NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

చివరి నిమిషంలో పవన్‌ పర్యటన వాయిదా.. నెక్ట్స్ ఏంటి..?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. చివరి నిమిషంలో తన పర్యటన వాయిదా వేసుకున్నారు.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న ఆయన.. మరో కీలక నిర్ణయం తీసుకుంటూ.. ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకున్నారు.. అయితే, దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శనను వాయిదా వేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

ఏపీకి షాక్ ఇచ్చిన రైల్వేశాఖ.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కొత్త మెలిక..!
ఆంధ్రప్రదేశ్‌ఖు షాక్‌ ఇచ్చింది రైల్వేశాఖ.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్త మెలిక పెట్టింది. సెంటిమెంట్‌ను గౌరవించి 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్ కొనసాగిస్తూనే.. కీలక మార్గాలలో కోత పెట్టింది. కార్గో, అరకు పర్యాటక అభివృద్ధికి కీలకమైన కొత్త వలస – కిరండోల్ మార్గం ఒడిషా పరిధిలోకి వెళ్ళిపోనుంది. KK లైన్ ను వాల్తేర్ నుంచి విడగొట్టి నూతనంగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్ పరిధిలోకి తీసుకుని వచ్చారు. అలాగే, ఉత్తరాంధ్ర పరిధిలోని ఇచ్ఛాపురం సహా పలు స్టేషన్లు వాల్తేరు కోల్పోయింది. వాస్తవానికి వాల్తేరు రైల్వే డివిజన్ కు కిరండోల్ ల్కెన్ గుండెకాయ లాంటిది. ఏడాదికి 10 వేల కోట్ల రూపాయల ఆదాయం కిరండోల్ లైన్ ద్వారానే వస్తోంది. ఇక, రాయగడ కేంద్రంగా డివిజన్ అనేది చాలా కాలంగా ఒడిశాలో వున్న పొలిటికల్ డిమాండ్. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మేలు జరిగే ఏర్పాట్లు అక్కడ నాయకత్వం చేసుకుని సక్సెస్ అయింది. కానీ, ఇందులో భాగంగానే విశాఖకు 20 కిలోమీటర్ల దూరంలోనూ… దాదాపు 150 కిలో మీటర్లు ఆంధ్రాలో ప్రయాణిస్తున్న కొత్తవలస – బచేలీ రూట్ రాయగడ డివిజన్‌ను తన్నుకుపోయారు. టూరిజం పరంగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. దేశ, విదేశాల నుంచి పర్యాటకుల నిత్యం వస్తూనే వుంటారు. అలాంటి అరకును.. రాయగడ డివిజన్‌లో కలిపేస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి భారీ లబ్ధి చేకూర్చామని చెబుతూ వచ్చిన కేంద్రం.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూనే.. కొత్త మెలిక పెట్టడంపై ఇప్పుడు చర్చగా మారింది..

రేపే ఏపీ కేబినెట్‌ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలు..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది.. గురువారం రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ కానుండగా.. మంత్రివర్గంలో కీలక అజెండాపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. విశాఖలోని పంచగ్రామాల సమస్యకు ఇప్పటికే పరిష్కారం సూచించింది కూటమి ప్రభుత్వం.. పంచగ్రామాల భూములకు ప్రత్యమ్నాయంగా అదే విలువ కలిగిన భూములు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఈ మేరకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది.. ఇక, స్టేట్ ఇన్వెస్ట్​మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB)లో ఆమోదించిన 44 వేల 776 కోట్ల రూపాయల విలువ చేసే 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది మంత్రి మండలి.. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,580 మందికి ఉద్యోగావకాశాల కల్పనే ధ్యేయంగా పెట్టుకుంది ప్రభుత్వం.. మరోవైపు.. ఈ నెల ఆఖరు వారంలో జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై కేబినెట్‌ అనతరం సీఎం చంద్రబాబు.. మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఇక, రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యూయోట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్ధానానికి జగనునున్న ఎన్నికల వ్యూహాలపై ఆయా జిల్లాల మంత్రుల, ఇంఛార్జ్‌ మంత్రులతో చర్చిoచే అవకాశం ఉంది.. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై కూడి కేబినెట్‌లో చర్చ జరగనుంది..

