Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సీబీఎన్‌ 14 కాదు.. సీబీఎన్‌ 95 ఇక్కడ‌..‌ తప్పుచేస్తే తోక కట్ చేస్తా‌‌‌..!
సీబీఎన్‌ 14 కాదు.. సీబీఎన్‌ 95 ఇక్కడ‌..‌ తప్పుచేస్తే తోక కట్ చేస్తా‌‌‌ అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉండే ల్యాండ్ రికార్డులు మొత్తం మార్చేశారు‌‌.. 22ఏ కిందా ప్రజల భూములను పెట్టి వైసీపీ నేతలు వేధించారు.. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారు‌ అని ఆరోపించారు.. అయితే, రాష్ట్రం మొత్తం సర్వే చేయిస్తున్నాం.. ప్రజలకు భూమికి రక్షణగా అన్ని చర్యలు తీసుకుంటాను అన్నారు.. కుప్పం హార్టికల్చర్ హాబ్ అవుతుందన్నారు.. గత ఐదేళ్లుగా నకిలీ మద్యం తాగి ఇష్టానుసారం ప్రవర్తించారు… రోడ్డుమీదకు వచ్చి మహిళలపై దాడులు చేశారు… నన్నే కుప్పానికి రానుకుండా చేశారు.. సీబీఎన్‌ 14 కాదు.. సీబీఎన్‌ 95 ఇక్కడ‌..‌ తప్పుచేస్తే తోక కట్ చేస్తా‌‌‌ అంటూ హెచ్చరించారు..

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అరెస్ట్‌.. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం..
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఒకపక్క రాయచోటి పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాలలో పోలీసులు గస్తీ కాస్తుండగా, మరోపక్క టెర్రరిస్టుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కేరళకు చెందిన అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ (యూనిస్) అనే ఇద్దరు టెర్రరిస్టులు (అన్నదమ్ములు) బట్టల వ్యాపారం ముసుగులో రాయచోటిలో మకాం వేసి ఇద్దరు కలిసి రాయచోటి ప్రాంతానికి చెందిన మహిళలను వివాహం చేసుకున్నారు. వీరిలో అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్ కు సంతానం లేకపోగా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ (యూనిస్) కు సంతానం కలిగి ఉన్నట్లు సమాచారం. అన్న అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్ రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉండే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఓ చిల్లర దుకాణం ఏర్పాటుచేసి అక్కడ నుంచి కార్యకలాపాలు సాగించేవాడు. తమ్ముడు మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ (యూనిస్) రాయచోటి పట్టణంలోని మహబూబ్ భాషా వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ బట్టల షాపు ఏర్పాటు చేసి అక్కడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు.

విద్యార్థులకు అలర్ట్.. రేపు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్..!
విద్యార్థులకు అలర్ట్‌.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూళ్ల బంద్‌కు పిలుపునిచింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్.. మన వేదన అందరికీ తెలియచేసే కార్యక్రమానికి అందరి సహకారంతో కార్పొరేట్‌ స్కూళ్లలో సహా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. ఈ రోజున జరిగిన జూమ్ సమావేశంలో తెలియచేసిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు మన సభ్యులందరూ వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు.. రేపు అనగా 3-07-2025 గురువారం నాడు స్కూళ్లను మూసివేయడం ద్వారా – మన ఆవేదన, సమస్యలను తెలియజేయడానికే.. కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్.. ఈ కార్యక్రమాన్ని మన సమిష్టి ఐక్యతను అందరి దృష్టికి తీసుకెళ్లే చిరు ప్రయత్నం… రేపటి బంద్‌కు విద్యార్థులు, ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు సహకరించాలని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ , APPUSMA, ISMA, UPEIF, UPSF తదితరులు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైద్య విద్యార్థులు.. ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ సీఎం..
వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను కలిశారు వైద్య విద్యార్ధులు.. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.. వైద్య విద్యార్ధులపై గత రాత్రి పోలీసులు దాడిచేయడం దారుణమన్న ఆయన.. ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం అందరినీ ఇబ్బందిపెడుతోంది.. వైద్య విద్యార్ధులకు న్యాయం జరిగేవరకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. వైద్య ఖర్చులన్నీ మేమే చెల్లిస్తాం..!
సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం పలు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో సిగాచి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమృత్ రాజ్ సింహ స్పందించారు. ఈ ఘటనపై కంపెనీ మేనేజ్మెంట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో 38 మంది కార్మికులు మృతి చెందగా, 33 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 90 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గాయపడినవారికి పూర్తి వైద్య సదుపాయాలను అందిస్తున్నామని, వారి వైద్య ఖర్చులన్నీ కంపెనీ భరిస్తుందని స్పష్టం చేశారు.

