Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

2026లో ప్రభుత్వ సెలవుల ఇవే.. ఉత్తర్వులు జారీ..
డిసెంబర్‌ నెలలోకి వచ్చేశాం.. త్వరలోనే 2025 ఏడాదికి బైబై చెప్పి.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఇక, వచ్చే ఏడాది ఎప్పుడు సెలవులు ఉన్నాయి.. ఆ సెలవుల్లో ఏం ప్లాన్‌ చేసుకోవాలని ఎదురు చూసేవాళ్లు సైతం ఉన్నారు.. పబ్లిక్‌ హాలీడేస్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూ్ళ్లకు కూడా సెలవులు ఉండడంతో.. వాటికి అనుగుణంగా ఇప్పుడే.. ప్రణాళికలు చేసుకునేవారు కూడా ఉన్నారు.. ఇక, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026 సెలవులను ప్రకటించింది.. 2026లో మొత్తం 24 పబ్లిక్‌ హాలీడేస్‌ను ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. భోగి – జనవరి 14, మకర సంక్రాంతి – జనవరి 15, కనుమ – జనవరి 16, మహా శివరాత్రి – ఫిబ్రవరి 15, హోలీ – మార్చి 3, ఉగాది – మార్చి 19, శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4, వినాయక చవితి – సెప్టెంబర్‌ 14, విజయ దశమి – అక్టోబర్‌ 20, దీపావళి – నవంబర్‌ 8.. ఇలా 2026లో మొత్తం 24 పబ్లిక్‌ హాలీడేస్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

తిరుపతి రుయాలో మూడేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స
తిరుపతి రుయా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం అయింది. పులివెందుల రాజీవ్ కాలనీకి చెందిన 3 ఏళ్ల మహీ నాలుగు రోజుల క్రితం ప్లాస్టిక్ క్యాప్‌ను మింగడంతో అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. దగ్గు, శ్వాసకోశ సమస్యలతో రుయా ఆసుపత్రికి తీసుకువచ్చిన చిన్నారిపై నిర్వహించిన సీటీ స్కాన్‌లో ప్లాస్టిక్ క్యాప్ స్పష్టంగా కనిపించింది. వెంటనే వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సకు నిర్ణయించారు. పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఏ.బి. జగదీష్ నేతృత్వంలోని వైద్యబృందం రిజిడ్ బ్రోంకోస్కోపీ సాంకేతికతతో ఆ క్యాప్‌ను విజయవంతంగా బయటకు తీశారు. ఇలాంటి ప్రక్రియను నిర్వహించడం రుయా ఆసుపత్రిలో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. చిన్నారి మహీ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని, సాధారణ ఆరోగ్యంతో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా, ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో ఎన్నో అరుదైన శస్త్ర చికిత్సలు చేసిన విషయం విదితమే.

రూ.20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 56,278 కొత్త ఉద్యోగాలు..!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50 శాతానికి పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఇందులో 20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు 13వ ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. దీంతో 56,278 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలపై సీఎం సమీక్షించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసే ప్రముఖ సంస్థలు పెద్దఎత్తున ఏపీకి వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు.. కంపెనీలు స్థాపించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం అన్నారు.. ఆయా కంపెనీలకు అవసరమైన నీరు, విద్యుత్, భూమి వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాం. వాటి విషయంలో పారదర్శకత పాటిస్తుండడం వల్లనే ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయన్నారు. గత పాలకులు సింగపూర్ లాంటి దేశాన్నే ఇబ్బందులు పెట్టారని… ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారన్నారు. . అలాంటి పరిస్థితులుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుందని… మనం ఆ బ్యాడ్ ఇమేజ్ ని చెరిపేసి… ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చాం అన్నారు చంద్రబాబు… అందుకే ఇటీవల మనం నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు మంచి స్పందన వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు.

పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పరకామణి చోరీ కేసుకు సంబంధించిన విచారణలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో తప్పు ఏముంది? అని ప్రశ్నించిన ధర్మాసనం, అది కేవలం ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేసింది. లోక్‌ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే అధికారం ఈ ధర్మాసనానికే ఉందని పేర్కొన్న హైకోర్టు, దేవాలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో న్యాయస్థానాలే మొదటి సంరక్షులు అని వ్యాఖ్యానించింది. ఇక, రవి కుమార్ దాఖలు చేసిన అప్పీలుపై విచారణను కోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసును లోక్‌ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని, అప్పటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్‌తో ఈ కేసును రాజీ చేసుకునే అవకాశం లేదని మాత్రమే సింగిల్ బెంచ్‌ జడ్జి పేర్కొన్నారని ధర్మాసనం గుర్తుచేసింది. సింగిల్ బెంచ్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ రవి కుమార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ నిర్వహించింది.

