పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. జ్వరంతోనే బెజవాడలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు.. ఫీవర్ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అయితే, అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు పవన్ కల్యాణ్.. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోతే అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.. దోమల బెడద తీవ్రత ఉన్నందున.. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.. మరోవైపు.. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైద్యుల సూచనలు తీసుకొంటున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు సైతం వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నట్టుగా తెలుస్తోంది..
ఏపీలో తొలిసారిగా CERT సేవలు.. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై తేల్చేసిన పోలీసులు..
కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం పెద్ద రచ్చ చేసింది.. విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణలు వచ్చాయి.. దీనిపై కాలేజీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థులు.. అయితే, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. తొలిసారి సీఈఆర్‌టీ సేవలను ఉపయోగించి.. కొంత క్లారిటీకి వచ్చారు.. పోలీసు బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు.. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశాం.. కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారు.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందన్నారు..
ప్రభుత్వం కృషి వల్లే ప్రాణనష్టం తగ్గింది.. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది..
గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే తర్వాత.. ప్రత్యక్షగా పరిశీలించిన ఆయన.. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చించారు.. ఏపీలో వరద పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు.. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.. ఇక, వరదలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందన్నారు.. కృష్ణా నది, బుడమేరు పొంగింది. సీఎం చంద్రబాబు కలెక్టరేట్‌నే సెక్రటేరియేట్ చేసుకున్నారు. చంద్రబాబు అండ్ టీం 24 గంటలు పని చేసిందని ప్రశంసించారు.. ఇక, ఏపీకి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇంతటి జల ప్రళయం సంభవించినా మృతులు సంఖ్యని తగ్గించగలిగారు. ఐఏఎస్ అధికారులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని అని అభినందించారు.. వరద సాయంపై బాధితులు సంతృప్తితో ఉన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు..
మానవ తప్పిదాల వల్లే భారీ వరదలు.. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి..!
బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు.. ప్రత్యక్షంగా వీక్షించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చ. ఏపీలో వరద పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు.. వరదలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి చౌహాన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి చౌహన్ ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి చూశారని తెలిపారు.. ఇక, కృష్ణానదీ పరివాహక ప్రాంతమంతా వర్షాలు పడ్డాయి. బుడమేరు పొంగింది.. అందుకే విజయవాడ ఇంతటి ప్రళయాన్ని చూసిందన్నారు.. అయితే, బుడమేరు వాగు ఆధునికీకరణ కోసం పనులు ప్రారంభిస్తే.. 2019లో క్యాన్సిల్ చేశారని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు.. 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని మరింత పటిష్టపరచాలని వెల్లడించారు.. కృష్ణా నదీ కరకట్టలను మరింత బలపరిచేలా చర్యలు తీసుకోవాలి. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు సీఎం చంద్రబాబు..
మట్టి గణపతులను పూజిద్దాం.. జీహెచ్‌ఎంసీ ద్వారా 3.10 లక్షల విగ్రహాల పంపిణీ
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. పర్యావరణం పట్ల ప్రజలను చైతన్య పర్చడంలో భాగంగా జీహెచ్ఎంసీ ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ ద్వారా 3.10 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో 8 ఇంచుల సైజులో 2.70 లక్షలు, ఒక ఫీట్ సైజులో 30 వేలు, ఒకటిన్నర ఫీట్ సైజులో 10 వేల విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పంకజ, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొని మట్టి వినాయక ప్రతిమలను స్వీకరించారు.
సీఎం సహాయనిధికి అరబిందో ఫార్మా రూ.5 కోట్లు, ఏఐజీ హాస్పిటల్స్ రూ.కోటి విరాళం
తెలంగాణలో వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అరబిందో ఫార్మా రూ.5కోట్లు విరాళంగా అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్&ఎండీ కె.నిత్యానంద రెడ్డి, కంపెనీ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి, తదితరులు రూ. 5 కోట్ల చెక్కును అందజేశారు. తెలంగాణలో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు విలయతాండవం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిగా సర్దుకోలేదు. ఇదిలా ఉండగా.. పలు రంగాల్లోని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ఈ రోజు ఎస్బీఐ ఉద్యోగులు, అరబిందో ఫార్మా యాజమాన్యం రూ.5 కోట్ల చొప్పున విరాళాలు అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఏఐజీ హాస్పిటల్స్ యాజమాన్యం కోటి రూపాయలను విరాళంగా అందించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, తదితరులు చెక్కును అందజేశారు.
