NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సినీ హీరోలపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల
బెంగళూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సినీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. సినిమాలలో పాత్రల మీద పవన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, అప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే.. ఇప్పుడు మాత్రం కుర్ర హీరోలు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు పోషిస్తున్నారు.. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేస్తే ఇప్పుడు హీరోలు మాత్రం అడవులను నాశనం చేసి చెట్లను నరికి వాటిని స్మగ్లింగ్ చేసే వారిగా నటిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గందదగుడి అనే సినిమా తనకు చాలా ఇష్టమని అడవిని రక్షించడమే ఆ సినిమా కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చారు. డీఎఫ్‌వోగా రాజ్ కుమార్ అడవులను కాపాడే తీరు తనకు అప్పట్లో చాలా బాగా నచ్చిందని పవన్ అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్స్ చేయరని పేర్కొన్నారు. చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేదే పవన్ కల్యాణ్ ఆలోచనగా స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..

వ్యవసాయశాఖ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు.. రైతులకు గుడ్ న్యూస్..
రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు.. జులై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్ పుట్ సబ్సీడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని ఆదేశించిన సీఎం… దీంతో సంబంధిత రైతులకు గుడ్ న్యూస్ చెప్పినట్టు అయ్యింది.. ఇక, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని క్లారిటీ ఇచ్చారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 140 డ్రోన్లు మాత్రమే వినియోగిస్తున్నామని వెల్లడించారు అధికారులు. ఇక, కరవు ప్రాంతాల్లో మాయిశ్చర్ ను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పరిశీలన చేసి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. ఇక, మైక్రో ఇరిగేషన్ మాన్యుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. నిమ్మ, టమాటా, మామిడి వంటి ఉత్పత్తుల విలువ జోడించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలన్న సీఎం. ఈ ఉత్పత్తుల ఎగుమతులకు ఎయిర్ కార్గో సేవల్ని అందించేలానూ చూడాలని స్పష్టం చేశారు.. త్వరలోనే ప్రారంభించనున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలుపై కొన్ని సూచనలు చేశారు.. లబ్ధిదారులను గుర్తించేందుకు మొబైల్ నెంబర్లు- బ్యాంకు ఖాతాలను అనుసంధానానికి ఆదేశించారు.. ఈ మేరకు జియో ట్యాగ్ చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

2కే చికెన్‌ బిర్యానీ.. ఎగబడిన జనం..
ఏదైనా నాన్‌వెజ్‌పై ఆఫర్‌ అంటే చాలు.. జనాలు అక్కడికి వాలిపోతుంటారు.. ఇక, బిర్యానీపై ఆఫర్‌ అని తెలిస్తే ఆగుతారా..? గతంలో బిర్యానీ ఆఫర్లకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివెళ్లి.. వాళ్లు ఇబ్బందిపడిన ఘటనలే కాదు.. పరిసర ప్రాంతాల వాసులను.. రోడ్లపై వెళ్లేవాళ్లు కూడా ఇబ్బందిపడేలా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఉషా గ్రాండ్ వద్ద ఓ రెస్టారంట్‌’ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అని ప్రకటించడంతో జనం పోటెత్తారు. దాదాపు 2 వేల మంది బిర్యానీ కోసం ఎగబడ్డారు. కానీ, నిర్వాహకులు మాత్రం ఆఫర్‌ కింద కేవలం 200 బిర్యానీ ప్యాకెట్లను మాత్రమే విక్రయించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి, ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ను అదుపుచేశారు.. రూ. 2కే బిర్యానీ అని చెప్పి కేవలం 200 మందికే ఇవ్వటంతో మిగిలిన వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా.. రూ.2కే చికెన్‌ బిర్యానీ 200 మందిని సంతృప్తి పరిచినా.. మిగతా వారిని మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది.. అంతేకాదు.. వేలాది మందిని ట్రాఫిక్‌ జామ్‌ ఇబ్బంది పెట్టింది.

