Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

లిక్కర్‌ కేసులో నిందితులకు బెయిల్.. హైకోర్టు పెట్టిన షరతులు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు ఏపీ హైకోర్టు బుధవారం కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డితో పాటు ముప్పిడి అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో ష్యూరిటీలు సమర్పించిన అనంతరం బెయిల్‌పై ఉత్తర్వులు వెలువడ్డాయి. లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిందితులకు పలు కఠినమైన షరతులు విధించింది. ప్రతి శనివారం విచారణ అధికారికి హాజరు కావాలి.. తాము ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ వివరాలు అధికారులకు తెలియజేయాలి.. దేశం విడిచి వెళ్లరాదు.. తమ పాస్‌పోర్ట్‌ను అధికారులకు అప్పగించాలి.. కేసులోని సాక్షులను ప్రభావితం చేయకూడదు.. సహ నిందితులతో ఎలాంటి సంప్రదింపులు చేయరాదు.. రూ.2 లక్షల విలువైన రెండు పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని స్పష్టం చేసింది కోర్టు..

క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశంలో క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి రూపొందించిన ఈ అట్లాస్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి నమోదు చేసిన వివరాలతో ఈ అట్లాస్ ను రూపొందించారు. విజన్ స్టేట్‌మెంట్‌ ద్వారా 2030 నాటికి అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌, మిషన్ స్టేట్‌మెంట్‌ ద్వారా ముందస్తు స్క్రీనింగ్ టెస్టులతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తగ్గించేలా అట్లాస్‌ ద్వారా కార్యాచరణ చేపట్టనున్నారు. హెల్త్ ఎడ్యుకేషన్, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన, ప్రివెన్షన్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ వంటివి క్యాన్సర్ కేర్ స్ట్రాటజీలో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పురుషులు, మహిళల నుంచి నమోదు చేసిన సమాచారం ఆధారంగా చికిత్సలు, సర్జికల్, రేడియేషన్, మెడికల్ ట్రీట్‌మెంట్‌ వారీగా అట్లాస్ లో వివరాలు పొందుపరిచారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో క్యాన్సర్ అట్లాస్ రూపకల్పన జరిగిందని స్పష్టం చేశారు..

మహిళా ఉద్యోగికి మరోసారి వీడియో కాల్.. వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కొత్త వీడియో..
రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది.. ఓ మహిళా ఉద్యోగి.. తనను శ్రీధర్‌ లైంగికంగా వేధిస్తున్నాడని.. లైంగిక దాడి చేయడమే కాదు.. ఐదు సార్లు అబార్షన్‌ చేయించాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఇక, తనతో సదరు ఎమ్మెల్యే చేసిన వాట్సాప్‌ చాట్.. వీడియో కాల్స్‌ కూడా బయట పెట్టింది.. ఇప్పటికే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఈ ఘటనపై జనసేన పార్టీ ఓ కమిటీ కూడా వేసి విచారణ ప్రారంభించింది.. అయితే, జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే మహిళా ఉద్యోగిపై లైంగిక ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కొత్త వీడియో బయటకు వచ్చింది. సంబంధిత మహిళా ఉద్యోగికి అరవ శ్రీధర్ మరోసారి వీడియో కాల్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో కాల్‌లో తన ప్రేమను గుర్తించాలని కోరుతూ శ్రీధర్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కారులోనే ఉండగా బ్లేడ్‌తో తన చేతిని కోసుకుని, రక్తం కారుతున్న దృశ్యాలను వీడియో కాల్‌లో చూపించినట్లు చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సదరు మహిళ బయటపెట్టడంతో వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. వీడియోలో అరవ శ్రీధర్ ఏడుస్తూ మాట్లాడినట్లు, భావోద్వేగ ఒత్తిడితో ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

విచారణకు నేను రాలేను.. నోటీసులపై స్పందించిన కేసీఆర్..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానని, అందుకే రేపటి విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని, తనకు మరింత సమయం కావాలని ఆయన సిట్ అధికారులను కోరారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే విచారణను తన నివాసమైన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు. హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కు రావడం కంటే, ఫామ్‌హౌస్‌లోనే అధికారులు ప్రశ్నలు అడిగితే తాను సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఇచ్చిన రిప్లైపై సిట్ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మున్సిపల్ ఎన్నికల కారణాన్ని అధికారులు అంగీకరిస్తారా? లేక రేపే ఎర్రవల్లికి వెళ్లి విచారణ జరుపుతారా? అనేది చూడాలి. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వంటి ముఖ్య నేతలు ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయి ఈ న్యాయపరమైన అంశాలపై చర్చించారు.

