Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం.. ప్రభుత్వానికి సిట్ లేఖ
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక లేఖను పంపింది. ఈ లేఖలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను సిట్ వివరించినట్టు సమాచారం. సుమారు వంద పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో, 2019–2024 మధ్యకాలంలో తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో చోటుచేసుకున్న అనేక తప్పిదాలను సిట్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. లడ్డూలో కల్తీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన అంశాలను కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. కేవలం తప్పిదాలనే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన సరిదిద్దే చర్యలు, పర్యవేక్షణా విధానాలపై కూడా సిట్ సూచనలు చేసింది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సిట్ పంపిన లేఖను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే అధికారికంగా స్పందించాలనే నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక అత్యంత సున్నితమైన అంశానికి సంబంధించినదైనందున, తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా అన్ని కోణాల్లో పరిశీలన జరుపుతున్నామని సమాచారం. అయితే, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఈ తరహా తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టడంతో పాటు, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ నోర్లు ఎందుకు మూత పడ్డాయి..?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం పాటించడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. సిట్ రిపోర్టు వచ్చాక ఇంతవరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన నీచులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పూర్తిగా చెంచాగా మారిపోయారని, సొంత పార్టీ నడుపుతున్నానన్న సంగతే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా వీరిద్దరూ వ్యవహరించారని ఆరోపించారు.

పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు.. చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు.. పని మాత్రమే కావాలి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉత్తరాంధ్ర పంచాయతీరాజ్ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తనకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదని, క్షేత్రస్థాయిలో నిజమైన పని మాత్రమే కావాలని తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరు పూర్తి నిబద్ధతతో పని చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్ వంటి కీలక పథకాల అమలులో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయినా, పనిలో అలసత్వం చూపించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సోషల్ ఆడిట్ ప్రక్రియను కూడా మొక్కుబడిగా కాకుండా పక్కాగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ చేరాల్సిందేనని, అలా జరగకపోతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.. ఇక, తన వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, సిఫార్సులు ఉండవని పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ప్రతి అధికారి నిబంధనల ప్రకారమే పని చేయాలన్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది అధికారులు ఇప్పటికీ పాత నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ విధానాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వ్యవహారాలను ఇకపై సహించబోమని హెచ్చరించారు. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు తావులేకుండా నిబంధనల మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనిలో అలసత్వాన్ని అస్సలు సహించబోమని మరోసారి స్పష్టం చేశారు.

జనసేన ఎమ్మెల్యే మరో వీడియో లీక్‌.. ఏకంగా అసెంబ్లీ హాల్‌లో నుంచే వీడియో..
రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారంలో తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈసారి లీక్ అయిన వీడియోలో ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే మహిళతో వీడియో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ హాల్‌లో చర్చలు కొనసాగుతుండగానే ఎమ్మెల్యే శ్రీధర్ తన మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న దృశ్యాలు బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభ వేదికలో ఇటువంటి ప్రవర్తన ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనతో ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న జనసేన ఎమ్మెల్యే వ్యవహారం మరింత ముదిరింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడగా, తాజాగా అసెంబ్లీ హాల్‌కు సంబంధించిన వీడియో లీక్ కావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఒక్క చుక్క వదులుకోం.. పోలవరం, నల్లమల సాగర్‌కు నో పర్మీషన్..
కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల ఈ భేటీ సాగింది. ఈ అంశంపై తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ  రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించాలని ప్రతిపాదించామన్నారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి.. కృష్ణా, గోదావరి జలాలపై అనేక అంశాలు ఉన్నాయి, అందుకే సమావేశానికి వచ్చామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదని.. తదుపరి సమావేశం సీడబ్ల్యూసీ నిర్ణయిస్తుందన్నారు. అనంతరం.. ఈ అంశంపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. “ఒక్క చుక్క నీరు కూడా వదులుకోం. ఢిల్లీలో జరిగిన మీటింగ్ గురించి హరీష్ రావు తెలుసుకుని మాట్లాడాలి.. మన నది జలాలను కాపాడుకోవడానికి ఎవరితోనైనా చర్చలకు సిద్ధం.. కానీ చుక్క నీరు కూడా వదులుకునేది లేదు.. తెలంగాణ అధికారులు.. నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టడానికి ఒప్పుకోమని స్పష్టం చేశారు.. ఇంటర్ స్టేట్ ఇష్యూలు అజెండాలో పెట్టాలని కేంద్రానికి చెప్పారు. పోలవరం.. నల్లమల సాగర్ కి అనుమతి లేదని కేంద్ర మంత్రి నాకు నిన్న లేఖ రాశారు.. ఇవాళ జరిగిన మీటింగ్ లో కూడా సీడబ్ల్యూసీ ఇదే చెప్పింది.. పదేళ్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కట్టిన ప్రాజెక్టు కూలింది.. ఆ నాయకులు సిగ్గుపడాలి.. పదేళ్లలో slbc పూర్తి చేయలేదు.. డిండి ప్రాజెక్టు పూర్తి చేయలేదు.. పదే పదే అబద్ధాలు చెప్పి… నిజం చేయాలని అనుకుంటున్నారు.. పదేళ్ల లో కంటే… ఈ రెండేళ్లలో ఎక్కువ నీటి వినియోగం, వరి దిగుబడి వచ్చింది.” అని వ్యాఖ్యానించారు.

