కాకినాడ జిల్లాలో ఈ చర్యలు తీసుకోండి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు..
మొంథా తుఫాన్ కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యా్‌ణ్.. కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి పి. నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో 12 మండలాలపై ప్రభావం ఉంటుందనీ తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగు నీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలి అన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియచేయాలని తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి, విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది.. వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెలుసుకొని.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
విరుచుకుపడుతున్న మొంథా తుఫాన్.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు..!
తీవ్ర తుఫాన్ ముప్పు ముంగిట్లో ఉన్నాయి కోనసీమ, కాకినాడ జిల్లాలు …. కాకినాడకు దక్షిణంగా తీరం దాటవచ్చని తాజాగా అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.. తీరం దాటే సమయంలో 100 – 110 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. మరో 72 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.. విద్యుత్, టెలికాం వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.. విశాఖ కేంద్రంగా 9 జిల్లాల్లో పరిస్థితి సమీక్షిస్తున్నారు సీనియర్ IAS అజయ్ జైన్.. రాయలసీమ నుంచి అదనపు సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాలకు తరలిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు.. తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారుతుంది. రాను రాను తుఫాను తీవ్రత పెరగడంతో జిల్లాలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రేపు సాయంత్రం తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో వీచే భారీ గాలులకు తీవ్ర నష్టం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడ ప్రాణం నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నరసాపురం తీరప్రాంతానికి ఎన్టీఆర్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొనేందుకు చేరుకున్నాయి. అనుకోని నష్టం జరిగితే ఈ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేస్తాయి. ఇక, తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై బలంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, గాలుల తీవ్రత కారణంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయింది. ప్రస్తుతం విపత్తుల నిర్వహణ కేంద్రం నుంచి ఎండీ ప్రఖర్ జైన్ స్వయంగా తుఫాన్ పరిస్థితులను సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగానికి అవసరమైన దిశానిర్దేశాలు జారీ చేస్తున్నారు. తుఫాన్ తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంతాల వద్ద తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో గాలులు తీవ్రంగా వీసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు.. 3 సార్లు రిజిస్ట్రేషన్..!
కర్నూలు బస్సు దర్ఘటనలో దగ్ధమైన బస్సు రిజిస్ట్రేషన్ పై అనుమానంతో అధికారులు పూర్తిస్ధాయి విచారణ చేపట్టారు.. బస్సును సీటర్‌గా రిజిష్టర్ చేసి స్లీపర్ గా మార్చడానికి డామన్ అండ్ డయ్యూ దాకా తీసుకెళ్ళినట్టు గుర్తించారు… పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, ఈ విధంగా ఆల్టరేషన్లు చేసిన బస్సులపై తనిఖీలు చేస్తున్నామని, కర్నూలు దుర్ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా.. విజయవాడలో NTVతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. కర్నూలు బస్సు ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు ఏపీ రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా.. కర్నూలు జిల్లాలో దగ్ధమైన బస్సు మూడు సార్లు రిజిస్ట్రేషన్ అయ్యిందన్నారు.. మొదట తెలంగాణలోని మేడ్చల్ లో 53 సీటింగ్ వెహికల్‌గా రిజిష్టర్ చేసారు.. తరువాత వి. కావేరి యజమాని కొనుగోలు చేసి 2023లో 43 సీటింగ్ వాహనంగా డామన్ అండ్ డయ్యూలో రిజిష్టర్ చేసారు.. ఆ తరువాత డామన్ అండ్ డయ్యూ వాళ్లు 43 సీటింగ్ గానే NOC ఇచ్చారు.. అక్కడ నుంచి తీసుకొచ్చి ఒడిశాలో 43 స్లీపర్ గా రిజిష్టర్ చేశారు.. మొత్తం రిజిష్ట్రేషన్ విషయంలో అనుమానాలపై కర్నూలు ఎస్పీ విచారణ జరుపుతున్నారని తెలిపారు.. 600 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్ తో మిగతా రాష్ట్రాలకు ఏపీ మీదుగా తిరుగుతున్నవి పరిశీలిస్తున్నాం.. 200 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్ తో బయట రిజిష్టర్ అయ్యి ఏపీలో తిరుగుతున్నాయి.. 1600 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్ తో ఏపీలో రిజిష్టర్ అయ్యి ఏపీలో తిరుగుతున్నాయి.. మొత్తం బస్సులు అన్ని మేం తనిఖీలు నిర్వహిస్తాం అని వెల్లడించారు ఏపీ రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా..
