పేర్ని జయసుధకు కోర్టులో ఊరట..
మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టులో ఊరట దక్కింది.. అయితే, ఇదే సమయంలో.. విచారణకు సహకరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య జయసుధ మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. గత వారం విచారణ ముగించిన జిల్లా కోర్టు.. విచారణను వాయిదా వేసిన విషయం విదితమే.. అయితే, బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ఈ కేసులో విచారణకు సహకరించాలని జయసుధకు ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఏ2 మేనేజర్ మానస తేజ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మరోవైపు.. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు.. మొదట 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ రూ.1.68 కోట్ల జరిమానా విధించగా.. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. మొత్తంగా గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని చెబుతున్నారు అధికారులు.. అయితే, ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మాజీ మంత్రి పేర్నినాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం విదితమే.. కొన్నిసార్లు పేర్నినాని కనిపించినా.. ఆయన ఫ్యామిలీ మొత్తం అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న విషయం విదితమే..
ఏపీలో భారీగా లిక్కర్ సేల్స్.. రూ.6,312 కోట్లు తాగేశారు..!
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయని ఎక్సై్జ్ శాఖ చెబుతోంది.. ఏపీ వ్యాప్తంగా భారీగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్‌బై చెప్పి ప్రైవేట్ వైన్ షాపులకు అనుమతి ఇచ్చిన విషయం విదితమే.. టెండర్లకు ఆహ్వానించి.. ఆ తర్వాత లిక్కర్ షాపులకు కేటాయించగా.. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రైవేట్ లిక్కర్ షాపులు అందుబాటులోకి వచ్చాయి.. అయితే, అక్టోబర్ 16వ తేదీ నుంచి నిన్నటి వరకు అంటే డిసెంబర్ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.. ఈ 75 రోజుల కాలంలో 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు సాగగా.. 83,74,116 కేసుల మద్యం అమ్మినట్టు చెబుతున్నారు. బార్లు, వైన్ షాపులకు కలిపి ఈ అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.. ఇక, డిసెంబర్ 31, జనవరి 1కి సంబంధించి వచ్చిన ఇండెంట్ బట్టి ఈ రోజుకి ఆరోజు సరుకు పంపుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. డిసెంబర్ 30, 31 తేదీలతో పాటు.. 2025 జనవరి 1వ తేదీనా మద్యం అమ్మకాలు మరింత భారీగా సాగుతాయనే అంచనాలు వేస్తున్నారు..
మహిళలకు గుడ్‌న్యూస్.. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.. ఇప్పటికే కొన్ని పథకాలను అమల్లోకి తెచ్చిన సర్కార్.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఫోకస్ పెట్టింది.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టింది. ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు.. మొత్తంగా ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.. ఈ పథకం అమలు చేస్తే చేయాల్సిన పనులపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు..కాగా, మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలులో ఉన్న రాష్ట్రాలలో పర్యటించడానికి ప్రభుత్వం.. మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే.. ఏపీ రవాణా శాఖ మంత్రి చైర్మన్‌గా.. హోంమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఈ కమిటీ సభ్యులుగా చేర్చింది ప్రభుత్వం.. ఈ కమిటీ కన్వీనర్ గా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని నియమించింది.. కమిటీ సమావేశాలు నిర్వహించడం, కమిటీ ఇచ్చే సమాచారం పొందుపరచడం వంటి బాధ్యలను కన్వీనర్‌కు అప్పగించింది.. సాధ్యమైనంత త్వరగా సదరు రాష్ట్రాల్లో పర్యటనలు ముగించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే..
టమాటా ధర భారీగా పతనం.. రైతుల గగ్గోలు..
