విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. భారత్‌లోనే ప్రథమ స్థానం..
విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) మరో అరుదైన ఘనత సాధించింది.. స్వచ్ఛత పఖ్వాడా అవార్డ్స్ 2024లో భారతదేశంలోనే మొదటి స్ధానంలో నిలించింది. తద్వారా విశాఖ ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపింది విశాఖ పోర్టు.. పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ మంత్రిత్వశాఖ (MoPSW) నిర్వహించిన ఈ పోటీలో, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు అథారిటీ (SMPA) రెండవ స్థానంలో నిలవగా.. ఇండియన్ మేరిటైమ్ యూనివర్సిటీ (IMU) మూడవ స్థానంలో నిలిచింది.. ఇక, స్వచ్ఛత మరియు పారిశుధ్య కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన విశాఖపట్నం పోర్ట్ ని కేంద్ర మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా అభినందించింది. మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, “స్వచ్ఛత కి భాగీదారీ” మరియు “సంపూర్ణ స్వచ్ఛత” కార్యక్రమాల కింద పోర్ట్ పలు ప్రభావవంతమైన కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో పెద్ద ఎత్తున నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమాలు, “ఏక్ పెడ్ మా కే నామ్” మొక్కలు నాటే కార్యక్రమం, గోడలపై చిత్రలేఖనం, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ సందేశాన్ని ప్రోత్సహించే సృజనాత్మక పోటీలు ఉండడం విశేషం..
జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీ షాక్..
కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు జరుగుతోన్న ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఓవైపు పులివెందుల, మరో వైపు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేసేందుకు అటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇటు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. అయితే, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మి దేవి, ఉప మండలాధ్యక్షురాలు గీతా.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా, వారికి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. టీడీపీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.. విద్యావంతులు టీడీపీలోకి స్వచ్ఛందంగా వచ్చి చేరడం ఆనందంగా ఉందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.. అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు..
ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్ ఎట్డకేలకు జైలు నుండి విడుదలయ్యారు. ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న కిషోర్.. ఏపీ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. ఇప్పటికే కిషోర్ పై 11 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆరేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో రెంటచింతల పోలీసులు కిషోర్ ను పీటీ వారెంట్ పై అరెస్టు చేశారు. దీనిపై కిషోర్ హైకోర్టును ఆశ్రయించాడు. కిషోర్ అరెస్టు అక్రమమని హైకోర్టు చెప్పింది. వెంటనే విడుదల చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులలో సాంకేతిక కారణాలు సాకుగా చూపడంతో జైలు నుండి విడుదల కావడం ఆలస్యమయ్యింది.. హైకోర్టు ఆదేశాలతో నిన్నే జైలు నుంచి విడుదల అవుతారని భావించినా.. ఉత్తర్వులు జైలు చేరడంలో కొంత ఆలస్యం.. అందులో సాంకేతిక సమస్యలు.. ఇలా కిషోర్ విడుదల సాయంత్రం వరకు వాయిదా పడింది.. ఈ సందర్భంగా తురకా కిషోర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తూ ఎనిమిది నెలలుగా జైలులో ఉంచారన్నారు. నా పిల్లలుకూడా నన్ను గుర్తుపట్టనివ్వకుండా 214 రోజులు జైలులో ఉంచారని పేర్కొన్నారు. జైలులో ఉన్న సమయంలో వైసీపీ నా కుటుంబానికి అండగా నిలిచిందని, తాను బయటకు రావడానికి సహకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్.
జగన్ ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చు..! డేట్ చెప్పలేం..
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారింది. ఇప్పటికే కీలక వ్యాఖ్యలు అరెస్ట్ అయ్యారు.. అయితే, లిక్కర్ కుంభకోణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్ట్ ఖాయమని అంటున్నారు బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో డేట్ చెప్పలేమని చెబుతున్నారు. బిగ్ బాస్ ఎవరో చెప్పినట్లుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోందని అన్నారు. అప్పట్లో చంద్రబాబుని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసి, 53 రోజులు జైల్లో ఉంచినా ఆధారాలు చూపలేకపోయారని మండిపడ్డారు.. మద్యం స్కామ్ లో సిట్ ఆధారాలు సేకరించి అరెస్టులు చేస్తుందని వివరించారు . ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ, అందుకే ఆ పార్టీ కార్యక్రమాల్లో సీనియర్ నేతలు పాల్గొనడం లేదని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రాజమండ్రిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… గత 78 ఏళ్లలో లేని విధంగా కేంద్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కి పూర్తి సహకారం అందుతోందని అన్నారు. ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంలో వైఎస్ జగన్ ఉన్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రాకూడదనే మళ్లీ నేనే అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నారని తీవ్రంగా విమర్శించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ సెంటర్లు మార్చారా..?
జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ.. పోలింగ్ సెంటర్ల మార్పు వ్యవహారం కాక రేపుతోంది.. అయితే, పోలీసుల సహాయంతో రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ కేంద్రాలు మార్చారా? అంటూ ఫైర్ అయ్యారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. జడ్పీటీసీ ఉప ఎన్నికలు, ఈసీ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. నల్గొండవారిపల్లె వాసులు ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.. నల్గొండవారి పల్లెలో ఎలా దాడులు చేశారో మనం చూశాం.. ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల మార్చడం చూశాం.. కానీ, పోలింగ్ కేంద్రం ఉన్న మార్చారు.. పోలీసులను అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేయడానికి మార్చారా..? అంటూ మండిపడ్డారు.. 6 పోలింగ్ కేంద్రాలపై ఈ ప్రభావం ఉంది… తన ఇంటి ప్రక్కనే పోలింగ్ కేంద్రం ఉన్నా, ఆ ఓటర్ మాత్రం 4 కిలోమీటర్లు వెళ్లి ఓటువేయాలని ఆవేదన వ్యక్తం చేశారు..
