Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మైనర్‌ బాలిక కిడ్నాప్‌, అత్యాచారం.. 12 ఏళ్ల తర్వాత యూపీలో దొరికిన నిందితుడు..
ఫోక్సో కేసులో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిని విశాఖ టూ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.. 2014 లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, కిడ్నాప్ కేసులో మహమ్మద్ సల్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.. అల్లిపురానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో రిమాండ్ కు తరలించారు.. కొద్ది రోజుల తర్వాత కండీషన్ బెయిల్ పై బయటకు వచ్చి అప్పటి నుండి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.. ఈ క్రమంలో విశాఖపట్నం వదిలి ఉత్తరప్రదేశ్ కు పారిపోయాడు.. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు విశాఖ పోలీస్ కమిషనర్ సూచనలు మేరకు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ట్రేస్ చేశారు.. ఉత్తరప్రదేశ్ కు టీమ్ ను పంపించి అక్కడ ముద్దాయి ఆచూకీ కనుగొన్నారు.. బలరాంపుర్ నుండి విశాఖకు తీసుకొచ్చారు.. పోలీసుల కళ్లు కప్పి 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిని కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్ కు తరలించారు.

ఏపీ లోక్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం..
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ లోక్ భవన్‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరుకాగా.. పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన సతీమణి అన్నా కొణెదల కూడా ఈ తేనీటి విందులో పాల్గొన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. మంత్రులు నారా లోకేష్, సవిత, అచ్చం నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, రామ్ ప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర.. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. ఈశ్వరయ్య.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సహా తదితరులు హాజరయ్యారు. అతిథులతో మమేకమై గవర్నర్ అబ్దుల్ నజీర్ అభివాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ప్రాముఖ్యతపై నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం పర్యటన వాయిదా
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిఠాపురం పర్యటన వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పర్యటనను పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో టౌన్, వార్డు, బూత్ స్థాయి కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ సభ్యత్వం కలిగిన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని కమిటీలను ఎన్నుకోనున్నారు. ప్రత్యేంగా ఈసారి ఓటింగ్ ప్రక్రియ ద్వారా పార్టీ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు నామినేషన్ లేదా ఏకగ్రీవ పద్ధతిలో జరిగే ఎన్నికలకు భిన్నంగా, తొలిసారి సభ్యులే ప్రత్యక్షంగా తమ ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. రేపు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించడంతోనే పవన్ కల్యాణ్ పర్యటనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ పిఠాపురం పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

సమ్మక్క -సారలమ్మ జాతరకు 4 వేల బస్సులు
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్‌లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎక్కడా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 ఆర్టీసీ బస్సులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఒక్క హుస్నాబాద్ డిపో నుండే మేడారానికి 50 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఎవరూ ఇబ్బంది పడకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని మంత్రి సూచించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం అత్యంత సురక్షితమైనదని, ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సులకు ఒక ప్రత్యేక సౌకర్యం ఉందని మంత్రి వివరించారు. భక్తులు నడక సాగించే అవసరం లేకుండా, నేరుగా అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లగలిగే రవాణా సౌకర్యం కేవలం ప్రభుత్వ బస్సులకే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాలలో రద్దీ , ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రజలు ఆర్టీసీని ఎంచుకోవాలని కోరారు. జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే క్రమంలో చిన్న పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించేందుకు పోలీస్ శాఖ , ఆర్టీసీ సంయుక్తంగా ఒక వినూత్న చర్య చేపట్టాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు..!
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ (SIT) అధికారులు తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక వాస్తవాలు సంతోష్ రావుకు తెలిసి ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, విచారణ నిమిత్తం జనవరి 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జుబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో స్వయంగా హాజరు కావాలని జుబ్లీహిల్స్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. వెంకటగిరి ఆదేశించారు. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను విచారించిన సంగతి తెలిసిందే. ఐటీ చట్టం (I.T. Act) , ప్రభుత్వ ఆస్తుల నష్టం నిరోధక చట్టం (PDPP Act) వంటి కఠిన సెక్షన్ల కింద కొనసాగుతున్న ఈ విచారణలో సంతోష్ రావుకు నోటీసులు అందడం రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది. రేపు మధ్యాహ్నం జరగబోయే ఈ విచారణలో సిట్ అధికారులు సంతోష్ రావు నుండి ఎటువంటి సమాచారాన్ని రాబడతారనే అంశంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ టీమ్‌లో ఉన్నది ఎవరెవరు..?
