NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్ల కేంద్ర సాయంలో బిగ్‌ ట్విస్ట్‌..! అది వట్టిదే..
వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవి చూసిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్‌ వచ్చి చేరింది.. కేంద్రం సాయం చేసింది అనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రూ.3300 కోట్లు వచ్చాయన్నది పుకారు మాత్రమే.. మాకైతే ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు అన్నారు.. మేం ఇంకా ప్రాథమిక నివేదిక పంపలేదు, రేపు ఉదయం నష్టం అంచనా పై ప్రాథమిక నివేదిక పంపుతాం అన్నారు సీఎం చంద్రబాబు..

మందుబాబులకు గుడ్‌ న్యూస్‌.. యథావిధిగా లిక్కర్‌ షాపులు.. నో బంద్..
ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులకు గుడ్‌ న్యూస్‌.. గత కొంత కాలంగా మద్యం షాపులు బంద్‌ కానున్నాయంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.. అయితే, రాష్ట్రంలో యథావిధిగానే పని చేయనున్నాయి ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బంద్ ని నిరవధికంగా వాయిదా వేసింది ఏపీ బేవరేజ్ కార్పొరేషన్‌ సేల్స్ మెన్స్ అండ్‌ సూపర్వైజర్ల అసోసియేషన్.. బంద్‌ని వాయిదా వేస్తూ ఈ నెల 4వ తేదీనే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కి లేఖ అందించారు ఆ సంఘ ప్రతినిధులు.. అయితే, వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు కమిషనర్ నిశాంత్ కుమార్.. దీంతో.. వివిధ సోషల్ మీడియా వేదికల్లో మద్యం దుకాణాల బంద్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, యథావిధిగానే మద్యం షాపులు పని చేస్తాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు కమిషనర్ నిశాంత్ కుమార్.. కాగా, మొదట ఈ నెల 7వ తేదీ నుంచి మద్యం షాపులు బంద్‌ చేయాలని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌‌తోనే ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్వ్యూల ద్వారా తమను ఎంపిక చేశారు.. ఇప్పుడు తాము ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.. ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం స్పందించే వరకు ఈ బంద్‌ కొనసాగిస్తామని పేర్కొన్నారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బంద్‌కు పూనుకున్నట్టు వార్తలు వచ్చాయి.. కానీ, బంద్‌ కాలాఫ్‌ కావడంతో.. ఇప్పుడు యథావిధిగానే ఏపీలో మద్యం షాపులు పనిచేయనున్నాయి..

ఆయనే రాష్ట్రానికి ఒక పెద్ద విపత్తు.. మానవ తప్పిదాల వల్లే వరదలు..
ఏపీలో వరదల సమయంలో బురద రాజకీయం నడుస్తోంది.. అయితే, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జగనే రాష్ర్టానికి ఒక పెద్ద విపత్తుగా పేర్కొన్న ఆయన.. జగన్ చేసిన మానవ తప్పిదాల వల్లనే వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగాయన్నారు. ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’లో ఉన్న మ్యాన్ జగన్ రెడ్డే అని దుయ్యబట్టారు.. పోలవరం, వెలిగొండ, పట్టిసీమను పట్టించుకోకపోవడం.. సాగునీటి ప్రాజెక్టులకు తట్ట మట్టి వేయకపోవడం.. జగన్ చేసిన మానవ తప్పిదాలని ఫైర్‌ అయ్యారు.. 2021లో పింఛ ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి జగన్ ఆధ్వర్యంలో ఇసుక మాఫియానే కారణం అన్నారు.. 2021లో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 44 మంది చనిపోయి వేలాదిమంది నిరాశ్రయులవడానికి జగన్ ఇసుక మాఫియానే కారణమని ఆరోపించారు.. ప్రాజెక్ట్ గేట్లకు గ్రీజు కూడా పెట్టకుండా జగన్ చేసిన తప్పులే నేడు ప్రజలకు శాపంగా మారాయని.. బుడమేరు కాలువ చుట్టుపక్కల కబ్జాలకు పాల్పడ్డ నాటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. వారి నాయకుడు జగన్ రెడ్డే విజయవాడ వరదలకు కారణమని విమర్శించారు. ఇక, బుడమేరు నుండి వరద నీటిని కృష్ణా నదికి తరలించడానికి 2017-18లో టీడీపీ ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేస్తే.. అధికారంలోకి రాగానే పనులను ఆపేసి.. ఈనాటి వరద బీభత్సానికి జగన్ రెడ్డినే కారణం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్‌..

