ఆ గిరిజనుల రహదారి సమస్య పరిష్కారం.. ఫొటోలు షేర్ చేసిన పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం హయాంలో రోడ్ల పరిస్థితిపై ఎన్నో విమర్శలు వచ్చాయి.. అయితే, తాను అధికారంలోకి రాగానే, రోడ్లు పరిస్థితి మారుస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.. ఇక, రోడ్డు సౌకర్యం కూడా లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.. ఇప్పుడు పూర్తి చేసిన రోడ్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. “గిరిజన గ్రామాలకు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ PM జన్ మన్ పథకం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం, లక్కవరం నుండి చీదిగోంది వరకు సహకారంతో దాదాపు రూ.87.19 లక్షల వ్యయంతో 1.01 కి.మీ రహదారి నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా దాదాపు 183 మంది గిరిజనులకు రహదారి సమస్య పరిష్కారం అయ్యింది” అని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఇక, “సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, దాదాపు రూ.1,000 కోట్ల నిధులతో – గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రారంభించిన అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా, ఇన్నేళ్లుగా సరైన రోడ్లు లేక వైద్యానికి, అవసరాలకు ఇబ్బందిపడుతున్న గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని చేయడం ద్వారా వారి ఇబ్బందులు తొలగించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వారికి అభివృద్ధిని చేరువ చేస్తోంది..”అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయ సమాధే..! జగన్‌కు జేసీ కీలక సూచనలు
ఏది మాట్లాడినా ముక్కుసూటిగా.. ఉన్నది ఉన్నట్టుంగా మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది.. అయితే, ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయంగా సమాధి అవుతావు అంటూ వైఎస్ జగన్‌కు కీలక సూచనలు చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పలు అంశాలపై స్పందించారు.. టీడీపీ మహానాడుకు వెళ్తే.. అక్కడి జనాలను చూసి మైండ్ పోయిందన్నారు.. అక్కడ వచ్చింది లీడర్లు కాదు.. సామాన్య ప్రజలే ఎక్కువ అన్నారు.. జగన్.. కావాల్సిన వ్యక్తివి.. మీ అమ్మ.. తాడిపత్రి నుంచి వచ్చిన వ్యక్తే అన్నారు జేసీ.. నాకు నచ్చిన నేతలు ముగ్గురే ముగ్గురు అందులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒకరు.. అందరితో.. నాతో అప్యాయంగా ఉండే వ్యక్తి ఆయన.. ఎక్కడ ఉన్నా అప్యాయంగా పలకరించే వ్యక్తి.. కానీ, నువ్వు ఇలా ఎందుకు ఉన్నావు జగన్..? అని ప్రశ్నించారు.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే.. అది చేస్తాం.. ఇది చేస్తామని హెచ్చరిస్తున్నారు.. ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయంగా సమాధే అవుతావని హెచ్చరించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మరోవైపు, నారా లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు జేసీ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, ప్రజలు.. ఇలా అందరితో లోకేష్ మమేకం అవుతున్నారు.. బాగా చదువుకున్న వ్యక్తి.. ప్రజలతో అలా కలిసిపోయే వ్యక్తికి మంచి ఫ్యూచర్ ఉంటుందని తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇక, పెద్దారెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ.. ఇక్కడ వచ్చి తిరుగుతూనే ఉన్నారు.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లమని కోర్టు చెప్పింది.. కానీ, సమాచారం ఇవ్వకుండానే తిరుగుతున్నారని విమర్శించారు జేసీ.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో జేసీ చేసిన సంచలన వ్యాఖ్యలను తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
పులివెందులలో యాంకర్ శ్యామల పర్యటన.. అందుకే నా పయనం..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.. పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. పులివెందులలోని మెడికల్ కాలేజీని సందర్శించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేశారో అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయేందుకే నా పయనం అన్నారు.. మొదటిరోజు కావడంతో వేంపల్లిలోని గండి ఆంజనేయస్వామిని దర్శించి పులివెందులలోని మెడికల్ కాలేజీ ప్రాంతాన్ని పరిశీలించాం… ప్రజలకు వైద్యం, విద్య అందుబాటులో ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ మెడికల్ కాలేజ్ నిర్మించారని తెలిపారు.. వందలాది కోట్ల ఖర్చుపెట్టి బిల్డింగులు నిర్మిస్తే దేనికి పనికిరాకుండా చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. గత వైసీపీ ప్రభుత్వం 100 మెడికల్ సీట్లు అడిగితే కేంద్ర ప్రభుత్వం 50 సీట్లు మంజూరు చేసింది… కానీ, మంజూరు చేసిన 50 మెడికల్ సీట్లను కూడా కూటమి ప్రభుత్వం వెనక్కి పంపిందంటూ మండిపడ్డారు.. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆగిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల..
ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన..
ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాజిల్లాలకు మరో రెండు రోజులు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాలు యాక్టివ్ గా వుండటం, ఆవర్తనాల ప్రభావంతో సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారుల వేటను నిషేధించారు. అటు, పశ్చిమ బెంగాల్ దగ్గర నిన్న అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్ వైపు తరలిపోయి అల్ప పీడనంగా బలహీన పడుతోంది… వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తెలుగు రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించకుండానే తీరాన్ని దాటిపోయింది. నిన్న అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్ దగ్గర తీరాన్ని తాకి క్రమేపీ బలహీనపడుతూ బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. మరోవైపు, నైరుతి యాక్టివిటీ, ఆవర్తనాల ప్రభావంతో ఏపీలో దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. పల్నాడు, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో వచ్చే రెండురోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే చాన్స్ వుంది. ఇక, మిగిలిన ప్రాంతాల్లో చెదురు మదురు నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మాన్ సూన్ అసోసియేటెడ్ విండ్ గ్రేడియంట్ బలంగా వుంది. దీని ప్రభావంతో సముద్ర ఉపరితలంపై గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సాగరం కల్లోలంగా వుంది.
మహానాడు తుస్సుమంది.. అంబటి సెటైర్లు
కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు తుస్సుమంఇ అంటూ సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ప్రసంగం మొత్తం అభద్రతాభావం కనిపించింది.. కడప మహానాడు తుస్సుమంది.. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్ లను తీసుకువచ్చారు.. ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాల సమయంలో కూడా జగన్ ను తిట్టించటం కింద నవ్వుకోవటం.. మేం మీ మీద ఇలా మీ మీద మాట్లాడలేమా..? అని ప్రశ్నించారు.. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు.. మీ గృహ ప్రవేశానికి మీ చెల్లెళ్లను పిలిచారా..? మహానాడులో గావు కేకలతో మాట్లాడి సక్సెస్ అయ్యింది అని చెప్పుకుంటున్నారు.. లోకేష్ గారికి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.. మామీద కేసులు పెడుతున్నారు.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు..
బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం.. కానీ..
బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులను కోయకుండా సీఎం, డీజీపీ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. పండుగ ఎలా జరుపుకుంటారో తమకు అనవసరమని.. కానీ పశువులను కోస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తాము బాధ్యులం కాదని తేల్చిచెప్పారు. పశువుల రవాణాలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. పశువుల వాహనాలను పోలీసులు తూ తూ మంత్రంగా చెక్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ రవాణాను అడ్డుకుంటున్న తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు అడ్డుకుంటున్న వాహనాలను ఎంఐఎం కార్పొరేటర్లు గుండాల ప్రవర్తించి విడిపిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఇప్పటికే చాలా ఆవులు, ఎద్దులు సిటీలోకి వచ్చాయన్నారు. సీఎం రాష్ట్రానికి రాజు లాంటి వాడు.. ముఖ్యమంత్రి గోమాత ప్రేమికుడని ఎన్నికల సమయంలో గోమాతను పూజ చేయడం చూశానని రాజాసింగ్ చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో పాపం ఎవరు చేసిన అది సీఎం రేవంత్ రెడ్డికే తగులుతుందన్నారు. జూన్ 7న బక్రీద్ నాడు.. పాపంలో భాగస్వామి కావొద్దని సీఎం రేవంత్‌కు సూచించారు. ఆవులు, ఎద్దులు, దూడలు తీసుకొని వస్తున్నా వారిపై మీరు యాక్షన్ తీసుకోవాలని.. లేదంటే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు.
బీహార్ పర్యటనలో ప్రధాని మోడీకి బెదిరింపు.. ఒకరు అరెస్ట్
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం గురువారం బీహార్ చేరుకున్నారు. అయితే గురువారం భద్రతా సంస్థలకు వాట్సాప్ కాల్ చేసి మోడీని చంపేస్తామంటూ బెదిరింపు వచ్చింది. రంగంలోకి దిగిన భద్రతా అధికారులు.. భాగల్‌పూర్‌కు చెందిన సమీర్ రంజన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు వేరొక వ్యక్తి మొబైల్ నుంచి బెదిరించినట్లుగా గుర్తించారు. నిందితుడికి ఆస్తి వివాదం ఉండడంతో ఆ వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఈ ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రధాని మోడీ గురు, శుక్రవారాల్లో బీహార్‌లో పర్యటించారు. భాగల్పూర్ జిల్లా సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేషి గ్రామానికి చెందిన సమీర్ రంజన్.. 71 ఏళ్ల మంతు చౌదరి మొబైల్ ఫోన్ తీసుకుని.. భద్రతా సంస్థలకు ఫోన్ చేసి.. మోడీని చంపేస్తామంటూ బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మంతు చౌదరిని విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. దీంతో మరింత లోతుగా విచారిస్తే.. తన ఫోన్‌ను రంజన్ ఉపయోగించినట్లుగా తెలిపాడు. దీంతో రంజన్‌ను అరెస్ట్ చేశారు. మంతు చౌదరితో రంజన్‌కు ఆస్తి వివాదం ఉంది. ఈ నేపథ్యంలో మంతు చౌదరిని ఇరికించేందుకు ఈ ప్లాన్ చేసినట్లుగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ. 150 కోట్లు స్వాహా..!
