పీ4పై సీఎం కీలక వ్యాఖ్యలు.. ఆ ప్రచారంపై క్లారిటీ..
P4 కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పీ4 కార్యక్రమంపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ విజయానంద్, పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా.. మార్గదర్శకుల ఎంపికపై జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.. P4 రివ్యూ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం.. మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే అన్నారు సీఎం చంద్రబాబు.. బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే జరుగుతోందన్న ఆయన.. ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదని స్పష్టం చేశారు.. ఎవరినీ బలవంతం చేయొద్దు.. మానవత్వం ఉండే వారే ఇందులో చేరతారు.. మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల తరహాలో వ్యవహరిస్తార.. ప్రజల మనస్సుల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తారని మండిపడ్డారు..
డాక్టర్ సమరం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్.. అప్పట్లో చాటుగా స్వాతి బుక్ చదివేవాళ్లం..!
డాక్టర్ సమరం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో జరిగిన డాక్టర్ సమరం రాసిన 218వ పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో అందరూ 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు.. కానీ, 86 సంవత్సరాల వయసులో కూడా డాక్టర్ సమరం రిటైర్ కాలేదన్నారు.. వాజ్ పేయ్ కూడా రిటైర్ కాలేదు, అలసిపోలేదు అని ఒక సమావేశంలో చెప్పారని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఆరోగ్య శాఖ గురించి తెలియాలంటే ఇన్ని పుస్తకాలు చదవాలా? అని నాకు తెలియదు అంటూ చమత్కరించారు.. 218 పుస్తకాలు రాసారు డాక్టర్ సమరం.. ఆధునిక రోజులలో కూడా మాట్లాడటానికి ఆలోచిస్తున్న అంశాలను డాక్టర్ సమరం పదుల సంవత్సరాల క్రితమే చెప్పారు.. సైన్స్ గురించి విస్తారంగా తెలిసిన వ్యక్తి డాక్టర్ సమరం అని ప్రశంసలు గురిపించారు సత్యకుమార్..
ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు ఎప్పుడంటే..?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి.. ఇక, ఈ నెల 12వ తేదీన మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని.. ఇప్పటికే అరెస్ట్ చేసింది సిట్.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి.. అయితే, ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి.. మిథున్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. మిథున్ రెడ్డి కాల్ రికార్డ్స్ లో చెవిరెడ్డి, కేసిరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మాట్లాడినట్టు ఉన్నట్టు సిట్ చెబుతోంది.. వారంతా ఒకే పార్టీలో ఉన్నపుడు మాట్లాడితే కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు.. వందల మంది స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి కేవలం LW – 13, 14, 71 ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బెయిల్ ఇవ్వద్దని చెప్పటం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మిథున్‌రెడ్డి న్యాయవాదులు..
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక, వారికి చెక్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది.. పాత రేషన్ కార్డుల స్థానంలో కీలక మార్పులతో స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకురానుంది.. ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని.. ఈ నెల 31వ తేదీ వరకు రేషన్ కార్డులు పంపిణీని పూర్తి చేయాలని నిర్ణయించింది.. మొత్తంగా ఏపీ లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది ప్రభుత్వం.. మన దగ్గర ఉండే ఏటీఎం కార్డు లాగా స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. కుటుంబ సభ్యుల వివరాలు ఈ కార్డుపై ఉంటాయి.. ఈ నెల చివరిలోగా రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేయకుండగా.. వచ్చే నెల నుంచి కొత్త స్మార్ట్ కార్డులతోనే రేషన్ ఇవ్వనుంది సర్కార్.. రేషన్ పంపిణీ మరింత ఎఫెక్టివ్ గా నిర్వహించడానికి డిజిటల్ రేషన్ కార్డులు సమర్థంగా పని చేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈనెల 25వ తేదీన పండుగ వాతావరణంలో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఇక., రేషన్ బియ్యం అక్రమ రవాణా నియంత్రణకు విజిలెన్స్ మరింత పటిష్టం చేశామని.. విశాఖ, నెల్లూరు వంటి చోట్ల అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క్యూ ఆర్ కోడ్ తో రూపొందించిన కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు అని స్పష్టం చేశారు.. సుమారు లక్షా 40 వేల కార్డులకు సంబంధించి మ్యాపింగ్ ఇష్యూస్ వున్నాయి.. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం.. గతం కంటే 200 శాతం ఎఫెక్టివ్ గా విజిలెన్స్ పని చేస్తోంది.. కాకినాడ పోర్ట్ తరహాలోనే విశాఖ, నెల్లూరు సహా పోర్టుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం.. గిరిజన సహకార సంస్థలతో త్వరలోనే ఒప్పందం చేసుకుంటాం.. గిరిజన ఉత్పత్తులు రేషన్ షాపుల్లో అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్..