సీఎం సహాయనిధికి ఎస్‌బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎంజితేందర్ శర్మ , ఏజీఎం దుర్గా ప్రసాద్, తనుజ్‌లు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్లు సీఎం సహాయనిధికి ఎస్బీఐ ప్రతినిధులు విరాళంగా అందించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ చెక్కును అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా ఎంతో మంది బాధితులు భిక్కుభిక్కుమంటూ గడుపుతున్నారు. బాధితుల సహాయార్థం పలువురు విరాళాలు అందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. బాధితులకు తోడుగా నిలుస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
యోగి సర్కార్ తీరుపై ములాయం కోడలు అపర్ణ అలక.. ఎస్పీలో చేరేందుకు ఏర్పాట్లు!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం నూతన మహిళా కమిషన్‌లో వైస్‌ఛైర్‌పర్సన్‌గా నియమించడంపై ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైస్‌ఛైరన్ పదవి ఇవ్వడంపై ఆమె అలకబూనినట్లు సమాచారం. చైర్‌పర్సన్ పదవి ఆశించి భంగపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె బీజేపీని వీడనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇప్పటికే ఆమె సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఎస్పీలో చేరవచ్చని సమచారం. మంగళవారమే అపర్ణ.. మహిళా కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ ఎన్నిక
ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ ఎన్నికయ్యారు. ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికలు ముగిసిన దాదాపు రెండు నెలల తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. మిచెల్ బార్నియర్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. యూరోపియన్ యూనియన్ యొక్క మాజీ చీఫ్ బ్రెక్సిట్ సంధానకర్త అయిన బార్నియర్ వివిధ ఫ్రెంచ్ ప్రభుత్వాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈయూ కమిషనర్‌గా కూడా పని చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం మిచెల్ బార్నియర్(70)ను దేశ కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సమాచారం అందింది. దేశానికి, ఫ్రాన్స్‌కు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత బార్నియర్‌కు ఉందని ప్రకటన పేర్కొంది. బార్నియర్ 2016 నుంచి 2021 వరకు యూరోపియన్ యూనియన్ (EU) నుండి బ్రిటన్ నిష్క్రమణ చర్చలకు నాయకత్వం వహించారు.
ఈ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల రిక్రూట్‌మెంట్.. అప్లై చేయండిలా..!
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పంజాబ్ & సింధ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (punjabandsindbank.co.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కింద సంస్థలో 213 పోస్టులను భర్తీ చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 15వ తేదీ వరకు. JMGS I, MMGS II లలో IT స్పెషలిస్ట్‌ల పోస్ట్‌లకు దరఖాస్తు చేసే అభ్యర్థులు అర్హత ప్రమాణంగా GATE స్కోర్‌ను అందించాలి. ఎంపిక ప్రక్రియలో GATE స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్.. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. SMGS IV,MMGS III,MMGS II,JMGS I పోస్టుల ఎంపిక ప్రక్రియలో వ్రాత పరీక్ష, అభ్యర్థుల షార్ట్‌లిస్ట్.. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. మెరిట్ ర్యాంకింగ్ ప్రకారం ఉంటుంది.
భారత్కు మరో పతకం.. కాంస్యం సాధించిన కపిల్ పర్మార్
పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన జూడో పురుషుల 60 కేజీల J1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక ప్లేఆఫ్‌లో బ్రెజిల్‌కు చెందిన ఎలియెల్టన్ డి ఒలివెరాను 10-0తో ఓడించాడు. కేవలం 33 సెకన్లలో ఆకట్టుకునే ‘ఇప్పన్’తో ఓడించి కాంస్య పతకం గెలుచుకున్నాడు. కాగా.. తాజా పతకంతో పతకాల సంఖ్య 25కి చేరింది. అందులో.. ఐదు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. నలుగురు సోదరులు, ఒక సోదరిలో చిన్నవాడైన కపిల్ మధ్యప్రదేశ్‌లోని శివోర్ అనే గ్రామం నుండి వచ్చాడు. అతని తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతని సోదరి ప్రాథమిక పాఠశాలను నడుపుతోంది. కపిల్ చిన్నతనంలో పొలాల్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ నీటి పంపును తాకడంతో తీవ్ర విద్యుత్ షాక్ తగిలి కోమాలోకి వెళ్లిపోయాడు.
‘‘నా కొడుకు పట్టిన గతే దర్శన్‌కి పట్టాలి’’.. రేణుకాస్వామి తల్లిదండ్రులు..
కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. దర్శన్‌కి నటి పవిత్ర గౌడకు ఉన్న సంబంధంపై, తన అభిమాన హీరో కుటుంబాన్ని పాడుచేస్తు్న్నామని రేణుకాస్వామి, పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడమే అతడి మరణానికి కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని దర్మన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి అతను మరణించేలా చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడలతో పాటు మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రేణుకాస్వామి చిత్రహింసలకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. చొక్కా లేకుండా ట్రక్కు ముందు కూర్చొని ఏడుస్తున్న ఫోటో వెలుగులోకి వచ్చింది. మరో దాంట్లో స్పృహ లేకుండా పడి ఉన్న ఫోటో కనిపించింది. అయితే, విచారణ సమయంలో దర్శన్ సహాయకుడి ఫోన్ నుంచి ఈ ఫోటోలను పోలీసులు సేకరించారు. అయితే, రేణుకాస్వామి చిత్రహింసలకు సంబంధించిన ఫోటోలు వెలుగులోకి రావడంతో అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అతడి ఫోటోలు చూడటంతో హత్య వెనక ఉన్న వ్యక్తులు తమ కొడుకుని ఎలా చిత్రహింసలు పెట్టారో, వారు కూడా అలాంటి హింసనే అనుభవించాలని అతడి తండ్రి అన్నారు. “నా కొడుకు తప్పు చేశాడని ఒప్పుకున్నా, కనికరం లేకుండా దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. అది నాకు విపరీతమైన బాధ కలిగిస్తుంది. అయినా కనికరం చూపలేదా? శరీర అవయవాన్ని కూడా విడిచిపెట్టకుండా షాక్‌లు ఇచ్చి చిత్రహింసలకు గురిచేశారు. ఒక్కసారి ఊహించుకోండి. దీని గురించి ఆలోచించడం మాకు చాలా బాధ కలిగిస్తుంది” అని తండ్రి కాశీనాథ్ శివనగౌడ అన్నారు.