NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సచివాలయ ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. 5 రోజుల పనిదినాలు పొడిగింపు..
సచివాలయంతో పాటు.. వివిధ హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటికే అమల్లో ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాన్ని పొగిడిస్తూ చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.. ఏపీ సచివాలయంతో పాటు హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉండనుంది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్.. ఇవాళ్టి నుంచి వారానికి ఐదు రోజుల పనివిధానం అమల్లోకి వస్తుందని.. నేటి నుంచి ఏడాది పాటు వారానికి ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్‌. కాగా, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు.. కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.. రాజధానిలో క్వార్టర్స్‌తో పాటు ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు.. విభజన తర్వాత హైదరాబాద్‌లోనే తమ కుటుంబాలు ఉండడంతో.. సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు.. ఆ ర్వాత హైదరాబాద్‌కు వచ్చి వారి కుటుంబాలతో గడిపేవారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలనుకున్నారు.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ విధానాన్ని ఎత్తివేయాలనే ఆలోచన చేసింది.. కానీ, ఉద్యోగుల విజ్ఞప్తితో ఆ వెసులుబాటును కొనసాగించింది.. అమరావతి నిర్మాణం అగిపోయినా.. ఉద్యోగుల ఐదు రోజుల పనివిధానం కొనసాగుతూ రాగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అమరావతి రాజధానిపై వేగంగా అడుగులు వేస్తోంది.. మరోవైపు.. సచివాలయ ఉద్యోగులకు గతంలో కల్పించిన ఐదు రోజుల పని దినాల వెసులుబాటు త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో.. ఐదు రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్.

ఆస్తి కోసం తల్లిదండ్రుల హత్య..! తాగునీటిలో విషం కలిపి..
ఆస్తి ముందు.. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్నవారు.. తోబుట్టులు.. ఇలా ఎవరూ కనబడడం లేదు.. ఆస్తి ఉంటేచాలన్న దురాశతో.. అయినవారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు.. ప్రాణాలు తీస్తున్నారు కూడా.. ఇప్పటికే ఎంతో మంది ఆస్తుల విషయం ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తాజాగా, అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొత్త వడ్డేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిని కాజేసేందుకు కన్న కొడుకు ఉప్పుతోళ్ల వెంకటరమణ అనే వ్యక్తి తన భార్య కళావతితో కలిసి తల్లి తండ్రికి తాగునీటిలో విషద్రావం కలిపి తాగించారు.. విషయం కలిపిన నీటిని తాగిన ఉప్పుతోళ్ల చిన్న సుబ్బన్న (80), ఉప్పుతోళ్ల నాగమ్మ (75) లు అపస్మార్క స్థితిలో పడిపోయారు.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో చిన్న సుబ్బన్న మృతి కిందగా, నాగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.. ఆస్తి కోసమే కొడుకు రమణ, కోడలు కళావతి కలిసి విషయం ఇచ్చి చంపివేశారంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు.

ఒకే ఒక ఎన్టీఆర్, ఒకే ఒక రామోజీరావు.. ఇద్దరూ ఇద్దరే..
ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు.. ఇద్దరూ ఇద్దరే అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లోని కానూరులో ప్రభుత్వం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో పాటు రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్నది ప్రతీ ఒక్కరి ఆకాంక్ష అన్నారు.. ఇక, అమరావతి, ఢిల్లీలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం.. అమరావతిలో ఓ రోడ్ కు రామోజీ మార్గ్ అని పేరు పెడతాం.. విశాఖలో రామోజీరావు చిత్రపురి నిర్మిస్తాం అని పేర్కొన్నారు.. భయమనేది రామోజీరావు జీవితంలో లేదు.. పోరాటం ఆయనలో ఓ భాగం.. రామోజీరావు అక్షర శిఖరం.. సాధారణ కుటుంబంలో పుట్టి అచంచలమైన విశ్వాసంతో ఎదిగారు.. రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ.. చేపట్టిన ఏ రంగమైనా ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేశారు అంటూ ఆ అక్షర యోధుడిని స్మరించుకున్నారు. మార్గదర్శిలో ప్రతీ పెట్టుదారుడు రామోజీరావు వెంటే నిలిచారంటే అదీ ఆయన విశ్వసనీయత అన్నారు చంద్రబాబు.. 40 ఏళ్లుగా నెంబర్1 లో ఈనాడు ఉందంటే ఎంతటి కార్యదీక్ష ఉందో అందరూ అర్ధం చేసుకోవాలన్న ఆయన.. రాజధానికి రామోజీరావు సూచించిన పేరు ప్రపంచ మంతా మార్మోగింది.. తెలుగు భాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత.. రామోజీరావు స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల ప్రజలది అన్నారు. ఇక, విశాఖలో రామోజీరావు మొదటి అడిషన్ పెట్టారు.. ఈనాడు ప్రజాగళంగా ప్రజా చైతన్యం కోసం పనిచేస్తున్నది.. పత్రికా రంగంలో ఉండి రామొజీరావు ప్రజా సమస్యల కోసం పని చేసారు.. సినిమా రంగంలో, జర్నలిజంలో ఎందరినో తయారు చేసారు.. ఒక మెగా స్కేలులో ఆలోచించి జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు.. ఇతర రాష్ట్రాలలో తుఫానులు వచ్చినా ముందుండి సేవలు అందించారు.. ఏ పని చేసినా ప్రజాహితం కోసం పని చేసారు రామోజీరావు.. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా ప్తజలు గుర్తు పెట్టుకుంటారు అని కొనియాడారు..