టమాటా ధర ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా మార్కెట్ కిలో టమాట రూపాయి, రూపాయి పావలా కూడా పలకని పరిస్థితి. 25 కిలోలు ఉన్న టమాటా బాక్సు 30 నుంచి 40 రూపాయలు లోపే అమ్ముకోవాల్సి వస్తోంది. పోనీ పంట ఎక్కువగా వస్తుంది.. ధర తగ్గిందా అంటే.. అదీ లేదు. వ్యాపారులకు సరిపడా టమాటా సరుకు రావడం లేదు. రేపో మాపో మార్కెట్ కూడా మూసివేయాల్సి వస్తోంది. అయినా టమాటాకు ధర మాత్రం దక్కడం లేదు. పంట వున్న ఈ వారం రోజుల్లో, పది రోజుల్లో అయినా కాస్త మంచి ధరకు అమ్ముకుందామంటే అతి తక్కువ ధర ఉంది. కనీసం టమాటా కోత కూలీలు, ఖర్చులు అయినా రావడం లేదని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో ప్రధానంగా సాగుచేసే పంటల్లో టమాటా ఒకటి. జిల్లాలో సుమారు 40 నుంచి 50 వేల ఎకరాల్లో టమాటా సాగుచేస్తారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, చిప్పగిరి, డోన్, ప్యాపిలి మండలంలో టమాట ఎక్కువగా సాగు చేస్తారు. ఏపీలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ టమాటా ఎక్కువగా సాగు చేస్తారు. ఎకరా టమాటా సాగుకు 30 వేలు పెట్టుబడి ఖర్చు అవుతుంది. కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ నుంచే ఫిబ్రవరి వరకు టమాటా దిగుబడి బాగా ఉంటుంది. పత్తికొండ, ప్యాపిలి, డోన్ , బిల్లేకల్ ప్రాంతాలలో ప్రత్యేకంగా టమాటా మార్కెట్లు ఉన్నాయి. కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు ఎక్కువగా రవాణా అవుతుంది. కర్నూలు జిల్లాలో ఒక్క పత్తికొండ మార్కెట్ నుంచే రోజుకు 200 టన్నుల టమాటా రవాణా అవుతుంది. పత్తికొండ, దేవనకొండ, ఆస్పరి, తుగ్గలి, మద్దికెర, ఆలూరు మండలాల నుంచి పత్తికొండ మార్కెట్ కు టమాటా తీసుకువస్తారు. టమాటా రవాణాకు దూరాన్ని బట్టి గంపకు 10 నుంచి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. టమాటా ధర స్థిరంగా వుండే రోజులు చాలా తక్కువ. రైతు నుంచి కొనుగోలు చేసే ధర తక్కువ.. వినియోగదారునికి అమ్మే ధర ఎక్కువగా ఉంటుంది. టమోటా ధర కిలో ఒక్కోసారి రూపాయి కూడా వుండదు.
జనసేనలో చేరిన జయమంగళ వెంకటరమణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి వరకు అధికారాన్ని చలాయించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఈ రోజు జనసేన పార్టీలో చేరారు వైసీపీ నేతలు.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.. వారికి పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.. ఇక, కైకలూరు నియోజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ ఈ మధ్యే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. మరోవైపు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి, శ్రీమతి రాధని కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పవన్ కల్యాణ్.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎం.ఎస్.ఐ.డి.సి. ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస రావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తదితరలు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను సీఎం అవుతానన్నారు. తన సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడున్న వాళ్ళు వందల కోట్లు ఖర్చుపెట్టి లక్షల కోట్లు దోచుకున్నారు.. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ఆయన మాటలతో వందల మందిని బలి చేశారని పేర్కొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీలు వేరే పార్టీ తరఫున పోటీ చేయకండి.. పార్టీలకు అతీతంగా ఏకగ్రీవం చేసుకోండని సూచించారు. చాలా మంది కులాన్ని వాడుకొని పార్టీలు లాభం పొందారు.. బీసీలను రెండు మూడు కులాల వారు అనగదొక్కారని కేఏ పాల్ తెలిపారు. రెడ్డిలు 12 మంది సీఎంలు అయ్యారని అన్నారు. కేసీఆర్ పేరు మీద లేదా పార్టీ మీద పోటీ చేద్దామనుకునే వారు వారికంటే దరిద్రులు ఇంకా ఎవరు లేరని చెప్పారు. కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని కేఏ పాల్ వెల్లడించారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కేఏ పాల్ కౌంటర్ ఇచ్చారు. పూలమ్మి.. పాలమ్మి అంత సంపాదించారా అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. హైడ్రా పెద్ద డ్రామా అని ఆరోపించారు. రేవంత్, కేసీఆర్ తోడు దొంగలు అని దుయ్యబట్టారు. కేటీఆర్, రేవంత్ కొట్టుకోవడం.. తిట్టుకోవడం పెద్ద డ్రామానేనని కేఏ పాల్ అన్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్‌ఆర్, ఫ్లైఓవర్‌లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు, క్లబ్‌లు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని.. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. మైనర్ డ్రైవింగ్ చెస్తే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు రేపు రాత్రి 11నుండి జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మరోవైపు.. నగరంలోని 172 రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై మంగళవారం రాత్రి 11 గంటల నుండి నూతన సంవత్సర వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు చెప్పారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ముందే డ్రగ్స్ కలకలం.. ఓ పబ్‌లో డ్రగ్స్ పార్టీ