మేడిగడ్డ బ్యారేజ్‌కు కేంద్రం రెడ్‌ అలర్ట్‌..
తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, దీనిని అత్యంత ప్రమాదకరమైన ‘కేటగిరి-1’ డ్యామ్‌గా ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిర్వహించిన 2025 వర్షాకాలం అనంతర తనిఖీల్లో ఈ ప్రాజెక్టులో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలిందని, వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన మూడు అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులలో మేడిగడ్డ ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ పటిష్టతను కాపాడేందుకు NDSA సిఫార్సు చేసిన వివిధ నివారణ, ఉపశమన చర్యలను తక్షణమే అమలు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని లోయర్ ఖజూరీ డ్యామ్, జార్ఖండ్‌లోని బొకారో బ్యారేజ్ వంటి ఇతర కేటగిరి-1 ప్రాజెక్టులను కేంద్రం తన DRIP-II పథకం ద్వారా పునరావాస పనుల్లో చేర్చగా, మేడిగడ్డ విషయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యతను రాష్ట్రానికి సూచించింది. ప్రాజెక్టు భద్రతను నిర్ధారించడానికి, సంబంధిత విపత్తులను నివారించడానికి తక్షణ చర్యలు అవసరమని కేంద్రం తన నివేదికలో పేర్కొంది.

ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎవరిది అధికారం..? ఆసక్తికరంగా సర్వే ఫలితాలు..
గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాలేదు.. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దేశంలో ఇప్పుడే లోక్‌సభ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తాజా సర్వే వెల్లడించింది. ఇండియా టుడే – సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN)’ సర్వే ప్రకారం, NDA మొత్తం 352 లోక్‌సభ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ అంచనాల ప్రకారం, బీజేపీ ఒక్క పార్టీకే 287 సీట్లు దక్కే అవకాశం ఉండటంతో, పార్టీ సొంతంగా మెజారిటీ సాధించే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి భారీ ఊపునిచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే, ఓట్ల శాతం విషయంలోనూ NDAకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో NDAకి 43 శాతం ఓట్ల వాటా లభించగా, ఇండియా బ్లాక్‌కు 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సర్వేను డిసెంబర్ 8, 2025 నుంచి జనవరి 21, 2026 వరకు నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని వయసులు, కులాలు, మతాలు, ఆడ, మగ ఇలా 36,265 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే, గణాంకాల్లో సుమారు ±5 శాతంలోపం ఉండే అవకాశం ఉందని సర్వే నిర్వాహకులు తెలిపారు. అయితే, గత ఎన్నికలు, గత సర్వేతో పోలిస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో NDA 293 సీట్లు, ఇండియా బ్లాక్ 234 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే, ఆగస్టు 2025లో నిర్వహించిన MOTN సర్వేలో NDAకి 324 సీట్లు, ఇండియా బ్లాక్‌కు 208 సీట్లు వస్తాయని అంచనా వేశారు. తాజా సర్వేలో NDA సీట్ల సంఖ్య మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, నాయకత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసమే NDAకి ఈ ఆధిక్యానికి కారణమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఇండియా బ్లాక్ ఈ సర్వేలను జాగ్రత్తగా తీసుకోవాలని, అసలు పోరు ఎన్నికల సమయంలోనే తేలుతుందని అంటోంది.

‘‘రాహుల్ గాంధీ మాకు బూస్ట్, హార్లిక్స్ ఇస్తున్నారు’’.. విజయ్ తండ్రి ప్రతిపాదనపై కాంగ్రెస్..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే, ఈ సారి స్టార్ యాక్టర్ విజయ్ తన పార్టీ టీవీకేతో బరిలో దిగుతుండటంతో రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొంది. దీంతో పొత్తులపై అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే, విజయ్ పార్టీకి కాంగ్రెస్‌తో పొత్తు కుదురుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఆహ్వానం వచ్చింది. టీవీకేతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్‌ను విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ కోరారు. తిరువారూర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని, ఈ అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకోవద్దని సూచించారు. కాంగ్రెస్‌కు గొప్ప చరిత్ర ఉందని, విజయ్ వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ అవకాశాన్ని తీసుకుని కాంగ్రెసన్ తన పాత గౌరవాన్ని పొందాలని, ఇప్పుడు నిర్ణయం కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీవీకే కానీ, విజయ్ కానీ అధికారికంగా స్పందించలేదు.

