వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి.. డీఎంహెచ్‌వో వివరణ
స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. పల్నాడు జిల్లా డీఎంహెచ్‌వో రవికుమార్ స్క్రబ్ టైఫస్ కేసులపై వివరణ ఇచ్చారు.. జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే, ఈ వ్యాధి గురించి ప్రజలు అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌వో రవికుమార్ వివరాల ప్రకారం, స్క్రబ్ టైఫస్ ప్రాణాంతక వ్యాధి కాదు.. ఇది ఒక రకమైన చిన్న పురుగు.. నల్లిని పోలిన చిగర్ మైట్.. కరిచినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ మాత్రమే. ముఖ్యంగా, ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికీ సోకదు, అంటురోగం కాదని ఆయన తెలిపారు. స్క్రబ్ టైఫస్‌కు సాధారణంగా కనిపించే లక్షణాల గురించి వివరిస్తూ.. జ్వరం, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి.. ఈ లక్షణాలు నాలుగు–ఐదు రోజులకు పైగా కొనసాగితే వెంటనే సమీప ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వ్యాధికి “డాక్సిసైక్లిన్” అనే టాబ్లెట్ వాడితే త్వరగా నయం అవుతుందని తెలిపారు. రాజుపాలెం ఆర్ఆర్ కాలనీకి చెందిన నాగమ్మ అనే మహిళకు గత నెల 8న జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరారు. 14వ తేదీన గుంటూరు జీజీహెచ్ఎకు రిఫర్ చేయగా, రిపోర్టులు రాక ముందే 16న చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. రుద్రవరంకికి చెందిన జ్యోతి కూడా ఇదే లక్షణాలతో మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతి చెందారు. ఈ ఇద్దరి రిపోర్టులు వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎంహెచ్‌వో వెల్లడించారు..
ప్రతి అర్జీకి పరిష్కారం చూపించాల్సిందే..
ప్రతి అర్జీకి పరిష్కారం చూపించాల్సిందే అంటూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తుచేశారు. ప్రతి అర్జీపై కృషి చేయడం వల్లే ఎక్కువ పౌరుల నుంచి అర్జీలు రావడం జరుగుతున్నట్టు చెప్పారు. సమస్యలను విభజించి, క్యాటగిరీల వారీగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. గ్రీవెన్స్ వ్యవస్థను రొటీన్ ప్రక్రియగా కాకుండా, సమయస్పదంగా నిర్వహిస్తాం. ఇప్పటివరకు సుమారు 34,000 అర్జీలు పరిష్కరించాం. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించే మెరుగైన వ్యవస్థను ప్రవేశపెట్టుతున్నాం.. రైతు సమస్యల విషయంలో మంత్రి కేశవ్ తెలిపారు.. మామిడి రైతుల నుంచి గిట్టుబాటు ధరలో కొనుగోలు చేశామని గుర్తుచేశారు మంత్రి పయ్యావుల.. బార్లీ, పొగాకు కొనుగోలు చేశామని.. ప్యాడీ కొనుగోలు కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు.. తాజాగా మొక్కజొన్న సమస్యపై చర్యలు తీసుకుంటున్నాం.. అలాగే, అరటి కొనుగోలు మరియు మార్కెట్ అవకతవకలపై ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తూ దృష్టి సారించిందని చెప్పారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..
శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన శివస్వాములు.. స్పర్శ దర్శనంపై కీలక నిర్ణయం
శ్రీశైలం మహాక్షేత్రంలో శివస్వాముల సందడి నెలకొంది.. కార్తీక మాసంలో శివ మాల ధరంచిన శివస్వాములు.. ఇప్పుడు శ్రీమల్లికార్జునస్వామికి ఇరుముడి సమర్పణ కోసం శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తారు.. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుల కోసం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్జు చైర్మన్ రమేష్ నాయుడు కీలక నిర్ణయం తీసుకునారు.. ఈ నెల 7వ తేదీ వరకు ఇరుముడితో వచ్చే శివస్వాములకు ప్రత్యేకంగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించనున్నారు.. 7వ తేదీ వరకు ఇరుముడితో వచ్చే శివ స్వాముకు విడతల వారీగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.. మరోవైపు, సాధారణ భక్తులకు స్పర్శ దర్శనాలు రద్దు చేశారు.. సాధారణ భక్తులకు సైతం ఇబ్బందులు కలగకుండా శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నారు.. అయితే, భక్తుల రద్దీ పెరడంతో మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.. ఇక, క్యూలైన్లలో శివస్వాములు, సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.. ఇరుముడితో వచ్చిన శివస్వాములకు రెండు గంటలకు ఒకసారి స్పర్శదర్శనానికి అనుమతి ఇస్తున్నారు.. మరోవైపు, మిగతా సమయంలో సాధారణ భక్తులకు శ్రీస్వామివార అలంకార దర్శనం కల్పిస్తున్నారు.. క్యూలైన్‌లో వేచిఉండే భక్తులకు ఎప్పటికప్పపడు అల్పాహారం, మంచినీరు సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు వెల్లడించారు..
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఎనిదేళ్ల బాలికపై అత్యాచారం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు
కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగిలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు రాంప్రసాద్ రెడ్డికి యావజీవ జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును పోక్సో కోర్టు మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ వెలువరించారు.. మేజిస్ట్రేట్ తీర్పులో, టీసీలు మరియు రైల్వే సిబ్బందికి నిర్లక్ష్యానికి కారణమై ఘటన జరిగిందని పేర్కొని, వారి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు 2019లో తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళుతున్న సమయంలో రాజంపేట-నందలూరు మధ్య చోటు చేసుకున్నది. బాలిక వాష్‌రూమ్‌కు వెళ్ళినప్పుడు నిందితుడు రాంప్రసాద్ రెడ్డి దాడి చేశాడు. ఇటీవల, బాధిత బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో గుంతకల్ ఆర్‌ఎం కార్యాలయం కడపకు కేసును రెఫర్ చేసింది. తర్వాత, కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందుకు అనుగుణంగా, పోక్సో కోర్టు బాధిత యువతికి రూ.10,50,000 రూపాయల పరిహారం అందించాలని గుంతకల్ ఆర్‌ఎమ్‌కు ఆదేశాలు జారీ చేసింది. మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దివ్యాంగులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు..
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమాజంలో ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం, జీవన ప్రమాణాల మెరుగుదల అందించాలని లక్ష్యంగా, ఇంద్రధనుస్సు తరహాలో ఏడు వరాలు ప్రకటించారు. దివ్యాంగులకు APSRTC ఉచిత ప్రయాణం: ఇప్పటివరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఇకపై దివ్యాంగులకు కూడా వర్తింపచేస్తామని సీఎం ప్రకటించారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ప్రతినిధిత్వం: స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు మరియు పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక్క దివ్యాంగ ప్రతినిధిని తప్పనిసరిగా నామినేట్ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఆర్థిక సబ్సిడీ పథకాల పునరుద్ధరణ: SC, ST, BC మరియు మైనారిటీలకు ఇచ్చినట్లే, దివ్యాంగులకు కూడా ఆర్థిక సబ్సిడీ పథకాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. క్రీడా కార్యక్రమాల్లో దివ్యాంగులకు అవకాశాలు: SAAP (Sports Authority of Andhra Pradesh) ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని క్రీడా కార్యక్రమాలు, ప్రతిభాభివృద్ధి పథకాలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. హౌసింగ్ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు: బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ గృహ నిర్మాణాల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌ను తప్పనిసరిగా కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక డిగ్రీ కాలేజీ & పెన్షన్ పంపిణీ: బాపట్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ స్థాపించనున్నారు. అలాగే, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్‌లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అదే చోటే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేసే విధానం అమలు కానుంది. అమరావతిలో రాష్ట్ర స్థాయి ‘దివ్యాంగ్ భవన్’: దివ్యాంగుల కోసం రాష్ట్ర స్థాయిలో అన్ని సేవలు, మద్దతు కార్యక్రమాలు, శిక్షణా కేంద్రాలు, హక్కుల పరిరక్షణ సేవలను ఒకే చోట అందించేలా ‘దివ్యాంగ్ భవన్’ ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు.
జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం.. కమిషనర్ కీలక ఆదేశాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ వేగవంతం అయింది. ఇప్పటికే ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రత్యేక ఆదేశాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జారీ చేశారు. 27 మున్సిపాలిటీల్లో రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమీషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. జోనల్ కమీషనర్ పర్యవేక్షణలో డిప్యూటీ మున్సిపల్ కమీషనర్లు రికార్డ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రత్యేకంగా రికార్డ్స్ ప్రొఫార్మ రూపొందించాలని తెలిపారు. ఇక, 27 మున్సిపాలిటీల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ల బాధ్యతల జాబితాను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 27 మున్సిపాలిటీల సిబ్బంది వివరాలు ఇవ్వాలని CDMAను జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. గ్రేటర్ లో విలీనం అయ్యే 27 మున్సిపాలిటీలలో ఉన్న సిబ్బంది వివరాలను తక్షణమే అందించాలని పేర్కొన్నారు. సాంక్షన్‌డ్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్, రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అత్యవసరంగా ఈ డేటాను కోరినట్లు కమిషనర్ లేఖలో స్పష్టం చేశారు.
కోకాపేట భూములకు ముగిసిన మూడో విడత వేలం.. ఎకరం రూ. 131 కోట్లు
కోకాపేట నియో పోలీస్ భూములకు మూడో విడత వేలం ముగిసింది. ఈరోజు (డిసెంబర్ 3న) ప్లాట్ నంబర్స్ 19, 20లోని 8.04 ఎకరాలకు ఈ వేలం వేశారు అధికారులు. అయితే, ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి 131 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 20లో ఎకరానికి 118 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. కాగా, ఈరోజు 8.04 ఎకరాలకు గాను సుమారు వెయ్యి కోట్ల రూపాయలను HMDA పొందింది. ఇక, మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు 3,708 కోట్ల రూపాయలను HMDA ఆర్జించింది. అయితే, ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఈ వేలం వేసింది. కోకాపేటలోని 29 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాల భూమికి వేలం వేస్తున్నారు. కోకాపేట గోల్డెన్ మైల్ లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు డిసెంబర్ 5వ తేదీన ఈ వేలం వేయనున్నారు. అయితే, హెచ్ఎండీఏ భూముల వేలంలో కాసుల పంట పండింది. ప్లాట్ నెంబర్ 19ను ఎకరాకు 131 కోట్ల రూపాయల విలువతో YULA కన్స్ట్రక్షన్స్ LLP, గ్లోబస్ ఇన్ఫ్రాకాన్ LLP సంస్థలు పొందాయి. అలాగే, ప్లాట్ నెంబర్ 20లో ఎకరాకు 118 కోట్ల రూపాయలకు బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ దక్కించికుంది. కాగా, నియో పోలీస్ ఈ-ఆక్షన్‌లో సుమారు 3,700 కోట్ల రూపాయల మైలురాయిని దాటి, సగటు స్థల విలువల్లో అసాధారణ వృద్ధి సాధించింది. మూడు దఫాలుగా నిర్వహించిన ఆక్షన్‌ల ద్వారా ఇప్పటి వరకు కలిపి మొత్తం 3, 708 కోట్ల ఆదాయాన్ని హెచ్ఎండీఏ ఆర్జించింది.
కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న అడవులు.. 12 మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్-దంతేవాడ అంతర్- జిల్లా సరిహద్దులోని పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టు కేడర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎదురు కాల్పుల్లో ముగ్గురు బీజాపూర్ DRG సిబ్బంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. హెడ్ కానిస్టేబుల్ మోను వాడారి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోడిగా గుర్తించారు. అలాగే, మరో ఇద్దరు బీజాపూర్ DRG సిబ్బంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఇక, SLR రైఫిల్స్, INSAS రైఫిల్స్, 303 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నిరంతర సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అదనపు బలగాలను, తగినంత బలగాలు మోహరిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టు ముట్టాయి. కాగా, బీజాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం మీడియాతో ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేం అన్నారు.
నేను బతికున్నంత వరకు, బెంగాల్‌ను బీజేపీ తాకలేదు..
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘‘తెలివైన కుట్ర’’కు తెర తీశారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావని ఆమె హెచ్చరించారు. మాల్దా జిల్లాలో సర్ వ్యతిరేక బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఓటర్ల జాబితా ప్రక్రియ నిర్వహించడం ద్వారా బీజేపీ తన సమాధిని తానే తవ్వుకుంటోందని అన్నారు. బీజేపీ బెంగాల్‌ను స్వాధీనం చేసుకోలేదని, బెంగాల్ ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడూ మద్దతు ఇవ్వరని, బెంగాల్ బీహార్ కన్నా భిన్నమని మమతా అన్నారు. తాము సర్‌ను వ్యతిరేకించడం లేదంటూనే, ఎన్నికల సమయంలో ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. బెంగాల్‌లో సర్ కారణంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారని, 13 మంది ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారని చెప్పింది. తాను బెంగాల్ ప్రజలకు ‘‘కాపలాదారు’’ని అని చెప్పారు. బీజేపీ మత శక్తులు ప్రజల్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశామని, తాను బతికి ఉన్నంత వరకు బెంగాల్‌ను తాకనివ్వనని, తాను మత రాజకీయాలను అనుమతించనని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ ఒక నల్లిపురుగు లాంటిదని, వాటిని తొలగించే వరకు కొరుకుతాయని చెప్పారు. బెంగాల్ ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు తొలగించబడవని, ఎవరూ నిర్బంధ శిబిరాలకు వెళ్లరని ఆమె హామీ ఇచ్చారు.
భారత్‌తో యుద్ధానికి అసిమ్ మునీర్ ఆరాటం, బీజేపీ స్నేహం కోసం ఇమ్రాన్ ఖాన్..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారనే పుకార్ల నేపథ్యంలో, మంగళవారం అతడి సోదరిని ప్రభుత్వం కలిసేందుకు అనుమతి ఇచ్చింది. దీని తర్వాత, ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. మే నెలలో జరిగిన భారత్-పాకిస్తాన్ సైనిక ఘర్షణ గురించి ప్రశ్నించిన సమయంలో..”అసిమ్ మునీర్ ఒక రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్, ఇస్లామిక్ కన్జర్వేటివ్. అతను భారతదేశంతో యుద్ధం కోసం తహతహలాడటానికి ఇదే కారణం. అతని ఇస్లామిక్ రాడికలైజేషన్ మరియు సంప్రదాయవాదం ఇస్లాంను నమ్మని వారిపై పోరాడటానికి అతన్ని బలవంతం చేస్తున్నాయి” అని అలీమా అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడిపించేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆమె కోరారు.
ఆ ఇమేజ్‌కు దూరంగా యంగ్ హీరోలు?