మరో అవినీతి తిమింగలం.. ఆదాయానికి మించి రూ.100 కోట్లు
రంగారెడ్డి జిల్లా భూ సర్వే, భూ సంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కోతం శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఆదాయానికి మించిన భారీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. శ్రీనివాసులు అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. శ్రీనివాసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు తెలిసిన ఆదాయ వనరుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆస్తులు ఉండటంతో ఏసీబీ అప్రమత్తమైంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, డిసెంబర్ 4న శ్రీనివాసులు నివాసంతో పాటు ఆయన బంధువులు, మిత్రులు, బినామీలకు చెందిన ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

ఢిల్లీలో ల్యాండ్ అయిన పుతిన్.. స్వయంగా స్వాగతించిన మోడీ..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయ్యారు. పుతిన్‌ను స్వాగతించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ, ఎయిర్ పోర్టుకు వచ్చారు. పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు. ప్రధాని నివాసంలో జరిగే విందు కార్యక్రమానికి మోడీ, పుతిన్ ఇద్దరూ ఒకే కారులో వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. పుతిన్ పర్యటనపై దేశంతో పాటు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్-400, ఎస్-500, SU-57 ఐదో తరం యుద్ద విమానాల వంటి రక్షణ ఒప్పందాలతో పాటు, ఇంధనం, వాణిజ్యం వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది.

ఫుడ్ ఫర్ ఆయిల్.. పుతిన్- మోడీ మధ్య కీలక డీల్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాసేపటి (డిసెంబర్ 4న) క్రితం ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యారు. అతడ్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత్ కు ఫ్రెండ్ గా భావించే పుతిన్ కోసం ప్రధాని మోడీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి నేరుగా మాస్కో అధినేత దగ్గరకు వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి ఓకే కారులో బయల్దేరారు. కాసేపట్లో ప్రధాన మంత్రి మోడీ నివాసంలో విందులో పాల్గొననున్నారు. అయితే, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. దీంతో మాస్కో నుంచి ఆయిల్ ను ఇండియా అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంది. ఈ డీల్ ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనలో ఒప్పందం చేసుకోనున్నారు. ఇందులో ముఖ్యంగా ‘ఫుడ్ ఫర్ ఆయిల్’ డీల్ $60 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం భారత్ వ్యవసాయ ఉత్పత్తులను క్రెమ్లిన్ కు ఎగుమతి చేస్తే.. ఆ దేశం ఆయిల్ ను భారత్ కి పంపనుంది.

ఇండిగో విమానాల ఆలస్యం.. క్షమాపణలు చెప్పిన సీఈఓ
ఇండిగో విమానయాన సంస్థ గత మూడు రోజులుగా ఆపరేషనల్ సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో పాటు అనేక ఫ్లైట్లు ఆలస్యమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు (డిసెంబర్ 4న) అధికారికంగా క్షమాపణలు చెప్పారు. ఆయన స్టాఫ్‌కు పంపిన అంతర్గత ఈ-మెయిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజుకు 3.8 లక్షల మంది ప్యాసింజర్లకు సేవలు అందించే సంస్థగా ప్రతి ప్రయాణికుడికి మంచి అనుభవం ఇవ్వాల్సిందేనని, కానీ గత కొన్ని రోజుల్లో ఆ హామీని నిలబెట్ట లేకపోయామని ఎల్బర్స్ ఒప్పుకున్నారు. చిన్న సాంకేతిక లోపాలు, షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన రంగంలో అధిక రద్దీ, అలాగే కొత్తగా అమల్లోకి వచ్చిన FDTL నిబంధనలు కలిసి ఆపరేషన్లపై ఇండిగో విమానాలపై తీవ్ర ప్రభావం చూపాయి. పైలట్లు, క్యాబిన్ క్రూ, ఇంజినీర్లు లాంటి అన్ని ఆపరేషనల్ సిబ్బందికి సీఈవో పీటర్ ఎల్బర్స్ కృతజ్ఞతలు తెలిపారు.

ఏఐ ఆధారిత భవిష్యత్ ఆవిష్కరణలకు కీలకం.. సామ్ సంగ్ ది ఫస్ట్ లుక్ ఈవెంట్‌ ప్రకటన
ప్రపంచ ప్రసిద్ధ ఆవిష్కరణల ఎలక్ట్రానిక్ కంపెనీ సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్, 2026 సంవత్సరానికి తన డివైస్ ఎక్స్‌పీరియన్స్ (DX) డివిజన్ దృష్టి, కొత్త AI-ఆధారిత కస్టమర్ అనుభవాలను వెల్లడించనుంది. సామ్ సంగ్ తన ది ఫస్ట్ లుక్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఇది వచ్చే నెల ప్రారంభంలో లాస్ వెగాస్‌లో 2026 ప్రారంభంలో జరుగుతుంది. ఈ ఈవెంట్ CES 2026 (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో) కి రెండు రోజుల ముందు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, కంపెనీ 2026 లో హ్యాండ్ సెట్ అనుభవ విభాగం కోసం తన విజన్‌ను ప్రదర్శిస్తుంది. నివేదికల ప్రకారం, ఈ కార్యక్రమంలో కంపెనీ ఇటీవల విడుదల చేసిన ట్రైఫోల్డ్ హ్యాండ్ సెట్ ను మొదటిసారిగా ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేస్తుంది. అమెరికా మార్కెట్ కోసం ధరను కూడా కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. సామ్ సంగ్ తన ది ఫస్ట్ లుక్ ఈవెంట్ జనవరి 4వ తేదీ సాయంత్రం 7:00 గంటలకు (జనవరి 5వ తేదీ రాత్రి 8:30 గంటలకు IST) జరుగుతుందని ప్రకటించింది. ఈ ఈవెంట్ లాస్ వెగాస్‌లో జరుగుతుంది, అక్కడ కంపెనీ 2026లో తన ప్రణాళికలను వెల్లడిస్తుంది. సామ్ సంగ్ కొత్త AI-ఆధారిత వినియోగదారు అనుభవం కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శించనుంది.

