Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రుల పిటిషన్.. తుది నివేదిక పరిశీలించండి..
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్‌ దాఖలు చేశారు.. ఆయేషా మీరా హత్యపై సీబీఐ ఏం విచారణ చేసిందో తుది నివేదిక పరిశీలించాలని.. ఆ పిటిషన్‌లో హైకోర్టుకు విన్నవించారు ఆయేషా తల్లి శంషాద్ బేగం.. అదే విధంగా సీబీఐ విచారణ తుది నివేదికను ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఇక, ఆయేషా మీరా తల్లిదండ్రుల దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు..

గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే..
గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. నేను యువతకు ఒకటే చెబుతున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. రౌడీల తోక కత్తిరిస్తానని అన్నాను. రాయలసీమలో ముఠా కక్షలు. కుటుంబాలకు కుటుంబాలను చంపే పరిస్థితి. రాయలసీమలో ముఠాకక్షలను‌ పూర్తిగా అణిచివేశాం. మతసామరస్యాన్ని కాపాడుతాం… విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వదిలిపెట్టం అని హెచ్చరించారు.. రౌడీయిజాన్ని కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ కు బానిస అయితే ఎంతో ప్రమాదం. వారిని బాగు చేయడం కష్టం.. డ్రగ్స్, గంజాయికి రాష్ట్రం కేంద్రంగా మారిందని టీడీపీ ఎన్నోసార్లు చెప్పింది. ఏజెన్సీని గంజాయికి అడ్డాగా మార్చారు అని విమర్శించారు..

స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్‌ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?
అనేక సందర్భాల్లో సినీ హీరోలను టార్గెట్‌ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. ఇప్పుడు మరోసారి స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌పై విమర్శలు గుప్పించారు.. పాన్ మసాలా కొనమని స్టార్ హీరోలు, హీరోయిన్స్ ప్రచారం కల్పించడం బాధాకరమన్న ఆయన.. పాన్ మసాలా తయారీ కేంద్రాలను గుర్తించి సీజ్ చేయాలని సూచించారు.. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మాదకద్రవ్యాల నియంత్రణ కోసం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు.. రాష్ట్రంలో గంజాయి సాగును గుర్తించి వాటి మూలాలను నిర్మూలించాలన్నారు.. పాన్ మసాలాతోపాటు 10 రూపాయలు అదనంగా ఇస్తే కిందనుండి మరో చిన్న ప్యాకెట్ తీసి బై వన్ గెట్ వన్ లాగా ఇస్తున్నారు. చిన్న ప్యాకెట్లు వలన చాలా ప్రమాదం ఉంది. క్యాన్సర్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు..

గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ ప్రతినిధులు.. జగన్‌పై ప్రభుత్వం కుట్ర..!
ఏపీలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది వైసీపీ ప్రతినిధుల బృందం.. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై, ప్రభుత్వం చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆయనకు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇక, అనంతరం రాజ్‌భవన్ బయట శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న అఘాయిత్యాలు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కల్పించాల్సిన భద్రతను విస్మరించడం, ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులను బనాయిస్తున్న విధానాలపై గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం.. ఇవి అప్రజాస్వామికం, గతంలో ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు, కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న వైనంపై గవర్నర్‌కు వివరించాం. ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన వైయస్ జగన్ పర్యటన సందర్భంగా ఒక వాహనం ఢీ కొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై సాక్షాత్తు పల్నాడు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ ప్రమాదానికి జగన్‌కు చెందిన కాన్వాయి వాహనాలు కారణం కాదు, వేరే ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో సింగయ్య గాయపడటంతో పోలీసులే అతడిని ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత హటాత్తుగా పోలీసుల తీరు మారింది. ఈ సంఘటన జగన్ ప్రయాణించిన కారు ఢీకొనడం వల్లే జరిగిందటూ, ఎప్పుడూ చరిత్రలో జరగని విధంగా కారులో ప్రయాణిస్తున్న వారిపైన కూడా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.