నాకూ రెడ్‌ బుక్‌ ఉంది.. ఎవ్వరినీ వదలను..! భూమా అఖిల ప్రియ సంచలనం..
నాకూ ఒక రెడ్‌బుక్‌ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె.. నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. అందులో 100 మందికిపైగా ఉన్నారు.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.. అంటే వారిని నేను ఏదో కట్టె పట్టుకొని కొడతానని కాదు.. చంపేస్తానని కాదు.. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందిపై తప్పుడు కేసులు బనాయించారు.. అలాంటి వరికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవన్నారు.. నేను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను అని చెప్పానా? అధికారంలోకి వస్తే.. తోలు తీస్తానని చెప్పాను.. అతే తరహాలో ఉంటానన్నారు. ఇక, ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెబుతాను అని చెప్పా.. చెప్పి తీరుతా అన్నారు అఖిలప్రియ.. నాకు రెడ్‌ బుక్‌ ఉంది.. అందులో వంద మంది పేర్లు ఉన్నాయి.. ఇద్దరు ముగ్గురు పేర్లను పాపం అని తీసేశాను.. కానీ, వంద మందిని నేను ఇబ్బంది పెట్టబోతున్నాను అని వ్యాఖ్యానించారు.. అయితే, తప్పు చేస్తేనే భయపడంది.. లేకపోతే హ్యాపీ ఉండండి అని పేర్కొన్నారు.. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే గంగుల డిగ్రీ కాలేజీ తెచ్చానని చెప్పుకుంటున్నాడు.. పేరుకే డిగ్రీ కాలేజ్.. కానీ, సరైన వసతులు కూడా లేవు అని దుయ్యబట్టారు అఖిల ప్రియ.. కనీసం స్వీపర్లు కూడా లేక విద్యార్థులతో గదులు శుభ్రం చేయిస్తున్నారని విమర్శించారు.. మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డికి కేవలం దొంగ ఓటర్ మాత్రమే అని ఆరోపించారు.. సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్ ని తీసుకొచ్చి డిగ్రీ కాలేజీకి వేయించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు భూమా అఖిలప్రియ..

రాష్ట్రంలో వరదలు.. సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
తెలంగాణలో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు విలయతాండవం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిగా సర్దుకోలేదు. ఇదిలా ఉండగా.. పలు రంగాల్లోని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం సహాయనిధికి జీఎంఆర్ గ్రూప్ రూ.2కోట్ల 50 లక్షలు విరాళంగా అందించింది. కెమిలాయిడ్స్ (Chemiloids) కంపెనీ చైర్మన్ రంగరాజు రూ.కోటి విరాళంగా అందించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రతినిధులు రూ.కోటి విరాళంగా అందించారు. విర్కో ఫార్మా రూ.కోటి విరాళంగా అందించింది. అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి రూ.కోటి విరాళంగా అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది” అని అన్నారు.

విస్తారా విమానంలో భద్రతా లోపాలు.. టర్కీకి మళ్లింపు
విస్తారా ముంబై-ఫ్రాంక్‌ఫర్ట్ విమానంలో భద్రతా లోపాలు తలెత్తాయి. దీంతో విమానాన్ని టర్కీకి మళ్లించారు. ముంబై నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లాల్సిన UK27 విమానం భద్రతా కారణాల దృష్ట్యా టర్కీలోని ఎర్జురం విమానాశ్రయానికి మళ్లించబడిందని ఎయిర్‌లైన్ ఎక్స్‌లో తెలిపింది. కమర్షియల్ క్యారియర్ విస్తారా భద్రతా కారణాల దృష్ట్యా ముంబై-ఫ్రాంక్‌ఫర్ట్ విమానాన్ని శుక్రవారం టర్కీకి మళ్లించిందని ఎయిర్‌లైన్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపింది. రాత్రి 7:05 గంటలకు ఎర్జురం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడిందని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. విమానంలో ఎలాంటి భద్రతా కారణాలు తలెత్తాయన్న విషయాన్ని మాత్రం ఎయిర్‌‌లైన్స్ వెల్లడించలేదు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. విమానయాన సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. విమానంలోని సిబ్బంది భద్రతా ఆందోళనను గుర్తించారని, ఆ తర్వాత సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పారు. సిబ్బంది భద్రతా లోపాలను గుర్తించిన తర్వాతే విమానాన్ని టర్కీకి మళ్లించినట్లు వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత అధికారులు అప్రమత్తం అయ్యారని.. సురక్షితంగా విమానం ల్యాండ్ అయిందని తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. భద్రతా తనిఖీలకు ఏజెన్సీలకు సహకరిస్తామని చెప్పారు.