స్మృతి-పలాష్ వివాహం వాయిదా తర్వాత ఈవెంట్ ప్లానర్ సీక్రెట్ పోస్ట్ వెలుగులోకి.. వివాహం జరుగుతుందా?
భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధనా, గాయకుడు-సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్‌ల మధ్య వివాహం ఆలస్యం కావడం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ 23న సాంగ్లీలో జరగనున్న వీరి వివాహం ఆకస్మికంగా ఆగిపోయింది. వివాహం జరగాల్సిన వేళ స్మృతి తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్రాయోంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. స్మృతి మంధనా, పలాష్ ముచ్ఛల్ వివాహ కథలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ పోస్ట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో, అభిమానులు మరింత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. వివాహం వాయిదా పడిన తర్వాత, క్రాయోంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రహస్య సందేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్ట్ లో “జీవితంలో ఆడే ప్రతి మ్యాచ్‌లో మనం ఫినిష్ లైన్‌ను దాటము, కానీ స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ ఎల్లప్పుడూ ముఖ్యం.. మా టీమ్ ఆనందం, గర్వంతో కష్టపడి పని చేసింది. వారందరిని ప్రత్యేకంగా ప్రస్తావించాలి! ఛాంపియన్‌ను త్వరలో కలుస్తాం.” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో క్రికెట్ మెటాఫర్లు ఉపయోగించి, సంగీత్ కోరియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, స్టైలిస్టుల వంటి టీమ్ సభ్యులను ట్యాగ్ చేశారు. ఇది స్మృతి మంధనా వివాహానికి సంబంధించినదేనని అందరూ భావిస్తున్నారు. పోస్ట్ వైరల్ అవ్వడంతో, కామెంట్లలో “వివాహం జరుగుతుందా? రూమర్స్ నిజమా?” అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అఖండ2 విడుదలపై తాత్కాలిక నిషేధం
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా సీక్వెల్ అయిన ‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సినిమా విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ‘అఖండ 2’ సినిమా థియేట్రికల్, డిజిటల్ విడుదలలన్నింటినీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ S.M. సుబ్రమన్యం మరియు జస్టిస్ C. కుమారప్పన్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆంక్షలను విధించింది. ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ పక్షాన కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఎరోస్ సంస్థ ప్రధానంగా 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పిపై తీవ్ర ఆరోపణలు చేసింది. సినిమా నిర్మాతలు తమకు చెల్లించాల్సిన ₹28 కోట్లు చెల్లించకుండానే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎరోస్ ఆరోపించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కు అనుబంధ సంస్థ అయిన 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పి సినిమా విడుదల ప్లాన్ చేసిందని ఎరోస్ వాదించింది. ఎరోస్ ఇంటర్నేషనల్ తరపున సీనియర్ కౌన్సిల్‌లు P.S. రమణ్ మరియు A.R.L. సుందరేశన్ లు సమర్థవంతంగా తమ వాదనలు వినిపించారు. డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం, కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ‘అఖండ 2’ సినిమాను ఏ రూపంలోనూ విడుదల చేయడం అసాధ్యం అని అంటున్నారు.

షాకింగ్.. అఖండ ప్రీమియర్స్ క్యాన్సిల్
అఖండ 2 ప్రీమియర్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బాలకృష్ణ అభిమానులకు సినిమా టీమ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అఖండ 2 తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ ఖరారు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్‌తో సినిమా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసినట్లుగా సినిమా టీమ్ ప్రకటించింది. “ఈరోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. మేము సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్” అంటూ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ పెట్టింది. నిజానికి, అమెరికా సహా ఇండియాలో కూడా ప్రీమియర్స్ పెద్ద ఎత్తున ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. కానీ, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇప్పుడు ఆ ప్రీమియర్స్ ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఓవర్సీస్ రివ్యూస్ మాత్రం యధావిధిగా పడనున్నాయని ప్రకటించారు. సినిమా రేపు ఉదయం యధావిధిగా రిలీజ్ అవుతుందని పేర్కొంది.

Exit mobile version