మామిడి రైతులకు సమస్య లేకుండా కార్యాచరణ.. సీఎం ఆదేశాలు
మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం నిర్వహించారు సీఎం. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు వారి మాయలో పడొద్దన్నారు చంద్రబాబు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.
కూటమి గెలుపుపై రోజా సంచలన వ్యాఖ్యలు.. ఈవీఎం మాయాజాలం తోడై..!
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం కూలిపోయి.. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయ్యింది.. అయితే, ఇప్పటికీ ఆ నాటి ఎన్నికల, ఫలితాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.. మరోసారి అదే అంశాన్ని లేవనెత్తారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు.. కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చారని విమర్శించారు.. కుక్కతోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్‌పై కొత్త చర్చ..
సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఏపీలోని కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం, కడప జిల్లాలకు వైసీపీ ప్రభుత్వ సమయంలో సిద్ధార్థ కౌశల్ ఎస్పీగా పని చేశారు.. ప్రజలకు చెరువగా ఉండేందుకు వాళ్లతో మమేకం అయ్యేందుకు సిద్ధార్థ కౌశల్ తన మార్క్ పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధానంగా బాధితులు నేరుగా తనను కలిసేందుకు సోషల్ మీడియా ఖాతాలలో యాక్టివ్ గా ఉండేవారు. దీంతోపాటు తన ఫోన్ నెంబర్లు అందరికీ తెలియజేసి.. ఏ సమస్యను అయినా తానే పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్ల సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గురించి ఆయా జిల్లాల్లో పనిచేసిన ప్రజలందరికీ సుపరిచితం. వైసీపీ ప్రభుత్వ సమయంలో ఆయన ప్రధాన జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రాధాన్య పోస్టులో ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఏఐజీ లా అండ్ ఆర్డర్ పోస్ట్ లో ప్రస్తుతం సిద్దార్ధ కౌశల్ ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేశారు.
కాకాణికి మళ్లీ షాక్.. మరో కేసులో రిమాండ్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోషాక్ తగిలింది.. ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న కాకాణికి మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు.. గత ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాలెంలో దొరికిన మద్యం డంపు కేసులో ఆయన నిందితులుగా ఉండగా.. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎక్సైజ్ పోలీసులు పీఈ వారెంట్ పై న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.. దీంతో, ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు..
అలా అయితే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.. చంద్రబాబు స్వీట్ వార్నింగ్..
కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. అభివృద్ధి, సంక్షేమం అంతా కార్యకర్త ద్వారానే జరగాలని ఆకాక్షించిన ఆయన.. ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్తే గుర్తుకు రావాలన్నారు.. ప్రజలకు దగ్గరైన వారు నాకు దగ్గరగా ఉంటారు.. లేదా, ప్రజల్లో చెడ్డ పేరుంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను.. కుప్పంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్మూలా అని స్పష్టం చేశారు చంద్రబాబు.. సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటింటి ప్రచారం కార్యక్రమ నిర్వహణపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.. ప్రభుత్వ పనితో సమానంగా పార్టీ కోసం పని చేస్తున్నాను.. పనులు చేయడం ఎంత ముఖ్యమో.. చేసిన పనిని చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నారు చంద్రబాబు… నేను మొదటి సారి కుప్పానికి వచ్చినప్పటి కంటే ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు.. దాన్ని ప్రజలకూ తెలియచెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.. గత పాలకులు అరాచకాలు చేశారు.. 11కు పడిపోయారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పాం.. హామీలిచ్చిన విధంగా పని చేస్తున్నామని ప్రజలకు చెప్పాలి.. కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టినప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దండి.. గత ప్రభుత్వం పెన్షన్లల్లో కోత పెట్టింది. మనం అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. అభివృద్ధికి బ్రాండ్ టీడీపీ అయితే.. టీడీపీకి బ్రాండ్ కార్యకర్తలే అన్నారు. నేతలు అటూ ఇటూ మారుతున్నారేమో కానీ కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారు. డబుల్ సంక్షేమం చేస్తున్నాం.. ఫలితం కూడా డబుల్ ఉండాలనే రీతిలో కేడర్ పని చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు..
సిగాచి ఫ్యాక్టరీలో బ్లాస్ట్.. ఈరోజు 13 మృతదేహాలు బంధువులకు అప్పగింత
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పేలుడు ధాటికి పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు పూర్తిగా చిద్రం అయిపోయాయి. చెల్లాచెదురుగా పడిపోయిన సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శరీర భాగాలను సేకరించి.. పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించారు. ఈ సందర్భంగా మార్చరీలో ఉన్న మృతదేహాలకు వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ చేసి అప్పగిస్తున్నారు. అయితే, ఈ రోజు మరో 13 మృతదేహాలను అధికారులు గుర్తించారు. దీంతో మృతదేహాల గుర్తింపు సంఖ్య ఇప్పటి వరకు 31కి చేరింది. ఇక, తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు ఇచ్చి.. ఈ రాత్రికే మృతుల స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మార్చురీలో 7 మృతదేహాలు ఉండగా.. గుర్తు పట్టలేని స్థితిలో మరికొన్ని అవయవాలు, మాంసపు ముద్దలు దర్శనమిస్తున్నాయి.
కేసీఆర్కు అనారోగ్యం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు డాక్టర్లు పలు పరీక్షలు చేస్తున్నారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. గతంలోనూ కేసీఆర్ అనారోగ్య సమస్యతో యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇక, 3 రోజుల పాటు హైదరాబాద్ లోని నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు. అయితే, సీజనల్ ఫీవర్ తోనే కేసీఆర్ బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో నందినగర్ నివాసంలో కేసీఆర్‌కు వైద్యులు పలు టెస్టులు చేశారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు యశోదా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్‌కు మెడికల్ టెస్టులు చేసినట్లు టాక్. కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ఇక, కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయాల్సి ఉంది.
