Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సీఎం పదవిపై నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!
మహానాడు వేదికగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతోంది.. మరోవైపు, లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలనే అభిప్రాయం కూడా గతంలో గట్టిగానే వినిపించింది.. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిపై మంత్రి నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో నారా లోకేశ్ చిట్‍చాట్‌లో తదుపరి సీఎం మీరేగా అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది? అని ప్రశ్నించారు.. సీఎం చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు.. ఆయన ఇంకా యువ నాయకుడే అని అభివర్ణించారు.. దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా అవసరం.. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు నారా లోకేష్‌..

రేపు, ఎల్లుండి జాగ్రత్త..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఈశాన్య రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తరదిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని.. 29న వాయుగుండంగా మారేందుకు ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ రోణంకి కూర్మనాథ్.. రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.. ఇక, ఎల్లుండి అనగా గురువారం రోజు పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.. మరోవైపు.. మంగళవారం సాయంత్రం 5గంటల నాటికి అనకాపల్లి జిల్లా పాములవాకలో 46.5 మిమీ, నరసింగపల్లిలో 41.2 మిమీ, యలమంచిలిలో 40.7మిమీ, అల్లూరి జిల్లా అనంతగిరి 37.5మిమీ, అనకాపల్లిలో 29మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు..

మహానాడుపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు.. ఈ పదం విన్నా, చదివినా..!
కడప మొత్తం పసుపు మయం అయ్యింది.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు అంగరంగవైభవంగా సాగుతోంది.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోన్న ఈ మహానాడుకు ప్రాధాన్యత ఏర్పడింది.. అయితే, కూటమిలో కీలకంగా ఉన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. మహానాడు ప్రారంభమైన సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలుగుదేశం పార్టీపై ప్రశంసలు కురిపించారు.. మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు పెట్టారు పవన్‌ కల్యాణ్.. “మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై.. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వములో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులుకు శుభాభినందనలు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”.. అంటూ పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

తిరుమల మెట్ల మార్గంలో మళ్లీ చిరుతల అలజడి.. నిపుణులతో టీటీడీ ఈవో భేటీ
తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుతలు అలజడి సృష్టిస్తున్నాయి.. గతంలో భక్తులపై దాడి, ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉండడంతో టీటీడీ అప్రమత్తమైంది.. నిపుణులతో సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు… అలిపిరి మెట్ల మార్గంలో భ‌క్తుల భ‌ద్రత‌కు అద‌న‌పు సిబ్బంది కేటాయించాలని నిర్ణయించారు. ఎప్పటిక‌ప్పుడు ఆరోగ్యశాఖ ద్వారా చెత్తను తొల‌గించేందుకు చ‌ర్యలు తీసుకోవాలని.. టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో న‌డ‌క‌మార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహించాలని.. మానవ-వన్యప్రాణి ఘర్షణ నివారణకు తక్షణ, దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో Wild Life Institute, అటవీ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. అలిపిరి మార్గాన్ని “చిరుత రహిత ప్రాంతంగా” మార్చేందుకు కెమెరా ట్రాప్‌లు, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగ్‌లు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్‌లు, పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగించేలా టీటీడీ చర్యలకు దిగనుంది.. నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షలు, అవగాహన కల్పించనున్నారు.. అలిపిరి మెట్ల మార్గంలో 2.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ఏడవ మైలు నుండి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పన, నిఘాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఈవో శ్యామలరావు.. ప్రతి నెల మానవ – వన్యప్రాణి ఘర్షణలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించాలని పేర్కొన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు.

ఇక, అధికారికంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకులను జరపాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక నుండి ప్రతీ సంవత్సరం మే 28 తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం… అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఈ వేడుకలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చారు ఏపీ సర్కార్ చీఫ్ సెక్రటరీ విజయానంద్.. సచివాలయంలోని అన్ని విభాగాలు, అన్ని విభాగాధిపతులు, రాష్ట్రంలోని అన్ని కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొంది ప్రభుత్వం.. ఓవైపు కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోంది.. ఈ పసుపు పండగ వేదికగా ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు.. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు జరగనున్నాయి.. ఇక, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించే విషయం విదితమే..