తెలుగు రాష్ట్రాలకు రామోజీ ఓ ఉద్యమకారుడు.. రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, తెలుగు రాష్ట్రాలకు రామోజీరావు ఓ ఉద్యమకారుడు.. రాజకీయ దాడులెన్నో తట్టుకుని ఎక్కడా రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దంన్నర నలిగి నలిగి.. ఆయన ఏపీలో కూటమి విజయ వార్త విన్నారో లేదో అని ఆందోళన పడ్డా.. కానీ, రామోజీరావు ఏపీలో విజయాన్ని 24 గంటలు సంపూర్ణంగా ఆస్వాదించారట అన్నారు. రామోజీరావు ప్రజాపక్షపతి.. ఆయనతో మాట్లాడినంత సేపూ ప్రజా శ్రేయస్సు అoశాలే ఎక్కువ ఉంటాయి.. దేశానికి, ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో తరచూ చెప్పేవారు.. రాజకీయ దాడులెన్నో తట్టుకుని ఎక్కడా రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి అన్నారు పవన్‌.. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు రామోజీరావు ఎంతో కృషి చేసారు అని గుర్తుచేసుకున్నారు పవన్‌ కల్యాణ్.. పత్రికా విలువల్లో ఎక్కడా రాజపడని తీరు సాహసోపేతం అని ప్రశంసించారు.. చివరి రోజుల్లో కూడా కూటమి విజయ వార్త విని సంతోషంగా పరమపదించారు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరి స్థాయిలో వారు రామోజీరావు లా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఏ పార్టీని ఆయన వదల్లేదన్నారు. రామోజీరావు జర్నలిజం వారసత్వ సంపదను ఎంత అంది పుచ్చుకున్నామా అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

తెలంగాణలో 18, 942 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు..!
ఈ నెల 8వ తేదీన ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ జరిగింది. పదవీ విరమణకి మూడు సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. పండిట్, పీఈటీ పోస్ట్ లని అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో కోర్టు కేసులతో ఎక్కడ అయితే బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే పాఠశాల విద్యా శాఖ కొనసాగించింది. టెట్ తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయింది. కోర్టులో కేసు నడుస్తుండగా మళ్ళీ ఇబ్బందులు రాకుండా చకచకా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పూర్తి చేశారు. అయితే, టీచర్ల బదిలీలు, పదోన్నతులను దృష్టిలో పెట్టుకొని ఖాళీ అయ్యే పోస్టులను పరిగణనలోకి తీసుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతులు, బదిలీల్లో 18 వేల 942 మంది టీచర్లకి ప్రమోషన్ రానుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ గా 17 వేల 72 మందికి పదోన్నతి లభించనుంది. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ గా 1870 మందికి పదోన్నతి వచ్చింది. ఇక, ఎస్జీటీ బదిలీలు మినహా టీచర్ల పదోన్నతి, బదిలీల ప్రక్రియ పూర్తి అయింది.

ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. నెట్టింట ఫోటోలు వైరల్..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పాత ఓమ్నీ వెహికిల్ ను నడిపారు. కాలి ఆపరేషన్ తర్వాత ఆయన కర్ర సాయం లేకుండా ఇప్పుడిప్పుడే నడుస్తున్నారు. ఈ క్రమంలో మ్యానువల్ కారు నడపాలని డాక్టర్లు ఆయనకు సూచించినట్లు తెలుస్తుంది. దీంతో కేసీఆర్ స్వయంగా ఓమ్నీ వాహనాన్ని నడిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక, కేసీఆర్ వాహనం నడపటంపై నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. ‘సారు మళ్లీ కారు నడుపుతున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతేడాది డిసెంబర్ 8వ తేదీన అర్ధరాత్రి తన నివాసంలో కాలు జారి కేసీఆర్ పడిపోయారు. ప్రమాదానికి గురైన తర్వాత కేసీఆర్‌కు వైద్యులు తుంటి ఎముకకు చికిత్స చేశారు. ఆ తర్వాత డాక్టర్లు కేసీఆర్‌ను వాకర్ సహాయంతో నడిపించారు. డిశ్చార్జ్ అయినా తర్వాత కూడా ఆయన వైద్యుల సూచన మేరకు చాలా రోజులు ఇంటికే పరిమితమై రెస్ట్ తీసుకున్నారు. అనంతరం కొద్ది రోజులకు చేతి కర్ర సాయంతో నడిచిన తర్వాత.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున చేతి కర్ర సాయంతోనే పలు సభలు, సమావేశాల్లోనూ పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని.. డాక్టర్ల సూచనలతో కేసీఆర్ ఓమ్నీ వాహనం నడిపారని పేర్కొన్నారు.