హైదరాబాద్ నగరం దేశానికి తలమానికం
వర్షాల నేపథ్యంలో చెట్లు, స్థంబాలు, విద్యుత్ వైర్స్ ఒరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అయితే.. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం దేశానికి తలమానికమని, హైదరాబాద్ కు చాలా మల్టిలేవల్ కంపెనీలు వస్తున్నాయన్నారు. వాటికి కూడా విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని సూచించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో అధికారులతో మాట్లాడి ముందుకు వెళ్తామని, సుంకిశాల గోడ కూలిందని చూశానని, హైదరాబాద్ కి నీటి అవసరాల కోసం ప్రాజెక్టు నిర్మాణమన్నారు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల్లోనే క్వాలిటీ లేదు అనుకున్నామని ఆయన తెలిపారు. గోదావరి కాకుండా కృష్ణనదిలో నిర్మాణం అయ్యే వాటిని వదలలేదు అని అర్ధం అవుతుందని, 11.06.2021 న బీఆర్‌ఎస్ హాయంలో అనుమతులు ఇచ్చారని, 2022లో నిర్మాణం ప్రారంభించారన్నారు. జులై 23లో వాల్ పూర్తి అయిందని, సాగర్ లో నీళ్లు వచ్చాయి కాబట్టి కూలింది అంటున్నారని, పాలన ఏ విధంగా ఉందో అర్ధం అవుతుందన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం పై నెట్టి వేయాలని బీఆర్‌ఎస్‌ చూస్తుందని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పుణ్యమే కులడమని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రజల సొమ్ముని వృధా చేశారని ఆయన దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ పాపాలను ఇతరులపై రుద్దాలని చూస్తున్నారని, సుంకిశాల వాల్ కూలడం పై విచారణకు ఆదేశిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

విద్యార్థులకు మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం.. పోరాటంపై ప్రశంసలు
ధైర్యవంతులైన విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం విడుదల చేశారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు రాగానే.. జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ విడుదల చేశారు. గురువారం నిరసనకారులను ప్రశంసిస్తూ ఆసుపత్రి బెడ్‌పై నుంచి జియా వీడియో విడుదల చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి మృత్యువుతో పోరాడిన మా ధైర్యవంతులైన పిల్లలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందలాది మంది అమరవీరులకు నివాళులర్పిస్తాను’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ విజయం మనల్ని కొత్త ఆరంభానికి తీసుకొచ్చింది. దీర్ఘకాలిక ప్రజాస్వామ్య శిథిలాలు, కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన అవినీతి నుంచి బయటపడి కొత్త దేశాన్ని, సుసంపన్నమైన బంగ్లాదేశ్‌ను నిర్మించాలి. విద్యార్థులు, యువతే మన భవిష్యత్తు.. తీసుకువస్తాం. వాళ్లు ఏ కలల కోసం ప్రాణం పోసుకున్నారో ఆ కలలకు ప్రాణం పోయండి’’ అని ఆమె సోషల్ మీడియాలో సందేశంలో పేర్కొంది.

భారత హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు..
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. దీంతో.. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాగా.. విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కాంస్య పతకం సాధించిన భారత జట్టుపై మోడీ గురువారం ప్రశంసలు కురిపించారు. ఈ ఘనత రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని కొనియాడారు. భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా.. స్పెయిన్ పై విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో మెరిసి కాంస్య పతకాన్ని సాధించి పెట్టిన ఘనత రానున్న తరాలకు గుర్తుండేలా ఉందని తెలిపారు. ఒలింపిక్స్‌లో టీమిండియాకు ఇది వరుసగా రెండో పతకం కావడం మరింత ప్రత్యేకం అని అన్నారు. ఈ విజయం వారి నైపుణ్యం, పట్టుదల.. టీమ్ స్పిరిట్ యొక్క విజయమని తెలిపారు. జట్టు అపారమైన సహనం.. స్థితిస్థాపకతను కనబరిచిందని.. భారతీయులందరికీ హాకీ పట్ల భావోద్వేగ అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ విజయం మన దేశ యువతలో గేమ్‌ను మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

