ఆరో స్థానంలో చంద్రబాబు.. పదో స్థానంలో పవన్ కల్యాణ్..
మంత్రులు తమ పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలంటూ.. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రులను ఆదేశిస్తూనే ఉంటారు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా వీటిపై చర్చించిన సందర్భాలు చాలా ఉన్నాయి.. వాళ్లకు క్లాస్ తీసుకున్న ఘటనలు లేకపోలేదు.. పనితీరు మెరుగుపర్చుకోకపోతే ఉపేక్షించేది లేదు అని వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే, ఫైన్ల క్లియరెన్స్ విషయంలో తన కేబినెట్‌లో ఏ మంత్రి.. ఏ స్థానంలో ఉన్నారు అనే విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు.. డిసెంబర్ వరకూ ఫైళ్లు క్లియరెన్స్ లో మంత్రుల పనితీరు చదివి వినిపించారు.. అయితే, ఫైళ్ల క్లియరెన్స్ విసయంలో 6వ స్థానంలో తాను ఉన్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు.. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో మంత్రి ఫరూఖ్ ఉండగా.. చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10 స్థానంలో ఉంటే.. మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో ఉన్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు..
సీఆర్డీఏ లేఖకు ఈసీ సమాధానం.. అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికల తర్వాతే..!
రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఏపీ సీఆర్డీఏ.. అయితే, సీఆర్డీఏ రాసిన లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.. టెండర్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది.. అయితే ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రమే టెండర్లను ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేసింది.. కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈసీకి సీఆర్డీఏ లేఖ రాసిన విషయం విదితమే కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తర్వాత మాత్రమే రాజధాని టెండర్లను ఫైనలైజ్ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.. దీంతో రాజధాని నిర్మాణ పనులు కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.. ఈ నెలలోనే రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టాలని భావించింది ఏపీ ప్రభుత్వం.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది..
కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి.. వీటికి ఆమోదం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీ లకు కేటాయించేలా కేబినెట్ ఆమోదం తెలిపింది.. తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడంపై మంత్రులు దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు… నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీలకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన 50 శాతం పదవులు కేటాయింపులను రద్దు చేశారు… మహిళా పారిశ్రామిక వేత్తలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. కొన్ని సబ్సిడీలు కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందన్నారు మంత్రి పార్థసారథి.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. 40 వేల కోట్లకు పైగా సౌర, పవన ఇంధన రంగంలో పెట్టుబడులు రానున్నాయి.. 19 వేల ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది అన్నారు.. కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయన్నారు మంత్రి పార్థసారథి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు… పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల టెండర్ లను రద్దు చేసి కొత్తగా పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. నిర్వాసిత కాలనీల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పోటు సూపర్ వైజర్ల నియామకానికి ఆమోదం తెలిపింది కేబినెట్.. సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యం కోసం అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ కోసం డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.. చెన్నై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో కొందరు రైతులకు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం.. మానవ వనరులను అభివృద్ధికి ఏపీ నాలెడ్జి సొసైటీ కెపాసిటి బిల్డింగ్ 2025కి ఆమోదం తెలిపింది.. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పెద్దపీట వేసేలా సౌర పవన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు..
రేపు పోలీసు విచారణకు రాంగోపాల్ వర్మ.. వస్తాడా..?
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రేపు పోలీసు విచారణకు హాజరుకాబోతున్నారు.. రేపు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు ఆర్జీవీ.. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో గత నవంబర్‌లో రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది.. అయితే, కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆర్జీవీ.. ముందస్తు బెయిల్ పొందారు.. అయితే, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆదేశించింది కోర్టు.. ఇక, గతంలో పలుసార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు వర్మ.. పలుమార్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం.. ఆయన డుమ్మా కొట్టడం జరుగుతూ వచ్చాయి.. తాజాగా జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈ నోటీసులపై స్పందించిన ఆర్జీవీ.. రేపు విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారట.. అయితే, రేపైనా దర్శకుడు రాంగోపాల్ వర్మ.. పోలీసుల విచారణకు హాజరవుతారా? లేదా.. ఇంకా ఏదైనా కారణం చూపి.. చివరి నిమిషంలో డుమ్మా కొడతారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది..