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ధర్నా.. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: సీఎం రేవంత్
దేశరాజధానిలో బీసి రిజర్వేషన్ల అంశం హీటెక్కుతోంది. ఏకంగా బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ధర్నాకు దిగుతోంది. జంతర్ మంతర్ లో జరిగే ధర్నాను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడ్ చేయనున్నారు. మరోపక్క ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన ధర్నాలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు చేశారు. రాష్ట్రంలోని బీసీలకు రాజకీయంగా, విద్య ఉపాధిలో 42 శాతం రిజర్వేషన్ల కోసం వీటిని రూపొందించింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్స్ ను గవర్నర్ ద్వారా రాష్ట్రపతి కి పంపించారు. వాస్తవానికి గవర్నర్ కు బిల్లు పంపి 3 నెలలు దాటింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించలేదు పోనీ తిప్పి కూడా పంపలేదు.. దాంతో కావాలని కేంద్రం బీసి రిజర్వేషన్ల బిల్లును ఆపుతుందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంది.
“మాటిచ్చిన విషయం నాకు తెలియదు”.. రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌పై మంత్రి కోమటిరెడ్డి రియాక్షన్..
ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం గురించి ప్రయత్నాలు చేస్తున్నాం.. ప్లాన్స్ జరుగుతున్నాయన్నారు. పటౌడీ హౌస్ లో రెండు నెలల్లో పనులు మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో అనుమతుల కోసం కొంత ఆలస్యం అవుతోందన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై మంత్రి స్పందించారు. “నేను మా సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో లేను. కేంద్ర పెద్దలు మాటిచ్చిన విషయం నాకు తెలియదు. నా చేతుల్లో ఏం లేదు. అధిష్టానం, ముఖ్యమంత్రి మంత్రి పదవుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఢిల్లీకి రాలేదు. మంత్రి పదవి అడగలేదు” అని స్పష్టం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చారని చెబుతున్నారు.
1971లో పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరా.. అమెరికా తీరును ఎండగట్టిన భారత సైన్యం
భారత సైన్యం ఒక పాత వార్తాపత్రిక నివేదికను పోస్ట్ చేయడం ద్వారా అమెరికా తన చారిత్రక చర్యను గుర్తు చేసింది. ఈ పోస్ట్ ఆగస్టు 5, 1971 నాటిది. భారతదేశంతో యుద్ధానికి ముందు దశాబ్దాలుగా అమెరికా పాకిస్తాన్‌కు ఎలా సహాయం చేసిందో ఇది నివేదిస్తుంది. పాకిస్తాన్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారతదేశం నుంచి దిగుమతులపై సుంకాన్ని పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన తర్వాత భారత సైన్యం అమెరికాకు ధీటుగా జవాబిచ్చింది. వార్తాపత్రిక క్లిప్‌ను భారత సైన్యం తూర్పు కమాండ్ షేర్ చేసింది. 1971 యుద్ధం కోసం అమెరికా దశాబ్దాలుగా పాకిస్తాన్‌కు ఆయుధాలను ఎలా సరఫరా చేస్తుందో ఇది చెబుతుంది.
వాట్సాప్ లో మరో క్రేజీ ఫీచర్.. యాప్ లేకుండానే యూజర్లతో చాట్!
