NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనపై సర్కార్‌ సీరియస్‌.. లైసెన్స్‌కే ఎసరు..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ లిక్కర్‌ షాపులకు బైబై చెప్పేసింది.. కొత్త లిక్కర్‌ పాలసీ తీసుకొచ్చి.. ప్రైవేట్‌ మద్యం షాపులను తీసుకొచ్చింది.. అయితే, కొన్ని చోట్ల లిక్కర్‌ షాపుల్లో తమకు తోచిన ధరలకు అంటే.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్‌ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూ తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించనున్నారు.. అయినా తీరు మారకుండారెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేయనుంది ప్రభుత్వం.. మరోవైపు ఇక, బెల్ట్‌ షాపుల విషయంలో కఠిన చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం.. బెల్ట్‌ షాపుల్లో మద్యం విక్రయాలు సాగితే.. బెల్టు తీస్తానంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు హెచ్చరించిన విషయం విదితమే.. మొత్తంగా ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన విషయంలో సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది ప్రభుత్వం.. పైసలకు కకుర్తి పడి.. అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగిస్తే.. తొలిసారి రూ.5 లక్షల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే.. ఇక, రెండోసారి చిక్కితే మాత్రం లైసెన్స్‌కే ఎసరు రానుంది..

కాకినాడ పోర్టులో పట్టుపడిన రేషన్‌ బియ్యం.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం పట్టుబడిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతాం.. ట్రాన్స్‌పోర్ట్‌ మెకానిజంలో మార్పులు చేపడతాం అన్నారు.. ఐపీసీ ఇన్వాల్వ్ చేసేలా రవాణా వ్యవస్ధ కఠినతరం చేస్తామని వెల్లడించారు.. అయితే, ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు 48 వేల కోట్లు.. అక్కడికి చేరాక అది డబుల్ అవుతోందన్నారు.. మమ్మల్ని చాలా మంది తప్పుదోవ పట్టించాలని చూసారు.. అక్కడ చెక్ పోస్టులు పెట్టినా ఒక షిప్టు లేకుండా చేసి మరీ పీడీఎస్ రైస్ తరలింపుకు సిద్ధమయ్యారు.. బియ్యం అక్రమ రవాణ ఆర్గనైజ్డ్ క్రైం. ఇక నుంచి బియ్యం స్మగ్లింగ్ ను ఆర్గనైజడ్ క్రైంగా కేసులు నమోదు చేస్తాం అని వార్నింగ్‌ ఇచ్చారు. ఇక, పీడీ యాక్ట్ క్రింద రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారిని తీసుకువచ్చే చట్టం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందన్నారు నాదెండ్ల.. కాకినాడు పోర్టులో బియ్యం అక్రమ రవాణా కేసులో 28 కంపెనీలు ప్రమేయం వుంది. వీరంతా ముఠాగా ఏర్పడి దక్షిణ ఆఫ్రికాకు స్మగ్లింగ్ చేస్తున్నారని వెల్లడించారు.. నేను ఇచ్చిన సమాచారం, నా ఆదేశాల మేరకే కాకినాడ పోర్టులో స్టెల్లా నౌకను కలెక్టర్ తనిఖీలు చేశారని తెలిపారు.. షిప్ ను కూడా సీజ్ చేస్తాం. షిప్ ను సీజ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.. మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్న.. మంత్రి పయ్యావులు కేశవ్ వియ్యంకుడి షిప్ వివరాలు ఇస్తే వాటిని కూడా తనిఖీ చేస్తాం.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు.. ఇక, నేను మంత్రిగా బాధ్యలు చేపట్టిన ఐదు నెలల్లో 6 ఏ కేసులు 1066 నమోదు చేశాము. ఇది రికార్డుగా పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్‌ జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూనే ప్రైవేట్‌ ఉద్యోగాల కల్పనపై ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం.. మరోవైపు.. ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి సారించింది.. అందులో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్‌ను ఈ రోజు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు.. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తారు.. బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పోస్టుల్ని పీహెచ్‌సీలు / ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.. http:apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం ఉంటుంది.. డిసెంబర్ 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు.

