NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సీఎం కీలక వ్యాఖ్యలు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం..
చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం అని స్పష్టం చేశారు.. రానున్న రోజుల్లో కుప్పంలో సహా జిల్లాలో అభివృద్ధి పనుల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానమన్న ఆయన.. సాయంత్రం 6 గంటల తరువాత మంత్రులు సమావేశాలు పెట్టకండని చెప్పాను అన్నారు.. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్దమీటింగ్ లు, భారీ కాన్వాయ్ లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండబోవు అన్నారు.. ఇక, అధికారులు ఫిజికల్.. వర్చ్యువల్ పని విధానాలకు సిద్ధపడాలని సూచించారు సీఎం చంద్రబాబు.. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.. మరోవైపు.. కుప్పంలో రౌడీయిజం, హిసం, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు అని స్పష్టం చేశారు.. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తేవేయండి అన్నారు.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుండే శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.

బాధ్యతలు స్వీకరించిన మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సర్కార్‌ ఏర్పడింది.. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా.. పలువురు మంత్రులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఈ రోజు రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు బీసీ జనార్ధన్ రెడ్డి.. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మొదట వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న ఆయన.. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఆయనకు కుటుంబ సభ్యులు, ఆ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.. ఇక, అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.. 2014-19లో ఆర్ అండ్ బీ శాఖకు బడ్జెట్‌లో14 వేల 970 కోట్ల రూపాయలు కేటాయించగా రూ.12 వేల 64 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.. అంటే 80 శాతం నిధులు ఖర్చు చేసినట్టు చెప్పారు. కాగా, గత ప్రభుత్వం 2019-24లో ఆర్ అండ్ బీకి రూ.19 వేల 428 కోట్లు బడ్జెట్ ల్లో కేటాయించింది కేవలం రూ.9 వేల 15 కోట్లు.. అనగా 46 శాతం మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన రూ. 2 వేల 261 కోట్లకు బిల్లులు చెల్లించ లేదని దానివల్ల పనులు చేసినా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని.. ఇప్పుడు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నది రూ.7 కోట్లేనన్న అధికారులు.. ఆశ్చర్యపోయిన డిప్యూటీ సీఎం పవన్..
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు.. ఇక, ఈ సమావేశంలో.. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ పని తీరుపై డిప్యూటీ సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు.. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై ఆయన ఆరా తీశారు.. గత ఐదేళ్ల కాలంలో కేంద్రం విడుదల చేసిన రూ.1066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ.. స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఇక, ఈ సమీక్షా సమావేశంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయల నిధులు పక్క దారి పట్టినట్టు గుర్తించారు పవన్‌ కల్యాణ్‌.. ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఖాతాలో ఎన్ని నిధులున్నాయని ఆరా తీశారు పవన్‌ కల్యాణ్‌.. అయితే, ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు ఉన్నాయని అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపోయారు పవన్‌.. అవి కూడా ఐదు నెలల జీతాలకే సరిపోతాయని అధికారులు వెల్లడించడంతో 2020-21 ఏడాదిలో రూ.2092 కోట్ల మేర నిధులుంటే.. ఇప్పుడు ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు.. కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారంటూ సీరియస్‌ అయ్యారు.. నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

రేపు తాడిగడపకు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు.. పెనమలూరు మండలం తాడిగడపలో నిర్వహించనున్న రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొననున్నారు.. పెనమలూరు మండలంలోని తాడిగడప.. రామోజీరావు స్వగ్రామం అయిన విషయం విదితమే.. క్రమంగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించినా.. ఏ నాడూ సొంత ఊరిని మరవకుండా.. అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు రామోజీరావు.. ఇక, తాడిగడపలో నిర్వహించే రామోజీ రావు సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. రామోజీతో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకోనున్నారు.. మరోవైపు.. రేపటి సభా ఏర్పాట్లను మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, సత్యాకుమార్ యాదవ్‌, కొలుసు పార్థసారథి పరిశీలించారు.. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన దాదాపు 7 వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు మంత్రి పార్థసారథి వెల్లడించారు.. ఇక, రామోజీరావు పుట్టిన జిల్లాల్లో తాను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు మంత్రి పార్థసారథి. ఇక, దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.. మీడియా, సినీ రంగాలతో పాటు సమాజానికి ఆయన చేసిన విశేష సేవలకుగాను ఆయన గౌరవార్థం సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించండి..
ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే, హైద‌రాబాద్- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు వ‌రుస‌లుగా విస్తరించాలని జాతీయ ర‌హాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని రేవంత్ ఇవాళ (బుధ‌వారం) భేటీ అయ్యారు. ఈసంద‌ర్భంగా రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్తరణతో పాటు నూత‌న జాతీయ ర‌హ‌దారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ ర‌హ‌దారులుగా ప్రకటించిన మార్గాల ప‌నుల ప్రారంభం త‌దిత‌ర విష‌యాల‌ను కేంద్ర మంత్రి దృష్టికి తెలంగాణ సీఎం తీసుకెళ్లారు. ఇక, సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌- తూప్రాన్‌- గ‌జ్వేల్‌- జ‌గ‌దేవ్‌పూర్‌- భువ‌న‌గిరి- చౌటుప్ప‌ల్ (158.645 కి.మీ.) ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించారు.. కానీ, దాని భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్యయంలో స‌గ భాగాన్ని త‌మ ప్రభుత్వమే భ‌రిస్తోంద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భాగంలో త‌మ వంతు ప‌నులు వేగ‌వంతం చేశామ‌న్నారు. చౌటుప్పల్ నుంచి అమ‌న్‌గ‌ల్‌- షాద్‌న‌గ‌ర్‌- సంగారెడ్డి వ‌ర‌కు (181.87 కి.మీ.) ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించాలని ఆయన కోరారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించి.. ఈ ఏడాది ఎన్‌హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాల‌ని తెలిపారు. హైద‌రాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వ‌లిగొండ‌- తొర్రూర్- నెల్లికుదురు- మ‌హ‌బూబాబాద్‌-ఇల్లెందు- కొత్తగూడెం వ‌ర‌కు ర‌హ‌దారిని (ఎన్‌హెచ్‌-930పీ) జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించాలని కేంద్రమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