స్టార్‌డమ్ సంపాదించాలంటే తప్పనిసరిగా ‘మాస్ ఇమేజ్’ ఉండాలన్న పాత ఫార్ములాను నేటి యువ హీరోలు పక్కన పెడుతున్నారు. మాస్ హీరో అనిపించుకోవడం కంటే, ‘సక్సెస్’ వస్తే చాలు అనే కొత్త మానియాతో వీరు విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. యువ హీరోల టీజర్స్, ట్రైలర్స్ పరిశీలిస్తే, ఒకరిద్దరు మినహా చాలామంది మాస్ ఇమేజ్‌కు దూరంగా, కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, యాక్షన్ హీరోలుగా ప్రయత్నించి ఫెయిల్ అయిన లేదా రొటీన్ ట్రాక్‌లో ఇరుక్కున్న యువ హీరోలు ఇప్పుడు కథా కథనంలో మార్పులు తెస్తున్నారు. మాస్ ట్రాక్ ఎక్కి పట్టాలు తప్పడంతో, రొటీన్ నుంచి బయటపడాలని ప్రయత్నించాడు నిఖిల్. ఫలితంగా, ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ ‘స్వయంభు’ తో ఏకంగా హిస్టరీలోకి వెళ్లిపోయాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతోంది. సక్సెస్ కోసం నిఖిల్ ప్రస్తుతం పీరియాడిక్ మూవీస్ వైపు మొగ్గు చూపుతున్నాడు. అన్న విజయ్ దేవరకొండలా కాకుండా, తమ్ముడు ఆనంద్ దేవరకొండ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వస్తున్నాడు. ‘బేబి’ తర్వాత, ఆనంద్, వైష్ణవి కాంబోలో ‘ఎపిక్’ అనే సినిమా రాబోతోంది. మాస్ జోలికి పోకుండా కొత్త కథలను ట్రై చేస్తున్న హీరోల్లో ఆనంద్ బెటర్ అని అనిపించుకుంటున్నాడు. యువ హీరోలు కేవలం యాక్షన్, మాస్ సినిమాలకే పరిమితం కాకుండా, విభిన్న జానర్లను ఎంచుకుంటున్నారు. సుమ, రాజీవ్ కనకాల వారసుడు రోషన్ బబుల్ గమ్ తర్వాత గ్యాప్ తీసుకుని, హీరోగా ‘మోగ్లీ’ చిత్రంతో రాబోతున్నాడు. ‘మోగ్లీ’ ట్రైలర్ విడుదల అయింది. ఇందులో రోషన్ కొంతవరకు యాక్షన్ హీరోగా కనిపింస్తున్నాడు. మరోపక్క హీరో శర్వానంద్ పూర్తిగా సిక్స్ ప్యాక్‌తో గుర్తుపట్టలేనంతగా మారి, ‘బైకర్’ పాత్రలో కనిపించబోతున్నాడు. మాస్ నుంచి బైకర్ పాత్ర వరకు మారడం ఈ ట్రెండ్‌కు నిదర్శనం. హీరో నందు.. అర్జున్ రెడ్డిలా నెగెటివ్ షేడ్‌లో ‘సైక్ సిద్దార్థ్’ గా కనిపించబోతున్నాడు. ఇది కూడా మాస్‌కు దూరంగా, క్యారెక్టర్ డ్రైవెన్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడమే.తెలుగు యువ హీరోలు ఇప్పుడు కేవలం మాస్ ఇమేజ్ కోసం కాకుండా, కథా బలమున్న కొత్త ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కొత్త రూటే వారికి స్టార్‌డమ్‌ను అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
రోషన్ మేక వర్సెస్ రోషన్ కనకాల
ఒకే నేమ్‌తో ఉన్న ఇద్దరు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హీరోలుగా నిలదొక్కుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలుపెట్టారు. హీరోలుగా ఇంట్రడ్యూసయ్యారు. కానీ వారి ఫస్ట్ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. నెక్ట్స్ తమ సెకండ్ ఫిల్మ్స్‌తో లక్ టెస్టుకు రెడీ అయ్యారు. వారే హీరో కుమారుడు శ్రీకాంత్ రోషన్, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల. వీరి తెరంగేట్రం ఈజీగానే జరిగిపోయింది కానీ హీరోలుగా సాలిడ్ ఐటెంటిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్న వయస్సులోనే నిర్మలా కాన్వెంట్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేశారు ఇద్దరు రోషన్లు. ఆ తర్వాత ఎవరీ కెరీర్ వారిదే. ఎవరి ఆఫర్స్ వాళ్లవే. రోషన్ పెళ్లి సందDతో హీరోగా ఎంట్రీ ఇస్తే.. బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. కానీ శ్రీలీల పాపులరై బాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమైంది. కానీ రోషన్ మాత్రం సెకండ్ ఫిల్మ్ లోడ్ చేయడానికి నాలుగేళ్లు పట్టింది. అలాగే రోషన్ కనకాల కూడా టూ ఇయర్స్ బ్యాక్ బబుల్ గమ్ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇలా తమ ఫస్ట్ సినిమాలతో ఫెయిల్యూర్స్ చవిచూసిన రోషన్ అండ్ రోషన్ కనకాల.. సెకండ్ ఫిల్మ్‌తో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. వీరిలో ముందు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రోషన్ కనకాల. రోషన్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మోగ్లీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కలర్ ఫోటో ఫేం సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సాక్షి మడోల్కర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
అఖండ2లో సంయుక్తమీనన్ హీరోయిన్నా? ఐటంగర్లా?
సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో నటిస్తూ, ప్రస్తుతం తొమ్మిది సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న హీరోయిన్ సంయుక్త మీనన్ త్వరలో ఫేడౌట్ అవుతుందనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైంది. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, కెరీర్ మసకబారుతుందా అన్న భయం ఈ అమ్మడిని వెంటాడుతోంది. ఈ విచిత్రమైన పరిస్థితులకు కారణం ఏమిటి? సాయి పల్లవి, నిత్యా మీనన్ తరహాలో ఇంతకాలం గ్లామర్‌కు దూరంగా, నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు ఎంచుకున్నారు సంయుక్త. ‘సార్’ (తెలుగులో వాతి) సినిమాలో టీచర్‌గా డిగ్నిఫైడ్ రోల్‌లో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే, బాలయ్య సినిమాతో సంయుక్త రూటు మారింది. అఖండ 2 లో బాలయ్యతో జత కట్టడమే కాక, ఐటమ్ గర్ల్‌గా కూడా కనిపించబోతుండడం ఈ భయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జాజికాయ సాంగ్‌లో సంయుక్త స్కిన్‌షో చేయడం బాలయ్య చేతిలో పడి యూటర్న్ తీసుకున్నట్టుగా అయ్యిందనే చర్చ నడుస్తోంది. హీరోయిన్స్ ఎవరైనా బాలకృష్ణతో నటిస్తే, ఆ సినిమా హిట్టైనా హీరోకి, డైరెక్టర్‌కి మాత్రమే పేరు వస్తుందని, హీరోయిన్‌కు మరో ఆఫర్ దక్కడం కష్టమేననే ఒక ‘సెంటిమెంట్’ టాలీవుడ్‌లో బలంగా ఉంది. చాలామంది దర్శకులు కెరీర్ చివరి స్టేజ్‌లో ఉన్న లేదా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్లను మాత్రమే బాలయ్య పక్కన సెలెక్ట్ చేస్తున్నారనే విమర్శ ఉంది. ‘భగవంత్ కేసరి’ హిట్టయినా, కాజల్‌కు మరో పెద్ద ఆఫర్ దక్కలేదు.’లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో బాలయ్యకు జంటగా నటించిన తర్వాత రాధికా ఆప్టే కనిపించకుండా పోయారు. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయినా, ఆ హిట్ ప్రగ్యా జైస్వాల్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. ‘డాకు మహారాజ్’ తర్వాత ఊర్వశి రౌతేలా కూడా తెరపై కనిపించలేదు. క్రేజీ భామగా కొనసాగుతున్న సంయుక్త మీనన్ కూడా ‘అఖండ 2’ తర్వాత ఇదే సెంటిమెంట్‌కు బలైపోతుందా, లేదా ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. బాలయ్యతో జత కట్టడం సంయుక్త కెరీర్‌ను మసకబారేలా చేస్తుందా, లేక మరింత హైప్‌ను తెస్తుందా అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