సీఎం అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం.. అమరావతి నిర్మాణంలో ముందడుగు..!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది.. ప్రధానంగా ఈ సమావేశంలో రాజధాని నిర్మాణ పనులపై చర్చించారు.. అయితే, అమరావతి పనుల ప్రారంభానికి సీఆర్డీఏ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. 2,498 కోట్ల రూపాయలతో రహదారుల పనులు ప్రారంభించనున్నారు.. ఇక, రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణానికి అనుమతి లభించింది.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతిలో 217 చదరపు కిలోమీటర్లలో రోడ్లు, బిల్డింగ్ లకు కొన్నింటికి అథారిటీ మీటింగ్ లో అనుమతులిచ్చాం అన్నారు.. కొన్ని రోడ్లకు 2498 కోట్లతో వేయడానికి అథారిటీ అనుమతిచ్చింది.. 1585 కోట్లతో మూడు వాగులు, మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి అథారిటీ అనుమతి లభించిందని వెల్లడించారు.. ఇక, రూ.3,523 కోట్లతో అధికారుల బిల్డింగ్ లకు అనుమతి లభించింది.. జనవరి నుంచి అనుమతులు వచ్చిన పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.. అన్ని రకాల వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి నారాయణ..

విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. మొత్తంగా మూడు కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.. వైజాగ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు.. గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీసుకు 5.08 కిలోమీటర్లు.. తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ 6.75 కిలోమీటర్లు.. ఈ మూడు లైన్లు ఫేజ్ 1గాను కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లు రెండవ ఫేజ్ లోనూ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. మొత్తం 76.9కిలోమీటర్లు మెట్రోరైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మరోవైపు.. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. 66.15 కిలోమీట్ల నిడివితో మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతోంది.. మొదటి ఫేజ్ లో 38.4 కిలోమీటర్లు, రెండవ ఫేజ్ లో 27.75 కిలోమీటర్లు మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు.. ఇక, మొదటి ఫేజ్ లో 1,152 కోట్ల రూపాయలతో భూసేకరణ చేయనుండగా.. రూ.11,009 కోట్లతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు.. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్‌.. పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచ పెనమలూరు, పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచి అమరావతికి ఇలా మూడు కారిడార్లలో విజయవాడ మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టనున్నారు..

గత పదేళ్ళు ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గురైంది..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పెద్దయెత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతూ… నియామక పత్రాలు అందించడం… ఆనందంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల అవసరాల ను తీర్చడం కోసం… ప్రతినెల ఆరోగ్య శాఖ కు నిధులు విడుదల చేయాలంటే నీళ్ళు మింగాల్సిన పరిస్థితి అని, ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆరోగ్య శాఖ పై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు , పేదవారికి, మధ్యతరగతి లో గానీ ఆయా కుటుంబాల్లో ఆరోగ్యం విషమిస్తే… ఆర్థికంగా పెట్టుకోలేక అనేక ఇబ్బందులు పడ్డారని, అందుకే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం లో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, సదుపాయాల కల్పన విషయంలో పూర్తి స్థాయిలో మేము అందించే ప్రయత్నం చేస్తున్నామని, గత పదేళ్ళు ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గురైందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళారు.. ఇప్పుడు వాటికి అతికష్టం మీద వడ్డీలు కడుతున్నామన్నారు.

పార్లమెంట్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ మూవీ చూసిన మోడీ
ప్రధాని మోడీ సోమవారం పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ చిత్రాన్ని వీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎంపీలు, నటీనటులతో కలిసి ప్రధాని సినిమా చూశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా చిత్ర బృందం వీడియోలో ప్రత్యేకంగా కనిపించారు. ఆడిటోరియంలోకి వెళ్లే సమయంలో సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి ప్రధాని మోడీ నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కనిపించాయి. సత్యాన్ని ప్రదర్శించడానికి సినిమా చేసిన ప్రయత్నాలకు ప్రధాని మోడీ ప్రశంసించారు. “ఈ నిజం బయటకు రావడం మంచిది, అది కూడా సాధారణ ప్రజలు చూసే విధంగా. ఒక నకిలీ కథనం పరిమిత కాలం వరకు మాత్రమే కొనసాగుతుంది. అంతిమంగా వాస్తవాలు ఎప్పటికీ బయటకు వస్తాయి! ” అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ధీరజ్ సర్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశి ఖన్నా నటించారు. ఫిబ్రవరి 27, 2002న గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌కు సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని S-6 కోచ్‌లో జరిగిన విషాదకరమైన దుర్ఘటనకు సంబంధించిన విశేషాలను చిత్రంలో చూపించారు.

సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా? ఎందుకో..!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక డైలీ సీరియల్‌గా కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపుగా 9 రోజులైంది. కానీ ఈరోజుకి సీఎం అభ్యర్థి పేరు ప్రకటించలేదు. ఈరోజు.. రేపు అంటూ ఊరిస్తున్నారే తప్ప.. అధికారికంగా అభ్యర్థి పేరు మాత్రం ప్రకటించలేకపోతున్నారు. వాస్తవానికి మహారాష్ట్ర ప్రభుత్వ కాలం ఎప్పుడో ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా మహాయుతి కూటమికి భారీ విజయం కూడా ఉంది. కానీ సీఎం పేరు అధికారికంగా ప్రకటించడానికి జంకుతున్నారు. భవిష్యత్‌ ముప్పును దృష్టిలో పెట్టుకుని ఏం జరగుతుందోనన్న ఆందోళనతోనే పేరు ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ భయపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే షిండేకు అనారోగ్యం కారణంగా ముంబైలో జరగాల్సిన ఎన్డీఏ సమావేశం రద్దైంది. దీంతో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా పడింది. మరోవైపు మహారాష్ట్ర పంచాయితీ పరిష్కారం కోసం కేంద్ర పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజారాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నియమింపబడ్డారు. ఇంకోవైపు డిసెంబర్ 5నే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం పేరు ప్రకటించలేదు. తాజాగా డిసెంబర్ 4న ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు పేరు ప్రకటిస్తారని బీజేపీ నేత ఒకరు మీడియాకు వెళ్లడించారు. దీంతో మరికొన్ని గంటల పాటు సస్పెన్ష్ కొనసాగనుంది. డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు మహారాష్ట్ర విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది

బీజేపీ మహిళా నేత ఆత్మహత్య..
గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన 34 ఏళ్ల బీజేపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. సూరత్‌లోని వార్డ్ మెంబర్ 30లో దీపికా పటేల్ అనే బీజేపీ మహిళా మోర్చా నాయకులురా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త రైతు, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. దీపికా పటేల్ నిన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. కార్పొరేటర్ చిరాగ్ సోలంకి, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని సీనియర్ పోలీస్ అధికారి విజయ్ సింగ్ గుర్జార్ తెలిపారు. ఉరివేసుకుని చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. కాల్ రికార్డు, ఫోరెన్సిక్ పరీక్షల్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు.

‘షికారా’ పేరుతో మొట్టమొదటి సారి అలాంటి సేవలను అందించబోతున్న ఉబెర్ ఇండియా
యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ ఉబెర్ భారతదేశంలో తన మొదటి జల రవాణా సేవను మొదలు పెట్టింది. ఇప్పుడు మీరు కాశ్మీర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో షికారా రైడ్‌ని ఆస్వాదించాలనుకుంటే, మీరు ఉబర్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోగలరు. కాబట్టి ఇప్పటినుండి మీరు కాశ్మీర్‌ను సందర్శించబోతున్నారంటే మీ సరదా రెట్టింపు కాబోతుంది. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలోనే తొలిసారిగా ఇలాంటి సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఉబెర్ తెలిపింది. ఇక నుంచి శ్రీనగర్‌ను సందర్శించే పర్యాటకులు ఇక్కడ టాక్సీని బుక్ చేసుకోవడంతోపాటు షికారాకు ట్రిప్‌ను బుక్ చేసుకోవడం సులభం అవుతుంది. ఉబర్ మొదలు పెట్టిన ‘షికారా’ బుకింగ్ సేవ గురించి కంపెనీ దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభజీత్ సింగ్ మాట్లాడుతూ.. ఉబెర్ ‘షికారా’ సేవ అనేది నిజానికి సంప్రదాయం, సాంకేతికతల ఏకైక సంగమం అని అన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ‘షికారా’ రైడ్ కోసం సులభంగా బుక్ చేసుకోవచ్చని, కశ్మీర్ టూరిజంను పెంచడంతో పాటు తమ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సర్వీస్‌ను ప్రారంభించడం ద్వారా ప్రయాణికులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించబోతున్నామని ఆయన అన్నారు. ఆసియాలోనే ఈ తరహా జలరవాణా సర్వీసు ఇదే తొలిసారని ఆయన స్పష్టం చేశారు.

