NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు.. ఎవరికి ఎంతంటే..?
సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది.. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసిన విషయం విదితమే కాగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్, సంధ్యా రాణి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ.. ఏ సంస్థకు ఎంత మేర భూమి కేటాయించారో వివరించారు. భూకేటాయింపులపై గ్రూప్‌ ఆఫ్ మినిస్టర్స్‌ సమావేశంలో చర్చ జరిగిందన్నారు మంత్రి నారాయణ.. GoM కొన్ని సంస్థలకు భూములు కేటాయించేందుకు అనుమతి ఇచ్చిందని వివరించిన ఆయన.. ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు.. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు 5 ఎకరాలు.. IGNOUకి 0.8 ఎకరాలు.. బసవతారకం ఆస్పత్రికి 15 ఎకరాలు, l&tకి 5 ఎకరాలు.. బ్రహ్మకుమారీస్‌కి 10 ఎకరాలు కేటాయించామని తెలిపారు.. ఇక, సీఆర్డీఏ అధికారులతో కూడా చర్చించాం.. ఈ భూకేటాయింపులు డిసెంబరు నెలాఖరులోగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.. ప్రాజెక్టులు కంటిన్యూ చేయడానికి సీఈలతో ఒక కమిటీ వేశామని.. ఈ డిసెంబర్‌ నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు.. ఇక, వచ్చే జనవరి నుంచి పనులు మొదలవుతాయని తెలిపారు.. 131 మందికి గతంలో భూములు ఇచ్చాం.. వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నాం.. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నాం. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ.

కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష.. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. రాష్ట్రంలో రెడ్‌ బుడ్‌ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.. వ్యవస్ధలన్నీ కూప్పకూలిపోయిన పరిస్దితి కనిపిస్తోంది. దొంగకేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వార్డ్‌ చేసినా కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మన ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రతి ఇంట్లోనూ చర్చ నడుస్తుంది. జగన్‌ కుటుంబమంతటికీ మేలు చేశాడు. చంద్రబాబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానన్న ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు చూశాం అన్నారు..

క్షేత్రస్థాయికి పర్యటనకు వైఎస్‌ జగన్‌.. వారంలో 2 రోజులు జిల్లాల్లోనే..
క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం అవుతున్నారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు.. ఈ రోజు తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఇక, సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని.. ఆ రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని.. పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని వెల్లడించారు.. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు వైఎస్‌ జగన్‌.. జనవరిలోగా పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలి. జిల్లాస్ధాయి నుంచి మండల స్ధాయి వరకు పూర్తవ్వాలి. ఆ తర్వాత బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు జరగాలి. గ్రామస్ధాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్‌ బుక్, ఇన్‌స్టా, వాట్సప్‌ ఉండాలని సూచించారు వైఎస్‌ జగన్‌.. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్‌ లోడ్‌ చేయాలి. ప్రతి గ్రామంలో టీడీపీని, సీఎం చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు..

జేసీ సంచలన వ్యాఖ్యలు.. నాకు కోపం, రోషం ఉంది.. కొట్టడం కూడా తెలుసు..!
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జేసీ.. తాజాగా ఫ్లైయాష్ అంశంలో తనను విమర్శించిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి బూతు పురాణంతో రెచ్చిపోయారు.. అసలు, ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదంతో నాకేం సంబంధం? అని ప్రశ్నించారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోపం, తాపం, రోషం ఉన్నా.. పక్కన పెట్టారన్న ఆయన.. నేను చంద్రబాబు అంత మంచి వాడిని కాదు.. నాకు కోపం, తాపం, రోషం ఉంది.. అలాగే కొట్టడం కూడా తెలుసు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించారని మండిపడ్డారు జేసీ.. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు.. ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలని పిలుపునిచ్చారు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తే ఇంటికొచ్చి చెప్పుతో కొడతా అంటూ హెచ్చరించారు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తాడిపత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలను వెనకేసుకొస్తున్నాడు.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంగతి త్వరలోనే తేలుస్తా అన్నారు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ఊరు విడిపిస్తా.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటి పక్కన ఉన్న ఐటీఐ కళాశాల భూమిని కబ్జా చేసి గేటు పెట్టాడని ఆరోపించారు.. డిసెంబర్ 4వ తేదీ లేదా 5వ తేదీన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి గేట్లు పగలగొడతా అంటూ హెచ్చరించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..

చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం..!
చరిత్ర చదవకుండా భవిష్యత్‌ను నిర్మించలేమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆత్మగౌరవం.. అస్తిత్వం.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లమవుతామన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు కాదు.. తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తొస్తోంది.. తెలంగాణ భవన్.. జనతా గ్యారేజ్‌గా మారిందన్నారు. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నాడని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడని ఆరోపించారు. ఉద్యమంపై గన్ను సీఎం రేవంత్ రెడ్డి ఎక్కుపెట్టాడన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నాడన్నారు. సోనియమ్మ లేకపోతే.. తెలంగాణ అడుక్కుతినేదని అహంకారంతో వాగుతున్నాడన్నారు. తెలంగాణ అస్తిత్వంపై గుజరాత్ గులాములు ఓ పక్క.. ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క దాడి చేస్తున్నారన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌లో మన గళం వినిపించే నాథుడే లేడన్నారు. తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే ఇంకెవరూ కాదన్నారు. లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం, తెలంగాణ ప్రజల విజయమని కేటీఆర్ స్పష్టం చేశారు.

అత్యంత నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం
ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవ‌సాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిర‌మ్మ ఇళ్లపై త‌న నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స‌మీక్ష నిర్వహించారు. తొలి ద‌శ‌లో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని, ఈ విష‌యంలో గ్రామ కార్యద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌ని.. ఏ ద‌శ‌లోనూ ల‌బ్ధిదారుకు ఇబ్బంది క‌ల‌గ‌వ‌ద్దని.. అదే స‌మ‌యంలో శాఖ‌ప‌రంగా ఎటువంటి పొర‌పాట్లకు తావివ్వకుండా చూడాల‌ని సీఎం ఆదేశించారు.

90 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. రూ.కోటి నగదు మాయం
దేశంలో సైబర్ స్కామ్‌లు పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు నగదు దొంగిలిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌‌లో చోటుచేసుకుంది. గుజరాత్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడిని చైనాలో ఓ ముఠాతో కలిసి రాకెట్ నడిపిస్తున్న గ్యాంగ్ డిజిటల్ అరెస్ట్ చేసి రూ.కోటి నొక్కేశారు. సీబీఐ అధికారులుగా నటిస్తూ 15 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉంచారు. పార్శిల్‌లో డ్రగ్స్ దొరికాయని బెదిరింపులకు దిగారు. మీ పేరు మీద ముంబై నుంచి చైనాకు కొరియర్ పంపినట్లు హడలెత్తించారు. అతని బ్యాంకు ఖాతా నుంచి ముఠా సభ్యులు రూ. 1,15,00,000 బదిలీ చేసుకున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు సూరత్ సైబర్ పోలీసులకు అక్టోబర 29న ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి పార్థ్ గోపాని కోసం గాలిస్తున్నారు. పార్థ్ గోపానీ కంబోడియాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వృద్ధుడు సంపాదించిన కోటి రూపాయులు కేటుగాళ్లు నొక్కేయడంతో లబోదిబో అంటున్నాడు.

హిందూ నేతల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై రాడికల్ ఇస్లామిస్టులు దాడులకు తెగబడుతున్నారు. ప్రధానిగా షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. హిందువుల వ్యాపారాలు, గుడులు, ఇళ్లపై దాడులుకు తెగబడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ పాలన ఈ అరాచకాలను అడ్డుకోలేకపోతోంది. హిందువుల హక్కుల గురించి నినదించిన ప్రముఖ హిందూ నేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసింది. వరసగా హిందువుల్ని టార్గెట్ చేయడంపై భారత్ తన ఆందోళనని వ్యక్తం చేసింది. మైనారిటీల రక్షణను నిర్ధారించాలని కోరింది. ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్ మరింత దిగజారింది. పలువురు హిందూ నేతల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. చిన్మోయ్ కృష్ణదాస్‌తో సమా 17 మంది ఖాతాలను 30 రోజుల పాటు స్తంభింపచేయాలని బంగ్లాదేశ్ అధికారులు ఆదేశించారు. బంగ్లాదేశ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (BFIU) గురువారం (నవంబర్ 28, 2024) వివిధ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు ఈ ఆదేశాలను పంపింది. అన్ని రకాల లావాదేవీలను నెల పాటు నిలిపేయాలని కోరింది. ఈ 17 మంది వ్యక్తులకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలు, ఖాతాల అప్డేట్స్‌, లావాదేవీల స్టేట్‌మెంట్‌లతో సహా అకౌంట్లకు సంబంధించిన అన్ని వివరాలనున మూడు రోజుల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమకు పంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ దేశంలో ప్రతేడాది 2.88 లక్షల మంది విదేశీ కార్మికులు అవసరం.. ఇది భారతదేశానికి శుభవార్త
ప్రపంచంలోని ఐదు ఆర్థిక అగ్రరాజ్యాల్లో నాలుగో అగ్రరాజ్యమైన జర్మనీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. జర్మనీ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. దీని కారణంగా, ఇమ్మిగ్రేషన్ విషయంలో చాలా దూకుడు విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. దీని అర్థం జర్మనీ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది వలస పౌరులకు వసతి కల్పించవలసి ఉంటుంది. భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో పౌరులు జర్మనీకి వెళుతున్నందున ఈ వార్త భారతదేశానికి ఉపశమనం కలిగిస్తుంది. తాజాగా జర్మనీ కూడా వీసా నిబంధనలను సడలించడంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు ప్రయాణం సులువుగా మారింది. ఓ నివేదిక ప్రకారం, జర్మనీకి ప్రతి సంవత్సరం మొత్తం 2.88 లక్షల మంది కార్మికులు అవసరమవుతారు. అది బయటి నుండి అంటే వలస పౌరుల రూపంలో పొందవలసి ఉంటుంది. ఈ దేశంలో స్థిరమైన శ్రామిక శక్తి అవసరాలను తీర్చడానికి, ఇటీవలి సంవత్సరాలలో కాకుండా 2024 వరకు ప్రతి సంవత్సరం 2.88 లక్షల మంది వలస పౌరులకు వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా, ఒక ముఖ్యమైన సంఖ్య ఏమిటంటే, కార్మికుల సంఖ్య, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధ కార్మికుల సంఖ్యలో మంచి పెరుగుదల లేకుంటే, ఈ సంఖ్య జర్మనీలో 3 లక్షల 68 వేల మంది వలసదారులకు చేరుకుంటుంది.