నెల్లూరుపై తుఫాన్ తీవ్ర ప్రభావం.. 144 పునరావాస కేంద్రాలు ఏర్పాటు..
నెల్లూరు జిల్లాను బలంగా కొట్టేందుకు తుఫాన్ దూసుకొస్తుంది. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అందుకు తగ్గట్లుగానే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా చర్యలు తీసుకుంటుంది నెల్లూరు జిల్లా యంత్రాంగం. 144 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. ప్రతి రెవిన్యూ డివిజన్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.. బంగాళాఖాతంలో ఏర్పడిన ముంత తుఫాను తీవ్ర రూపం దాలుస్తోంది. గంట గంటకు తుఫాను చెన్నై వైపు దూసుకు వస్తోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తీర ప్రాంతం మండలాలలో దీని ప్రభావం అతి తీవ్రంగా ఉండబోతోంది. దీంతో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆయా మండలాలపై దృష్టి పెట్టారు. జలదిగ్బంధంలో చిక్కుకునే గ్రామాలపై ఫోకస్ పెట్టారు. సుమారు 160 గ్రామాలను ఇప్పటికే గుర్తించిన కలెక్టర్ ఆయా ప్రాంతాలలోంచే నీటిని బయట ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ నుంచి విమానాలు రద్దు..
తీరం వైపు దూసుకు వస్తుంది మొంథా తుఫాన్.. ఇప్పటికే తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారిపోయాయి.. మరోవైపు, అప్రమత్తమైన రైల్వే శాఖ.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధితో పాటు.. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కూడా పలు రైలు సర్వీసులను మూడు రోజుల పాటు రద్దు చేసింది.. ఇక, మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన విమానయాన శాఖ.. మొంథా తుఫాను నేపథ్యంలో రేపు పలు విమానాలు విజయవాడ నుంచి రద్దు చేసినట్టు ప్రకటించారు.. ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమానాలు విజయవాడ నుంచి రేపు రద్దు చేస్తున్నట్టు ప్రకటంచింది ఎయిర్‌పోర్ట్ అథారిటీ.. IX 2819 విశాఖపట్నం – విజయవాడ, IX-2862 విజయవాడ – హైదరాబాద్, IX-2875 బెంగళూరు – విజయవాడ, IX-2876 విజయవాడ – బెంగళూరు, IX-976 షార్జా – విజయవాడ, IX-975 విజయవాడ – షార్జా, IX2743 హైదరాబాద్ – విజయవాడ, IX-2743 విజయవాడ – విశాఖపట్నం విమానాలను అక్టోబర్ 28వ తేదీన రద్దు చేసినట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ.. ఇందులో షార్జా నుంచి రావాల్సిన.. షార్జాకు వెళ్లాల్సిన రెండు విమానాలను సైతం రద్దు చేశారు.. మొత్తంగా మొంథా తఫాన్ నేపథ్యంలో.. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన.. విజయవాడకు రావాల్సిన విమాన సర్వీసులను అన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది ఎయిరిండియా..