హైదరాబాద్ నగరంలో మరొక భారీ మోసం వెలుగు చూసింది.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా 150 కోట్ల రూపాయలను కొట్టేశారు.. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సంస్థ కుచ్చు టోపీ పెట్టింది.. సెక్యూరిటీ బాండ్ల రూపంలో లాభాలు ఇస్తామని చెప్పి 1500 మంది కస్టమర్ల దగ్గర నుంచి 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు మోసగాళ్లు.. కాగా.. సెక్యూరిటీ సంస్థను ఇద్దరు దంపతులు నడుపుతున్నారు.. కొంతకాలం పాటు కొందరికి లాభాలు సైతం ఇచ్చారు. ఈ లాభాలను చూసి చాలామంది పెంగ్విన్ సంస్థను నమ్మి పెట్టు బడులు పెట్టారు.. జీడిమెట్ల గణేష్ నగర్ కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట ప్రాంతంలోని చాలామంది వ్యాపారస్థులు ఇందులో పెట్టుబడులు పెట్టారు. దాదాపు 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఈ సంస్థ దుకాణం ఎత్తివేసింది.. సంస్థ తమను మోసం చేసిందని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.. సంస్థ బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు..
ఆర్సీబీ టైటిల్ గెలిస్తే.. జూన్ 4న పబ్లిక్ హాలిడే ?
ఐపీఎల్ టైటిల్ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు ఈ సారి ఆర్‌సీబీకి సువర్ణావకాశం లభించింది. మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను ఓడించడం ద్వారా RCB నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది.పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ 9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ రేసులో మిగతా జట్లు ఉన్నా.. అందరి చూపు ఆర్సీబీ మీదే ఉంది. టైటిల్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఎంతగా ఎదురుచూస్తుందో.. ఫ్యాన్స్ అంతకన్నా ఎక్కువే ఆరాటపడుతున్నారు. కోహ్లీ కోసమే కోట్లాదిమంది అభిమానులు ఆర్సీబీ ఆడే మ్యాచ్ లను చూస్తున్నారు. ప్రతిసారి ఈ సాల కప్ నందే స్లోగన్ వినివిని విసిగిపోయారు. కానీ ఈ సారి మాత్రం కప్ ఆర్సీబీనే వరించేలా కనిపిస్తుంది. జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఏవిధంగా చూసినా ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. జూన్ 4న దేశవ్యాప్తంగా సెలెబ్రేషన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ ఆర్సీబీ ఫ్యాన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశాడు. జూన్3న ఆర్సీబీ కప్ కొడుతోంది, జూన్4న ప్రశాంతంగా సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హాలిడే ప్రకటించాలని లేఖలో కోరాడు. బెళగావి జిల్లాకు చెందిన శివానంద్ మల్లన్న అనే అభిమాని ఆర్‌సిబి ఐపిఎల్ గెలిచిన రోజును కర్ణాటక రాజ్యోత్సవం మాదిరిగానే ఆర్‌సిబి అభిమానుల పండుగగా అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరాడు. ముఖ్యమంత్రికి రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత మాయం చేశారు!
టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ముందే ఊహించని సమస్యల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన హార్డ్ డ్రైవ్ మాయమైన వ్యవహారం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్‌లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి పంపిన హార్డ్ డ్రైవ్ ఆఫీస్ బాయ్ రఘు ద్వారా చరిత అనే యువతికి అప్పగించబడింది. అయితే, ఆ తర్వాత చరిత కనిపించకుండా పోయింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు, చరితలు సినిమాకు నష్టం కలిగించే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా చెన్నైలో జరిగిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో కూడా విష్ణు ఈ ఘటనను ప్రస్తావించారు. “మా టీమ్ ఎంతో కష్టపడి ఈ సినిమాను ఒక ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దింది. ఇలాంటి కుట్రలు మమ్మల్ని ఆపలేవు. ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన పైరేటెడ్ కంటెంట్‌ను వినోదం కోసం ప్రసారం చేయవద్దని కోరుతున్నాను” అని విజ్ఞప్తి చేశారు. ఈ హార్డ్ డ్రైవ్ మాయం వెనుక మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ హస్తం ఉందని విష్ణు ఆరోపిస్తున్నారు. రఘు, మనోజ్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడని, చరిత కూడా మనోజ్ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి అని చెన్నైలో పేర్కొన్నారు. 45 రోజుల క్రితం హైవ్ స్టూడియోస్ నుంచి వచ్చిన హార్డ్ డ్రైవ్ పార్శిల్‌ను విష్ణు ఇంటి సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ సిబ్బంది అడ్డుకున్నారని, ఈ ఘటన వెనుక మనోజ్ కుటుంబం నుంచి కావాలనే కుట్ర జరిగిందని విష్ణు టీమ్ ఆరోపణలు చేస్తోంది. విష్ణు-మనోజ్ మధ్య చాలా కాలంగా కుటుంబ వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఆ వివాదాలు మరింత ముదిరాయని అనిపిస్తోంది. అయితే, మనోజ్ మద్దతుదారులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. “మనోజ్ ‘భైరవం’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి కుట్రలకు సమయం ఎక్కడిది?” అని వారు ప్రశ్నిస్తున్నారు.