కేంద్ర ప్రభుత్వంగా కాదు.. మా బాధ్యతగా ఏపీకి సహకారం..
కేంద్ర ప్రభుత్వంగా కాదు.. మా బాధ్యతగా ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తున్నాం అన్నారు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరవాత దేశ వ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నాం. మొదట ముంబైలో.. రెండో చర్చ విశాఖ లో నిర్వహించాం అన్నారు.. విశాఖలో బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలను కలసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం అన్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్ట్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చాం.. కేంద్ర ప్రభుత్వంగా కాదు, మా బాధ్యతగా సహకారం అందిస్తున్నాం అన్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎక్కువ మొత్తం కేటాయించాం.. స్టీల్ ప్లాంట్ ను పునరాభివృద్ది చేయడానికి 11 వేల కోట్ల సహకారం అందిస్తున్నాం.. పారిశ్రామిక కారిడార్ కు.. కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధానికి కూడా సహకారం అందిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నాం అన్నారు.
ఎక్కడా రాజీ పడొద్దు.. పార్లమెంట్‌లో గట్టిగా గళమెత్తండి.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు.. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గట్టిగా గళం వినిపించండి అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకం.. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం.. కేంద్ర కేబినెట్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులున్నా.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణం.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు టీడీపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. ఆంధ్రుల హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలి.. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో చంద్రబాబు భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరుస ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.. ఇవాళ ఢిల్లీలో కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం వివిధ కేంద్ర పథకాల కింద సహాయం చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది.. ఇక, వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ లకు కేంద్ర సహాయం విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా సమాచారం.. దేశంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టాలనే ఆలోచనలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు.. అందుకే కేంద్ర మంత్రిని కలిసి.. రెండో నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల విషయాన్ని వివరించారట.. ఇక, ఏపీలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహాలను పెద్ద ఎత్తున కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారట సీఎం చంద్రబాబు.. మొత్తంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య అరగంటకు పైగా సమావేశం జరిగింది..
వంశీ, వర్మ, పోసాని కేసుల్లో కీలక పరిణామాలు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. మరోవైపు సినీ నటుల కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. పోలీసు కస్టడీలో విచారించిన సమయంలో కీలక సమాచారం తెలిసిందని చెప్పారు. వంశీ ఆదేశాలతోనే సత్యవర్ధన్‌ను కలిసినట్లు మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారని కోర్టుకు పీపీ తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. మరింత సమాచారం రాబట్టేందుకు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసినట్లు కోర్టుకు వివరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్‌నకు, వంశీకి ఎలాంటి సంబంధం లేదన్నారు వంశీ లాయరర్లు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఇక, దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సీఐడీ నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ… హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషన్‌పై ఆరు వారాలు స్టే విధించింది. గతంలో విడుదలైన సినిమాకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదు చేయడమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. సినిమా రిలీజ్ అయిన సమయంలో… తెలియదా అని నిలదీశారు. అనంతరం కేసు విచారణపై ఆరువారాలస్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ 17కు తదుపరి విచారణ వాయిదా వేశారు.
నామినేషన్ వేసేందుకు సిద్ధమైన నాగబాబు.. ముహూర్తం ఎప్పుడంటే..?
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్.. నాగబాబు పేరు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. ఇక, నాగబాబు నామినేషన్ దాఖలుకి అవసరమైన పత్రాలు సిద్ధం చేశారు జనసేన నేతలు.. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్ , బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ.. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. ఇక, రేపు మధ్యాహ్నం నాగబాబు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి..
ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్
నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
బీజేపీ- బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలే కారణం.. కాంగ్రెస్ ఓటమిపై ఎంపీ రియాక్షన్..
గెలుపునకు మేమందరం బాధ్యత తీసుకున్నాం.. ఓటమి కూడా సమిష్టి బాధ్యత అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుల ఓటమిపై ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవక పోగా, డిపాజిట్లు పోగొట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్సీల సంఖ్య 3 కు పెరిగిందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఒరిగేది ఏం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఫలితాలు చూపించి సంబురాలు చేస్తుంటే, ఆశ్చర్యంగా ఉందన్నారు.
‘‘హోలీ ఏడాదికి ఒకసారి, శుక్రవారం నమాజ్ 52 సార్లు’’.. ఇబ్బంది ఉంటే ఇంట్లో ఉండండి..
హోలీ పండగ, రంజాన్ మాసంలో శుక్రవారం నమాజ్ ఒకే రోజు కలిసి రావడంతో మతపరమైన సున్నిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు మరింత ఎక్కువగా ఉంటాయి. గతేడాది నవంబర్ నెలలో సంభాల్ జామా మసీదు సర్వే సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో నలుగురు వ్యక్తులు మరణించడంతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత యోగి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సంభాల్ ప్రాంతంలో అధికారుల సర్వేల్లో పురాతన దేవాలయాలు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, హోలీ, రంజాన్ మాసంలో శుక్రవారం నమాజ్ కలిసి వస్తున్న నేపథ్యంలో పండగను దృష్టిలో పెట్టుకుని సంభాల్ కొత్వాలి పోలీస్ స్టేషన్ గురువారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ‘‘హోలీ అనేది ఏడాదికి ఒకేసారి వచ్చే పండగ, శుక్రవారం ప్రార్థనలు ఏడాదిలో 52 సార్లు జరుగుతాయి. హోలీ రంగులతో ఎవరైనా ఇబ్బంది అని భావిస్తే, ఆ రోజు ఇంటిలోనే ఉండండి. బయటకు వచ్చే వారు విశాల దృక్పథంతో ఉండాలి. ఎందుకంటే పండగలు కలిసి జరుపుకోవాలి’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు.
మిల్లర్ భారీ సిక్స్.. బంతితో స్టేడియం నుంచి ఇద్దరు వ్యక్తులు జంప్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండవ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో కివీస్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్ భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 362 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఎప్పుడూ జరగని ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ వైపు భారీ సిక్స్ బాదాడు. ఆ బంతిని ఇద్దరు వ్యక్తులకు దొరికింది. ఆ బంతిని తీసుకున్న ఆ వ్యక్తులు లాహోర్ స్టేడియం నుంచి బయటకు జంప్ అయ్యారు. ఇది చాలా అరుదైన ఘటన! ఐసీసీ ఈవెంట్ లో ఇలా జరగడం ఇదే తొలి సారి అని చెబుతున్నారు. దీంతో ఆ ఇద్దరి వ్యక్తులు స్టేడియం నుంచి బంతిని తీసుకుని వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి ఘటన మొదటి సారి చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్’కి ఎక్కితే రిజల్ట్ ఇలానే ఉంటుంది!
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడమే కాదు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా కాసుల వర్షం కురిపించింది. మునుపెన్నడూ లేని విధంగా ఒక రీజినల్ బ్లాక్ బస్టర్ సినిమా 303 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి సరికొత్త ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా అనేక రికార్డులు బద్దలు కొడుతోంది. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకి ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వీక్షించేందుకు సబ్స్క్రైబ్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ సినిమా కోసం ఒక్క 24 గంటల వ్యవధిలోనే 35,000 మంది సబ్స్క్రైబర్లు జి5కి వచ్చారంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఎంత కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇస్తే సినిమాని ఏ స్థాయిలో నిలబెడతారు అనేది మరోసారి నిరూపితమైంది అని చెప్పొచ్చు.