ఆ ఫ్రస్టేషన్‌లో ఇలా చేశాను.. వారికి కౌశిక్ రెడ్డి క్షమాపణలు
తెలంగాణ ఐపీఎస్‌ అధికారుల సంఘానికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే తనకు గౌరవం ఉందని.. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. “నేను ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు.. రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా కుటుంబం పై రాజకీయ కక్షకు తెగబడ్డారు.. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం.. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు.. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను.అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు.. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను.. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నాను” అని వీడియోలో చెప్పారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య.. రేపు ప్రమాణస్వీకారం..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా రేపు సాయంత్రం 5 గంటలకు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. ఈ రోజు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎన్సీపీ నేతలు సమావేశమయ్యారు. సునేత్రా పవార్‌కు అత్యున్నత పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆమెకు ఎక్సైజ్, క్రీడా మంత్రిత్వ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అజిత్ పవార్ వద్ద ఉండేది. అయితే, మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఆర్థిక శాఖ తాత్కాలికంగా ఫడ్నవీస్ వద్దే ఉంది. ఆ తర్వాత దీనిని ఎన్సీపీకి అప్పగించే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 7న జరగనున్న పూణే జిల్లా పరిషత్ ఎన్నికలక ముందు పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు సునేత్ర పవార్‌ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని పార్టీ సీనియర్ నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై పవార్ కుటుంబంలో చర్చలు జరిగాయని వర్గాలు తెలిపాయి. ఈ చర్చల అనంతరం, అత్యున్నత పదవి చేపట్టడానికి సునేత్ర అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణస్వీకారం శనివారం జరిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం ఫడ్నవీస్ చెప్పారని ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ అన్నారు.

కాంగ్రెస్ ‘‘ఆధునిక ముస్లిం లీగ్’’.. అన్సారీ ‘‘గజినీ’’ కామెంట్స్‌పై బీజేపీ..
కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ విదేశీ ఆక్రమణదారులను ప్రేమిస్తుందని, హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తుందని బీజేపీ ఆరోపించింది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ‘‘గజనీ’’పై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. విదేశీ ఆక్రమణ, దోపిడీదారులపై అన్సారీకి ఉన్న ప్రేమ అతని ‘‘వికృత మనస్తత్వాన్ని’’ చూపిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంషు త్రివేది అన్నారు. చరిత్ర పుస్తకాల్లో విదేశీ ఆక్రమణదారులు, దోపిడీదారులుగా పేర్కొన్న గజినీ మహ్మద్‌ వాస్తవానికి ‘‘భారతీయ దోపిడీదారుడు‘‘అని అన్సారీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వివాదాస్పదమైంది. గజినీ, లోడీ వంటి వారు బయట నుంచి రాలేదని, వారందరూ భారతీయులే అని ఒక ఇంటర్వ్యూలో అన్సారీ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ‘‘సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి, అపవిత్రం చేసిన గజినీని కీర్తించడం, ఢిల్లీ అల్లర్ల నిందితులు షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్‌లను యువకులు అని పిలవడం కాంగ్రెస్ ఎకో సిస్టమ్‌కు అలవాటే , వారు సోమనాథ్ ఆలయానికి వ్యతిరేకం, ఔరంగాజేబు లాంటి వారి నేరాలను కప్పిపుచ్చుతారు, హిందువులపై జరిగిన అఘాయిత్యాలను పట్టించుకోరు. వారికి భారత్, హిందువులు అంటే ద్వేషం’’ అని అన్నారు.