వాట్సాప్ లో మెసేజ్ పంపడానికి ఒకరి నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు.. అవతలి వ్యక్తికి WhatsApp యాప్ లేదని మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు నార్మల్ మెసేజ్ లేదా కాల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కానుంది. WhatsApp లేని వారికి కూడా మీరు సందేశం పంపగలిగే ఫీచర్‌పై WhatsApp పనిచేస్తోంది. WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్‌ను ‘గెస్ట్ చాట్’ అని పిలుస్తారు. వాట్సాప్ నెట్‌వర్క్ వెలుపల ఉన్న ఇతర వ్యక్తులతో చాట్ చేయాలనుకునే వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఈ ఫీచర్ బీటా వెర్షన్‌ను కంపెనీ త్వరలో విడుదల చేయగలదని భావిస్తున్నారు. ఆ తర్వాత స్థిరమైన అప్‌డేట్ కూడా అందుబాటులోకి వస్తుందంటున్నారు.
మరోసారి టెస్టు బరిలోకి టీమిండియా.. సౌతాఫ్రికాతో పోరు ఎప్పుడంటే..?
నరాలు తెగే ఉత్కంఠకు ముగింపు పలుకుతూ యువ భారత్ అండర్సన్- తెందుల్కర్ టెస్టు సిరీస్‌లో ఐదో మ్యాచ్‌ను అద్వితీయమైన ఆటతీరుతోముగించింది. థ్రిల్లింగ్ విక్టరీతో టీమ్ఇండియా ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ క్రికెట్ ప్రేమికులకు ఫుల్ జోష్ ఇచ్చినట్లైంది. ఇన్నిరోజులు టీ20, వన్డే మ్యాచ్‌లపై ఎక్కువ ఆసక్తి చూపే క్రికెట్ లవర్స్ ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లకు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మరి తెలుసుకుందామా టీం ఇండియా తదుపరి టెస్ట్ సిరీస్ ఎప్పుడు ఉందో..
AI వాడకం.. ధనుష్ ఆరోపణలపై నిర్మాణ సంస్థ క్లారిటీ
2013లో విడుదలైన రొమాంటిక్ డ్రామా చిత్రం “రాంఝానా” AI సాయంతో మార్చిన కొత్త క్లైమాక్స్‌తో రీ రిలీజ్ కావడం సినీ పరిశ్రమలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సినిమా తమిళంలో “అంబికాపతి” పేరుతో ఆగస్టు 1, 2025న రీ-రిలీజ్ అయింది. సినిమా హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఈ ఏఐతో క్లైమాక్స్ మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసి, ఈ వివాదంపై తమ వైఖరిని స్పష్టం చేసింది.
సినీ కార్మికుల జీతాలు పెంచాలి.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు !
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో బతకాలంటే జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత నేను కార్మికులతో నేరుగా మాట్లాడతాను. ఈ అంశాలన్నిటినీ దిల్ రాజుకు అప్పగించాము. ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్‌తో చర్చలు జరుపుతున్నారు,” అని వెల్లడించారు. ఆయన మరింత మాట్లాడుతూ, “పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. టికెట్ ధరలు పెంచేందుకు మేము అనుమతులు ఇస్తున్నాము. కాబట్టి, కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి, నిర్మాతలు తగిన నిర్ణయం తీసుకోవాలి,” అని స్పష్టం చేశారు.
కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదం పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలు లేబర్ కమిషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ గంగాధర్‌తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తమ వాదనలను వివరించారు. అనంతరం వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “కార్మికుల వేతనాల అంశంపై మేము అదనపు కమిషనర్ గంగాధర్‌ను కలిసాము. లేబర్ కమిషన్ ఒక పర్సెంటేజ్ ప్రతిపాదన చేసింది, కానీ దానిని మేము ఒప్పుకోలేదు. మేము 30 శాతం వేతన పెంపును సూచించాము. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని గంగాధర్ హామీ ఇచ్చారు,” అని తెలిపారు. ఆయన మరింత మాట్లాడుతూ, “మేము కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం అడుగుతున్నాము, ఎవరినీ దోచుకోవడం మా ఉద్దేశం కాదు. సినిమా రంగం బాగుంటేనే ప్రొడ్యూసర్లు, కార్మికులు బాగుంటారు. ఎవరికీ ఇబ్బంది కాకుండా వేతనాలను పెంచుకోవడమే మా లక్ష్యం,” అని స్పష్టం చేశారు.
