Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలి.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..
యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని.. అందుకే అంతా వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ఊతం ఇస్తుందన్నారు.. చేనేత… మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచింది. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.. మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే అసంఘటిత రంగాలలో చేనేత ఒకటి. ఈ రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఊతమిస్తుందన్నారు పవన్‌ కల్యాణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నాం.. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం.. సొసైటీలనుoచి ఆప్కో కొనేవాటికి జీఎస్టీపై 5 శాతం రాయితీ అమలు చేయడంతోపాటు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. చేనేత వస్త్రాలు వినియోగం పెంచే దిశగా ప్రచార కార్యక్రమాలు పెంపొందిస్తాం… యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు.. దాడులపై ఫిర్యాదు..
కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతోన్న వేళ.. దాడులు వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, రాజ్‌ భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైసీపీ నేతల బృందం.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు.. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసినవారిలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు.. ఇక, ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యాలపై గవర్నర్ దృష్టికి తెచ్చాం.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడి ఘటనలను వివరించాం.. రమేష్ యాదవ్ పై విచక్షణా రహితంగా దాడి చేసి మట్టుపెట్టే ప్రయత్నం చేశారు.. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా..? అని ప్రశ్నించారు.. అయితే, దాడులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరాం అన్నారు.. గ్రామంలో పోలీసులు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే దాడి జరిగిందన్నారు.. కర్నూలు డీఐజీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన భాష చూస్తుంటే పోలీసులు ఎలా ఉన్నారో అర్థం అవుతుందన్న ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని కోరాం.. గవర్నర్ అన్ని విషయాలు విని సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఏసీబీ చరిత్రలో తొలిసారి..! రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈఎన్సీ..
ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే గతంలో ఎన్నడూ పట్టుబడని విధంగా ఏకంగా 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు ఓ అధికారి.. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.. భీమవరానికి చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తికి 35 కోట్ల రూపాయల బిల్లు విడుదల చేయాల్సి ఉండగా.. దాని కోసం రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌.. అయితే, ఇవాళ 25 లక్షల రూపాయాలు అడ్వాన్స్ ఇవ్వగా.. ఆ డబ్బు ఇస్తుండగా శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్‌ చేయడం.. రూ.25 లక్షలతో పట్టుబడడం ఇదే తొలిసారి అంటున్నారు ఏసీబీ అధికారులు..

విశాఖలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..!
విశాఖపట్నంలో భారీ పేలుడు సంభవించింది.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఏరియాలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది.. విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ బార్ దగ్గర గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో.. ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది… అయితే, పలువురికి గాయాలు అయ్యాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.. కాగా, స్టీల్‌ సిటీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. సిలిండర్ పేలుడు జరిగిన ప్రాంతంలో చల్లాచెదురుగా పడిపోయారు క్షతగాత్రులు.. ఇక, గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మృతదేహాలు ఉన్నాయి.. ఘటన స్థలానికి చేరుకున్న సహాయ బృందాలు, అంబులెన్స్‌.. సహాయక చర్యలు చేపట్టాయి.. అసలు మాంసం ముద్దలుగా మృతదేహాలు మారిపోవడం షాక్‌కు గురిచేస్తోంది.. అయితే, వెల్డింగ్ చేసే సిలిండర్ పేలినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.. ఇప్పటివరకు ముగ్గురు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం.. మరోవైపు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్.. ప్రమాదంపై ఆరా తీశారు..

ఉద్యోగిని కిడ్నాప్‌.. ఆఫీసుకు వచ్చి బలవంతంగా కారులో ఎక్కించి..!
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలో ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది.. దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో.. సోయం శ్రీసౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 8 మంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా వాహనంలో సినీ ఫిక్కీలో ఆమెను ఎత్తుకెళ్లారు. అయితే ప్రేమ వ్యవహారంతో ఈ కిడ్నాప్ జరిగినట్లుగా తెలుస్తోంది. కిడ్నాపర్లలో ఒకరైన కశింకోట అనిల్ ప్రేమ వ్యాహారంతో సౌమ్యను బలవంతంగా తీసుకెళ్లినట్లుగా భావిస్తున్నారు. గతంలో వీరిద్దరూ పారిపోయిన సమయంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. తాజాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దేవీపట్నం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. వచ్చే రెండ్రోల పాటు విస్తారమైన వర్షాలు..!
హైదరాబాద్‌ సిటీలో పెనుగాలులతో కుండపోత వర్షం కురుస్తోంది.. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌, మాదపూర్‌, కొండాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 2 రోజులపాటు రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడే అవకాశం ఉంది. హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