ఆ కేసులో అరెస్టైన ప్రియుడు.. జైలుకెళ్లి సర్ ప్రైజ్ చేసిన ప్రియురాలు..
ప్రేమ కోసం ఏదైనా చేస్తామన్నట్టుగా ఉంది కొందరి ప్రేమికుల తీరు. ఓ యువతి తన ప్రియుడిని కలిసేందుకు జైలుకెళ్లింది. ఆ ప్రియుడు డ్రగ్స్ కేసులో అరెస్టై జైళ్లో ఉన్నాడు. తన బాయ్ ఫ్రెండ్ బర్త్ డేకు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న ప్రియురాలు జైలుకెళ్లింది. జైలులో ప్రియుడిని కలిసిన ప్రియురాలు రీల్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. తర్కేశ్వర్‌ అనే యువకుడు డ్రగ్స్‌ కేసులో అరెస్టై రాయ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని బర్త్ డే రోజున ఆశ్చర్యపర్చాలని ప్రేయసి భావించింది. జైలు అధికారుల అనుమతితో ప్రియుడ్ని కలిసింది. ప్రియురాలిని చూసిన ప్రియుడు ఆనందంలో మునిగిపోయాడు. అలాగే ఆ జైలులో రీల్‌ చిత్రీకరించింది. ఈ వీడియో క్లిప్‌ను ఆ యువతి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఓవైపు ఐటీ దాడులు.. మరోవైపు రివాల్వర్‌తో కాల్చుకుని కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్‌ ఆత్మహత్య..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ (CJ Roy) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్న సమయంలోనే ఈ విషాదకర సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న తన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కంపెనీ పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో డాక్టర్ సీజే రాయ్ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ వ్యవహారంపై అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, డాక్టర్ సీజే రాయ్ దక్షిణ భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన కాన్ఫిడెంట్ గ్రూప్, కర్ణాటక మరియు కేరళలో వందలాది నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టి, రియల్ ఎస్టేట్ రంగంలో విశేష స్థానం సంపాదించింది. సంస్థకు యూఏఈలో కూడా కార్యకలాపాలు ఉన్నాయి.

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. ఫిబ్రవరి 1 నుండి న్యూ రూల్స్.. ఈ సేవలు బంద్
మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారా? సినిమా టిక్కెట్లు, ప్రయాణం లేదా డిజిటల్ చెల్లింపులపై అందించే ప్రయోజనాలకు అలవాటు పడ్డారా? అయితే మీకు బిగ్ షాక్. ఫిబ్రవరి 1, 2026 నుండి, ICICI బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నియమాలలో కీలక మార్పులు చేయబోతోంది. ఈ మార్పుల ప్రకారం, కొన్ని ప్రసిద్ధ ఫీచర్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. మరికొన్నింటిపై కొత్త షరతులు, అదనపు ఛార్జీలు విధించనున్నారు. ఇది లక్షలాది మంది కార్డ్ హోల్డర్ల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని బ్యాంక్ చెబుతోంది. ICICI బ్యాంక్ తన కొన్ని కార్డులపై అందించే ఉచిత సినిమా టికెట్ ప్రయోజనాన్ని ముగించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుండి, BookMyShow ద్వారా ICICI బ్యాంక్ ఇన్‌స్టంట్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్, ICICI బ్యాంక్ ఇన్‌స్టంట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్‌పై అందించే కాంప్లిమెంటరీ మూవీ ప్రయోజనం నిలిచిపోనుంది. దీని అర్థం ఈ కార్డులు ఇకపై ఉచిత లేదా డిస్కౌంట్ సినిమా టిక్కెట్ల ప్రయోజనాలను అందించవు.