వినేష్ ఫోగట్ సీటు కేటాయించిన కాంగ్రెస్.. పోటీకి దూరంగా బజరంగ్!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్ లో చేరింది. వినేష్ ఫోగట్ జులనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనుండగా, బజరంగ్ పునియా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 71 సీట్లపై నిర్ణయాలు తీసుకున్నారు. బజరంగ్ పునియా బద్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని గతంలో చర్చ జరిగింది. ఎందుకంటే బజరంగ్ బద్లీ నుంచి వచ్చాడు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయరని, ప్రచారం మాత్రమే చేస్తారనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరింగ్‌ పునియా చేరిన విషయం తెలిసిందే. హర్యానాలో వచ్చే నెల తొలివారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీరి చేరిక కాంగ్రెస్‌కి మరింత జోష్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌లో చేరికపై వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం మనకు అనుకూలంగా లేని సమయంలోనే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో తెలుస్తుందని అన్నారు. ‘‘ నా కుస్తీ కెరీర్‌లో నన్ను ఆదరించినందుకు దేశ ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మరియు వారి అంచనాలను అందుకుంటానని ఆశిస్తున్నాను. నేను కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వారు చెప్పినట్లు, సమయం చెడుగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఎవరు ఉంటారో తెలుసుకోవచ్చు. మనల్ని రోడ్లపైకి ఈడ్చుకెళ్లినప్పుడు బీజేపీ తప్ప మిగతా పార్టీలు మాతో పాటు నిలబడి మా బాధను, కన్నీళ్లను అర్థం చేసుకున్నాయి’’ అని ఆమె అన్నారు. తాజాగా ఈ రాజకీయరంగ ప్రవేశంపై సాక్షిమాలిక్ కూడా స్పందించింది.

నాకు కూడా ఆఫర్ వచ్చింది కానీ.. రాజకీయరంగ ప్రవేశంపై సాక్షి మాలిక్ కీలక వ్యాఖ్యలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరింగ్‌ పునియా చేరారు. హర్యానాలో వచ్చే నెల తొలివారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీరి చేరిక కాంగ్రెస్‌కి మరింత జోష్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌లో చేరికపై వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం మనకు అనుకూలంగా లేని సమయంలోనే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో తెలుస్తుందని అన్నారు. ‘‘ నా కుస్తీ కెరీర్‌లో నన్ను ఆదరించినందుకు దేశ ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మరియు వారి అంచనాలను అందుకుంటానని ఆశిస్తున్నాను. నేను కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వారు చెప్పినట్లు, సమయం చెడుగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఎవరు ఉంటారో తెలుసుకోవచ్చు. మనల్ని రోడ్లపైకి ఈడ్చుకెళ్లినప్పుడు బీజేపీ తప్ప మిగతా పార్టీలు మాతో పాటు నిలబడి మా బాధను, కన్నీళ్లను అర్థం చేసుకున్నాయి’’ అని ఆమె అన్నారు. తాజాగా ఈ రాజకీయరంగ ప్రవేశంపై సాక్షిమాలిక్ కూడా స్పందించింది.