పాత వాహనాల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం యూటర్న్..
ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన వెహికిల్ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడంతో మళ్లీ యూటర్న్ తీసుకుంది. 15 ఏళ్ల కన్నా పాతవైన పెట్రోల్ వాహనాలకు, 10 ఏళ్ల కన్నా పాతవైన డీజిల్ వాహనాలకు ఇంధనం ఇవ్వద్దని ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. పాత వాహనాల నిషేధాన్ని నిలిపివేస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. సాంకేతిక సవాళ్లు, సంక్లిష్ట వ్యవస్థల కారనంగా అమలు చేయడం కష్టం, జాగ్రత్తగా ఉండే వ్యక్తులను శిక్షించే బదులు, పేలవంగా నిర్వహించబడుతున్న వాహనాలను స్వాధీనం చేసుకునే వ్యవస్థ ఉంది’’ అని చెప్పారు.
పెళ్లి కోసం లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి.. చివరకు అత్యాచారం కేసు..
తన ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి ‘‘లింగ మార్పిడి’’ చేసుకున్నాడు. అంతా బాగుంది కానీ, ఇప్పుడు ఆ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ట్విస్ట్ చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి తన లవర్ కోసం సర్జరీ చేయించుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించడంతో పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించాడు. అత్యాచారం, శారీరక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ గురువారం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ కేసులో ఫిర్యాదుదారు, నిందితుడు 25 ఏళ్ల వ్యక్తులు. మొదటిసారిగా నర్మదాపురంలో దాదాపు 10 ఏళ్ల క్రితం వీరు కలుసుకున్నారు. వారు కాలా కాలం పాటు కలిసి జీవించారు. స్వలింగ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఫిర్యాదు ప్రకారం, రైసేన్ జిల్లాలోని ఒబేదుల్లా గంజ్ నివాసి, సదరు వ్యక్తిని లింగమార్పిడి చేయించుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ తర్వాత, అతడిని పెళ్లి చేసుకుంటా అని మభ్యపెట్టాడు.
డబుల్ సెంచరీతో చరిత్రను తిరగరాసిన కెప్టెన్ గిల్.. ఏ రికార్డులను సాధించాడంటే..?
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజు గిల్ తన టెస్ట్ కెరీర్ లోనే మొట్టమొదటి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇలా టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ, అలాగే తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్ 311 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు 1979లో ది ఓవల్ వేదికగా సునీల్ గావస్కర్ చేసిన 221 పరుగుల పేరుతో ఉండేది. అలాగే 2002లో అదే వేదికపై రాహుల్ ద్రావిడ్ 217 పరుగుల వరకే పరిమితమయ్యాడు. కానీ, ఇప్పుడు గిల్ వీరిద్దరిని అధిగమించి కొత్త శిఖరాన్ని అధిరోహించాడు.
జులై 25న ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మూవీ రిలీజ్..
మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో కొత్త మూవీ వండర్ రాబోతోంది. అదే ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్. 1960 నాటి MCU కాలక్రమంలో రీడ్ రిచర్డ్స్, అతని సహచరుడు కలిసి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మూవీ జులై 25న రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ నటిస్తున్నాడు. అతని మానవాతీత తెలివితేటలతో ఈ మూవీలో అబ్బురపరిచే యాక్షన్ తో అదరగొడుతాడని అంటున్నారు మూవీ టీమ్. బెన్ గ్రిమ్ జట్టు ఇందులో ఎమోషనల్ సెంటర్ గా ఉండనున్నారు. అతను రాక్ లో చిక్కుకున్నప్పటికీ, అతను లోపల ఎలాంటి సాహసాలు చేశాడు, యుద్ధంలోకి దిగిన మొదటి వ్యక్తిగా అతను ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు చేశాడో మూవీలో కనిపించబోతోంది. ట్రైలర్లు సూ మరియు రీడ్ కుమారుడు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ జననం గురించి తెలియజేస్తాయి.
N జులై 11న ఓటీటీలోకి ‘నరివేట్ట’..
మలయాళ స్టార్ నటుడు టొవినో థామస్ నటించిన యాక్షన్ డ్రామా ‘నరివేట్ట’. రీసెంట్ గానే మలయాళంలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ మూవీని ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మించగా అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేశారు. థియేటర్లలో హిట్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జూలై 11 నుంచి సోనీ లివ్‌లోకి రాబోతోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో టొవినో థామస్ నిజాయితీ పరుడైన కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. వయనాడ్ ప్రాంతానికి వర్గీస్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం.. ఆ తర్వాత అక్కడి పరిస్థితులపై పోరాడటం అనే కాన్సెప్ట్ తో మూవీని తెరకెక్కించారు.
నేను కాపీ కొట్టలేదు.. ప్రియమణి వివరణ..
సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’. ఈ సిరీస్ ను రేవతి డైరెక్ట్ చేయగా.. రేపు జులై 4 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ పై కొన్ని రూమర్లు వస్తున్నాయి. అమెరికాలో వచ్చిన ‘ది గుడ్ వైఫ్’ సిరీస్ ను ప్రియమణి కాపీ కొట్టి ఈ గుడ్ వైప్ సిరీస్ చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. తాజా ప్రమోషన్లలో వాటిపై ప్రియమణి క్లారిటీ ఇచ్చింది. మేం ఎలాంటి వెబ్ సిరీస్ ను కాపీ కొట్టలేదు. ఇది పూర్తిగా మన కల్చర్ కు సంబంధించింది.