ఈ వ్యాధికి తల్లి పాలు ఔషధం.. ఢిల్లీ ఎయిమ్స్ వెల్లడి
తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రోటీన్ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) సంక్రమణను నాశనం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకంగా పరిగణించబడుతుంది. ఎయిమ్స్‌లోని బయోఫిజిక్స్ అండ్ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన వైద్యులు ల్యాబ్‌లో జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎయిమ్స్ (AIIMS) ఈ పరిశోధన అంతర్జాతీయ మెడికల్ జర్నల్ (ఫ్యూజర్ మైక్రోబయాలజీ జర్నల్)లో ప్రచురించబడింది. భవిష్యత్తులో తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రొటీన్ నుండి బ్లాక్ ఫంగస్‌కు ఔషధాన్ని తయారు చేయవచ్చని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఇది యాంఫోటెరిసిన్-బితో ఉపయోగించవచ్చని పేర్కొ్న్నారు. డాక్టర్‌ సుజాత శర్మ, డాక్టర్‌ ప్రదీప్‌ శర్మ, ఎయిమ్స్‌ బయోఫిజిక్స్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ తేజ్‌ పి సింగ్‌, మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఇమ్మాక్యులటా జెస్‌ సంయుక్తంగా పరిశోధన చేశారు. అనియంత్రిత మధుమేహం, క్యాన్సర్, అవయవ మార్పిడి, కాలిన రోగులు, ఐసీయూలో చేరిన రోగులకు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోగుల రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. మరోవైపు.. కరోనా సమయంలో స్టెరాయిడ్‌లను అధికంగా వాడటం వలన భారతదేశంతో సహా అనేక దేశాలలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పెరిగింది. కరోనా యొక్క దుష్ప్రభావాల కారణంగా.. రోగనిరోధక శక్తి బలహీనపడటం వలన చాలా మంది రోగులలో ప్యాంక్రియాస్ ప్రభావితమైంది. దాని ఇన్ఫెక్షన్ కారణంగా చాలా మంది చనిపోయారు.

అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ
పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయా ఎంపీలు రకరకాలైన స్లోగన్లు ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నేతలు ఒకలా.. ఇండియా కూటమి నేతలు మరోలా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసద్దుదీన్ మాత్రం.. ప్రమాణస్వీకారం తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు. ఈ ఘటన సభలో దుమారం రేపింది. రికార్డుల నుంచి తొలగించాలంటూ ఎన్డీఏ సభ్యులు డిమాండ్ చేశారు. తాజాగా అమరావతి మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్‌ కౌర్ రాణా.. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా గురువారం లేఖ రాశారు. ఒవైసీ తన ప్రమాణం స్వీకార కార్యక్రమంలో ‘జై పాలస్తీనా’ నినాదాన్ని లేవనెత్తడం ద్వారా భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. జూన్ 25వ తేదీన అసదుద్దీన్ పార్లమెంట్‌లో ప్రమాణం చేశారు. ఈ ప్రమాణంలో అసదుద్దీన్ ఒవైసీ.. జై బీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సభలోని పలువురు కేంద్ర మంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ స్పందించారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాజాగా నవనీత్ కౌర్.. రాష్ట్రపతికి లేఖ రాసి సభ్యత్వాన్ని రద్దు చేయమని కోరారు.

పార్లమెంట్ సమావేశాల్లో రేపు నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం
పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇండియా కూటమి ఈ రోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయింది. ఈ సమావేశానికి కూటమిలోని పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్, ఆప్ నేత సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ హాజరయ్యారు. పార్లమెంట్‌లో లేవనెత్తాల అంశాలపై ఇండియా కూటమి చర్చించింది. స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంపై ఈ సమావేశంలో చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో నీట్, అగ్నివీర్, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చించాలని కూటమి నిర్ణయించింది. డీఎంకే ఎంపీ టీ రవి మాట్లాడుతూ, నీట్ అంశంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా నీట్ అంశంపై రేపు పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ అంశంపై చర్చించేందుకు అధికార పక్షం అనుమతించకుంటే సభలో నిరసన తెలపాలని భావిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం నుంచి జరిగే చర్చలో పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు.