విజయవాడకు మొంథా తుఫాన్ ముప్పు.. రోడ్లపైకి రావద్దు..! నగరవాసులకు వీఎంసీ వార్నింగ్
తీరం వైపు దూసుకొస్తున్న మొంథా తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను టెన్షన్ పెడుతోంది.. మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు.. రేపు అత్యవసరమైతే తప్పా ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్న అధికారులు.. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.. మెడికల్ షాపులు, కూరగాయలు, పాలు విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని సూచిస్తున్నారు.. రోడ్లపై రాకపోకలు తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు వీఎంసీ అధికారులు.. చివరకు వాకింగ్ కి వెళ్లొద్దని సూచించారు.. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.. అత్యవసర పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్: 9154970454, వీఎంసీ కంట్రోల్ రూమ్: 0866 2424172, 0866 2422515, 0866 2427485 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు..
రియాజ్ కుటుంబానికి పోలీసుల వేధింపులు.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు..!
ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC)ను ఆశ్రయించారు. తన కొడుకు ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, ఆ తరువాత పోలీసులు తమను వేధిస్తున్న తీరుపై రియాజ్ తల్లి, భార్య, పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రియాజ్ కుటుంబ సభ్యులు తమను స్వగ్రామంలోకి కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కమిషన్‌కు వివరించారు. మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్‌తో రియాజ్‌కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయని రియాజ్ కుటుంబ సభ్యులు కమిషన్‌కు వివరించారు. రియాజ్ భార్య తన ఫిర్యాదులో.. కానిస్టేబుల్ ప్రమోద్ ఒక కేసు విషయంలో రియాజ్‌ను రూ. 3 లక్షలు డిమాండ్ చేశారని.. రియాజ్ అప్పటికప్పుడు రూ. 30 వేలు చెల్లించాడని తెలుపుతూ.. మిగతా డబ్బులు ఇవ్వాలని ప్రమోద్ రియాజ్‌ను తీవ్రంగా వేధించారని ఆరోపించింది. ఇకపోతే ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గతంలోనే సుమోటోగా కేసు స్వీకరించింది. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను వచ్చే నెల (నవంబర్) 24వ తేదీలోపు సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్ ఆదేశించారు.
ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్-బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వం..!
శంషాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్ మైనార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన అనేది బీజేపీతో కుమ్మక్కై నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనార్టీ డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేసింది. మైనార్టీల కోసం రూ. 4 వేల కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ పాలనను సమర్థించుకుంటూ.. మేం కూడా కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ భారతదేశంలో మైనార్టీల కోసం కేసీఆర్ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాల్లో అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారు.. కానీ ఇక్కడ మాత్రం చెప్పరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిలో వైరుధ్యాన్ని కేటీఆర్ ఎత్తిచూపారు. బుల్డోజర్ రాజ్యం నడవదని యూపీపై రాహుల్ గాంధీ విమర్శిస్తారు.. కానీ, ఇక్కడ అదే బుల్డోజర్ రాజ్యం నడుస్తుంటే.. ఆయన సైలెంట్‌గా ఎందుకు ఉన్నారు? హైడ్రా గురించి కూడా రాహుల్ గాంధీ సైలెంట్‌గా ఉంటారని నిలదీశారు. రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ మధ్య రహస్య ఒప్పందం ఉందని కేటీఆర్ పరోక్షంగా ఆరోపించారు. “చౌకీదార్ చోర్” అని రాహుల్ అంటే, రేవంత్ రెడ్డి మాత్రం కాదు కాదు.. ఆయన నా పెద్దన్న అని చెబుతారని అన్నారు. అలాగే సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు మోడీ జేబు సంస్థలని.. రాహుల్ విమర్శిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తారని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి బంధువుకు కేంద్రంలో కాంట్రాక్టులు వస్తాయి.. దానికి బదులుగా రేవంత్ రెడ్డి కూడా బీజేపీ నేతకు లాభం చేకూరుస్తారని మంది పడ్డారు.
ఈ డాక్యుమెంట్స్ లేకపోతే.. మీ పేరు SIR జాబితా నుంచి తొలగింపే!