ఎల్లుండి బీజేపీలో చేరుతున్న.. నల్లమల్ల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురవేస్తా..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆయన వచ్చే ఆదివారం (10వ తేదీ) ఉదయం 10 గంటలకు బీజేపీ పార్టీని చేరనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన బాలరాజు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నేను ఎంతో కష్టపడి బీఆర్ఎస్ పార్టీ జెండాను చెట్టు కు, పుట్టకు, ఇంటికి తీసుకెళ్లాను. అదే తీరులో ఇప్పుడు బీజేపీ జెండాను కూడా ఇంటింటికి తీసుకెళ్తాను” అన్నారు.
రాహుల్‌కి ఈసీ సవాల్.. ఫైర్ అయిన ప్రియాంక గాంధీ
లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో జరిగిన ఓట్ల చోరీ గురించి సంచలన ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయని చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆగస్టు 1న తాము బిహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని ప్రకటన విడుదల చేసినా.. ఇప్పటివరకు ఏ పార్టీ తమను మార్పులు చేర్పులపై సంప్రదించలేదని ఈసీ తెలిపింది. ఓట్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సైతం ముసాయిదాపై ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు నమోదు చేయలేదని పేర్కొంది. తాము విడుదల చేసిన ఓట్ల తొలగింపు ముసాయిదాపై రాహుల్ గాంధీ బిహార్ ఎన్నికలు పూర్తయ్యాక తన అభ్యంతరాలు చెప్తారేమో అని ఈసీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
దేశానికి ఈసీ సమాధానం చెప్పాలి.. 5 ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ!
లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు. దేశానికి ఈసీ ఈ 5 ప్రశ్నలపై కచ్చితంగా సమాధానం చెప్పాలని అన్నారు. ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటరు జాబితా ఎందుకు రావడం లేదు? ఏం దాస్తున్నారు?, సీసీటీవీ వీడియో ఆధారాలు ఎందుకు ,ఎవరు చెబితే నాశనం చేయబడుతున్నాయి?, నకిలీ ఓటింగ్ ఓటర్ల జాబితాను తారుమారు చేయడం జరిగింది ఎందుకు?, ప్రతిపక్ష నాయకులను బెదిరించడం ఎందుకు?, ఈసీ ఇప్పుడు BJP ఏజెంట్‌గా మారిందా స్పష్టంగా చెప్పండి?. భారతదేశ ప్రజాస్వామ్యం అమూల్యమైనదని ఆయన పేర్కొన్నారు.
అమెరికా సుంకాల వేళ.. చైనాకు మోడీ..
2020లో జరిగిన గాల్వాన్ వివాదం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారి చైనాకు వెళ్లనున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని చైనాను సందర్శించనున్నారు. అమెరికా సుంకాల వేళ మోడీ చైనా పర్యటన ప్రపంచ దేశాల్లో ప్రాముఖ్యతను సంతరించుకొంది. టియాంజిన్ నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరుగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని చైనా, భారత ప్రధానమంత్రిని ఆహ్వానించింది.
కేరళలో కూలీ క్రేజ్.. టికెట్ల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడు. అలాగే అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో అంచనాలు ఎక్కువగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. తాజాగా కేరళలో మూవీ బజ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి!
మహిళలు తమలో ఆత్మవిశ్వాసం పెంచుకున్నపుడే తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలరు అని బాలీవుడ్ తార వామికా గబ్బి అభిప్రాయపడ్డారు. దక్షిణ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన మిస్ ఇండియా యూకే ప్రాజెక్టును నగరంలోని బంజారాహిల్స్ తాజ్ డెక్కన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిస్ ఇండియా యూకే లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు తమలో నైపుణ్యం గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు అన్నారు. ప్రాజెక్టు నిర్వాహకులు స్టార్‌డస్ట్ పేజెంట్స్ ప్రతినిధులు సత్య, క్రాంతి, సాయి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రతిభను, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు మిస్ ఇండియా యూకే ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ది ప్యారడైజ్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ది ప్యారడైజ్. ఒక్క గ్లింప్స్ తోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ అయింది. దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. పైగా నాని చేతిమీద ల** కొడుకు అనే పచ్చబొట్టుతో అందరినీ షాక్ కు గురి చేసింది ఆ గ్లింప్స్. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఈ రోజు సాలీడ్ అప్డేట్ ఇచ్చారు. అందరూ ఊహించినట్టే మూవీని 2026 మార్చి 26న రిలీజ్ చేస్తున్న ఈ రోజు మార్నింగ్ అనౌన్స్ చేశారు. తాజాగా మరో పోస్టర్ ను వదిలారు. ఇప్పుడు వచ్చిన పోస్టర్ లో నాని వందల మంది మధ్యలో కుర్చలో దర్జాగా కూర్చున్నాడు. చుట్టూ వందలాది మంది ఖైదీల డ్రెస్సులో కత్తులతో చంపడానికి చూస్తున్నారు.
