పోలవరం ముంపు గ్రామాల్లో కేంద్ర బృందం.. పరిహారం ఇస్తే ఖాళీ చేసేందుకు సిద్ధం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో కేంద్రం బృందం పర్యటించింది.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాల్లో వరద పరిస్థితి గురించి స్థానికులను అడిగి తెలుసుకుంది సెంట్రల్ టీమ్.. వరద ముంపును అంచనా వేసేందుకు వచ్చిన బృందం వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రంకోట, తాట్కూరుగొమ్ము గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. 41.15 కాంటూరు పరిధిలో ముంపు గ్రామాల్లో వరద వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వరదల సమయంలో తాము పడుతున్న ఇబ్బందులను నిర్వాసితులు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. తమకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేస్తే గ్రామాలు ఖాళీ చేసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. కేంద్ర బృందంలో సీనియర్ కన్సల్‌టెంట్ (సీఐఐ) డాక్టర్ స్వాతి సులగ్న, డిప్యూటీ డైరెక్టర్ సీఐఐ అయినపర్తి జెస్సీ ఆనంద్, మరో ఇద్దరు సభ్యులు ఉన్నారు. రుద్రమ్మకోట, రేపాక గొమ్ము, తాటుకూరుగొమ్ము గ్రామాల్లో పర్యటించి 2022లో వరదలు ఎంత మేరకు వచ్చాయి? ప్రజలు ఎక్కడ రక్షణ పొందారు? లాంటి అంశాలపై ఆరా తీశారు..
కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ.. తర్వాతే బడ్జెట్ సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.. అసెంబ్లీ సమావేశాలకు కావాల్సిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది.. అసెంబ్లీ సమావేశాలను 20 రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.. అయితే, అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే బీఏసీ సమావేశం నిర్వహించి దానిలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.. సభలో చర్చించాల్సిన అజెండాలకు కూడా ఫైనల్ చేయనున్నారు.. ఇప్పటికే ఆర్ధిక శాఖ అధికారులు 2025 – 26 ఆర్ధిక బడ్జెట్ కేటాయింపులకు సంబందిచిన అవసరాల మేరకు కేటాయింపులపై చర్చించారు.. ఇప్పటికే కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో.. ఏపీ బడ్జెట్ లో కేటాయింపులపై స్పష్టత వచ్చింది.. ఈ బడ్జెట్ లో మూడు కీలకమైన సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయింపులతో పాటు.. సంక్షేమం – అభివృద్దికి సమప్రాధన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.. ఈ నెల 28వ తేదీన లేదా వచ్చే నెల 3వ తేదీన ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.. 26న శివరాత్రి.. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో 28న బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. ఇదే క్రమంలో ఈ సారి అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండటంతో.. కొత్తగా ఎంపికైన శాసన సభ్యులకు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అవగాహన తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యులు విధులు, సభలో సభ్యుల నడుచుకునే తీరు వంటి అంశాలపై సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు.. ఈ శిక్షణా తరగతులను ప్రారంభించేలా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ను ముఖ్య అతిధిగా అహ్వానించనున్నారు అసెంబ్లీ స్పీకర్.. రెండో రోజు మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు కూడా ఈ శిక్షణా తరగతులకు హాజరుకానున్నారు..
పోలీసుల విచారణ.. అది నిజమేనని ఒప్పుకున్న ఆర్జీవీ..!
వివాదాస్పద పోస్టులతో కేసులు ఎదుర్కొంటున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్‌బాబు.. ఆర్జీవిని ప్రశ్నిస్తున్నారు.. అయితే, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో దాదాపు ఆరు గంటలుగా ఆర్జీవీ విచారణ కొనసాగుతోంది.. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు ఆర్జీవీ.. అయితే, తన ఎక్స్ లో నుండే ఆ పోస్టింగ్స్ చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు ఆర్జీవీ.. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ పోస్టింగ్స్ చేసినట్టు ఆర్జీవీ అంగీకరించారట.. కానీ, ఆ పోస్టింగ్స్ తో వైసీపీ నేతలకు సంబంధం లేదని స్పష్టం చేశారట.. మరోవైపు, ఫైబర్ నెట్ నుండి రెండు కోట్ల రూపాయలు ఆర్జీవీకి కేటాయించడంపై ప్రశ్నలు సంధించారట పోలీసులు.. కానీ, రెండు కోట్ల కేటాయింపు పై రాంగోపాల్ వర్మ ఎలాంటి సమాధానం చెప్పనట్టుగా తెలుస్తోంది.. ఇక, వైసీపీ నేతలతో ఆర్జీవీకి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీయగా.. వైసీపీ నాయకులతో తనకు వ్యక్తి గత పరిచయాలు మాత్రమే ఉన్నాయని ఆర్జీవీ సమాధానం ఇచ్చారట.. అయితే, మరో నాలుగైదు గంటల పాటు ఆర్జీవీ విచారణ కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, పోలీసుల విచారణకి వచ్చే ముందుగా వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. ఆర్జీవీని కలవడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారట..