ఎన్నికల సంఘం SIR రెండవ దశను ప్రకటించింది. బీహార్ తరువాత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. వీటిలో అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఓటర్లు SIR కోసం సమర్పించాల్సిన పత్రాల జాబితాను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. మీ వద్ద ఈ పత్రాలు ఉంటే, మీరు వాటిని మీ BLOకి చూపించాలి. ఈ పత్రాలను సమర్పించని వారు SIR తర్వాత తయారుచేసిన ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చడంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
దేశంలో 22 నకిలీ విశ్వవిద్యాలయాలు.. లిస్ట్ రిలీజ్ చేసిన యూజీసీ
భారత్ లోని 22 విశ్వవిద్యాలయాలను నకిలీ విశ్వవిద్యాలయాలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రకటించింది. నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. UGC చట్టబద్ధమైన విశ్వవిద్యాలయాలుగా చెప్పుకుంటూ ప్రవేశాలు కల్పిస్తూ, UGC నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 22 సంస్థల జాబితాను UGC విడుదల చేసింది. ఈ సంస్థల నుంచి పొందిన ఏ డిగ్రీ అయినా చెల్లదని అభ్యర్థులు గమనించాలి. UGC రాష్ట్రాల వారీగా నకిలీ సంస్థల జాబితా ప్రకారం, ఢిల్లీలో అత్యధికంగా 10 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దీని తరువాత ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో రెండు, మహారాష్ట్ర, పుదుచ్చేరిలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఏదైనా విశ్వవిద్యాలయం లేదా సంస్థలో చేరే ముందు ఆ విశ్వవిద్యాలయం లేదా సంస్థ గుర్తింపును తనిఖీ చేయాలని UGC విద్యార్థులందరినీ హెచ్చరించింది. నకిలీ విశ్వవిద్యాలయం నుండి పొందిన డిగ్రీకి చట్టపరమైన లేదా విద్యాపరమైన విలువ ఉండదని స్పష్టం చేసింది.
రోహిత్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు.. ప్రపంచ కప్ లక్ష్యంగా..?
భారత్, ఆస్ట్రేలియా సిరీస్ అందిరికి మాములు సిరీస్ మాత్రమే. కాకపోతే టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్స్ రోహిత్ శర్మ, కోహ్లీలకు ఒక కీలకమైన అస్సైన్‌మెంట్. అందులో ముఖ్యంగా ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన రోహిత్‌పై.. కెప్టెన్సీని కోల్పోవడం, ఫామ్ కోల్పోయాడనే సందేహాలు విమర్శకులలో నెలకొన్నాయి. అయితే వాటి అన్నింటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన రోహిత్, ఈ సిరీస్‌ను మూడు మ్యాచుల్లో 202 పరుగుల అద్భుతమైన ప్రదర్శనతో ముగించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. ఇది ఇలా ఉండగా.. చివరి వన్డే ముగిసిన తర్వాత, రోహిత్ శర్మకు మరో ప్రత్యేక పురస్కారం లభించింది. అదే ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఈ ప్రత్యేక అవార్డును అందించింది. ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును టీమ్ ఇండియా స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ అడ్రియన్ లే రూక్స్ అందింస్తూ.. ఈ అవార్డు ఒక ప్రత్యేక వ్యక్తికి ఇవ్వడం గొప్ప గౌరవం. ఒక నాయకుడిగా, అనుభవజ్ఞుడైన ఆటగాడిగా రోహిత్ అందుకు అర్హుడు అని మేమంతా ఏకీభవిస్తాం అని ప్రశంసించి అవార్డు అందించారు.
బావుమా రీ-ఎంట్రీ.. టీమిండియాతో తలపడే సౌతాఫ్రికా జట్టు ఇదే..!