టాటా కర్వ్ EV లాంచ్.. ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభం..
టాటా తన కూపే ఎస్‌యూవీ కర్వ్ EVని లాంచ్ చేసింది. దేశంలో తొలిసారిగా కూపే స్టైల్ డిజైన్‌తో వచ్చిన తొలి కారు కర్వ్ ఈవీ. టాటా నుంచి నెక్సాన్, టిగోర్, టియాగో, పంచ్ తర్వాత వస్తున్న ఐదో ఎలక్ట్రిక్ వాహనం కర్వ్ EVనే. దీని ప్రారంభ మోడల్ ధర రూ. 17.49 లక్షలతో మొదలై రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీకి, బీవైడీ అట్టో 3కి ప్రత్యర్థిగా ఉండనుంది. ఇతర టాటా ఈవీ కార్ల మాదిరిగానే టాటా కర్వ్ స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెర్షన్‌లో 45kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది, ఇది 502 కి.మీ రేంజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 55kWh బ్యాటరీ ప్యాక్‌‌తో 585 కి.మీ రేంజ్ ఇస్తుందని చెబుతోంది. టాటా కర్వ్ EV మొత్తం 5 వేరియంట్లు – క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ +S, ఎంపవర్డ్ + , ఎంపవర్డ్ +Aని కలిగి ఉంది. కనెక్టెడ్ LED DRL లైట్లు, LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, బాడీ క్లాడింగ్‌లతో కూడిన స్వ్కేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లను కలిగి ఉంది. వెనకాల LED టెయిల్ ల్యాంప్‌లు ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిమీ, వాటర్ వాడింగ్ కెపాసిటీ 450 మిమీ. బూట్ స్పేస్ 500 లీటర్లు కలిగి ఉంది. ఫీచర్ల విషయాని వస్తే పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కలిగిన 2.3-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, ప్రంట్ వెంటిలేడెట్ సీట్లు, 320 W JBL సౌండ్ సిస్టమ్‌ని కలిగి ఉంది. కర్వ్ భారత్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉంది. లెవల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి.

కరీబియన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్కు హైదరాబాద్ క్రికెటర్ ఎంపిక..
వెస్టిండీస్ లో ఆగష్టు 22 నుంచి 30 వరకు జరగనున్న మహిళల కరీబియన్ ప్రీమిమర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్ లో హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్‌ ప్రణవి చంద్ర ఎంపికైంది. ప్రణవి చంద్ర ఆతిథ్య ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడేందుకు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సీపీఎల్ కు ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రణవి నిలవడం గర్వకారణమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అన్నారు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఎంపికైన తొలి హైదరాబాదీ క్రికెటర్‌గా ప్రణవి రికార్డు నెలకొల్పింది. 22 ఏళ్ల ప్రణవి రైట్‌ హ్యాండ్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ కమ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌. ఆమె ఇప్పటివరకు భారత జాతీయ జట్టుకు ఆడలేదు. కాగా.. హైదరాబాద్‌ టీమ్‌తో పాటు ప్రణవి సౌత్‌ జోన్‌ టీమ్‌ కూడా ప్రాతినిథ్యం వహించింది. దూకుడుగా ఉండే టాప్ ఆర్డర్ బ్యాటర్, దేశవాళీ టీ20లతో పాటు వన్డేలలో ప్రణవి ఆకట్టుకునే స్ట్రైక్ రేట్లు.. ట్రినిడాడ్ లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగే లీగ్ కు ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించింది. లీగ్ లో ట్రినిడాడ్@టొబొగో జట్టులో ముగ్గురు భారతీయులు ఉన్నారు. వారిలో జెమియా రోడ్రిగ్స్, శిఖా పాండే, ప్రణవి ఉన్నారు.

పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీపై దాడి చేసేందుకు కుట్ర..
ఆస్ట్రియాలోని వియన్నాలో జరగాల్సిన మూడు టేలర్ స్విఫ్ట్ కచేరీల ప్రదర్శనలపై దాడి చేసేందుకు ISIS కుట్ర బయటపడింది. ఈ నేపథ్యంలో ఆ షోస్ రద్దు చేయబడ్డాయి. ఆస్ట్రియన్ షో ప్రమోటర్ బార్రాకుడా ఎర్నెస్ట్ హాపెల్ స్టేడియంలో గురువారం నుండి శనివారం వరకు జరగాల్సిన అమ్ముడుపోయిన ప్రదర్శనల రద్దును ధృవీకరించారు. ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద దాడిని అధికారులు ధృవీకరించిన తర్వాత రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఎర్నెస్ట్ హాపెల్ స్టేడియంలో ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద దాడి జరిగనునట్లు ప్రభుత్వ అధికారుల నుండి నిర్ధారణతో., ప్రతి ఒక్కరి భద్రత కోసం షెడ్యూల్ చేయబడిన మూడు ప్రదర్శనలను రద్దు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదని బర్రాకుడా ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. వియన్నా సమీపంలోని ఓ నివాసంపై పోలీసులు బుధవారం జరిపిన దాడిలో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. నిందితులు 19 ఏళ్ల ఆస్ట్రియన్ జాతీయుడు, మరొక వ్యక్తి, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి అవసరమైన రసాయనాలు, పదార్థాలతో కనుగొనబడ్డారు.

కంగనా రనౌత్‌‌కు కాంగ్రెస్ షాక్.. రూ.40 కోట్ల పరువు నష్టం దావా
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌‌పై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నరేంద్ర మిశ్రా రూ.40 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. పార్లమెంట్‌లో కుల గణనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్కల్ క్యాప్, మెడలో శిలువ, నుదుటిపై తిలకం ధరించి ఉన్న నకిలీ ఫోటోను కంగనా షేర్ చేసింది. దీంతో పరువుకు భంగం కలిగించే పని చేసిదంటూ ఆమెపై నరేంద్ర మిశ్రా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆమెకు నోటీసు పంపించారు. ఇదిలా ఉంటే కంగనా తీరుపై నెటిజన్లు కూడా మండిపడ్డారు. తాజాగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నరేంద్ర మిశ్రా.. ఆమెపై చట్టపరమైన చర్య తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక చిత్రాన్ని అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఐటీ చట్టం ప్రకారం చట్ట విరుద్ధమని మిశ్రా అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిష్టను కించపరిచినందుకు ఆమెపై రూ.40 కోట్ల పరువు నష్టం కేసు వేశామని.. పరిహారం చెల్లించాలని కోరారు.

బాధితులకు సహాయార్ధం కేరళ ముఖ్యమంతికి చెక్‌ అందించిన మెగాస్టార్..
కేరళలోని వాయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 400 మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం నలుమూలల నుండి ఈ ఘోరమైన ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సంతాపం, ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, బాధితులను రక్షించడం, పునరావాసం కోసం పలువురు ప్రముఖులు ఉదారంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం నాడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేరళ లోని వయనాడ్‌ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి మనకి తెలిసిందే. కేరళ సీఎం రిలీప్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి.. అందుకు సంబంధించిన కోటి రూపాయల చెక్కును చిరు కేరళ సీఎంకు అందజేశారు. గడిచిన ఆదివారం నాడు కేరళ కొండచరియల బాధితులకు చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి కోటి రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఆదివారం చిరు తన ట్వీట్‌ లో.. ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం, వందలాది విలువైన ప్రాణాలను కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా హృదయం వెల్లివిరుస్తోంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా బాధితులను ఆదుకుంటున్నాం అని రాసుకొచ్చారు.