5 పరుగులు, నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బౌలర్..!
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. కింగ్‌స్టన్‌లో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు రెండో రోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ బౌలర్ జాడెన్ సీల్స్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌట్ చేయడంలో సీల్స్ కీలక పాత్ర పోషించాడు. అతను 15.5 ఓవర్లు బౌలింగ్ చేయగా.. అందులో 10 మెయిడిన్ ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీశాడు. కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. టెస్టుల్లో ఈ తరహా ఎకానమీ సాధించడం అద్భుతం. సీల్స్ ఎకానమీ 0.30గా ఉంది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యుత్తమ ఎకానమీ. ఆ జాబితాలో మొదటి పేరు ఇండియా ప్లేయర్ బాపు నందకర్ణి ఉన్నాడు. బాపు 1964లో ఇంగ్లండ్‌పై 32 ఓవర్లలో 27 మెయిడిన్లు వేసి ఐదు పరుగులు ఇచ్చాడు. ఆ సమయంలో అతని ఎకానమీ 0.15గా ఉంది. తాజాగా.. సీల్స్ చేరాడు. ఇతని తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన జిమ్ లేకర్, ఆస్ట్రేలియాకు చెందిన జిమ్ బర్క్, నాథన్ లియాన్.. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ అలెన్, ఇండియాకు చెందిన ఉమేష్ యాదవ్, మనీందర్ సింగ్.. పేర్లు ఉన్నాయి.

భారీ తేడాతో జపాన్ ను చిత్తు చేసిన టీమిండియా కుర్రాళ్లు
పురుషుల అండర్-19 ఆసియా కప్ 2024లో భారత జట్టు పాకిస్థాన్‌పై భారత్ 43 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చుసిన తర్వాత, జపాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జపాన్‌ జట్టు టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు జపాన్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో జపాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 211 పరుగులతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 భారీ స్కోరు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మహ్మద్ అమన్ అజేయ సెంచరీ సాధించగా.. కేపీ కార్తికేయ 57 పరుగులు, ఆయుష్ మ్హత్రే 54 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇక భారీ లక్ష్య చేధనకు వచ్చిన జపాన్ ఎక్కడ కూడా లక్ష్యం వైపు వెళ్లినట్లు కనపడలేదు. చాలా నెమ్మదిగా ఆడిన జపాన్ నిర్ణిత 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి కేవలం 128 పరుగులకే పరిమితం అయ్యింది. దీనితో భారత్ 211 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.