జూడాలకు అండగా ఉంటాం.. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం..!
హైదరాబాద్ లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాలు భేటీ అయ్యారు. ఆ తర్వాత నిరసన చేస్తున్న జూడాలు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ జూడాలు గతంలో రెండు సార్లు మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్ లో పెండింగ్ సమస్యలపై కలవడం జరిగింది అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 15వ తేదీన రిప్రజెంటేషన్ ఇచ్చారు.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి లకు చరిత్ర ఉంది.. కానీ హాస్టల్స్ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కేఎంసీ రోడ్డు గురించి అడిగారు.. అలాగే, పోలీసు భద్రత కావాలని అడిగారు.. నేను, మా శాఖలోని ఉన్నతాధికారులతో మాట్లాడా.. వారి స్టై పెండ్ కోసం సుమారు 406 కోట్ల రూపాయల జీవో కూడా విడుదల చేసామన్నారు. హాస్టల్స్ నిర్మాణం, పునరుద్దరణకు దాదాపుగా రూ. 204 కోట్లు ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్ కోసం విడుదల చేసామని మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. ఇక, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం అనేది కోర్టు పరిధిలో ఉంది అని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహా అన్నారు. కానీ మా ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం పట్ల సీరియస్ గానే ఉంది.. పాలసీలలో మార్పులు తీసుకురాబోతున్నాం.. సమ్మె విరమించినందుకు జూడాలకు ధన్యవాదాలు అని మంత్రి చెప్పారు. ఇందులో రాజకీయాలు అవసరం లేదు.. సామాన్యుడికి మెరుగైన వైద్యం, నాణ్యమైన వైద్య విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిది.. అలాగే, మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ పెంచబోతున్నాం.. డ్రగ్స్ కి సంబంధించిన ల్యాబ్స్ పెంచనున్నాం.. అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ హైదరాబాద్ లో ఉంది కానీ నియంత్రణ లేదు… అది మేము చేస్తామన్నారు. క్లినికల్ ఎస్టబులిష్మెంట్ యాక్ట్ నీ కఠినంగా అమలు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు.

కేజ్రీవాల్‌కు ఇక్కట్లు.. 3 రోజులు సీబీఐ కస్టడీకి అనుమతి
లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు చిక్కులు ఎదురవుతున్నాయి. రెగ్యులర్ బెయిల్ వచ్చినట్లే వచ్చి గంటల్లో రద్దైంది. ఆప్ ఆశలన్నీ ఈడీ రూపంలో ఆవిరైపోయాయి. తాజాగా కేజ్రీవాల్‌కు మరో చిక్కుచ్చిపడింది. మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. మంగళవారం రాత్రి కేజ్రీవాల్‌ను తీహార్ జైల్లో సీబీఐ విచారించింది. ఇక బుధవారం కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరగా.. మూడు రోజులు అనుమతిచ్చింది. జూన్ 29న రాత్రి 7:00 గంటలలోపు కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని రోస్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి అమితాబ్ రావత్ ఆదేశించారు. లిక్కర్ పాలసీ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు కేజ్రీవాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మూడు రోజుల పాటు మరింత సమాచారాన్ని రాబట్టనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని ఈడీ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ట్రయల్ కోర్టు మెదడు ఉపయోగించలేదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. ఇక లోక్‌సభ ఎన్నికల కోసం 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోయారు.