కీలక పరిణామం.. వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్ సమక్షంలో చేరిక
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు తగులుతూ వచ్చాయి.. పార్టీలో కీలకంగా ఉన్నవాళ్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.. ప్రజాప్రతినిధులు ఇలా చాలా మంది వైసీపీకి గుడ్‌బై చెప్పి కూటమి పార్టీల్లో చేరారు.. అయితే, ఇప్పుడు కీలక నేత, మాజీ మంత్రి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్.. అయితే, గత కొంతకాలంగా.. శైలజానాథ్ చూపు వైసీపీ వైపు అనే ప్రచారం సాగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగానే ఇటీవలే పలుసార్లు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు శైలజానాథ్.. ఇక, ఆయన వైసీపీలో చేరేందుకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రేపు పార్టీలో చేరబోతున్నారు శైలజానాథ్.. ఈ కార్యక్రమం తర్వాత బెంగళూరు వెళ్లనున్నారు వైఎస్ జగన్..
సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ సంచలన వ్యాఖ్యలు.. అందరూ షాక్..!
తెలంగాణలో ఇటీవల, ఒక ముఖ్యమైన రాజకీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు నాయకులు , మీడియా ద్వారా ప్రచారం చేయబడిన రహస్య భేటీ వివాదంపై, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం స్పందించారు. కొన్ని రోజుల క్రితం, ఈ ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలతో కలిసి రహస్య భేటీ నిర్వహించారని, ఆ భేటీలో వారు ఒక మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, గురువారం జరిగిన సీఎం పీసీసీ సమావేశం అనంతరం, అనిరుధ్ రెడ్డి ఈ వదంతులకు సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా, అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మీరు చెప్పినట్లుగా ఏదీ జరగలేదు. ఈ భేటీ మాత్రం రహస్యంగా కాదు. అన్ని సమస్యలు మనమా టెస్ట్ చేయకుండా, సులభంగా మనం పీసీసీ అధ్యక్షుని లేదా ఏఐసీసీ ఇంచార్జి, ఇంచార్జ్ మంత్రికి చెప్పవచ్చు. ఈ సమావేశంలో పాల్గొన్నవాళ్లంతా కేవలం డిన్నర్ కోసమే కలిశాము” అని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన కుమారుడిపై ప్రమాణం చేసి మీడియాకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ భేటీలో ఏ మంత్రిపై అసహనం ఉందని చెప్పలేదు. అయితే, కొన్ని సమాజిక అంశాలను చర్చించారు, అయితే మీడియా వాటిని తప్పుగా చూపించిందని అన్నారు.
ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆనందంలో ఆశావాహులు.. ఈ సారి కేబినెట్ విస్తరణ ఖాయ’మే’నా..!
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో కేబినెట్ విస్తరణ గురించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన తర్వాత, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో బిజీగా ఉండడంతో కేబినెట్ విస్తరణ అంశం కొంతకాలం వెనక్కి పోయింది. అయితే, ఈ సమయంలో ఎవరైనా కేబినెట్ విస్తరణలో చోటు పొందేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ, ఈ విషయంపై ఇటీవల తాజా పర్యవేక్షణలు జోరుగా సాగుతున్నాయి. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. అయితే.. గతంలో ఎన్నో అంచనాలు, ఊహాగానాల తర్వాత, తాజాగా గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో తెలంగాణ ఇంచార్జ్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఇతర నాయకులు ఈ అంశంపై గడిచిన కొద్దినెలలలో మౌనంగా ఉన్న విషయం మీద గందరగోళం తీసుకొచ్చారు. సమావేశంలో, కేబినెట్ విస్తరణ గురించి సుదీర్ఘ చర్చలు జరిగాయని తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాల్లో ఆశావాహుల జాబితాను మున్షీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, రాహుల్ గాంధీతో ఈ విషయంపై చర్చలు జరగవచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో తగిన నిర్ణయం తీసుకుని, కేబినెట్ విస్తరణకు సంబంధించిన జాబితాను ప్రకటన చేసేందుకు సమయం దక్కే అవకాశం ఉందని ఆశావహుల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?