మూడు రాజధానులపై త్వరలో మా స్టాండ్ చెబుతాం.. అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో మూడు రాజధానులే మా విధానం అని స్పష్టం చేసింది.. అమరావతిని శాసన రాజధానిని చేసి.. విశాఖను పరిపాలన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొన్నారు.. ఆ దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసింది.. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏంటి? నే చర్చ సాగుతుండగా.. మూడు రాజధానులపై మా స్టాండ్ ఏంటో త్వరలో చెప్తాం అన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. దీంతో, మూడు రాజధానులపై వైసీపీ మళ్లీ కొత్త స్టాండ్ తీసుకోనుందా? అనే చర్చ సాగుతోంది.. మరోవైపు, చంద్రబాబు దగ్గర రెడ్ బుక్ ఉన్నంతవరకు వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు అంబటి.. ఇక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిల దృష్ట్యా నూతన నగరాలు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు అన్నారు.. రాజకీయాలలో సీనియర్ అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు నిలకడ లేదు.. ఏ పార్టీలో చేరితే ఆ పాట పాడటం డొక్కాకు అలవాటు అని ఫైర్ అయ్యారో.. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఏ జ్వరం వచ్చిందో నాకు తెలియదు అంటూ సెటైర్లు వేశారు.
గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే..
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా గ్రూప్-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించగా, మొత్తం 21,093 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థుల్లో కేవలం 67.17% మాత్రమే మెయిన్స్ పరీక్ష రాశారు. ఈ గణాంకాల ప్రకారం ఒక్కో పోస్టుకు సుమారు 38 మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా, 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించేందుకు టీజీపీఎస్సీ తుది సమీక్ష చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, వారం నుండి పది రోజుల్లో ఫలితాలు (Results) విడుదల చేసే అవకాశముంది. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు. ఇక, గ్రూప్-2 (Group-2) , గ్రూప్-3 (Group-3) పరీక్షల ఫలితాల కోసం నిరీక్షణలో ఉన్న అభ్యర్థులకు మరో అప్‌డేట్ ఉంది. టీజీపీఎస్సీ ముందుగా గ్రూప్-1 నియామక ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం.
అలర్ట్.. అలర్ట్.. మీసేవలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అంతే కాదు, కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులు, చిరునామా మార్పులు, ఇతర మార్పులు అవసరమైనా వాటిని కూడా ఆన్‌లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాలను సందర్శించి అవసరమైన మార్పులు, కొత్త దరఖాస్తులను చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటికీ కొనసాగుతుందని, దీనికి ఒక నిర్దిష్టమైన గడువు లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించనుంది.
2015, 2020లో బీజేపీ గ్రాఫ్ ఇది.. 2025 బిగ్ ఛేంజ్ అవుతుందా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆప్ మాత్రం అవి ఫేక్ సర్వేలంటూ తోసిపుచ్చుతోంది. ఇలా ఎవరికి వారే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఊహాగానాలన్నింటికీ మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఇదిలా ఉంటే 2015, 2020 ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గానీ.. బీజేపీ గానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కాంగ్రెస్ అయితే జీరో సీట్లు సాధించింది. బీజేపీ అయితే కనీసం కొన్ని సీట్లైనా గెలిచింది. 2015లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 సీట్లలో 62 గెలుచుకుని ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుని తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ ఏర్పాటు చేసింది. బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు.
ఇండో అమెరికన్ నేత క్షమా సావంత్‌కు ఎమర్జెన్సీ వీసా తిరస్కరించిన భారత్!
అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న భారత కాన్సులేట్‌లో భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలు క్షమా సావంత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అత్యవసర వీసా నిరాకరించడంతో సియాటిల్‌లోని భారత కాన్సులేట్ శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొంది. కొంతమంది వ్యక్తులు కార్యాలయ సమయం తర్వాత అనుమతి లేకుండా కాన్సులేట్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి, బయటకు వెళ్లడానికి నిరాకరించడంతో సంబంధిత స్థానిక అధికారులను పిలవవలసి వచ్చిందని సియాటిల్ లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. ‘‘ఈరోజు కొంతమంది వ్యక్తులు కార్యాలయ సమయం తర్వాత కాన్సులేట్ ప్రాంగణంలోకి అనధికారికంగా ప్రవేశించడం వల్ల తలెత్తిన శాంతిభద్రతల పరిస్థితిని కాన్సులేట్ ఎదుర్కోవలసి వచ్చింది. పదే పదే అభ్యర్థించినప్పటికీ ఈ వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణాన్ని వదిలి వెళ్ళడానికి నిరాకరించారు. కాన్సులేట్ సిబ్బందితో దూకుడుగా మరియు బెదిరింపులకు పాల్పడ్డారు.’’ అని సియాటిల్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. క్షమా సావంత్.. సియాటిల్ నగర కౌన్సిల్ మాజీ సభ్యురాలు. ఇదే వ్యవహారంపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. తిరస్కరణ జాబితాలో తన పేరు ఉందని పేర్కొంటూ వీసా నిరాకరించారన్నారు. ఈ క్రమంలోనే మూడుసార్లు తన వీసా నిరాకరించినందుకు గల కారణాలు తెలపాలంటూ తన మద్దతుదారులతో కలిసి భారత కాన్సులేట్ ముందు శాంతియుతంగా నిరసన చేపట్టామన్నారు. క్షమా సావంత్‌కు భారత్ వీసా నిరాకరించడం ఇదే తొలిసారి కాదు. బెంగళూరులో ఉంటున్న ఆమె తల్లి దగ్గరకు వెళ్లేందుకు సావంత్ గతంలో ప్రయత్నించినప్పటికీ వీసా మంజూరు కాలేదు. ఆమె భర్త కాల్విన్ ప్రీస్ట్‌కు మాత్రం వీసా లభించడం విశేషం.
పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.. చాలా కాలం మిస్ అయ్యాను!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. తెలుగు సినిమా ప్రేక్షకులకు థాంక్ యూ సో మచ్. సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా కాలంగా ఇది మిస్ అయ్యాను. ఫైనల్ గా మళ్ళీ నాకు తిరిగివచ్చింది. మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళుతోంది. ఇంకా ఫ్యామిలీస్ థియేటర్స్ కి రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ కి నచ్చే ఎన్నో ఎమోషన్స్ వున్నాయి. వాళ్ళంతా వస్తే సినిమాకి ఇంకా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. దేవిశ్రీ కి థాంక్ యూ చెప్పాలి. నా పెర్ఫార్మెన్స్ కి కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే సగం క్రెడిట్ దేవికి ఇవ్వాలి. మా ‘తండేల్’ అరవింద్ గారు. ఆయనకి, వాసుకి, చందుకి ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు. అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇదంతా టీం వర్క్. అందరికీ థాంక్ యూ. అందరూ థియేటర్స్ కి వెళ్లి సినిమాని ఎంజాయ్ చేయండి’ అన్నారు.
విజయ్ దేవరకొండ సినిమా “వీడీ 12” టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ “వీడీ 12”. ఇప్పటికే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సినిమాను రూపొందిస్తున్నారు.నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన నుంచే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డెట్ వచ్చింది. ఈ రోజు(శుక్రవారం) మూవీ మేకర్స్ “వీడీ 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన “వీడీ 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరీటాన్ని చూపించడంతో పాటు ‘ది సైలెంట్ క్రౌన్, అవేట్స్ ది కింగ్..’ అని క్యాప్షన్ రాసి ఉంది. ఇది ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ప్రేక్షకులు ఆదరించేలా, ఎప్పుడూ గుర్తుంచుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సినిమా మేకర్స్ తెలిపారు.
యాక్షన్ కు యాక్షన్.. కామెడీకి కామెడీ.. టీజర్ తోనే అదరగొట్టిన స్టార్ బాయ్ సిద్ధు
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘జాక్ కొంచెం క్రాక్’ అనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సరికొత్త జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 7న విడుదల చేశారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన తదుపరి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘డీజే టిల్లు’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు ‘జాక్ కొంచెం క్రాక్’తో ఓ కొత్త ప్రయాణం ప్రారంభించనున్నారు. ఈ చిత్రం ఇటీవల విడుదలైన టీజర్‌తో అదిరిపోయే హింట్ ఇచ్చింది. ఇది ప్రేక్షకుల మధ్య అంచనాలు మరింత పెంచింది. ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్‌లో సిద్ధు జొన్నలగడ్డ అద్భుతమైన వినోదంతో తన పాత్రతో తన మార్క్ కామెడీ పండించాడు. టీజర్‌లో ఆయన పర్‌ఫార్మెన్స్ చూడగానే అర్థమవుతుంది. భాస్కర్ దర్శకత్వంలో అద్భుతమైన స్క్రీన్‌ప్లే, గ్యాగ్‌లు, కామెడీ సీన్లు ఈ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘జాక్ కొంచెం క్రాక్’ చిత్రం ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్లను కలగలిపి రూపొందించబడినట్లు తెలుస్తోంది. సినిమా మరింత రెగ్యులర్ ప్రేక్షకులకు చేరడానికి, కుటుంబ సమేత ప్రేక్షకులను ఆకర్షించడానికి రెడీ అవుతుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.