గూగుల్‌ సంచలన ప్రకటన.. ఇక అన్నీ క్రోమ్‌ లోనే..
ఇంటర్నెట్‌ను మనం ఉపయోగించే విధానం పూర్తిగా మారబోతోందా..? అనే ప్రశ్నకు గూగుల్ తాజా ప్రకటన “అవును” అనే సమాధానం ఇస్తోంది. టిక్కెట్లు బుక్ చేయడం నుంచి ఆన్‌లైన్ ఫారమ్‌లు నింపడం, షాపింగ్ చేయడం వరకు.. ఇకపై ఈ పనులన్నీ గూగుల్ క్రోమ్ స్వయంగా చేయగలదు. దీనికి కారణం.. క్రోమ్‌లోకి వస్తున్న కొత్త AI ఏజెంట్ ఫీచర్. ఇప్పటివరకు ఒక వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేయాలంటే ఫారమ్ నింపాలి, ఆప్షన్లు ఎంచుకోవాలి, పేమెంట్ చేయాలి. ఇవన్నీ మనమే చేయాల్సి వచ్చేది. కానీ, గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో, మీరు కేవలం ఒక ఆదేశం ఇస్తే చాలు.. మిగతా పని అంతా క్రోమ్ చూసుకుంటుంది. ఉదాహరణకు, ఈ వెబ్‌సైట్ నుంచి నా ట్రైన్ టికెట్ బుక్ చేయి అని క్రోమ్‌కు చెప్పగలిగితే.. AI పేజీని అర్థం చేసుకుని, బటన్‌లను గుర్తించి, అవసరమైన వివరాలు పూరించి, ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని టెక్ ప్రపంచంలో AI ఏజెంట్ బ్రౌజింగ్ లేదా ఆటో బ్రౌజ్ అని పిలుస్తున్నారు. ఇప్పటికే పెర్ప్లెక్సిటీ సంస్థ తీసుకొచ్చిన కామెట్ బ్రౌజర్, అలాగే OpenAI యొక్క ప్రయోగాత్మక బ్రౌజర్ ATLAS ఈ కాన్సెప్ట్‌తో వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు గూగుల్ కూడా వెనుకబడి ఉండకుండా, తన శక్తివంతమైన జెమిని AIని నేరుగా క్రోమ్‌లోకి తీసుకొస్తోంది.

వరల్డ్ కప్‌కు అమెరికా జట్టు ప్రకటన.. కెప్టెన్ భారతీయుడే..
టీ20 వరల్డ్ కప్ సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని టీంలు తమ ప్లేయర్స్ జాబితాను ప్రకటించాయి. తాజాగా యూఎస్‌ఏ టీం మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు మోనాంక్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత ప్రపంచకప్‌లో ఆడిన 15 మందిలో 10 మంది ఈసారి ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అంటే గత అనుభవాన్ని ఈసారి పూర్తిగా ఉపయోగించుకోవాలన్నదే అమెరికా ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే.. ఈ జట్టు కెప్టెన్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. కెప్టెన్ మోనాంక్ దిలీప్‌భాయ్ పటేల్ భారతదేశంలో జన్మించిన అమెరికన్ క్రికెటర్. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. మోనాంక్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. వికెట్ కీపర్ గా 2019లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ అమెరికన్ క్రికెట్ వృద్ధిలో కీలక వ్యక్తిగా నిలిచాడు. అతని నాయకత్వంలో, USA 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై గ్రూప్-స్టేజ్ విజయంతో సహా మైలురాయి విజయాలను నమోదు చేసింది. అయితే.. ఈ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌నే అమెరికాకు పెద్ద పరీక్షగా మారనుంది. ముంబయిలో జరిగే తొలి మ్యాచ్‌లో సహా ఆతిథ్య దేశం, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్‌తోనే అమెరికా తలపడుతుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. అమెరికా క్రికెట్ విషయంలో గత ఏడాది ఒక పెద్ద వివాదం చోటు చేసుకుంది. ఐసీసీ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిందన్న కారణంతో సెప్టెంబర్ 23న ఐసీసీ, యూఎస్‌ఏ క్రికెట్‌ను సస్పెండ్ చేసింది. దాంతో ఈసారి జట్టు ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఐసీసీతో పాటు యూఎస్ ఒలింపిక్ అండ్ ప్యారాలింపిక్ కమిటీ కలిసి ఒక కొత్త ఎంపిక విధానాన్ని రూపొందించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా, పూర్తిగా ప్రతిభ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. ఎంపిక కమిటీ సభ్యులు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని ముందే ప్రకటించగా, ప్రత్యేక అధికారి ఈ ప్రక్రియను పర్యవేక్షించాడు. గత ప్రపంచకప్‌లో అమెరికా చేసిన ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేరు. పూర్తి సభ్య దేశమైన పాకిస్థాన్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, సూపర్ ఎయిట్ దశకు కూడా చేరింది. అదే ధైర్యంతో ఈసారి కూడా బరిలోకి దిగుతోంది.

Exit mobile version