ఢిల్లీలో ఎన్నికలు ముగిసి 24 గంటలకు పైగా గడిచింది. ఫలితాలు రావడానికి దాదాపు 36 గంటల సమయం మిగిలి ఉంది. ఇప్పటి వరకు విడుదలైన చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ మౌలానా సాజిద్ రషీది చేసిన ఈ వాదన ఎన్నికల గణాంకాల నిపుణులను కాస్త ఆశ్చర్య పరిచాయి. ఎగ్జిట్ పోల్స్‌కు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు నిలిచాయి. పోలింగ్ అనంతరం మౌలానా సాజిద్ రషీది నిన్న ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తాను జీవితంలో తొలిసారిగా బీజేపీకి ఓటు వేశానని చెప్పారు. సాజిద్ రషీది బీజేపీకి ఓటు వేయడానికి గల కారణాలను కూడా వివరించారు. ఇతర పార్టీలు బీజేపీ పేరుతో ముస్లింలను భయపెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ భయాన్ని అంతం చేయాలంటే.. కమలానికి ఓటేయడం అవసరమన్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఢిల్లీలో సాధారణ ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేశారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి సంబంధించిన గణాంకాలు ఇంకా అందుబాటులో లేవు. కానీ ఈ ఎన్నికల్లో హిందూ-ముస్లింల ఓట్ల విభజన జరగలేదని తెలుస్తోంది. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, విద్యుత్-నీరు వంటి స్థానిక సమస్యలపై మరింత చర్చ జరిగిందని సమాచారం. 2020లో జరిగిన ఎన్నికల మాదిరిగా.. హిందూ ముస్లింల ఓట్ల విభజన జరగలేదని చర్చ నడుస్తోంది.
కల్కాజీలో ముఖ్యమంత్రి అతిషి గెలుస్తారా? లేదా? అంచనాలు ఇవే!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 60 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. దాదాపుగా అన్ని సర్వేలు కూడా కమలం పార్టీదే అధికారం అని తేల్చేశాయి. ప్రజలు మార్పు కోరుకుంటన్నారని సర్వే అంచనాలు వేశాయి. ఇక ఆప్ ప్రకటించినట్లుగానే.. బీజేపీ కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వని ఉచిత హామీలను హస్తిన వాసులకు ఇచ్చింది. దీంతో ఓటర్లు ఎక్కువుగా కాషాయ పార్టీ వైపే మొగ్గు చూపించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి అతిషి గెలుపు కూడా సర్వేలు వచ్చాయి. అతిషి గెలుస్తారా? లేదా? అని కొన్ని సర్వేలు స్పష్టం చేశాయి. కల్కాజీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అతిషి పోటీ చేశారు. అతిషికి పోటీగా బీజేపీ నుంచి రమేష్ బిధురి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా బరిలో ఉన్నారు. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉన్నట్లుగా సర్వేలు పేర్కొన్నాయి. ఈ మేరకు యాక్సిస్ మై ఇండియా సర్వే పేర్కొంది. అయితే అతిషికే కొంచెం ఎడ్జ్ ఉన్నట్లుగా తెలిపింది. అయితే ఈ తీవ్ర పోటీలో అతిషి గట్టెక్కవచ్చని స్పష్టం చేసింది.
జొమాటో పేరు మారింది.. కొత్త పేరు ఇదే..
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారుతుంది. కంపెనీ బోర్డు పేరు మార్పును ఆమోదించింది. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో ఈ సమాచారాన్ని అందించారు. అయితే, జొమాటో బ్రాండ్ పేరులో ఎటువంటి మార్పు ఉండదు. యాప్‌లో కూడా జొమాటోగానే ఉంటుంది. కంపెనీ పేరు మాత్రమే మార్చనున్నారు. జొమాటో లిమిటెడ్ కంపెనీ కాస్త ఇప్పుడు ఎటర్నల్ లిమిటెడ్ గా మారనుంది. కంపెనీ సీఈఓ, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ పేరును మార్చడానికి గల కారణాన్ని వెల్లడించారు. కంపెనీ ఫుడ్ డెలివరీతో పాటు ఇతర రంగాలలో తన వ్యాపారాన్ని విస్తరిస్తోందన్నారు. “బ్లింకిట్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి జొమాటోను ఎటర్నల్‌గా వ్యవహరిస్తూ వచ్చాం. కానీ దానిని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రస్తుతం జొమాటో కిరాణా, టిక్కెట్ల అమ్మకం, తదితర వ్యాపారాలలో మెరుగుపడుతోంది. కంపెనీకి బ్రాండ్/యాప్ మధ్య వ్యత్యాసం ఉండాలనుకున్నాం. ఈ ఉద్దేశంతో ఈ పేరు మార్చాం. బ్రాండ్ పేరులో ఎటువంటి మార్పు ఉండదు. పేరు జొమాటోగానే కొనసాగుతుంది. స్టాక్ టిక్కర్ సైతం ఎటర్నల్‌గా మారుతుంది. ” అని దీపిందర్ గోయల్ అన్నారు.
