మంత్రులకు సీఎం దిశానిర్దేశం.. ఇక నుంచి దూకుడు పెంచాలి..!
మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.. మంత్రులు ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారు.. ఇక నుంచి పరిపాలనలో దూకుడు పెంచాలని సూచించారు.. తప్పుడు వార్తలు నిజం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది.. వైసీపీ నేతల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. పోలీసులు, రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాలి.. అంతర్జాతీయ సంబంధాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు.. మంత్రులు దశల వారీగా సింగపూర్ వెళ్లాల్సి ఉంటుందన్నారు.. ప్రజల్లో మన కూటమి ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉంది.. మంత్రుల పనితీరుతో ప్రజల్లో మరింత సానుకూలత పెరగాలని స్పష్టం చేశారు.. జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలి.. తమ శాఖలపై మంత్రులు రిపోర్టు తయారుచేసుకోవాలన్నారు.. ఇక, వచ్చే కేబినెట్ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో తమశాఖ ఘనతపై మాట్లాడిస్తాం అని దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
మరో ముఖ్యమైన హామీ అమలు సిద్ధమైన ప్రభుత్వం.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తుంది.. ఇక, మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది.. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన సమాచార ప్రసార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. కూటమి ప్రభుత్వంలో మరో ముఖ్యమైన హామీ అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా… తల్లికి వందనం… అన్నదాత సుఖీభవ అమలు అవుతున్నాయి.. ఇక, మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్నాం అని తెలిపారు..
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు..
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు PLR ప్రాజక్ట్స్ ఎండీ చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివా రెడ్డి. లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత PLR సంస్థ ప్రతినిధులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది సిట్. లిక్కర్ స్కాం కేసులో PLR సంస్థ ఖాతాల్లోకి డబ్బు బదిలి అయినట్లు మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్.. PLR ప్రాజక్ట్స్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు సిట్ అధికారులు.. కాగా, PLR ప్రాజెక్ట్స్ ఎంపీ మిథున్ రెడ్డికి చెందినది.. మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై ఏసీబీ ప్రత్యేక న్యాస్థానంలో వాదనలు ముగిశాయి.. ఈ నెల 12వ తేదీన తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో ఏ31గా ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాజీ OSD కృష్ణ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఇద్దరు నిందితులు.. ఇక, ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్కెదురైంది.. స్విమ్స్ లో వైద్యం చేయించుకోవటం కోసం అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు.. మరోవైపు, జైలుకి ఇంటి భోజనం అనుమతించాలని చెవిరెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. వారంలో మూడు రోజుల పాటు ఇంటి భోజనం పంపటానికి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.. లిక్కర్ కేసులో ఏ38గా ఉన్నారు చెవిరెడ్డి.. మరోవైపు, మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో ఏ1గా ఉన్నాడు రాజ్ కేసిరెడ్డి.. ఈ నెల 11న విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ఒకసారి రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసిన విషయం విదితమే..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. యువత – పరిశ్రమల అనుసంధానం..!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్.. సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్యం పోర్టల్ ని ప్రారంభిస్తున్నాం.. యువత – పరిశ్రమలను అనుసంధానించేలా నైపుణ్యం పోర్టల్ పని చేస్తుందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్టికల్ అంటే ఒక వస్తువు తయారు చేయటానికి ఉపయోగపడే అన్ని కంపెనీలు ఒకే చోట ఉండేలా చూస్తున్నాం అన్నారు.. హారిజాంటల్ అంటే స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్.. దీని కోసమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకుని వస్తున్నాం. ఇవి రెండు అనుసంధానం అయితేనే క్లస్టర్స్ ఏర్పడతాయని తెలిపారు.
పులివెందుల వైసీపీ నేతలకు వైఎస్ జగన్ ఫోన్.. దాడిపై ఆరా
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ దాడుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. అయితే, పులివెందుల వైసీపీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. టీడీపీ దాడిని ఖండించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డితోనూ ఫోన్‌లో మాట్లాడారు జగన్.. వీరితో సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డిలతో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్ధితిపై వాకబు చేశారు.. తమపై టీడీపీ దాడి చేసిన తీరును వివరించారు నేతలు.. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు.. దీనిని బలంగా తిప్పికొడదాం.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణం అన్నారు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి వారికి అర్ధమైంది.. అందుకే ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు.. ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు.. జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు.. వైసీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలి.. పార్టీ అందరికీ అండగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతాం…
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో బుధవారం నిర్వహించిన పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బలహీన వర్గాలపై కక్ష గట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చట్టం చేశారని విమర్శించారు. నాడు కేసీఆర్ చేసిన చట్టం నేడు రిజర్వేషన్లకు గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బలహీన వర్గాల బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా అడ్డుగా ఉన్న చట్టాన్ని తొలగించాలని తామ ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపామని… దానిని ఆమోదించడం లేదని సీఎం తెలిపారు. వెనుకబడిన వర్గాలకు స్థానిక ఎన్నికల్లో… విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీలో ధర్నాకు దిగామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధించి తీరుతామని సీఎం తెలిపారు.