హైకోర్టులో సీఎం క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను హైదరాబాద్ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో బీజేపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో, కోర్టు తదుపరి తేదీగా జూలై 8ను నిర్ణయించింది. ఈ కేసులో అసలు ముఖ్య అంశం ఏమిటంటే.. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా వేశారు. రేవంత్ రెడ్డి ఓ సభలో ప్రసంగిస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారని ఆరోపించారు.

ఏడాది కాలంగా 16 ఏళ్ల విద్యార్థిపై 40 ఏళ్ల మహిళా టీచర్ లైంగిక వేధింపులు..
ముంబైలోని ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల ఇంగ్లీష్ టీచర్ తన 16 ఏళ్ల విద్యార్థిపై ఏడాది పాటు లైంగిక వేధింపులకు పాల్పడింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ మైనర్ బాలుడిని ముంబైలోని వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి, మద్యం తాగించేదని తేలింది. నిరోధక మాత్రలు సైతం ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పేర్కొన్నాడు. 16 ఏళ్ల బాధితుడి ప్రవర్తనలో మార్పును గమనించిన కుటుంబీకులు ఆరా తీయగా.. ఈ విషయం బయటపడింది. జరిగిన విషయాన్ని ఆ బాలుడు కుటుంబీకులకు తెలియజేయడంతో వాళ్లు ఆ టీచర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో షాకింగ్ వివరాలు బయటకు వచ్చాయి.

“I Love You చెప్పడంలో లైంగిక ఉద్దేశం లేదు”.. హైకోర్టు సంచలన తీర్పు..
మైనర్ బాలికను “ఐ లవ్ యు” అని ఆటపట్టించాడనే ఆరోపణలపై 2015లో దోషిగా తేలిన 25 ఏళ్ల వ్యక్తిని బాంబే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దిగువ కోర్టు తీర్పును కొట్టివేసింది. గతంలో నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు.. ఆ వ్యక్తికి భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354-A (లైంగిక వేధింపులు), 354D (వెంబడించడం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POSCO) చట్టంలోని సెక్షన్ 8 కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును బాంబే హై కోర్టు కొట్టేసింది. ఈ తీర్పుతో పోక్సో కేసులో దాదాపు పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి ఉపశమనం లభించింది. ఈ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం మాటలతో ప్రేమను వ్యక్తపరచడం లైంగిక వేధింపులుగా పరిగణించబడదని పేర్కొంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

చీకటి గదిలో జీవించడానికైనా సిద్ధం.. కానీ, బానిసత్వం వద్దు
పాకిస్తాన్‌ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ఎక్స్‌ (ట్విట్టర్)లో స్పందించిన ఆయన.. ఈ బానిసత్వాన్ని తాను అంగీకరించడానికి బదులు జైల్లో చీకటి గదిలో జీవించడానికి ఇష్టపడతానని రాసుకొచ్చారు. తన సందేశాన్ని ప్రజలకు చేరకుండా షరీఫ్ సర్కార్ అన్ని విధాలా అడ్డుకుంటోందని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని తన మద్దతుదారులకు ఆయన పిలుపునిచ్చారు.

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ బిగ్ షాక్.. ఏకంగా 9 వేల మందికి లేఆఫ్‌ నోటీసులు
టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి ఉద్యోగులను బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్‌ నోటీసులు జారీ చేస్తునట్లు తెలుస్తుంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ పెద్ద మొత్తంలో లేఆఫ్‌లు ప్రకటించడం ఇది సెకండ్ టైమ్. అయితే, ఈసారి ఎంత మందిపై వేటు పడనుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కాగా, దాదాపు 4 శాతం కంటే తక్కువ ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం చూపనుందని పేర్కొనింది. ఇక, కొన్ని మీడియా ఛానల్స్ కథనాల ప్రకారం దాదాపు 9 వేల మందికి పైగా లేఆఫ్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది.

అదే కథ.. మరో స్టార్ హీరో!
అల్లు అర్జున్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, తర్వాతి పరిణామాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. చాలా గ్యాప్ తీసుకుని, వేణు శ్రీరామ్ తమ్ముడు అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ లోపు, అల్లు అర్జున్ పుష్ప వన్, పుష్ప టూ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ నేపథ్యంలో, ఐకాన్ సినిమాను అల్లు అర్జున్‌తో చేయడం కష్టమేనని, దీంతో దిల్ రాజు సినిమా చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. అయితే, ఈ సినిమాకు కచ్చితంగా ఒక స్టార్ హీరో కావాలని వేణు శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

దిల్ రాజు, ఇండస్ట్రీకి దూరం పెరిగిందా?
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ నిర్మాతగా నిలిచారు. ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు సినీ పరిశ్రమకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన ఎన్‌టీవీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్ విత్ ఎన్‌టీవీ షోలో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలకు సంబంధించి తన మనసులోని విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఫుల్ ఇంటర్వ్యూ శనివారం నుంచి అందుబాటులో ఉంటుంది. ఈలోపు ప్రోమో మీద ఒక లుక్ వేయండి.

Exit mobile version