ఎమ్మెల్సీ ఎన్నికలు.. మంత్రులకు టార్గెట్‌ పెట్టిన సీఎం..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ మంత్రులకు టార్గెట్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 27న ఏపీలో రెండు గ్రెడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.. ఇంఛార్జ్‌ మంత్రులు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు పర్యటనలో ఉన్నారు.. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు గ్రేడ్యుయేట్ స్థానాలకు.. విశాఖ -విజయనగరం – శ్రీకాకుళం ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయ్యింది.. దీంతో, కూటమి నేతలు, మంత్రులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఇంకా అనుమానాలు ఎందుకు..? త్వరలోనే ప్రధానితో భేటీ..
విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో మాట్లాడి హామీ ఇచ్చినా.. ఇంకా అనుమానాలు ఎందుకు? అని ప్రశ్నించారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌.. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితికి కారణం గత 10 ఏళ్లలో సంస్ద యాజమాన్యం విచ్చలవిడిగా, అనాలోచితంగా తీసుకున్న పలు నిర్ణయాలే అన్నారు.. కానీ, కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో మాట్లాడి హామీ ఇచ్చినా ఇంకా అనుమానాలు ఎందుకు అని అసహనం వ్యక్తం చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకోచ్చింది ఏపీ ప్రజల కోసమే అని స్పష్టం చేశారు.. గతంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకుంటే, ప్రతిపక్ష హోదా కూడా పోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే నేనేం చేయను.. అంటూ సెటైర్లు వేశారు. ప్రధాని మోడీతో త్వరలో భేటీ అవుతాను. ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత, నేను స్వయంగా వచ్చి కలుస్తాను అన్నారు మంత్రి నారా లోకేష్..

రైతులకు శుభవార్త.. వాళ్లకు రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణ అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. 17.03 లక్షల రైతుల అకౌంట్లలో నిధులు పడ్డాయి. రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మొత్తం రూ. 1126.54 కోట్లు రైతు భరోసా నిధులు జమ అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే రైతుబంధుకు రూ. 7625 కోట్లు, రుణమాఫీకి రూ. 20,616.89 కోట్లు, రైతు భీమాకు 3000 కోట్లు విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఎన్నడూలేని విధంగా రూ. 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించినట్లు తెలిపారు. ప్రత్తి పంటను పూర్తిగా సేకరించడానికి మంత్రి తుమ్మల గడువు కోరారు. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులు పంటలను మార్క్ ఫెడ్ ద్వారా రైతుల దగ్గర నుంచి మద్ధతు ధరకు కోనుగోలు చేసినట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు వచ్చాయన్నారు. యాసంగిలో 10,547 కోట్లతో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, ఖరీఫ్‌లో 12,178.97 కోట్లతో 52.51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చి కొన్న ప్రభుత్వం. అందుకు 1154 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగింపు ఉంటుందని చెప్పారు. పసుపు, మిరప పంటలకు మద్దతు ధర నిర్ణయించడానికి కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుందని పేర్కొ్న్నారు. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంది చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతే అని మంత్రి అన్నారు.

అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్‌ను నేరుగా కలవడం, అభ్యర్థి నామినేషన్‌పై చర్చించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎన్నిక అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర స్థాయి సమన్వయ కర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ది ప్రచార ఆర్భాటమే తప్ప.. ఏ వర్గానికి రాష్ట్రంలో మేలు చేయలేదని ధ్వజమెత్తారు. మహిళలు, రైతులు, కార్మికులు, యువత అంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపు చాలా విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. ఇది ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లాలని కోరారు. పేద, మధ్య తరగతికి మేలు చేసే కేంద్ర బ‌డ్జెట్‌ను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న సానుకూల పరిస్థితుల్లో మూడుకి మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలని కార్యకర్తలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణ టెట్ పలితాలు విడుదల
తెలంగాణ టెట్ పలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి విడుదల చేశారు. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం అర్హత సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం 04-11-2024న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక పరీక్షలు 02-01-2025 నుంచి 20-01-2025 తేదీల మధ్య ఇరవై సెషన్‌లలో ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించారు. మొత్తం 275753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1లో ఎనిమిది సెషన్‌లలో 7 భాషల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీలో నిర్వహించారు. ఇక పేపర్-2 పన్నెండు సెషన్‌లలో నిర్వహించారు.