కిలో వెండి రూ.5 లక్షలకు చేరుతుందా..? ఈ సమయంలో పెట్టుబడి పెట్టొచ్చా..?
బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తూ కేవలం రెండు రోజుల్లోనే రూ.60,000కు పైగా పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బంగారం ధర కూడా రూ.12,000కు పైగా పెరిగింది. అమెరికా – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై చేస్తున్న హెచ్చరికలు, మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం.. ఇవన్నీ కలిసి బంగారం, వెండి ధరలకు భారీ మద్దతుగా మారాయి. గురువారం సాయంత్రం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. వెండి ధర ఒక్క రోజులోనే సుమారు రూ.31,000 పెరిగి రూ.4,17,000 (కిలోకు) చేరింది. బంగారం ధర దాదాపు రూ.9,000 పెరిగి రూ.1,75,000కు చేరగా, ట్రేడింగ్ సమయంలో రూ.1,80,000 స్థాయిని కూడా తాకింది. తాజా డేటాను పరిశీలిస్తే.. జనవరి 27న కిలో వెండి ధర రూ.3.56 లక్షలుగా ఉంటే.. జనవరి 29న కిలో వెండి ధర రూ.4.16 లక్షలకు పెరిగింది.. అంటే కేవలం రెండు రోజుల్లోనే వెండి రూ.60,000 లాభాన్ని చూసింది.. ఇక, జనవరి 27న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.68 లక్షలుగా ఉంటే.. ప్రస్తుతం రూ.1.80 లక్షలకు పెరిగింది.. అంటే సుమారు రూ.12,000 పైకి ఎగబాకింది..

వచ్చే నెలలో LPG నుండి FASTag వరకు రానున్న మార్పులు ఇవే.. బడ్జెట్ వేళ జేబులపై ప్రభావం!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త నెల ప్రారంభంతో, మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన నియమాలు మారబోతున్నాయి. FASTag , బ్యాంకింగ్, ధృవీకరణ వ్యవస్థల నుండి LPG ధరల వరకు, ఫిబ్రవరి 1 నుండి అనేక ప్రధాన మార్పులు జరగనున్నాయి.వచ్చే నెల ఫిబ్రవరి 1 నుంచి ఆర్థిక పరమైన అంశాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. LPG సిలిండర్ ధరలను చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖున సమీక్షిస్తుంటాయి. LPG సిలిండర్ ధరలు కూడా ఫిబ్రవరి 1న విడుదల అవుతాయి. ఫిబ్రవరి 1 ఆదివారం, కంపెనీలు గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్షించి కొత్త ధరలను విడుదల చేస్తాయి. LPG సిలిండర్లు మరింత ఖరీదైనవి అయితే, అది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అయితే, ధరలు తగ్గితే, మీరు తక్కువ ధరకు సిలిండర్‌ను పొందుతారు. LPG సిలిండర్ ధరలతో పాటు, CNG, PNG, ఏవియేషన్ టర్బైన్ ఇంధన ధరలు కూడా ఫిబ్రవరి 1న మారే అవకాశం ఉంది. ఈ రోజున చమురు కంపెనీలు కొత్త ధరలను విడుదల చేస్తాయి. ATF ధరలు పెరిగితే, అది విమాన ఛార్జీలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఇంధనం కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తే విమానయాన సంస్థలు టికెట్ ధరలను పెంచవచ్చు.

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేసే దమ్ము పాకిస్తాన్‌కు లేదు..
టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్‌లో ఆడమని చెప్పిన బంగ్లాదేశ్, చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా మేము కూడా టోర్నీని బహిష్కరించే ఆలోచన చేస్తామని చెప్పిన పాకిస్తాన్, ఇంకా టోర్నీ ఆడుతుందా లేదా అనే క్లారిటీ ఇవ్వలేదు. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) చీఫ్ మొహ్సీన్ నఖ్వీ మాత్రం, ఆ దేశ ప్రధాని షెహజాబ్ షరీఫ్‌తో రెండు రోజుల క్రితం భేటీ అయ్యారు. పాక్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనే విషయంపై సోమవారం స్పష్టత రానుంది. అయితే, పాకిస్తాన్ పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకునే అవకాశం చాలా తక్కువ అని తెలుస్తోంది. కానీ భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మాత్రం బాయ్‌కాట్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఉంది. దీనిపై, అజింక్య రహానే క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు అలా చేయరని నేను అనుకుంటున్నాను. భారత్‌తో మ్యాచ్ బహిష్కరించే ధైర్యం వాళ్లకు లేదు.’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం రెహానే వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరోవైపు, పాకిస్తాన్ 15 మందితో తన జట్టును ప్రకటించింది.

Exit mobile version