Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

తప్పు చేసినవారు తప్పించుకోలేరు.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు..
తప్పు చేసినవారు తప్పించుకోలేరు.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ కేబినెట్‌ సమావేశంలో మంత్రులతో చర్చల సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని అభిప్రాయపడ్డారు పలువురు మంత్రులు.. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేయగా.. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.. వైసీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని మనమూ వేధించటం సరికాదని హితవు చెప్పారు.. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోంది.. నేరం రుజువయ్యాక ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు.. తప్పు చేసిన వారిని శిక్షించటమే మన విధానం, రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదు.. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు సీఎం చంద్రబాబు..

ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. ‘వెన్నుపోటు దినం’పై జగన్‌ ఆసక్తికర పోస్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది.. అయితే, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శిస్తూ.. ‘వెన్నుపోటు దినం’ పేరుతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, ఈ నిరసన కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చాడు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు.. చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు.. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు అని దుయ్యబట్టారు జగన్..

తుని రైలు ప్రమాదం కేసు.. మంత్రులకు సీఎం దిశానిర్దేశం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. పలు అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది కేబినెట్‌.. ఇక, మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో.. తుని రైలు ప్రమాదం కేసు అంశంపై మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చిందట.. ప్రతీ జీవోను జాగ్రత్తగా గమనించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పొరపాటు జరిగాక సరిదిద్దుకోవడం కంటే.. ముందే జాగ్రత్త పడాలని సీఎం చంద్రబాబు సూచించారు.. ఈ తరహా పరిణామాలు మళ్లీ పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, జరిగిన పొరపాటుకు సీఎంకు క్షమాపణలు చెప్పారు హోంశాఖ కార్యదర్శి..

నైరుతి రుతుపవనాలకు “షార్ట్ బ్రేక్”.. మండుతోన్న ఎండలు..
నైరుతి రుతుపవనాలు “షార్ట్ బ్రేక్” తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించింది. దీంతో వర్షాలు ముఖం చాటేయగా వాతావరణం నిప్పులు కుంపటిగా మారింది. సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ జనం అల్లాడి పోతున్నారు. తీవ్రమైన ఉక్కపోతలు కోస్తాజిల్లాలను ఉడికెత్తిస్తున్నాయి. కాగా, నైరుతి రుతుపవనాలు 10 రోజుల ముందే పలుకరించిందన్న సంతోషం ఆవిరైంది. ఊరించి.. హుషా రు తెచ్చిన వానలు ముఖం చాటేశాయి. గత నెల 29 తర్వాత మాన్ సూన్ కరెంట్ మందగమనంలో కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు వేగంగా విస్తరించిన ఋతువనలు కదలికలు దక్షిణ భారత దేశం, ఈశాన్య రాష్ట్రాల దగ్గర ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం వాయువ్య బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం. ఋతుపవనాల విస్తరణకు అవసరమైన తేమ మొత్తం వెళ్లిపోవడంతో పొడి గాలులు వీస్తున్నాయి.

బెంగళూరులో తొక్కిసలాట.. మృతులకు ప్రధాని మోడీ సంతాపం
ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడంతో.. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలు చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. దీంతో గ్రౌండ్ గేట్ల దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇక, బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రమాదం పూర్తిగా హృదయ విదారకం అన్నారు. ఈ విషాద సమయంలో, తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన సీఎం.. రూ.10 లక్షల సహాయం ప్రకటన..
ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాద ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తొక్కిసలాటపై సీఎం విచారం వ్యక్తం చేశారు. 11 మంది చనిపోయినట్లు సీఎం స్పష్ట చేశారు. మరో 33 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు తెలిపారు. ఇంత భారీగా జనం వస్తారని ఊహించలేదన్నారు. స్టేడియం 35 వేల మంది సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. కానీ 3 లక్షలకు పైగా అభిమానులు బయట ఉన్నారని చెప్పారు. ఈ ఘటన విని షాక్ అయ్యాం.. ఈ విషాదం బాధ విజయ ఆనందాన్ని తుడిచిపెట్టేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారందరూ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారని సీఎం సిద్ధరామయ్యా తెలిపారు. వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని.. ప్రభుత్వం వారికి సాధ్యమైనంత సహాయం అందిస్తుందని వెల్లడించారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఈ సంఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందన్నారు. తొక్కిసలాటపై దర్యాప్తుకు ఆదేశించామని వెల్లడించారు.

తొక్కిసలాట ఘటనపై బీజేపీ సంచలన ఆరోపణలు.. దీనికి కారణం మీరే..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర బౌరింగ్, లేడీ కర్జన్ ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర మాట్లాడుతూ.. “ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. మొత్తం దేశం, కర్ణాటక ఆర్‌సీబీ విజయాన్ని ఘనంగా నిర్వహించారు. కానీ.. ముందస్తు సన్నాహాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విజయ ర్యాలీని నిర్వహించడానికి తొందరపడటం ఈ విషాదానికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సన్నాహాల గురించి పట్టించుకోలేదు. వారు ప్రచారంపై ఎక్కువ ఆసక్తి చూపారు. దీని ఫలితంగా 11 మందికి పైగా మరణించారు. కొంతమంది ఐసీయూలో ఉన్నారు. నేను కొంతమంది బాధితులతో మాట్లాడాను, లోపల పోలీసులు లేరు, అంబులెన్స్ సౌకర్యం లేదు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని న్యాయ విచారణకు పంపాలి.” అని ఆయన డిమాండ్ చేశారు.

ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!
వివో కంపెనీ నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Vivo T4 Ultra 5G భారత్‌లో జూన్ 11న విడుదల కాబోతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే మైక్రోపేజీ లైవ్‌ అయింది. ఇందులో ఫోన్‌కు సంబంధించిన రంగులు, డిజైన్, ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌లో తొలి సారిగా 50MP పెరిస్కోప్ లెన్స్ ఉండబోతోంది. అదే విధంగా pOLED 120Hz క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇక వివో తన T4 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 11, మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనుంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక ఈ-స్టోర్, అలాగే రిటైల్ ఛానెల్ భాగస్వాముల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

తొక్కిసలాట ఘటనపై స్పందించిన బీసీసీఐ..
చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన దురదృష్టకర తొక్కిసలాట సంఘటనపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఆయన వాపోయారు. వేడుకల నిర్వహనపై అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు వేడుకలను బాగా ప్లాన్ చేసి ఉండాల్సిందన్నారు. అభిమానులు ప్లేయర్స్ పట్ల పిచ్చిగా ఉన్నారన్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడారు. అభిమానులు ఎక్కువగా తరలిరావడంతో ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం రోడ్‌షోను నిలిపివేసిందని స్పష్టం చేశారు. కానీ, స్టేడియం వెలుపల తొక్కిసలాట జరుగుతుందని ఊహించలేదన్నారు. నష్టాన్ని నియంత్రించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాద ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేఎస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నగర పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడాను. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేం. ప్రజలంతా సంయమనంతో ఉండాలి. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాన్ని పది నిమిషాల్లోనే ముగించాం. లక్షలాది మంది అభిమానులు వచ్చారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు.

జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ అలా పిలవను!
ఈమధ్య కాలంలో బూతు పదాలతో రెచ్చిపోతున్న రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఈ విషయం మీద స్పందించారు. అలీకి ఇబ్బంది లేదు, మా అన్నయ్య నేను పర్సనల్ గా మాట్లాడుకున్న విషయం, దీన్ని మీరెందుకు పెద్దది చేస్తున్నారు అని అడిగాడు. ఎవరో ఏదో అంటే మనం ఏం చేయగలం. ఇక్కడ ఇండస్ట్రీలో హానెస్ట్ గా ప్రేమలు పంచుకోవడమే ఉంటుంది. లేకపోతే ఇన్నేళ్ల నటజీవితం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. మొన్న జరిగిన పరిణామాలకు హర్ట్ అయ్యాను, ఎంత హార్ట్ అయ్యాను అంటే జీవితంలో ఇంకెవరినీ, ఎప్పుడూ ఏకవచనంతో పిలవకూడదు అని నిర్ణయం తీసుకున్నాను.. ఇక మీదట అందరినీ బహువచనంతోనే పిలుస్తాను. అలా పిలవడం మా అన్నగారు(ఎన్టీఆర్) దగ్గర నేర్చుకున్నాను. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఇదే నా పనా, నా పని నాకు ఉంది. ఎవరో ఎదో పని లేని వాళ్ళు ఏదో చేశారని నేనేదో చేస్తూ కూర్చోలేను.

కొత్త షెడ్యూల్.. ఎప్పుడు? ఎక్కడ అంటే?
సూపర్‌స్టార్ మహేష్ బాబు -దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB 29 గురించి సినీ అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో అనేక ఆసక్తికర అప్‌డేట్స్‌తో వార్తల్లో నిలిచింది. ఇక షూట్ కూడా మొదలు పెట్టగా షూట్ గురించి అనేక వార్తలు తెరమీదకు వచ్చాయి. తాజాగా, సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్‌తో ప్రారంభం కానుందని సమాచారం. జూన్ 10, 2025 నుంచి వారాణసిలోని సెట్స్‌లో ఈ షెడ్యూల్ మొదలవనుందని తెలుస్తోంది. నిజానికి SSMB 29 చిత్రీకరణ ఇప్పటికే ఒడిశాలోని కోరాపుట్‌లో జరిగిన షెడ్యూల్‌తో వార్తల్లో నిలిచింది. అక్కడ జరిగిన షూటింగ్‌లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారని వీడియో లీక్స్ తో క్లారిటీ వహ్హ్యింది. ఇక ఇప్పుడు, సమ్మర్ వెకేషన్ తర్వాత, ఈ భారీ ప్రాజెక్ట్ వారాణసిలోని సెట్స్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.

Exit mobile version