కేసీఆర్‌కి 9.5 ఏళ్లు పట్టింది.. రేవంత్‌రెడ్డికి మాత్రం 1.5 ఏళ్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.. బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కేసీఆర్ కి ఎదురు తిరగడానికి 9.5 ఏళ్లు పట్టిందని.. కానీ.. రేవంత్ రెడ్డి పాలనకు కేవలం 1.5 ఏళ్లు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ 50 సంవత్సరాల కాంగ్రెస్ చీకటి అధ్యాయాన్ని తెలియజేస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వారిని చంపివేశారని చెప్పారు. పత్రికలను నిషేధించారని.. కోర్టులో పిటిషన్ వేసే అధికారం కూడా లేకుండా చేశారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఓట్లల్లో మెజార్టీ వచ్చిన వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు అధికారం ఉందని ఆ ఓటు హక్కు రాజ్యాంగంలో ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని ధిక్కరించి ఇందిరా గాంధీ రాజ్యాంగ సవరణ చేసిందని వెల్లడించారు. రాజ్యాంగం గొప్పతనం వల్ల ఒక ఛాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారని.. ఓ సాధారణ మహిళ రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. మోడీ రాజ్యాంగాన్ని ఒకటే దేశం ఒకటే చట్టం చేసిందని 3% మహిళలకు రిజర్వేషన్ రాజ్యసభలలో చేసిందని కొనియాడారు. ఆ రోజుల్లో రేడియో మాత్రమే ఉండేది.. కానీ ఈ రోజుల్లో ప్రతిదీ నిఘ ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా నా హక్కును కాదంటే ప్రజలు ఊరుకోరు బుద్ధి చెబుతారని చెప్పారు.

హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు.. నంబర్ షేర్ చేసిన హైడ్రా..
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గ‌చ్చిబౌలి పోలీసు స్టేష‌న్లో కేసు న‌మోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభ‌న్ బాబు గండిపేట మండ‌లం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించిన‌ట్టు పోలీసు స్టేష‌న్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మ‌ధ్యాహ్నం 3.20 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. న‌లుపు రంగు కారులో వ‌చ్చిన‌ ఈ ఇద్దరు ఇంటి ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చి ప‌రిశీలిస్తుండ‌గా.. ఎవ‌ర‌ని అడిగితే తాము హైడ్రా నుంచి వ‌చ్చామ‌ని బ‌దులిచ్చార‌ని ఆ ఇంటి వ‌ద్ద ప‌ని చేస్తున్న గుంత‌క‌ల్ మ‌ల్లికార్జున్ తెలిపారు. ఎందుకు వ‌చ్చార‌ని అడిగితే ఈ ఇంటిని కూల్చేస్తామ‌ని.. ఇందుకు సంబంధించిన స‌మాచారం సేక‌రిస్తున్నామ‌ని చెప్పార‌న్నారు. ఇంటి య‌జ‌మానితో మాట్లాడాల‌ని సూచించ‌గా.. చ‌ల్లగా జార‌కున్నార‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో మ‌ల్లికార్జున్ పేర్కొన్నారు. నిందితులు మిరియాల వేదాంతం(22) కారు డ్రైవ‌ర్ కాగా.. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అల్కాపురి టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నాడు. మ‌రో వ్యక్తి యెలిసెట్టి శోభ‌న్‌బాబు ఆర్టీసీలో ప‌ని చేసి రిటైర్ అయ్యారు. ఈయ‌న మ‌ణికొండ‌లోని పుప్పాల‌గూడ‌, ఎస్టీమ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు. ఆ ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శుభాన్షు శుక్లా ఆస్ట్రోనాట్ నెంబర్ 634.. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా రికార్డ్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి చేరుకున్న తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. గురువారం ఆక్సియం-4 వ్యోమనౌక ఐఎస్ఎస్‌తో డాకింగ్ అయింది. ఐఎస్ఎస్ చేరిన తర్వాత తన అనుభవాన్ని శుభాన్షు వివరించారు. ‘‘ఇది తేలికగా అనిపించిందని, కానీ తన తల కొంచెం బరువుగా ఉంది’’ అని అన్నారు. ఆయన అధికారికంగా వ్యోమగామి నంబర్ 632, అంతరిక్ష కేంద్రం పిన్ పొందారు. రాబోయే రెండు వారాలు గొప్పగా ఉంటుందని చెప్పారు. ఆక్సియం -4 సిబ్బందితో కలిసి తన స్వాగత ప్రసంగంలో, భూమిని అంతరిక్షం నుంచి చూసే అవకాశం పొందిన కొద్దిమందిలో ఒకరిగా ఉండటం ఒక గౌరవం అని శుక్లా అన్నారు. బుధవారం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ప్రయోగించిన ఆక్స్-4 సిబ్బంది, 28 గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్ చేరారు. తన ప్రయాణాన్ని అద్భుతంగా అభివర్ణించిన ఆయన..‘‘నేను దీని కోసం ఎదురుచూస్తున్నాను, సిబ్బంది నన్ను చాలా స్వాగతించారు. మా కోసం వారి తలుపులు తెరిచారు. రాబోయే 14 రోజులు ఉత్తేజకరమైనవి, గొప్పగా ఉండబోతున్నాయి’’ అని అన్నారు.