ఉత్తరాంధ్రపై మనసుపడ్డ టాలీవుడ్
సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేది భాష, యాస. ఎంత రీజనల్ లాంగ్వేజ్‌లో హీరో కనిపిస్తే అంత కనెక్ట్ అయిపోతుంటారు ఆడియన్స్. వారి యాసలో మాట్లాడితే.. మనోడురా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. పుష్పతో రాయలసీమ ఆడియన్స్‌కు బన్నీ దగ్గరైతే.. దసరాతో నాని తెలంగాణ ప్రేక్షకుల మనసు దోచాడు. ఇప్పుడు ఇలాంటి సరికొత్త యాసను ఎక్స్ పీరియన్స్ చేయించేందుకు రెడీ అవుతున్నారు త్రీ హీరోస్. ఉత్తరాంధ్ర భాషపై మక్కువ పెంచుకుంటున్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం పరిసర ప్రాంతాల యాస కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ రీజనల్ లాంగ్వేజ్‌తో వచ్చి మంచి టాక్ తెచ్చుకున్నాయి కోటబొమ్మాళి, పలాస. ఇప్పుడు ఆ యాసలోని రుచిని మరింత చేరువ చేసేందుకు సిద్ధం అవుతున్నారు చైతూ, చెర్రీలు. ఈ పాలి యాట.. గురి తప్పేదే లెస్ అంటూ అసలు సిసలైన సిక్కోలు జాలరిగా కనిపించబోతున్నాడు నాగ చైతన్య. శ్రీకాకుళంలో జరిగిన మత్య్సకారుల రియల్ స్టోరీ ఇన్సిడెంట్ ఆధారంగా తండేల్ తెరకెక్కుతోంది. ఇందులో చైతూ ఇంటెన్సివ్ లుక్స్‌లో రఫ్పాడిస్తున్నారు. ఆ భాషను నేర్చుకుని… తన డైలాగులతో పలికిస్తున్న యాసతో పులకరించిపోతుంది ఉత్తరాంధ్ర. చైతూ డిఫరెంట్ లుక్స్, లాంగ్వేజ్‌తో మెస్మరైజ్ చేస్తుండటంతో తండేల్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఇదే యాసను నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ నుండి షిఫ్టైన రామ్ చరణ్.. బుచ్చిబాబుతో వర్క్ స్టార్ట్ చేశాడు. ఇది కూడా శ్రీకాకుళం స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కుతున్న మూవీగా గట్టిగా బజ్ నడుస్తోంది. మల్ల యోధుడు కోడి రామ్మూర్తి బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. చెర్రీనే కాదు.. వెన్నెల కిషోర్ కూడా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటూ వస్తున్నాడు. క్రైమ్ కామెడీతో పాటు.. సిక్కులు ప్రజల జీవితాలను తెరపైకి తీసుకు వస్తున్నాడు దర్శకుడు మోహన్. డిసెంబర్ 25న మూవీ ప్రేక్షకులను పలకరించబోతుంది. మరీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఉప్పీ అంటే ఇంతేరా.. UI ది మూవీ ట్రైలర్ చూశారా?
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ ‘UI ది మూవీ’ చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. ఈ రోజు, మేకర్స్ వార్నర్‌తో ముందుకు వచ్చారు, ఇది మూవీ వరల్డ్ లో ఒక గ్లింప్స్ ని అందిస్తోంది. కథ 2040 సంవత్సరంలో జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, COVID-19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం, యుద్ధం యొక్క నిరంతర ముప్పు అస్తవ్యస్తమైన, బాధాకరమైన సమాజానికి దారి తీస్తాయి. వినాశకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, సామాజిక విభజనలు పాతుకుపోయాయి. కులం,మతం, సంఘర్షణ, విభజన మూలాలుగా వ్యక్తుల జీవితాల మారుస్తాయి. ఈ డిస్టోపియన్ వరల్డ్ లో ఉపేంద్ర నియంత గా కనిపించారు. మార్పు కోసం, న్యాయం కోసం, మంచి భవిష్యత్తు కోసం కష్టజీవుల నిరసనలకు దిగుతారు. ఇప్పుడు పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర రూత్ లెస్ గా కనిపించారు. కథ-కథనంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర మరో వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశారు. వార్నర్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. సినిమా కోసం నిర్మించిన వరల్డ్ గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూపుతుంది. హెచ్‌సి వేణుగోపాల్ క్యాప్చర్ చేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, అజనీష్ బి లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది. ఆర్ట్ డైరెక్షన్ శివ కుమార్ J (KGF1&2 ఫేమ్), VFX ని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రంలో రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్లింప్స్ లో అనౌన్స్ చేసినట్లుగా UI మూవీ డిసెంబర్ 20, 2024న విడుదల అవుతుంది.