కేసీఆర్ బిక్ష వల్ల ఎమ్మెల్యే కాలేదు.. గువ్వల సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేవలం కేసీఆర్ ఒక్కరే పోరాటాలు చేశారా? అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తాజాగా ఎన్టీవీ క్వశ్చన్ హవర్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది పోరాటం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ పట్టువిడవకుండా పోరాటం చేశారని ప్రశంసిస్తూ వచ్చానన్నారు. కేసీఆర్ బిక్ష వల్లే ఎమ్మెల్యే అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే.. కేసీఆర్ లేకుంటే మీరు ఎమ్మెల్యే అయ్యేవారే కాదు. మీరు వార్డు మెంబర్‌కే సరిపోరు అనే విధంగా నేడు బీఆర్ఎస్ విమర్శలు చేయిస్తోందని మండిపడ్డారు. అదెక్కటి సంస్కృతి అంటూ నిలదీశారు. అయితే.. తెలంగాణ పోరాటం లక్షల మంది చేశారు కదా.. వారందరినీ ఎమ్మెల్యేలుగా చేసేది ఉండే.. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్నే ఎందుకు ఎంచుకున్నారు? అని సూటిగా ప్రశ్నించారు. తాము ఎంత త్యాగం చేశామో.. ఎన్ని పోరాటాలు చేశామో తమకు తెలుసన్నారు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన తనను శాసనసభలోకి అడుగుపెట్టేలా చేసిందన్నారు. కేసీఆర్ చెప్పిందే తూచా తప్పకుండా పాటించానని గువ్వల బాలరాజు అన్నారు.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతోనే అవకాశాలు వచ్చాయని… ఏ పార్టీ తనను కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు.. ఏ పార్టీలో చేరుతాననే విషయం ఇప్పటికీ ప్రకటించలేదని.. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.. ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌ కూడా ఓటమికి ఓ కారణమన్నారు.

కేసీఆర్ అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌.. ఎంత పెద్ద మాట అన్నారు సార్…!
కేసీఆర్ అరెస్ట్‌ సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ అరెస్ట్ ఊహాగానాలకు తెరదించారు. కేసీఆర్‌ స్వీయ నియంత్రణలో బందీ అయ్యారని.. కొత్తగా ఆయన్ని జైల్లో పెట్టాల్సి అవసరం లేదన్నారు సీఎం రేవంత్. చర్లపల్లి జైలుకు ఫామ్‌హౌస్‌కు పెద్ద తేడా లేదన్నారు. ఫామ్‌హౌస్‌లో పర్యవేక్షణ ఉంటుంది. జైల్లో పహారా ఉంటుందని చెప్పారు. కేసీఆర్‌ను ప్రజలు ఓడించడమే పెద్ద శిక్ష అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. వారికే ఆ అధికారం..
నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి వ్యూహంపై సమావేశంలో చర్చించారు. మీటింగ్ అనంతరం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం (ECI) ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీలను ప్రకటించిందని, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21 అని ఆయన తెలియజేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధానమంత్రి మోడీ, జేపీ నడ్డా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అన్ని రాజ్యాంగ పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారని రిజిజు తెలిపారు.

ట్రంప్‌ సుంకాల మోతకు “ఆపరేషన్ సిందూర్” కారణమా..? సంచలన విషయాలు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరిపై అగ్రశ్రేణి నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్‌ను, అమెరికాకు ప్రథమ శత్రువుగా పరిగణించే చైనాను అకస్మాత్తుగా ట్రంప్ ఇష్టపడుతున్నారు. సుంకాల వివాదంలో చైనా కూడా భారతదేశానికి నైతిక మద్దతు ఇస్తుంటే.. ట్రంప్ మాత్రం మిత్రదేశం అంటూనే దెబ్బమీద దెబ్బ తీస్తున్నారు. భారత్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆపరేషన్ సిందూర్ అని ఓ విశ్లేషకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యాన్ని తిరస్కరించడంతో ఇందంతా చేస్తున్నారని.. అమెరికాకు చెందిన ఒక విశ్లేషకుడు అన్నారు.

నో ట్రంప్ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్..!
రెండ్రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ బయటపడింది. ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దుతు కలిసి రావడంతో ఏ ఎఫక్ట్ స్టాక్ మార్కెట్‌పై పని చేయలేదు. అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల బాదుడును దేశీయ మార్కెట్‌ పెద్దగా పట్టించుకోనేలేదు. ఎందుకంటే ట్రేడ్‌డీల్‌లో పైచేయి సాధించడానికి సుంకాల బాదుడు ఒక ఎత్తుగడ అని మార్కెట్‌ గ్రహించిందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురును సాకుగా చూపి భారత్‌పై సుంకం వడ్డించడంతో మార్కెట్‌ సూచీలు స్టార్టింగ్‌లో పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూసిన.. డే ఎండింగ్‌కి వచ్చే సరికి మాత్రం కొనుగోళ్ల మద్దతుతో గట్టిగా పుంజుకొని ఏ ఎఫెక్ట్ తమను ప్రభావితం చేయదని నిరూపించాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దుతు నష్టాల నుంచి గట్టెక్కించాయి. టారిఫ్‌ భయాలతో సెన్సెక్స్‌ ఉదయం 80,262.98 (క్రితం ముగింపు 80,543.99) పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో భారీ నష్టాల్లో కొనసాగిన సూచీ.. ఇంట్రాడేలో 79,811.29 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో భారీగా పుంజుకుని 79.27 పాయింట్ల లాభంతో 80,623.26 వద్ద స్థిరపడింది. నిఫ్టీసైతం 21.95 పాయింట్ల లాభంతో 24,596.15 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.69గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎటెర్నల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ లాభాల్లో ముగిశాయి.

వైఫై యూజర్స్‌కి అలర్ట్.. వీటి గురించి తెలుసా..!
మీ ఇంట్లో వైఫై ఉందా అయితే ఈ స్టోరీ మీ కోసమే. అసలు రాత్రి నిద్రపోయే సమయంలో Wi-Fi ఆన్ చేసి నిద్రపోతే కరెంట్ ఛార్జ్ పెరుగుతుందో లేదో ఎప్పుడన్నా ఆలోచించారా. చాలా మంది యూజర్స్‌కి ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న ఎదురై ఉంటుంది. Wi-Fi రూటర్‌ను 24/7 ఆన్‌లో ఉంచాలా వద్దా ప్రశ్నకు ఆన్సరే ఈ స్టోరీ నిలుస్తుంది. మీరు ఆలస్యంగా మేల్కొని గంటల తరబడి ఫోన్, లాప్‌ట్యాప్ స్క్రోల్ చేసే అలవాటు కలిగి ఉంటే, మీరు రాత్రంతా మీ Wi-Fi సిగ్నల్‌ను ఆన్‌లో ఉంచే అవకాశం ఉంది. వాస్తవానికి Wi-Fi రూటర్‌ను 24/7 ఆన్‌లో ఉంచడం ఉత్తమ మార్గం. ఇది యూజర్స్‌కి మంచి నాణ్యమైన సేవలను అందించడమే కాకుండా, మీ పరికరాలను సరిగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. రాత్రిపూట Wi-Fi రూటర్లను ఆఫ్ చేయడం వల్ల కొంత విద్యుత్తు సేఫ్ అవుతుంది కానీ.. ఇది చాలా తక్కువ. రూటర్ ఆన్‌లో ఉన్నా మీ విద్యుత్ బిల్లులో మీకు పెద్దగా తేడా కనిపించదు. నిజానికి రూటర్లు 24/7 పనిచేసేలా రూపొందించబడ్డాయి. వాటిని తరచుగా ఆన్/ఆఫ్ చేయడం వల్ల వాటి లైఫ్‌టైం తగ్గుతుంది.

బిగ్ బాస్ కు వెళ్తే నాశనమే.. యాంకర్ రవి సంచలనం..
తెలుగు నాట అతిపెద్ద రియాల్టీ షోగా ఉన్న బిగ్ బాస్ కు మంచి క్రేజ్ ఉంది. కానీ ఆ షో గురించి ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. అందులోకి వెళ్లిన వారు నెగెటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. తాజాగా యాంకర్ రవి ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ కు వెళ్లొద్దని మొదటి నుంచి అనుకున్నాం. ఎందుకంటే దాని గురించి మొత్తం తెలుసు. అందులోకి వెళ్లే వారంతా అక్కడి మేనేజ్ మెంట్ చెప్పినట్టు యాక్ట్ చేయాల్సిందే. అక్కడ ఎవరూ రియాలిటీగా ఉండరు. నాలుగు సీజన్లుగా ఆఫర్లు వస్తే రిజెక్ట్ చేశా. ఐదో సీజన్ కు పెద్ద మొత్తంలో ఇస్తే వస్తానని చెప్పి తప్పించుకోవాలనుకున్నా. కానీ వాళ్లు నేను అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అందుకే ఓకే చెప్పాల్సి వచ్చింది అంటూ తెలిపారు రవి.

హిందు వర్సెస్ ముస్లిం కాదు.. వీరమల్లుపై పవన్ క్లారిటీ..
పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ముస్లిం వర్సెస్ హిందు అనే కోణంలో తీశారనే ప్రచారం జరిగితే దాన్ని ఇప్పటికే పవన్ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమాను కోవిడ్ కు ముందు ప్రారంభించాం. ఈ మూవీ లైన్ గురించి క్రిష్‌ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమాలో మన చరిత్రను చూపించాలని అనుకున్నాం. వీరమల్లు వారసత్వాన్ని ఈ తరానికి చూపించాలని అనుకున్నాం. అంతే తప్ప హిందు వర్సెస్ ముస్లిం అనే కోణంలో తీయలేదు. ఒక నిరంకశుడి క్రూరత్వాన్ని ఈ సమాజానికి వివరించాలనే ప్రయత్నం మాత్రమే చేశాం అంటూ క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్‌.

Exit mobile version