ఈ పథకం అద్భుతం.. భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10 వేలు పొందే ఛాన్స్
ఉద్యోగం.. బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నంత కాలం ఎలాంటి ఢోకా ఉండదు. కానీ వృద్ధాప్య దశకు చేరుకున్నాక ఆర్థిక కష్టాలు వెంటాడుతుంటాయి. బతుకు భారంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా సురక్షితంగా ఉంటే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు. అందువల్ల, ఇప్పటి నుండే రేపటి కోసం పొదుపు చేయడం ముఖ్యం. పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం అందించే అటల్ పెన్షన్ యోజన పథకం అద్భుతంగా ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10 వేలు పొందే ఛాన్స్ ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన కింద, మీరు, మీ జీవిత భాగస్వామి ఇద్దరూ చెరో రూ. 5000 పెన్షన్ పొందవచ్చు. మొత్తంగా, మీకు రూ. 10,000 పెన్షన్ లభిస్తుంది. ఈ పథకానికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అసంఘటిత కార్మికులకు కూడా పెన్షన్ అందించాలనే సదుద్దేశంతో కేంద్రం ఈ అటల్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఈ పథకంలో నెలకు రూ. 420 చెల్లిస్తే భార్యాభర్తలిద్దరు నెలకు రూ. 10 వేలు పొందొచ్చు. ఈ పథకంలో చేరి పెట్టుబడి పెడితే.. 60ఏళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిపై ఆదారపడి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ స్కీమ్ లో చేరే వ్యక్తుల వయసును బట్టి చెల్లించే మొత్తం మారుతూ ఉంటుంది.

ధనుష్ లాంటి పాత్రలు టాలీవుడ్ లో చేసేది ఆ ఒక్కడే..!
కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలాంటి పాత్రలు చేయడం ఎవరికీ సాధ్యం కాదంటున్నారు. ఇది ఒకింత నిజమే. ఎందుకంటే మన టాలీవుడ్ హీరోల సినిమాలు అంటే కత్తి పట్టి నరకాల్సిందే.. రక్తం ఏరులై స్క్రీన్ నిండా పారాల్సిందే అన్నట్టే ఉంటాయి. హీరోయిజాన్ని చూపించే సినిమాలే తప్ప ఒక బిచ్చగాడిగా నటించే పాత్రల్లో మన వాళ్లు అస్సలు నటించరు. వాళ్లు ఒక మెట్టు కిందకు దిగి నటించాల్సి వస్తే ఆ సినిమానే రిజెక్ట్ చేస్తారు. వంగి దండాలు పెట్టే పాత్రలు, బానిసగా చేసే పాత్రలు, కుల వివక్ష పాత్రల్లో అస్సలు నటించరు. ఇలాంటి పాత్రలు చేయడం ధనుష్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ధనుష్ లాగానే టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీగా ఉండే హీరో ఒక్కడున్నాడు. ఆయనే విక్టరీ వెంకటేశ్‌. ఆయన సినిమాలు చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుంది. హీరోయిక్ పాత్రలు చేయడం కంటే కంటెంట్ ఉండి, నటనకు స్కోప్ ఉన్న పాత్రలే వెంకటేశ్ చేస్తాడు. ధనుష్ చేసిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేశాడు వెంకీ.

50 డేస్ కౌంట్ డౌన్.. ఏంటీ కొత్త ట్రెండ్..
ఈ నడుమ మూవీ రిలీజ్ డేట్లు ప్రకటించిన తర్వాత ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రిలీజ్ కు 50 రోజుల ముందు ఓ పోస్టర్ వేసేస్తున్నారు. 50 డేస్ టు గో.. 50 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్.. అంటూ పోస్టర్లు వేసేస్తున్నారు. అంటే మూవీ రిలీజ్ కు ఇంకో 50 రోజులే ఉంది అని ప్రేక్షకుల్లో మరోసారి దీని గురించి చర్చ జరిగేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు రిలీజ్ డేట్ ను ప్రకటించిన తర్వాత టీజర్లు, ట్రైలర్, సాంగ్స్ లాంటివి రిలీజ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు 50 రోజులు ఉందని గుర్తు చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. మొన్ననే కన్నప్ప సినిమాకు ఇలాంటి పోస్టర్ వేసేశారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ వార్-2కు 50 డేస్ ఉంది.. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ఓ పోస్టర్ ను పోస్ట్ చేశాడు. ఇప్పుడు కూలీ మూవీ టీమ్ ఇదే ట్రెండ్ ను ఫాలో అయింది. 50 డేస్ టు గో అంటూ పోస్టర్ ను వేసేసింది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నాయి. అందుకే ఈ పోస్టర్లు వేసేశాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సినిమాను తీయడం కంటే ప్రమోషన్లతో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడమే ఇప్పుడు అసలు సవాల్. అందుకే ఈ రకమైన పోస్టర్లను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ 50 డేస్ పోస్టర్లలో కొత్త లుక్ ను కూడా రివీల్ చేస్తుండటం వల్ల వీటికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. మున్ముందు మరిన్ని సినిమాలు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతాయా లేదా చూడాలి.

Exit mobile version