ముందంజలో దూసుకెళ్తోన్న కమలా హారిస్.. ఎన్ని విరాళాలు సేకరించారంటే..!
ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య ఫైటింగ్ పోటాపోటీగా ఉంది. నువ్వానేనా? అన్నట్లుగా వార్ నడుస్తోంది. ఇక కమలా హారిస్ ప్రచారంలో ముందంజలో దూసుకుపోతున్నారు. ట్రంప్‌పై పైచేయి సాధిస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టులో ట్రంప్‌ కంటే ఎక్కువగా విరాళాలు సేకరించి రికార్డు సృష్టించారు. కమలా హారీస్‌ ఆగస్టులో 30 లక్షల మంది దాతల నుంచి 36.1 కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు. ఇక సెప్టెంబర్‌లో న్యూయార్క్‌, అట్లాంటా, లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్‌ బృందం ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌ మాత్రం కొంత వెనుకంజలో ఉన్నారు. ట్రంప్‌ ఆగస్టులో కేవలం 13 కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది. ఈ ‍క్రమంలో ట్రంప్‌ కంటే కమలకు.. దాదాపు మూడు రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఇక డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమలా హారీస్‌ పూర్తి స్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి.

త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?
ముడి చమురు ధరలు తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇంధన ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు జనవరి 2024 నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) లాభదాయకతను మెరుగుపరిచింది. దీంతో ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు అవకాశం ఏర్పడింది. మరోవైపు అమెరికాలో మాంద్య భయాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్రెంచ్ క్రూడ్ తక్కువగా ట్రేడ్ అవుతోంది. బుధవారం, అమెరికా ముడి చమురు ధరలు 1% పైగా పడిపోయాయి, బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా 1 డాలర్ తగ్గి బ్యారెల్‌కు 72.75 డాలర్‌కి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం బ్యారెల్‌కి 73.17 డాలర్లుగా ఉంది. మరోవైపు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చివరి సారిగా సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ ధరలను లీటర్‌కి రూ. 2 తగ్గించింది.

టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?
టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌లు అయిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. అతను 521 మ్యాచ్‌లు ఆడి చాలాసార్లు సున్నాకి ఔట్ అయ్యాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ హిట్టర్.. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ తరుఫున ఆడుతున్నాడు. ఆంటిగ్వా, బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే అతను 4 బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు. ఇంతకుముందు.. ఐపీఎల్ లో సునీల్ నరైన్ KKR జట్టు తరుఫున బరిలోకి దిగి చాలా సక్సెస్ అయ్యాడు. ఆ క్రమంలోనే.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా నైట్ రైడర్స్ తరుఫున ఓపెనింగ్ దిగుతున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. షారుక్ ఖాన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ యజమానిగా నరైన్‌ను తన జట్టులో ఉంచుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఈ సీజన్‌లో సునీల్ నరైన్ మొదటిసారిగా డకౌట్ అయ్యాడు. అయితే.. టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నరైన్ మొదటి స్థానంలో ఉన్నాడు . సునీల్ నరైన్ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 46 సార్లు డకౌట్ అయ్యాడు. టీ20లో సున్నాకి అవుటైన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అలెక్స్ హేల్స్ రెండో స్థానంలో ఉన్నాడు., అతను ఇప్పటివరకు 43 సార్లు డకౌట్‌ కాగా.. రషీద్ ఖాన్ 42 సార్లు డకౌట్ అయ్యి మూడో స్థానంలో ఉన్నాడు. టీ20లో గ్లెన్ మాక్స్‌వెల్ 33 సార్లు డకౌట్ కాగా, రిలే రోసో 32 సార్లు సున్నాకే వికెట్ కోల్పోయాడు.