జియో కస్టమర్లకు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జి ధరలు
రిలయన్స్ జియో కస్టమర్లకు ఇది పెద్ద షాకింగ్ వార్త. జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న కనిష్ట నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్టంగా రూ. 34 నుంచి గరిష్టంగా రూ.600 వరకు పెంచింది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచింది. అలాగే.. జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 249 అయింది. దాని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. రూ.239 ప్లాన్ ఇప్పుడు రూ.299గా మారింది. దీని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. వీటితో పాటు కొత్తగా రిలయన్స్ జియో పలు సర్వీసులు ప్రారంభించింది. జియో సేఫ్, జియో ట్రాన్స్ లేట్. క్వాంటం సెక్యూర్ కమ్యూనికేసన్ ఆప్ పర్ కాలింగ్, మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్ ఫర్ తదితరాల కోసం రూ.199 చెల్లించాలి. జియో ట్రాన్స్ లేట్ అంటే బహుళ భాషా కమ్యూనికేషన్ యాప్, వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్, టెక్ట్స్, ఇమేజ్ ట్రాన్స్ లేషన్ కోసం నెలకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. ఈ ధరలు జూలై 3 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీ-పెయిడ్ ప్లాన్లపై సరాసరి 20 శాతం ధరలు పెంచింది. రెండున్నరేండ్ల తర్వాత రిలయన్స్ జియో టారిఫ్ ధరలు పెంచడం ఇదే తొలిసారి. జియో కొత్తగా 19 ప్లాన్లు ప్రకటిస్తే.. వాటిలో 17 ప్రీపెయిడ్ ప్లాన్లు, రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి.

‘కూలీ’ నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ వైరల్.. ఫిదా అయిపోయిన ఫ్యాన్స్
లోకేష్ కనగరాజ్ కొత్త చిత్రం ‘కూలీ’ నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఈ చిత్రంలో రజనీకాంత్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. అది వైరల్‌గా మారింది. ‘కూలీ’ షూటింగ్ జూలై నుంచి ప్రారంభమై 2025లో విడుదల కానుందని లోకేష్ కనగరాజ్ తెలిపారు. 2023లో విడుదలైన ‘జైలర్’ చిత్రంతో ‘తలైవా’ రజనీకాంత్ సంచలనం సృష్టించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. అప్పటి నుంచి రజనీకాంత్ తదుపరి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి, అందులో ఒకటి లోకేష్ కనగరాజ్ ‘తలైవా 171’. ఇప్పుడు ఈ చిత్రానికి పేరు ఖరారు చేయగా, నటుడి ఫస్ట్ లుక్ ఫోటోను కూడా రివీల్ చేశారు. ‘తలైవా 171’కి ఇప్పుడు ‘కూలీ’ అనే టైటిల్ పెట్టారు. రజనీకాంత్ ప్రమాదకరమైన యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారు. రజనీకాంత్ ఫస్ట్ లుక్ ఫోటోను లోకేష్ కనగరాజ్ షేర్ చేస్తూ ఈ ఏడాది జులై నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇటీవల ‘కూలీ’ కోసం రజనీకాంత్ లుక్ టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో లోకేష్ కనగరాజ్ ‘తలైవా’ చిత్రాన్ని తీసి ఎక్స్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలో, రజనీకాంత్ అద్దం ముందు స్టైలిష్‌గా అద్దాలు ధరించి కూర్చొని, వెనుక లోకేష్ కనగరాజ్ నిలబడి, మిర్రర్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని పంచుకుంటూ లోకేష్ కనగరాజ్ “కూలీ కోసం టెస్ట్ చూడండి” అని రాశారు. జులై నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

టాక్సిక్ చిత్రంలో బాలీవుడ్ నటి.. ఎవరంటే?
కేజీఎఫ్ చిత్రంతో కన్నడు హీరో యశ్ సెన్సేషన్‌ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రాఖీ భాయ్ పాత్రతో తన నటనతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్-2 చిత్రంతో ఇండియన బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ”టాక్సిక్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యశ్. సుదీర్ఘ విరామం తర్వాత, మలయాళ దర్శకుడు గీతూ మోహన్‌దాస్‌తో రాకింగ్ స్టార్ యష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ”టాక్సిక్” అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర బృందం రూపొందిస్తోంది. ఈ మూవీలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రంలో నయనతార సోదరి పాత్రలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన హూమా ఖురేషి ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనేది తెలియాల్సి ఉంది. అన్నదమ్ముల బంధం సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. టీమ్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. టాక్సిక్ మేకర్స్ ఇటీవల కర్ణాటకలో భారీ సెట్లు నిర్మించారు. ఈ చిత్రానికి “పెద్దల కోసం అద్భుత కథ” అనే ట్యాగ్‌లైన్ ఉంది. టాక్సిక్ 10 ఏప్రిల్ 2025న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కేవీఎన్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణతో కలిసి యశ్‌ ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు.