NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కృష్ణా నదిలో ఇదే రికార్డు ఫ్లడ్‌.. అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు..
అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కరకట్ట దగ్గర అవుట్ స్లూయుజ్ గండిని పూడ్చడానికి జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 11.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి వస్తుంది. ఇది కృష్ణానది చరిత్రలోనే అతి ఎక్కువ ఫ్లడ్ అన్నారు.. పరిపాలనాదక్షుడు చంద్రబాబు సీఎంగా ఉండటంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో జలవనరుల శాఖ తీవ్ర నిర్లక్ష్య ఫలితమే బుడమేరుకు వరద అన్నారు.. ఇవాళ రాత్రికి బుడమేరుకు పడిన మూడు గండ్లను పుడుస్తామన్న ఆయన.. ఇందు కోసం అధికారులు తీవ్రంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. కరకట్టపై మంతెన సత్యనారాయణ రాజు బిల్డింగ్ వద్ద షట్టర్ కి గ్రీజ్ కూడా పెట్టలేదని విమర్శించారు.. ప్రకాశం బ్యారేజీ గేట్లకు బొట్లు తగిలి గేట్లు కొంత దెబ్బతిన్నాయన్నారు. గేట్ల నిపుణు మరమత్తులు చేయనున్నారు. ప్రస్తుతానికి గేట్లు వలన ఇబ్బంది లేదన్నారు. అతి తక్కువ గంటల్లో భారీగా వర్షం పడింది. వరద ప్రభావం లేని అధికారులను విజయవాడకి తెప్పిస్తున్నాం అన్నారు మంత్రి నిమ్మల.. చుట్టూ పక్కల నగరాల నుంచి ఫుడ్ ప్యాకెట్లను రప్పిస్తున్నాం. ప్రకాశం బ్యారేజీకి ఒకేసారి నాలుగు బోట్లు గుద్దుకోవడం వెనుక కుట్ర కోణం లేకపోలేదు అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

పార్కింగ్ స్పాట్‌గా మారిన బెజవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్..
కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు, వరదలు చూస్తున్న బెజవాడ వాసులు ఇప్పుడు తమ వస్తువులను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.. లక్షలు పోసి కొనుగోలు చేసిన కార్లను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిపోయింది.. ఇప్పటికే వందలాది కార్లు.. ఇతర వాహనాలు నీటమునిగి పోగా.. మిగతా వారు తమ కార్లను, వాహనానుల కాపాడుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.. అయితే, ఇప్పుడు బెజవాడ వాసులకు దుర్గడుఇ ఫ్లైఓవర్‌ పార్కింగ్‌ స్పాట్‌గా మారిపోయింది.. ఫ్లైఓవర్‌పై ఇరువైపులా వందలాది కార్లు, ఇతర వాహనాలను పార్క్‌ చేశారు.. అంతేకాదు.. పార్క్ చేసిన కార్లకు కాపలాగా ప్రైవేట్‌ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నారు.. అక్కడక్కడ కార్ల మధ్యలో సామాన్యుల వాహనాలైన ఆటోలు కూడా కనిపిస్తున్నాయి.. మొత్తంగా కార్ల పార్కింగ్‌తో దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిండిపోయింది.. కొన్ని చోట్ల బైక్‌లను కూడా దుర్గగుడి ఫ్లైఓవర్‌పైనే పార్క్‌ చేశారు బెజవాడ వాసులు..

వర్షాలు, వరదల ఎఫెక్ట్‌.. గవన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రద్దీ..
కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడానికి తోడు.. భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలం అవుతుంది.. ఇక, విజయవాడ సిటీలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.. విజయవాడ-హైదరాబాద్‌ హైవేపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.. మరోవైపు.. రైల్వే లైన్లు కొట్టుకుపోవడంతో.. వందలాది రైళ్లను రద్దు చేసిన పరిస్థితి నెలకొంది.. దీంతో.. ప్రత్యామ్నాయ మార్గాలను బెజవాడ వాసులు ఆధారాపడాల్సిన పరిస్థితి వచ్చింది.. దీంతో.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.. వర్షాలు, వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు డిమాండ్‌ వచ్చింది.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో… గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.. అయితే, పెరిగిన రద్దీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్‌లు దర్శనమిస్తున్నాయి.. అయితే, పెరిగిన ప్రయాణికుల రద్దీకి తగిన విమానాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.. కాగా, భారీ వర్షాలు.. వరదలతో విజయవాడ సిటీలోని చాలా ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఆయా ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు సహా.. మంత్రులు.. అధికారులు పర్యవేక్షిస్తున్న సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు..

ప్రయాణికులకు ఉపశమనం.. విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రాకపోకలకు లైన్‌ క్లియర్‌
భారీ వర్షాలు.. వరదలు.. కృష్ణా నదిలో వరద ఉధృతితో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. అయితే, ఇప్పుడు విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌లో రాకపోకలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.. ఐతవరం దగ్గర హైవే పై చేరిన వరద నీరు తగ్గటంతో వాహనాలను అనుమతి ఇస్తున్నారు అధికారులు.. అయితే.. హైవేపై బురద పేరుకు పోవటంతో వాహనాలను నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని దాటిస్తున్నారు.. కాగా, భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయిన విషయం విదితమే.. వరద పోటెత్తడంతో నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై నుంచి వరద ప్రవాహం కొనసాగింది.. దీంతో.. రాకపోకలు నిలిచిపోయాయి.. దీంతో.. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి భారీగా వరద నీరు చేరడంతో ఈ పరిస్థితి వచ్చింది.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను.. ఖమ్మం వైపు, నార్కట్‌పల్లి- అద్దంకి రహదారి మీదుగా మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది.. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లేందుకు నార్కట్‌పల్లి మీదుగా వయా మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడకు వాహనాలను మళ్లించారు.. దీంతో.. ప్రయాణికులకు.. వాహనదారులకు తిప్పలు తప్పలేదు.. కానీ, ఇప్పుడు ఐతవరం దగ్గర హైవేపై చేరిన నీరు తగ్గడంతో.. విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు పునర్‌ప్రారంభం అయ్యాయి.. దీంతో.. ప్రయాణికులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

ఏపీలో 19 మంది మృతి.. ఇద్దరు గల్లంతు..
భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి.. ఇంకా వర్షం ముప్పు పొంచిఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది.. అయితే, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టం.. పంట నష్టం.. ఇతర విషయాలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఓ ప్రకటన విడుదల చేసింది.. రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతిచెందారు.. ఇద్దరు గల్లంతు అయినట్టు పేర్కొంది.. ఇక, 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని.. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందని వెల్లడించింది. మరోవైపు.. అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో 1,808 కిలో మీటర్ల పొడువున ఆర్ అండ్‌ బీ రోడ్లు దెబ్బతిన్నట్టు పేర్కొంది కమాండ్‌ కంట్రోల్‌ రూమ్.. ఇక, 1,72,542 హెక్టార్లలో వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగిపోయాయని తెలిపింది.. ప్రకాశం బ్యారేజీ వద్ద 11,25,876 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.. 41,927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించాం.. 171 వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామని.. సహాయక చర్యల్లో 36 NDRF, SDRF బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నారని పేర్కొంది. బాధితులకు ఈ రోజు 3 లక్షల ఆహార ప్యాకేట్లు, త్రాగునీరు ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నాం.. 188 బోట్లును, 283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాం.. ఎటువంటి సహాయనికైన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.. ఇక, ముంపు భాదిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది.. విజయవాడ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేశారు.. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నం ఉందని వెల్లడించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..

రేపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులపై కీలక ఆదేశాలు
రేపు కూడా తెలంగాణలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలున్న 11 జిల్లాలైన ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను సమీక్షించారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురిసే అవకాశమున్న ఈ జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున, రానున్న భారీ వర్షాల వలన పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశముందని పోలీసు తదితర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్మల్‌కు 31 సభ్యులు, నాలుగు బోట్లు ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపుతున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నుండి ప్రస్తుతం 20000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ఈ నీటి పరిమాణం ఎక్కువైతే నేడే పరీవాహక ప్రాంతాల్లో తగు ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని తెలియజేశారు.

ఆన్‌లైన్ ట్రోలింగ్‌కి మేము కూడా బాధితులమే: సుప్రీంకోర్టు
దేశంలో అత్యున్నత సంస్థలు కూడా ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌కి అతీతం కాదని ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. సోషల్ మీడియా ట్రోల్స్‌ని, వారి చర్యలని దారుణంగా అభివర్ణించింది. ‘‘మనం ఎవరికైనా అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేస్తే, అవతలి వర్గం న్యాయమూర్తిని ట్రోల్ చేస్తారు’’ అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం అన్నారు. ఆప్ నేత, రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం దారుణం, ప్రతీ ఒక్కరూ ప్రభావితమవుతున్నారు. న్యాయమూర్తులు కూడా ట్రోల్స్‌కి గురవుతున్నారు.’’ అని మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. దీనిని పట్టించుకోకపోవడమే మంచిదని చెప్పారు. బాధ్యతారహితమైన వ్యక్తుల్లో చాలా మంది, దురదృష్టవశాత్తు ఈ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ట్రోలింగ్‌కి పాల్పడుతున్నారని అన్నారు. వారు హక్కుల గురించి మాట్లాడుతారు తప్పితే, బాధ్యతల్ని విస్మరిస్తారని, వారు సంస్థల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతారని, వారిని పట్టించుకోవద్దని ఆయన అన్నారు.

రేపటి నుంచి బ్రూనైలో మోడీ పర్యటన.. ఆ దేశానికి తొలిసారిగా వెళ్లనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు బ్రూనైలో పర్యటించనున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పర్యటన బ్రూనైతో ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ బ్రూనైలో పర్యటించారు. బ్రూనైలో ప్రధానికి ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. కాగా.. ప్రపంచ ధనికుల్లో ఒకరైన బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా మోడీని ఆహ్వానించారు. సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే బ్రూనై పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి బోల్కియా ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. సుల్తాన్ బోల్కియా సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లు. ఇది ప్రధానంగా బ్రూనై చమురు, సహజ వాయువు నిల్వల నుంచి వస్తుంది. సుల్తాన్ జీవన విధానం చాలా విలాసవంతమైనది. ఆయన ఇల్లు ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ 1984లో నిర్మించబడింది. బ్రిటన్ నుంచి బ్రూనై స్వాతంత్ర్యం పొందిన సమయంలో దీనిని నిర్మించారు.

ఉద్యోగం నుండి తొలగించారని సీఎంఓపై ఓ వ్యక్తి కాల్పులు..
ఉద్యోగం నుండి తొలగించారని సీఎంఓపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా హర్సూద్ మున్సిపల్ కౌన్సిల్ సీఎంఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం కాల్పుల ఘటన కలకలం రేపింది. పిస్టల్‌తో వచ్చిన రోజువారీ వేతనంపై పనిచేస్తున్న డ్రైవర్, మహిళా సీఎంఓ (ముఖ్య మున్సిపల్ అధికారి)పై వరుసగా 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. కంట్రీ మేడ్ పిస్టల్‌తో నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా.. కాల్పుల నుంచి సీఎంఓ తృటిలో తప్పించుకోగా.. ఆమెను రక్షించేందుకు వచ్చిన ఓ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. అతన్ని ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.

బుల్డోజర్ చర్యలపై మండిపడ్డ సుప్రీంకోర్టు
గత కొద్ది రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో నిందితుల ఇళ్లపై బుల్డోజర్లతో ఆస్తులను ధ్వంసం చేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. సోమవారం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బుల్డోజర్ చర్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిపై బుల్డోజర్ చర్యలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపుతూ.. ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ కారణం చూపించి కూల్చివేతలను ఎలా చేపడతారని నిలదీసింది. ఒకవేళ ఆ వ్యక్తి దోషిగా తెలినప్పటికీ చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా అతని ఆస్తిని కూల్చివేయకూడదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఏపీ వరద బాధితులకు ‘ఆయ్’ సాయం.. ఎంతంటే?
నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ చిత్రం మంచి టాక్ తెచ్చుకోడమే కాదు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. గోదావరి ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించగా ఆడియెన్స్, విమర్శకుల నుండి ప్రశంసలతో పాటు, మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తండేల్ టీమ్ ఆయ్ యూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీ, డీసెంట్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఏపీలో చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఈ క్రమంలో ఈరోజు నుండి వారాంతానికి వచ్చే ఆయ్ కలెక్షన్లలో నిర్మాత వాటాలో 25% జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు అందజేస్తామని నిర్మాత బన్నీ వాస్, గీతా ఆర్ట్స్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ జానసేన ద్వారా బన్నీ వాస్ అండ్ టీమ్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేయనుంది.

టైం చెప్పేశారు.. ఇక రెడీ అవండమ్మా!
జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంది. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద ఉన్న అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నాయి. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు, రెండు సాంగ్స్ సినిమాని వేరే లెవెల్ లోకి తీసుకు వెళ్ళగా ఇప్పుడు థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్లు. దావుడి అని సాగనున్న ఈ సాంగ్ సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది. ఈ థర్డ్ సింగిల్ జాన్వి కపూర్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక మాస్ బీట్ లాగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఒక మెలోడీ సాంగ్ చుట్టమల్లే ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టి నూటపాతిక మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక మాస్ పెప్పీ నంబర్ రిలీజ్ చేస్తున్నారంటే అది ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాని కొరటాల శివ స్నేహితులు మిక్కిలినేని సుధాకర్ తో పాటు కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పలు భాషలకు చెందిన స్టార్ నటీనటులు నటిస్తున్నారు.