ఇది కదా మెంటల్ మాస్ అంటే.. బాలయ్యకు విలన్‌గా కుర్ర హీరో?
నందమూరి నటసింహం బాలకృష్ణకు విలన్‌గా.. మ్యాచో స్టార్ గోపిచంద్‌ను సెట్ చేస్తున్నారా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ‘తొలివలపు’ సినిమాతో హీరోగా కెరీర్‌ స్టార్ట్ చేసిన గోపీచంద్‌కు.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో.. ‘జయం’ సినిమాలో విలన్‌గా దుమ్ముదులిపేశాడు గోపీ. ఆ తర్వాత వర్షం, నిజం సినిమాలో భయంకరమైన విలన్‌గా భయపెట్టేశాడు. కానీ గోపీచంద్‌ది హీరో కటౌట్ కాబట్టి.. ‘యజ్ఙం’ సినిమాతో మళ్లీ హీరోగా మారిపోయాడు. ఇక్కడితో వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ స్టార్ హీరో. ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా గోపీచంద్‌కు సరైన విజయాలు వరిచండం లేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ అనే సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమతో మ్యాచోమ్యాన్ సక్సెస్ ట్రాక్ ఎక్కడం పక్కా అని అంటున్నారు. ఇదిలా ఉంటే.. గోపీచంద్ మరోసారి విలనిజం చూపించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా బాలయ్యకు విలన్‌ అని అంటున్నారు. ప్రజెంట్ బాబీ డైరెక్షన్లో ఎన్బీకె 109 ప్రాజెక్ట్ చేస్తున్న బాలయ్య.. నెక్స్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది అఖండ2 అనే ప్రచారం కూడా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్‌ను విలన్‌గా ట్రై చేస్తున్నాడట బోయపాటి. అంతేకాదు.. త్వరలోనే గోపీచంద్‌కు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. గోపీచంద్ మళ్లీ విలన్‌గా చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గోపీచంద్ సై అంటే మాత్రం.. మామూలుగా ఉండదనే చెప్పాలి. అయితే.. ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

నేను రాజ్ తరుణ్ కలిసి డ్రగ్స్ తీసుకున్నాం.. బాంబు పేల్చిన లావణ్య
లావణ్య ఎన్టీవీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లావణ్య ఒక డ్రగ్స్ అమ్మే వ్యక్తి, లావణ్య చాలామంది వ్యక్తులతో అఫైర్ లో ఉంది అని రాజ్ తరుణ్ చెప్పిన సందర్భాలు చూశాం కదా అంటే నేను డ్రగ్ అమ్ముతానని రాజ్ తరుణ్ ఎప్పుడూ చెప్పలేదని ఆమె కామెంట్ చేసింది. నా జీవితంలో నేను డ్రగ్స్ కొనలేదు, అమ్మలేదు దయచేసి ఆ మాటలు మాట్లాడొద్దు అని ఆమె అన్నారు . అయితే ఇంతదాకా వచ్చిన తర్వాత అతను మళ్ళీ కలుస్తాడా అని అడిగితే ఇంత ఇష్యూ అయిన తర్వాత డామేజ్ నాకు జరిగిందా? రాజ్ తరుణ్ కు జరిగిందా? అని ఆమె ప్రశ్నించారు. శేఖర్ బాషా వలన నా క్యారెక్టర్ కి బ్యాడ్ జరిగింది, డ్యామేజ్ జరిగింది నాకు. ఈ డ్యామేజ్ జరిగింది కదా అని బంధాన్ని వదులుకోవాలంటే ఎన్ని బంధాలు నిలవ గలవు అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు రాజ్ తరుణ్, తాను కలిసి డ్రగ్స్ తీసుకున్నామని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేంటి నిజంగానే రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకున్నాడా అంటే నేను డ్రగ్స్ తీసుకున్నానని రాజ్ తరుణ్ అంటే కనుక మేమిద్దరం కలిసి తీసుకున్నట్లే అని ఆమె అన్నారు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే అసలు మేము చేయలేదు. దానికి సంబంధించి ఆధారాలు కూడా లేవని ఆమె అన్నారు. మీరు గర్భం దాల్చినట్లు చాలా సందర్భాల్లో చెప్పారు. అబార్షన్ చేయించారని చెప్పారు ఇందులో వాస్తవం ఉందంటారా? నిజంగానే అప్పుడు గర్భం దాల్చి ఉంటే ఎందుకు బయట పెట్టలేదు అని ప్రశ్నిస్తే సంసారం చేస్తుంటే గర్భం ఎందుకు రాదు వచ్చింది. అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాము. ఒకసారి మిస్ క్యారీ అయింది. అప్పటికి ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇల్లు కొనుక్కోవాలి అనే ఉద్దేశంతోనే రాజ్ తరుణ్ ప్రమేయంతోనే అబార్షన్ జరిగింది అని ఆమె అన్నారు.