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా శామ్ పిట్రోడా తిరిగి నియామకం
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శామ్ పిట్రోడాను కాంగ్రెస్ బుధవారం తిరిగి నియమించింది. పిట్రోడా నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శామ్ పిట్రోడా నియమితుయ్యారని వెల్లడించారు. ఈ ఏడాది మేలో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. తూర్పు ప్రాంతంలోని భారతీయులు చైనీయులను పోలి ఉంటారని, దక్షిణాదిలో ఉన్నవారు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. పిట్రోడా వ్యాఖ్యలపై విస్తృతమైన దుమారం చెలరేగడంతో, కాంగ్రెస్ ఆయన ప్రకటనలకు దూరంగా ఉంది, వాటిని ‘ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొంది. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. ఆ వ్యాఖ్యలను జాత్యహంకారం, విభజన అని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చర్మం రంగు ఆధారంగా అగౌరవపరచడం దేశం సహించదని.. దీనికి సమాధానం చెప్పాలని ప్రధాని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిట్రోడాను జాత్యహంకారిగా అభివర్ణించారు. వ్యాఖ్యలు అతని పక్షపాతాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలు: బయటపెట్టిన నాగ్‌ అశ్విన్
ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి కొద్దిగా ముందు నాగ్ అశ్విన్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో ప్రభాస్ తో కలిసి ఆడియన్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇద్దరూ నటిస్తున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే వీరిద్దరూ ఏ పాత్రలలో నటిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే నాగశ్విన్ వీరిద్దరూ సినిమాలో భాగమవుతున్నానని ప్రకటించిన వెంటనే వారికి ప్రభాస్ థాంక్స్ చెబుతూ కనిపించాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాగశ్విన్ వీడియో ఆన్ చేసి మాట్లాడుతుండగా ప్రభాస్ మాత్రం కేవలం వాయిస్ మాత్రమే వినపడేలా ఈ లైవ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. ఇక విజయ్ దేవరకొండ కల్కిగా నటిస్తున్నాడని కూడా అంటున్నారు. అయితే ఈ విషయం మీద సినిమా రిలీజ్ అయితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

చివరి నిముషంలో మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్న క్రమంలో సినిమా టీంకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇస్తూ ఒక జీవో జారీ చేయగా ఇప్పుడు అదనంగా ఆరవ షో వేసుకునేందుకు వెసలుబాటు కల్పిస్తూ మరో జీవో జారీ చేసింది. ఈ ఈమేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఏపీలో కల్కి టికెట్ ధరలు కూడా ప్రభుత్వ అనుమని మేరకు పెరిగిన సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 75 రూపాయాలు.. మల్టీప్లెక్స్ లో టికెట్ పై 125 రూపాయాలు పెంచేందుకు కల్కి టీం కు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. విడుదలైన రోజు అంటే జూన్ 27 నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇక తాజా ఉత్తర్వులతో ప్రతి థియేటర్‌లో రోజుకు ఆరు షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక రేట్ల పెంపు జీవో ప్రకారం గత ఐదేళ్లలో ఏ సినిమాకి లేనంతగా అదనపు టికెట్ ధర కల్కికి దక్కినట్టు అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయి రచ్చ రేపుతున్న సంగతి తెలిసిందే.

వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?
బెంగళూరు హెబ్బల్‌లోని సింధీ కాలేజీలో, నటి తమన్నాపై 7వ తరగతి విద్యార్థులకు అందించిన టెక్స్ట్ బుక్ వివాదానికి దారితీసింది. దీన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెంగళూరులోని హెబ్బాల్‌లోని సింధీ కాలేజీ ఈ వివాదానికి కారణమైంది. సింధీ కాలేజీ 7వ తరగతి పాఠ్యాంశంలో నటి తమన్నా గురించిన పాఠాన్ని చేర్చడం వివాదానికి దారితీసింది. తమన్నా పాఠాన్ని చేర్చడంపై పలువురు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన పాఠ్యాంశాలు మీడియాలో కూడా ప్రసారమయ్యాయి. సింధీ కాలేజ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్‌లో తమన్నాపై పాఠం చేర్చబడింది. దాని యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సింధీ కమ్యూనిటీకి తెలియజేసే ముఖ్యమైన విషయాలు రాసిన చోటే తమన్నా యొక్క పాఠం చేర్చబడింది. తమన్నా పుట్టిన తేదీ, తమన్నా చేసిన సినిమాల వివరాలు పాఠంలో ఇవ్వబడ్డాయి. సింధు సంఘం అనుకూలతలను పరిచయం చేయడానికి ఆమె గురించి ప్రచురించి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఈ పాఠం 7వ తరగతి విద్యార్థులకు ఇవ్వబడుతుంది. తెలుగు మరియు తమిళంలో నటి చేసిన సినిమాలు మరియు ఆమె నటన గురించి టెక్స్ట్ లో పేర్కొన్నారు. సింధ్ విభజన తర్వాత జీవితం. తమన్నా యొక్క టెక్స్ట్ మైగ్రేషన్, కమ్యూనిటీ అండ్ కాన్ఫ్లిక్ట్ పేరుతో ఉంది. ఇక ఈ పాఠంలో బాలీవుడ్ నటుడు రణబీర్ సింగ్ గురించి కూడా మెన్షన్ చేశారు. తమన్నా గురించి పాఠంలో చేర్చడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మా పిల్లలు ఆమె గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి నటి నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు. తమన్నా పోర్న్ తరహా చిత్రాల్లో నటించిందని, పిల్లలు కూడా ఆమె గురించి మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారని తల్లిదండ్రులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై యాజమాన్య బోర్డును ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై తల్లిదండ్రులు బాలల హక్కుల కమిషన్‌, ప్రైవేట్‌ పాఠశాలల సమాఖ్యకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.