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మరోసారి డ్రగ్స్ మహమ్మారి వెలుగు చూసింది. న్యూ ఇయర్ టార్గెట్ గా విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతోంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకల కోసం క్రాక్ అరేనా అనే పబ్ డ్రగ్స్ పార్టీ అరెంజ్ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని ఓ ఈవెంట్‌లో డీజే పార్టీలో డ్రగ్స్ లభించింది. పార్టీకి వచ్చిన 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. గచ్చిబౌలిలోని క్రాక్ అరేనా పబ్‌లో బెమ్ బూమర్ షో సందర్భంగా నిన్న వీరంతా అటెండ్ అయ్యారు. తనిఖీల్లో ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. నిందితులను గచ్చిబౌలి పోలీసులకు టీజీ న్యాబ్ పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెమ్ బూమర్ ప్రముఖ జర్మన్ డీజే ప్లేయర్.. ఇతని షోలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా.. ఈనెల 27న కోల్‌కతా, 28న ఢిల్లీలో షోలు జరిగాయి. ఆదివారం (29న) హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగింది. ఈరోజు గోవాలో నిర్వహిస్తున్నారు. జనవరి 4న బాలిలో బెమ్ బూమర్ షోలు జరుగనున్నాయి
అతిషిని తాత్కాలిక సీఎం అనడంపై వీకే.సక్సేనా అభ్యంతరం.. సీఎంకు లేఖ
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. త్వరలో హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ ఆప్ ఎన్నికలకు రెడీ అయిపోయింది. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తోంది. ఇక ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు నెలకు రూ.2,100 సాయం, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం ప్రకటించారు. తాజాగా సోమవారం అర్చకులకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం ప్రకటించారు. అయితే సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అతిషి కేవలం తాత్కాలిక ముఖ్యమంత్రి అని.. ఎన్నికల్లో గెలిచాక తిరిగి ముఖ్యమంత్రి తానేనని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అతిషిని తాత్కాలిక సీఎం అని అనడం అవమానకరం అని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు. ఈ మేరకు అతిషికి రాసిన లేఖలో ఎల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్య రాజ్యాంగ విలువలకు, పదవి గౌరవానికి భంగం కలిగించేలా ఉందని లేఖలో విమర్శించారు. “ఈ వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా భావించాను. బాధపడ్డాను. ఇది మీకు మాత్రమే కాదు. భారత రాష్ట్రపతికి, ఆమె నియమించిన ఆమె ప్రతినిధిగా నాకు కూడా అవమానం. లెఫ్టినెంట్ గవర్నర్‌గా నేను ఆందోళన చెందుతున్నాను.”అని లేఖలో వీకే. సక్సేనా పేర్కొన్నారు.
విదేశీ టూర్‌కు రాహుల్.. బీజేపీ ఘాటు విమర్శలు
కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. కొత్త ఏడాదికి ముందు రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. అయితే రాహుల్ విదేశీ పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశంలో సంతాప దినాలు జరుగుతుండగా.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విదేశాలకు వెళ్తారా? అంటూ బీజేపీ ధ్వజమెత్తింది. మన్మోహన్ చనిపోయి కొన్ని గంటలైనా గడవక ముందే విదేశాలకు ఎలా వెళ్తారంటూ బీజేపీ నిలదీసింది. మన్మోహన్‌కు సంతాపం వ్యక్తం చేయడం కంటే.. రాహుల్‌కి న్యూఇయర్ వేడుకలే ఎక్కువైపోయాయని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు. గాంధీ, కాంగ్రెస్ కుటుంబాలు సిక్కులను ద్వేషిస్తున్నాయని ఆరోపించారు.
అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్‌తోజాయింట్ వెంచర్‌కు గుడ్ బై..
అదానీ గ్రూపునకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మార్ షేర్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. విల్మార్ లిమిటెడ్‌లో అదానీ గ్రూప్ తన వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తోందని చాలా కాలంగా బలమైన చర్చ జరిగింది. ఈరోజు ఈ అంశానికి ఆమోదం కూడా లభించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అదానీ విల్మార్ లిమిటెడ్ నుంచి నిష్క్రమించాలని అదానీ గ్రూప్ తన విక్రయాలను రెండు దశల్లో పూర్తి చేస్తుంది. అదానీ విల్‌మార్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మొత్తం వాటా 44 శాతం కలిగి ఉంది. డిసెంబర్ 30న ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందం ప్రకారం.. మొదటి దశలో.. అదానీ విల్మర్‌లో 31.06% వాటాను విల్మర్ ఇంటర్నేషనల్ పూర్తి యాజమాన్య సంస్థకు విక్రయించనుంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని 13% వాటాను బహిరంగ మార్కెట్‌లో అమ్మనుంది. ఇదిలా ఉండగా.. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో అదానీ విల్మార్ షేరు ధర రూ.329.50 స్థాయికి చేరుకుంది. గత రెండేళ్లలో కంపెనీ షేర్ల ధరలు 46 శాతం క్షీణించాయి. మరోవైపు.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఈరోజు 7 శాతం పెరిగి రూ.2593.45 స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే.. ఈ విక్రయం పూర్తయిన తర్వాత.. అదానీ కమోడిటీ నామినేట్ చేసిన డైరెక్టర్లు ఎమ్ఎమ్‌జీజీ కంపెనీ బోర్డు నుంచి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో.. కంపెనీ పేరు కూడా మారుతుంది. కాగా.. భారత వంట నూనెల మార్కెట్‌లో గణనీయ శాతం కలిగిన అదానీ విల్మర్, ఫార్చూన్ బ్రాండ్ పేరిట వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్యాకేజ్డ్ వంట సరకులను ఈ కంపెనీ అమ్ముతోంది.