బెంగాల్‌లో ప్రతిరోజూ 27 కోట్లు ఖర్చు చేస్తున్న ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా ?
ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో భారీ పెట్టుబడి పెట్టబోతున్నారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో.. ఆయన ఒక్కో రోజుకు రూ. 27 కోట్లు పెట్టుబడి పెడతానని ప్రకటించారు. అతను పూర్తి 5 సంవత్సరాల పెట్టుబడి ప్రణాళికను రూపొందించాడు. డిజిటల్ సేవలు, గ్రీన్ ఎనర్జీ, రిటైల్ సహా అనేక రంగాలు ఈ పెట్టుబడి పరిధిలోకి వస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే ముఖేష్ అంబానీ చేసిన ఈ పెట్టుబడితో బెంగాల్ యువత లక్ష ఉద్యోగాలు పొందవచ్చు. అయితే, బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 0.62 శాతం క్షీణించాయి. బెంగాల్‌లో ముఖేష్ అంబానీ ఎలాంటి ప్రకటన చేశారో తెలుసుకుందాం. ఈ దశాబ్దం చివరి నాటికి పశ్చిమ బెంగాల్‌లో రూ.50,000 కోట్ల కొత్త పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ బుధవారం ప్రకటించారు. ఈ పెట్టుబడి రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంబానీ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (BGBS) 2025లో అన్నారు. గత దశాబ్దంలో రిలయన్స్ బెంగాల్‌లో రూ.50,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన అన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి రూ. 50,000 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టబడుతుంది. మా పెట్టుబడులు డిజిటల్ సేవలు, గ్రీన్ ఎనర్జీ, రిటైల్‌తో సహా బహుళ రంగాలలో విస్తరించి ఉంటాయి. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని పెంచడంలో రిలయన్స్ నిబద్ధతను అంబానీ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచడంలో ప్రధాని మోదీ సహాయం చేస్తారని అన్నారు. బెంగాల్ వ్యాపార దృశ్యాన్ని మార్చడంలో దాని పాత్రను ప్రస్తావించారు.

ఢిల్లీ పీఠం కమలానిదే.. ఆప్ ఆశలు గల్లంతు ?
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం EVMలో నిక్షిప్తం అయింది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8 న విడుదల కానున్నాయి. కానీ దీనికి ముందు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. అతిషి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013, 2015, 2020లలో ఆప్ వరుసగా గెలిచింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ చిక్కుకుని 2024 మార్చిలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సెప్టెంబరులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ అతిషిని కొత్త ముఖ్యమంత్రిగా చేసింది. ఈ ఎన్నికలు ఆప్ కు చాలా ముఖ్యమైనవి. బిజెపి, కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నాయి. తిరిగి అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 1993లో ఢిల్లీలో బిజెపి గెలిచింది. కానీ ఆ తర్వాత ఎప్పుడూ విజయం సాధించలేదు. 1998, 2003, 2008లలో కాంగ్రెస్ వరుసగా గెలిచింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో ఆప్ బిజెపి, కాంగ్రెస్ ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఢిల్లీలో దాదాపు 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

పవన్ కల్యాణ్ కి అస్వస్థత?
పవన్ కల్యాణ్ కు అస్వస్థత ఏర్పడింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ఆయన టీం తెలిపింది. పవన్ కళ్యాణ్ ను జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోందని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారని అన్నారు. ఈ కారణంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ గారు హాజరు కాలేక పోవచ్చని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వలన సినిమా షూట్స్ కి దూరంగా ఉంటున్నారు. నిజానికి ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ ఈరోజు నుంచి మొదలైందని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్యం దృష్ట్యా ఆయన అందులో కూడా పాల్గొనలేక పోవచ్చు.

‘తండేల్’ నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ.. ఎమోషనల్ హై ఇస్తుంది: నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు. నా కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీ. క్యారెక్టర్, స్టొరీ అన్ని రకాలుగా బిగ్ స్పాన్ వున్న సినిమా ఇది. చాలా ఎక్సయిట్మెంట్ వుంది. ఆల్రెడీ సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. సెకండ్ హాఫ్ అయితే యునానిమాస్ గా చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఎమోషనల్ హై ఇచ్చింది. చివరి ముఫ్ఫై నిమిషాలు వెరీ సాటిస్ఫాక్షన్. క్లైమాక్స్ గ్రేట్ ఎమోషనల్ హై ఇస్తుంది. దూత సమయంలో ఈ కథ విన్నాను. వాసు గారు గీత ఆర్ట్స్ లో ఈ కథని హోల్డ్ చేశారని తెలిసింది. డెవలప్ చేసి మంచి సేఫ్ వస్తే చెప్పమన్నాను. నేను మొదట విన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ లా వుంది. సినిమాటిక్ లాంగ్వేజ్ లోకి తీసుకురావడానికి వర్క్ చేయాలి. అలా వర్క్ చేసిన తర్వాత అద్భుతంగా వచ్చింది. ఈ కథ మొదట ఓ ఐడియాగా చెప్పారు. పాత్రకు తగ్గట్టుగా మారాలంటే వాళ్ళ లైఫ్ స్టయిల్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి వాళ్ళని నేరుగా కలవాలని వెళ్లాం. మొత్తం హోం వర్క్ చేశాక నేను చేయగలనని కన్వెన్స్ అయిన తర్వాత జర్నీ మొదలైయింది.