భూభారతి పేద రైతులకు చుట్టం.. అవగాహన సదస్సులు నిర్వహించాలి
మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను అభినందిస్తున్నానన్నారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది.. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించాం.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని తెలిపారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయి.. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి.. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారు.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి.. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండాలి.. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి.. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి.. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి.. ఒక్క నిముషం వృధా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు.. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి.. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. విచారణకు వెళ్లేది ఆ రోజే..?
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది. అయితే, కాళేశ్వరం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5వ తేదీన కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కాగా, గులాబీ బాస్ కి కాళేశ్వరం మిషన్ నోటీసులు ఇచ్చినప్పటికీ నుంచి పార్టీలో కమిషన్ ముందు హాజరు కావాలా లేదా అని అంశంపై తర్జనభర్జన జరిగింది.. కానీ, చివరకు వచ్చే నెల 5న విచారణకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మరోవైపు, జూన్ 6న ఈటెల రాజేందర్, చివరగా జూన్ 9వ తేదీన హరీష్ రావు హాజరవ్వాలని నోటీసుల్లో పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్నారు.

హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
సుప్రీం కోర్టు కొలీజియం హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేసింది. మే 26న జరిగిన సమావేశంలో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జీల బదిలీలకు సిఫారసు చేసింది. న్యాయమూర్తి సుజోయ్ పాల్ తెలంగాణ నుంచి కలకత్తా కు బదిలీ, న్యాయమూర్తి వి. కామేశ్వర్ రావు కర్ణాటక నుంచి ఢిల్లీ కి, న్యాయమూర్తి లనుసుంకుమ్ జామిర్ గౌహతి నుంచి కలకత్తా కు, న్యాయమూర్తి మనాష్ రంజన్ పాఠక్ గౌహతి నుంచి ఒరిస్సా కు, న్యాయమూర్తి నితిన్ వాసుదేవ్ సంప్రే బాంబే నుంచి ఢిల్లీ కి, న్యాయమూర్తి అశ్విని కుమార్ మిశ్రా అలహాబాదు నుంచి పంజాబ్ & హర్యానా కు, న్యాయమూర్తి సుమన్ శ్యామ్ గౌహతి నుంచి బాంబే కు బదిలీ.. న్యాయమూర్తి సంజీవ్ ప్రకాశ్ శర్మ పంజాబ్ & హర్యానా నుంచి రాజస్థాన్ కు బదిలీ, న్యాయమూర్తి వివేక్ చౌధరీ అలహాబాదు నుంచి ఢిల్లీ కి బదిలీ, న్యాయమూర్తి దినేశ్ కుమార్ సింగ్ కేరళ నుంచి కర్ణాటక కు, న్యాయమూర్తి వివేక్ కుమార్ సింగ్ చెన్నై నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ, న్యాయమూర్తి బట్టు దేవానంద్ చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ, న్యాయమూర్తి ఓం ప్రకాష్ శుక్లా అలహాబాదు నుంచి ఢిల్లీ కి బదిలీ న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్ రాజస్థాన్ నుంచి బాంబే కు బదిలీ, న్యాయమూర్తి సుధీర్ సింగ్ పంజాబ్ & హర్యానా నుంచి పట్నా కు బదిలీ..