నా మనసుకు బాధ కలిగించవద్దు: ఫ్యాన్స్‌కి యశ్ షాక్
రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు జనవరి 8. అయితే ఆ రోజున తన పుట్టినరోజు జరుపుకోనని ఆయన ఒక పోస్ట్ చేశారు. ఈ సారి కూడా తన పుట్టినరోజు జరుపుకోనని యష్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. దీని గురించి ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. అలాగే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే అభిమానులు అందరూ ఆరోగ్యం, భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని యష్ లెటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనటం కంటే అభిమానులు వారి గొప్ప లక్ష్యాలను చేరుకుంటున్నారని తెలిసి ఎంతో ఆనందపడతానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. యష్ తన అభిమానులను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో ప్రేమను వ్యక్త పరిచే విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో యష్ పుట్టినరోజు సందర్భంగా.. కర్ణాటకలో గదగ్ జిల్లాలో ముగ్గురు అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో యష్ ప్రమాదంలో చనిపోయిన అభిమానుల కుటుంబాలను ప్రత్యేకంగా వెళ్లి కలిసి నివాళులు అర్పించటమే కాకుండా, ఆ కుటుంబాలకు మద్దతుగా ఉంటామని తెలియజేశారు. ఈ ఘటన తర్వాత తనకు బ్యానర్స్‌ను కట్టటం, ప్రమాదకరమైన బైక్ ర్యాలీలలో పాల్గొనటం, నిర్లక్ష్యపు సెల్ఫీలు తీసుకోవటం మానుకోవాలని యష్ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు చేయటమనేవి.. నిజమైన అభిమానాన్ని చూపినట్లు కాదని ఆయన పేర్కొన్నారు. ‘మీరు నా నిజమైన అభిమాని అయితే మీ పనిని మీరు శ్రద్ధగా చేయండి, మీ జీవితం మీదే, సంతోషంగా ఉండండి, విజయవంతంగా ముందుకెళ్లండి’ అని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు యష్ రిక్వెస్ట్ చేశారు.
వెంకీ మామ తగ్గట్లేదు.. మరో సాంగ్ వదిలాడు!
వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబోలో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మొదటి రెండు పాటలు చార్ట్ బస్టర్ కావడంతో థర్డ్ సింగిల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో, ప్రోమో థర్డ్ సింగిల్ కోసం చాలా క్యురియాసిటీని క్రియేట్ చేసింది. ఫైనల్ గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫెస్టివ్ బ్యాంగర్ థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పొంగల్ స్ఫూర్తిని క్యాప్చర్ చేసింది. వెంకటేష్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ వోకల్స్ తో అదరగొట్టారు. భీమ్స్ DJ అవతార్ ఆలాపనతో పాట ప్రారంభమైయింది, జనవరి చలి వాతావరణం, రంగోలీల వంటి సంక్రాంతికి ముందు జరిగే ఉత్సవాలతో సీన్ ని అద్భుతంగా సెట్ చేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎనర్జీ అదిరిపోయింది. ఈ పాట రూరల్ పొంగల్ వేడుకలను అందంగా ప్రజెంట్ చేసింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పండగ ప్రాముఖ్యతను, ఐక్యత, వేడుకలను అద్భుతంగా వర్ణించింది. వెంకటేష్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ట్రాక్‌కి ఎనర్జిటిక్ టచ్‌ని యాడ్ చేసింది, వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో, మయిపిలో రోహిణి సోరట్‌లు తమ డైనమిక్ వోకల్స్ ఆకట్టుకున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతమైన పండుగ మూడ్‌కు పెర్ఫెక్ట్ గా వుంది, వెంకటేష్, ఇద్దరు హీరోయిన్స్ సాంప్రదాయ వస్త్రధారణలో ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. గ్రామీణ సంస్కృతిని వర్ణించే గ్రాండ్ సెట్, సాంగ్ కి కలర్ ఫుల్ వైబ్‌ని యాడ్ చేసింది, పొంగల్ ఉత్సవాల్లో ఆడియన్స్ ని ముంచెత్తుతుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.