భారత్ పర్యటనకు సిద్ధమవుతున్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ 15 మంది టెస్టు జట్టును అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో టీమిండియాను ఎదుర్కోనున్నారు. ఈ సుదీర్ఘ సిరీస్ సుమారు నెల రోజులపాటు జరగనుంది. గాయం కారణంగా ఇటీవల పాకిస్థాన్ సిరీస్‌కు దూరమైన కెప్టెన్ బావుమా ఈసారి తిరిగి జట్టులోకి చేరి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆయన రీ-ఎంట్రీతో సఫారీ జట్టు మరింత బలంగా కనపడుతుంది. పాక్ సిరీస్‌లో ఆడిన ప్రధాన ఆటగాళ్లలో చాలా మందికి ఈ టెస్టు జట్టులో చోటు దక్కింది. సఫారీ జట్టు నవంబర్ 14న ప్రారంభమయ్యే మొదటి టెస్టుతో తమ పర్యటనను ఆరంభిస్తుంది. మొదటి టెస్టు నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలో, రెండో టెస్టు నవంబర్ 22 నుంచి 26 వరకు గువాహటిలో జరగనుంది. ఇక ఆ తర్వాత మూడు వన్డే మ్యాచ్‌లు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతాయి. ఇవి రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నం వేదికలుగా జరగనున్నాయి. ఆ తర్వాత జరిగే ఐదు టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి 19 వరకు కొనసాగుతుంది. వీటికి కటక్, ముల్లాన్‌పూర్, ధర్మశాల, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వేదికలు ఎంపికయ్యాయి.
పవన్ సినిమా నెక్ట్స్ లెవల్ అంతే.. శ్రీలీల హింట్
శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్ళీ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ఈ బ్యూటీ పేరు మార్మోగిపోతుంది. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర సినిమాలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా శ్రీ లీల వరుస ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మూవీ గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది. నేను రవితేజతో ఇప్పటికే ఓ సినిమా చేశాను. ఇది నాకు రెండో సినిమా. ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది. ఇక నేను పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మూవీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఫ్రెండ్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో ఆ సినిమా అలాగే ఉంటుంది. అందరికీ కావాల్సిన బోలెడంత ఎంటర్ టైన్మెంట్ అందులోనే ఉంటుంది. గతంలో ఎన్నడు చూడని విధంగా ఆ సినిమా ఉంటుంది అంటూ హైట్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది చూసిన ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. మరి ఈ రెండు సినిమాలు శ్రీ లీల కెరీర్ ఏ స్థాయిలో నిలబెడతాయో చూడాలి.
అలాంటి సీన్లు చేయకపోతే కెరీర్ ఉండదు.. హీరోయిన్ కామెంట్స్
తెలుగు బ్యూటీ ధన్య బాలకృష్ణన్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె నుంచి కృష్ణలీల అనే సినిమా వస్తోంది. దేవన్ హీరోగా స్వీయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ధన్య హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో ధన్య మాట్లాడుతూ.. ఈ సినిమా నా కెరీర్ కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నా. నేను సినిమాల్లో చాలా కండీషన్లు పెట్టుకున్నాను. అందుకే పెద్ద స్థాయికి ఎదగలేకపోయాను. ఇంటిమేట్ సీన్లు చేయొద్దని, రొమాంటిక్ సీన్లు చేయొద్దని ఇలా చాలా కండీషన్లు పెట్టుకున్నాను. అలా ఎన్నో సినిమా ఛాన్సులు వదులుకున్నా. ఒకవేళ అన్ని సీన్లు చేసి ఉంటే ఈ పాటికి మంచి పొజీషన్ లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడున్న పొజీషన్ కు నేను చాలా సంతోషిస్తా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను.. ఈ స్థాయి దాకా ఎదుగుతానని అనుకోలేదు. అదే నాకు గొప్ప ఫీలింగ్ ఇస్తుంది. పెద్ద సినిమాలు చేయడం కన్నా కూడా మంచి సినిమాలు చేయడమే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది ధన్య. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ తెలుగులో కొన్ని బోల్డ్ సినిమాల్లో కూడా నటించింది. వాటి వల్ల ఆమెకు కొంత నెగెటివిటీ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి క్రేజ్ సంపాదించుకుంటుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