రోహిత్ శర్మకు ఏమైంది.. ఇలా అయితే కష్టమే..!
హిట్ మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మకు ఏమైంది.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పటి నుండి అతను సరిగా ఆడటం లేదు.. దీంతో.. తన బ్యాట్‌కు ఏదో ఒక శాపం తగిలి ఉంటుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర నిరాశ పరిచిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రంజీలో ఆడాడు. అక్కడ కూడా ఇదే రకమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే.. వన్డే క్రికెట్‌లో అతని బ్యాట్ నుండి పరుగులు రావాలని అభిమానులు ఆశించినప్పటికీ మరోసారి నిరాశపరిచాడు. ఈరోజు నాగ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 7 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ క్రీజులోకి వచ్చారు. అయితే.. యశస్వి వికెట్ పడిపోవడంతో రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆడాలని ప్రయత్నించాడు. అయితే.. శకీబ్ మహమూద్ బౌలింగ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చాడు. రోహిత్ శర్మ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించగా.. అది గాలిలోకి లేచింది. దీంతో.. మరోసారి రోహిత్ ముఖంలో నిరాశ, విరక్తి స్పష్టంగా కనిపించాయి.
మరింత గ్యాప్ పెంచుతున్న అల్లు అరవింద్?
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు రామలింగయ్య కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన నటుడిగా ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా, ఎక్కువగా నిర్మాతగా ఉండడానికి ఇష్టపడ్డారు. ఒకరకంగా మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్లు అందించడంలో ఆయనది అందె వేసిన చేయి అనే ప్రచారం కూడా ఉంది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్ కూడా చాలాసార్లు బ్లాక్ బస్టర్ హిట్లకు కారణమయింది. అయితే అదంతా ఒకప్పటి సంగతి. తర్వాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు. అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి ఐకాన్ స్టార్ గా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా ప్రమోషన్స్ లో అల్లు అరవింద్ రామ్ చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తండేల్ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది. ఒక తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడుతూ నిజానికి చిరుత అంటే రామ్ చరణ్ డెబ్యూ మూవీ యావరేజ్ అని తాను రాజమౌళితో మాట్లాడి ఆయనకు మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ కి కారణమయ్యానని కామెంట్ చేశాడు. ఇదే ఇప్పుడు మెగా అభిమానులకు కోపం తెప్పిస్తోంది.
నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ కి జంప్?
సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్సేన్ అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయన ఫిబ్రవరి 14వ తేదీన లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్టు ప్రకటించాడు. అయితే కెరీర్ ముందు నుంచి విశ్వక్సేన్ నందమూరి హీరోలు ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణతో చాలా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవిని తన సినిమా ఈవెంట్ కి ఆహ్వానించడంతో విశ్వక్సేన్ నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ కి జంప్ అయ్యాడా అనే ప్రశ్న ఈ ఈవెంట్ కి హాజరైన జర్నలిస్టుల నుంచి ఎదురైంది. దానికి విశ్వక్సేన్ ఆసక్తికరంగా స్పందించాడు. తనకు ఇండస్ట్రీలో అందరూ కావాల్సిన వారే అని అంటూ అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఇంకా చాలామంది హీరోలు కూడా తనను సపోర్ట్ చేస్తారని తనను ఇలా గేట్లు వేసి కట్టేయవద్దు అంటూ ఆయన తనను ఒక కాంపౌండ్ కి పరిమితం చేయవద్దు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాడు. తనకు నందమూరి హీరోలు ఎంత సపోర్ట్ చేస్తారో అందరికీ తెలిసిందేనని అన్నాడు ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించామని ఆయన సపోర్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే అసలు విషయం ఏమిటంటే అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సినిమా ఇప్పుడు లైలా నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. ఆ పరిచయంతో మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ వేదికగా ఈ ఈవెంట్ జరగబోతోంది.