టర్కీ భారత్‌ని కాదని పాకిస్తాన్‌కి ఎందుకు మద్దతు ఇస్తోంది..?
టర్కీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతీయులు ఆ దేశంపై మండిపడుతున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కిష్ డ్రోన్లతో పాటు వాటిని ఆపరేట్ చేయడాని ఆ దేశ సిబ్బందిని కూడా నియమించింది. భారత్ జరిపిన దాడుల్లో డ్రోన్లతో పాటు, వాటిని ఆపరేట్ చేయడానికి వచ్చిన సిబ్బంది కూడా హతమయ్యారు. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనకు వెళ్లారు. అయితే, ఎర్డోగాన్ టర్కీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పూర్తిగా భారత వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. 2019లో భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు, భారత్ చర్యలకు వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కి మద్దతుగా టర్కీ మాట్లాడింది. తాజాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మాట్లాడుతూ.. ‘‘మేము పాకిస్తాన్ ప్రజలతో నిలబడతాము. నేను సోదరుడు షాబాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసి, మేము కలిసి ఉన్నామని చెప్పాను. భవిష్యత్తులో కూడా మేము పాకిస్తాన్‌తో నిలబడతాము.” అని చెప్పారు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్కి ఎగబాకిన పాక్‌ ప్లేయర్‌
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ బౌలర్‌ సదియా ఇక్బాల్‌ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. సదియా, ఇంగ్లండ్‌ బౌలర్‌ సోఫీ ఎక్లెస్టోన్‌ను వెనక్కి నెట్టి టాప్‌ ప్లేస్‌కు దూసుకెళ్లింది. గత వారం ర్యాంకింగ్స్‌లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆమె ఓ స్థానం మెరుగుపర్చుకుంది. అయితే, సదియా ఖాతాలో 746 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. భారత స్టార్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ (737 పాయింట్లు), ఆసీస్‌ బౌలర్‌ అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక, సోఫీ ఎక్లెస్టోన్‌ ఖాతాలో 734 పాయింట్లు ఉండటంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక, భారత పేసర్‌ రేణుక సింగ్‌ ఠాకూర్‌ ఐదో స్థానంలో కొనసాగుతుంది. అలాగే, ఇంగ్లండ్‌ బౌలర్‌ లారెన్‌ బెల్‌ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది. మరో ఇంగ్లండ్‌ బౌలర్‌ చార్లీ డీన్‌, పాక్ బౌలర్‌ సష్రా సంధు, ఆస్ట్రేలియా బౌలర్‌ జార్జియా వేర్హమ్‌ ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, ఇంగ్లండ్‌ బౌలర్‌ సారా గ్లెన్‌ 10వ స్థానంలో ఉంది. టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్‌ 16, శ్రేయాంక పాటిల్‌ 21, పూజా వస్త్రాకర్‌ 33 స్థానాల్లో కొనసాగుతున్నారు.

పవన్ ఆదేశాలు.. థియేటర్లలో సోదాలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏపీలోని సినిమా థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు చేశారు. అలాగే పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్‌ థియేటర్లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రోజు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో పవన్ కల్యాణ్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్ల బంద్ అంశంతో పాటు సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల సమస్యలపై లోతుగా చర్చించారు. థియేటర్లలో తినుబండారాల ధరలు అధికంగా ఉండటంతో ప్రేక్షకులు సినిమాలకు దూరంగా ఉంటున్నారనే వాదన బలంగా ఉంది. దీంతో థియేటర్లలో తనిఖీలు చేపట్టాలని మంత్రి కందుల దుర్గేశ్ తో పటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాప్‌కార్న్ తో పాటు పఫ్ లు, స్వీట్ కార్న్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ పై అధిక ధరలు ఉన్నాయనే వాదన ఉంది.

‘భైరవం’ యూనివర్సల్ సబ్జెక్ట్‌.. ఇంటర్వెల్ సీక్వెన్స్ అద్భుతం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తున్న ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’ టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పణలో, ఈ చిత్రం మే 30న సమ్మర్ సీజన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నారా రోహిత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు ఫోన్‌లో కథ గురించి చెప్పారు. ఆయన జడ్జిమెంట్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. శశి కుమార్ క్యారెక్టర్ గురించి వివరించారు. సినిమా చూశాను, చాలా నచ్చింది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళ్‌లో రస్టిక్ విలేజ్ డ్రామాగా తీసిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. ‘గరుడన్’ చూసినవారికి కూడా ఇది ఒరిజినల్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. మాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది, పర్సనల్‌గా కూడా చాలా దగ్గరగా ఉంటాం. దీంతో సెట్‌లో కంఫర్ట్ లెవెల్ బాగుంది. డైరెక్టర్ విజయ్‌కి స్పష్టమైన విజన్ ఉంది. ప్రతి క్యారెక్టర్ నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ కావాలో ఆయనకు తెలుసు. మాకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత, ఎమోషనల్ డెప్త్ ఉంటాయి.

పవన్ మాటలతో ఏకీభవిస్తున్నా.. స్నాక్స్ రేట్లు తగ్గించాలి!
సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశం పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని దిల్ రాజు అన్నారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు. అలాగే, థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ కి సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి, ఒక సినిమా ఎంత కాలానికి ఓటీటీకి వెళ్ళాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని ఆయన సినీ వర్గాల వారిని అన్నారు. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత, ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుంది.

Exit mobile version