ఇది ఆగదా.. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పోస్టల్ ఉద్యోగి బలి..
ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం మరో కుటుంబాన్ని కూలదోసింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోస్టల్ ఉద్యోగి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మృతుడు నరేష్ (విజయనగరం జిల్లా బొబ్బిలి వాసి) భార్య, కూతురుతో వనస్థలిపురంలో నివసిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌లో మునిగిపోయిన నరేష్ భారీ మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాడు. గెలుస్తాననే ఆశతో మరింతగా బెట్టింగ్ చేస్తూ చివరికి సుమారు రూ.15 లక్షల అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేకపోవడం, వ్యసనాన్ని మానలేకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారత్‌పై టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్.. 25% కాదు.. 50% ఫిక్స్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై టారిఫ్ బాంబు పేల్చారు. బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. ఇంతకు ముందు ప్రకటించిన 25% సుంకాలకు మరో 25% యాడ్ చేశారు. 50% సుంకాలు పెంచుతూ.. కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. భారత్‌పై మొత్తం 50% సుంకాన్ని అమెరికా ప్రకటించింది. నిజానికి.. గతంలో అమెరికా భారత్‌పై 25 శాతం సుంకం మాత్రమే ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే టారిఫ్ పెంపునకు ప్రధాన కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ తన మనసు మర్చుకున్న ట్రంప్ మరో 25% అదనంగా యాడ్ చేశారు. ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వు ప్రకారం.. ఈ సుంకం 21 రోజుల్లోపు, అంటే 2025 ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ఈ కొత్త సుంకం వర్తిస్తుంది. అయితే.. ఈ తేదీకి ముందు బయలుదేరి 2025 సెప్టెంబర్ 17 కి ముందు అమెరికాకు చేరుకున్న వస్తువులు ఈ సుంకం నుంచి మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఉన్న పన్నులకు ఈ సుంకం అదనమని.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు ఇస్తామని యూఎస్ ప్రకటించింది.
రాఖీ స్పెషల్.. మీ సోదరికి ట్రెండీ గాడ్జెట్‌లను గిఫ్ట్ గా ఇవ్వండి.. బెస్ట్ ఇవే!
రెండు రోజుల్లో రక్షా బంధన్ వేడుకలు జరుగనున్నాయి. ఈ పండుగ అన్నచెల్లి, అక్కా తమ్ముడు మధ్య బలమైన సంబంధానికి ప్రతీక. ఈ శుభ సందర్భంగా, సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీ కడతారు. సోదరికి రక్షణగా ఉంటానని సోదరులు ప్రతిజ్ఞ చేస్తారు. అంతే కాదు స్పెషల్ గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ చేస్తుంటారు. మరి ఈ సంవత్సరం ఈ పండుగ ఆగస్టు 9న జరుగనుంది. మీరు మీ సోదరికి తక్కువ ధరకు కొన్ని టెక్ గాడ్జెట్‌లను ఇచ్చి ఆశ్చర్యపరచాలని ఆలోచిస్తుంటే వీటిపై ఓ లుక్కేసి రాఖీ పండుగను మరింత స్పెషల్ గా మార్చుకోండి.
విజయ్ దేవర కొండకు కేఏపాల్ స్ట్రాంగ్ వార్నింగ్.. 24 గంటలు డెడ్‌లైన్..!
ఈడీ విచారణకు బుధవారం హాజరైన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్షణమే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో క్షమాపణ చెప్పి యాప్ ప్రచారం కోసం సంపాదించిన డబ్బులు మొత్తాన్ని బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజుల్లో చదువులేని వాళ్లు కూడా బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై డబ్బులు పోగోట్టుకుంటున్నారని అన్నారు. బెట్టింగ్ యాప్‌లో పాల్గొనే వారికి నూటికి 99 శాతం మందికి డబ్బులు రావని, కానీ వాటిని ప్రచారం చేసినందుకు నీకు మాత్రం డబ్బులు వస్తాయని అన్నారు. ఇటీవల సురేష్ యువకుడు బెట్టింగ్ యాప్‌ల ద్వారా తీవ్రంగా నష్టపోయి తన కుటుంబాన్ని వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘బుద్ధి ఉండాలి, నువ్వు చిన్న కుర్రోడివి మంచి కోసం ఫైట్ చేయాలి, కానీ ఇలా ప్రజల ప్రాణాలు తీసే యాప్‌ల కోసం కాదు’ అని అన్నారు. విజయ్ మార్పు చెందితే 24 గంటల్లో క్షమాపణలు చెప్పి, యాప్ ప్రచారం ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తాన్ని బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రకటనలు చేసిన ఎవరినీ వదిలిపెట్టని హెచ్చరించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు వార్ 2 తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పోరాడబోతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది సినిమా యూనిట్. రిలీజ్‌కి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఈవెంట్ నిర్వహించబోతున్న శ్రేయస్ మీడియా ఒక హింట్ ఇచ్చింది.