మ్యాడ్ 2 స్పెషల్ సాంగ్.. రంగంలోకి శ్రీవిష్ణు హీరోయిన్
‘టిల్లు స్క్వేర్‌’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థ మరో సీక్వెన్స్ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్‌’కి కొనసాగింపుగా.. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ను తెరకెక్కిస్తోంది. మ్యాడ్‌లో నటించిన నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా చేస్తున్నారు. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మ్యాడ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. నార్నె నితిన్ డెబ్యూ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చింది. థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ లభించింది. ‘మ్యాడ్ 2’లో మొదటి పార్ట్ లో ఉన్న లీడ్ యాక్టర్స్ అందరూ ఈ సీక్వెల్ లో కూడా ఉండబోతున్నారంట. మ్యాడ్ లో కాలేజ్ లైఫ్ ని చూపించిన కళ్యాణ్ శంకర్ ‘మ్యాడ్ 2’లో మాత్రం ముగ్గురు హీరోల ఫ్యామిలీ లైఫ్ లో ఫన్ రైడ్ ని తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మలయాళీ బ్యూటీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు హీరో శ్రీవిష్ణుకి జోడీగా ‘సామజవరగమన’లో నటించిన రెబ్బా మౌనిక జాన్. ఇదివరకే కొంతమంది పేరును పరిశీలించినప్పటికీ ఆమెనే ఫైనల్ చేశారంట. త్వరలో ఆమె పైన సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి రాబోతోందని తెలుస్తోంది.

పుష్ప 2 ప్రెస్ మీట్లో బ్లాక్ మ్యాజిక్ చేసిన రష్మిక… హీటెక్కించింది పో
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను నిర్వహిస్తుంది. పుష్ప 2 ప్రెస్ మీట్ సందర్భంగా ముంబై వేదికగా జరిగిన ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక తన గ్లామర్ తో పిచ్చెక్కించేసింది. అందరి చూపులను తిప్పుకోనివ్వకుండా అందాలతో కట్టిపడేసింది. బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన రష్మిక.. తన స్మైల్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రెస్ మీట్ లో రష్మిక ‘పుష్ప 2’ ప్రమోషన్లలో భాగంగా చిత్త యూనిట్ తో పాటు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక తన అనుభవాలను పంచుకుంటూ సినిమా గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ‘పుష్ప 2: ది రూల్’ డిసెంబర్ 5న పాన్ వరల్డ్ లెవల్లో విడుదల కానుంది. అల్లు అర్జున్, రష్మిక జోడీని మళ్లీ తెరపై చూడటానికి వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ హైప్ నెలకొంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఐకానిక్ ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్ హైప్ వేరే లెవెల్‌లో ఉందనే చెప్పుకోవాలి. ఈ ఈవెంట్‌ లో రష్మిక తన సింప్లిసిటీతో పాటు స్టైలిష్ లుక్‌, చూపు తిప్పుకోనివ్వని అందాలను ప్రదర్శించి యూత్ న అట్రాక్ట్ చేసింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు, ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచాయి. ప్రొమోషన్లలో భాగంగా విడుదల చేసిన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ‘పుష్ప 2’ కేవలం సినిమా కాదు, ఒక బ్రాండ్‌గా మారిపోతుంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా మేకర్స్ సినిమా ప్రమోషన్ స్ట్రాటజీపై ఎంత ఫోకస్ పెడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.