి చెప్పారని అన్నారు. అయితే బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రత గురించి ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. గాజా గురించి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ పార్టీ పొరుగుదేశంలో హిందువుల పరిస్థితిపై ఎందుకు సైలెంట్‌గా ఉంటుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మౌనంగా ఉండటానికి కారణం ఏమిటి..? అని అడిగారు.

రాహుల్‌గాంధీని కలిసిన ఒలింపిక్ విజేత మను భాకర్
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీని ఒలింపిక్ విజేత మను భాకర్ కలిశారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. పారిస్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు ఘనస్వాగతం లభించింది. పారిస్ నుంచి రాగానే మను భాకర్.. సోనియాగాంధీని కలిశారు. ఆమె సాధించిన రెండు పతకాలను చూపించారు. అలాగే పారిస్ విశేషాలను కూడా సోనియాతో మను భాకర్ పంచుకున్నారు. అనంతరం ఆమె పలువురు కేంద్రమంత్రులను, కాంగ్రెస్ నేతలను కలిశారు. తాజాగా శుక్రవారం సాయంత్రం పార్లమెంట్‌ హౌస్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిశారు. తల్లిదండ్రులతో కలిసి ఆమె రాహుల్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీనే స్వయంగా ఆమెకు పూలబొకేతో ఆహ్వానించి స్వీట్ అందించారు. ఈ సందర్భంగా పారిస్ విశేషాలను పంచుకున్నారు. అనంతరం అందరితో కలిసి రాహుల్ ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కీలక షెడ్యూల్ లో గుడ్ బాడ్ అగ్లీ
స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి అధిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్ లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై క్రుషియల్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ ‘మార్క్ ఆంటోని’ తో విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ గా గుడ్ బ్యాడ్ అగ్లీని తీసుకువస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టాప్ టెక్నికల్ టీం పనిచేస్తున్న ఇండియన్ సినిమాలో ఒక హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ .ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ అభిమానులకు, ఆడియన్స్ కు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి సిద్ధంగా ఉంది.

‘సలార్ 2’ సంగతేంటి బాసూ? ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!
ఓ వైపు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్రెండ్ చేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2ని ట్రెండ్ చేస్తున్నారు. చెప్పాలంటే సలార్ 2 గురించి ఓ రేంజ్‌లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికైతే.. ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ డేట్స్ అడ్జెస్ట్ కాలేకనో, లేక మరో కారణం ఏదైనా ఉందో తెలియదు గానీ, ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు నీల్. కానీ గతంలో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగష్టులో ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే.. ఇప్పుడు పూజా కార్యక్రమం నిర్వహించారు. దీంతో.. సలార్ 2 సంగతేంటి? ఎప్పుడు ఉంటుంది? అనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభాస్ ప్రజెంట్ కమిట్ అయిన సినిమాల తర్వాతే ఉంటుందని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం కెజియఫ్, సలార్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. గతంలో సలార్ 2 స్టార్ట్ చేసిన తర్వాత.. కెజియఫ్ చాప్టర్ 2 కంప్లీట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేసినప్పటికీ.. ముందు సలార్ 2నే పూర్తి చేసి రిలీజ్ చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే పార్ట్ 1తో పాటు కొంత వరకు సలార్ 2 షూటింగ్ చేసి పెట్టుకున్నాడు నీల్. ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా ఈ సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడనే టాక్ నడిచింది. కానీ ఫైనల్‌గా ఎన్టీఆర్ సినిమా ముందుకొచ్చింది. దీంతో.. ఇప్పట్లో సలార్ సీక్వెల్ ఉండే ఛాన్స్ లేదని.. రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్ తర్వాత ఉంటుందనే మాట వినిపిస్తోంది. లేదంటే.. ప్రశాంత్ నీల్ రెండు సినిమాలను సమాంతరంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.