దేశ కేంద్ర బడ్జెట్–2026 కోసం సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. అనుభవజ్ఞులు, కొత్త ముఖాల కలయికతో కూడిన బడ్జెట్ బృందం ఈ కీలక బాధ్యతను భుజాన వేసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది మోడీ 3.0 ప్రభుత్వానికి మూడవ పూర్తి బడ్జెట్ కావడం విశేషం. ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో సెలవు దినంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
* పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి.. పంకజ్ చౌదరి ఈ బడ్జెట్ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక విధానాల అమలులో ఆయన నిర్మలా సీతారామన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
* వి. అనంత్ నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు) ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత్ నాగేశ్వరన్ బడ్జెట్ రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్థిక వృద్ధి అంచనాలు.. రంగాల పనితీరు విశ్లేషణ.. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావం.. వంటి అంశాలపై స్థూల ఆర్థిక రూపరేఖను ఆయన విభాగం సిద్ధం చేస్తుంది.
* అనురాధ ఠాకూర్ – ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి.. బడ్జెట్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న అనురాధ ఠాకూర్‌కు ఇది మొదటి బడ్జెట్… 1994 బ్యాచ్, హిమాచల్ ప్రదేశ్ కేడర్ IAS.. జూలై 1, 2025న బాధ్యతలు స్వీకరణ.. బడ్జెట్ విభాగాన్ని నడిపిస్తున్న మొదటి మహిళా కార్యదర్శి ఆమె.. బడ్జెట్ పత్రాల తయారీ మొత్తం ఆమె పర్యవేక్షణలో జరుగుతుంది.
* అరవింద్ శ్రీవాస్తవ – రెవెన్యూ కార్యదర్శి.. పన్ను ప్రతిపాదనలను పర్యవేక్షించే బాధ్యత అరవింద్ శ్రీవాస్తవదే.. ప్రత్యక్ష పన్నులు: ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను.. పరోక్ష పన్నులు: జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ.. రెవెన్యూ కార్యదర్శిగా ఇది ఆయన తొలి బడ్జెట్.
* వి. వుయల్నామ్ – వ్యయ కార్యదర్శి.. మణిపూర్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ IAS అధికారి వి. వుయల్నామ్.. ప్రభుత్వ వ్యయం.. ఆర్థిక లోటు నియంత్రణ.. సబ్సిడీలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT).. వంటి అంశాలను పర్యవేక్షిస్తారు.
* ఎం. నాగరాజు – ఆర్థిక సేవల కార్యదర్శి.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, పెన్షన్ వ్యవస్థల ఆర్థిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించే బాధ్యత ఎం. నాగరాజుదే. ప్రభుత్వ ఆర్థిక అజెండాను ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
* అరుణిష్ చావ్లా – DIPAM కార్యదర్శి.. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ రోడ్‌మ్యాప్ బాధ్యతలు అరుణిష్ చావ్లా వద్ద ఉన్నాయి.
* కె. మోసెస్ చలై – DPE కార్యదర్శి.. మణిపూర్ కేడర్, 1990 బ్యాచ్ IAS.. ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (DPE) కార్యదర్శిగా ఉన్నారు.. మూలధన వ్యయం (Capex) పథకాల పర్యవేక్షణ చేస్తున్నారు.. మొత్తంగా అనుభవజ్ఞులైన అధికారులు, కొత్త బాధ్యతలు చేపట్టిన కార్యదర్శులతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ టీమ్ సిద్ధంగా ఉంది. ఆర్థిక వృద్ధి, పన్ను సంస్కరణలు, కాపెక్స్, సంక్షేమ పథకాలపై ఈ బడ్జెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు..
ఒక క్రికెటర్ కొడుకు‌పై రేప్ కేసు నమోదు అయ్యింది. ఇంతకీ ఈ కేసు ఎక్కడ నమోదు అయ్యిందో తెలుసా.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ కుమారుడిపై బార్కి పోలీస్ స్టేషన్ ఈ కేసు నమోదు చేశారు. పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పోలీసులు ఈ మాజీ క్రికెటర్ కుమారుడిని అరెస్టు చేశారు. ఈ మాజీ క్రికెటర్ ఇంట్లో బాధితురాలు పని మనిషిగా చేస్తుంది. పాకిస్థాన్ వార్తాపత్రిక డాన్ నివేదిక ప్రకారం.. జనవరి 23న బాధితురాలు బార్కి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు తనకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని కోరినట్లు బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. నిందితుడు తన కారులో వాళ్ల ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాడని, అక్కడ తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత ఆమె ఈ సంఘటనపై బార్కి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అత్యాచారం కేసు నమోదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడికి, ఫిర్యాదు చేసిన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ కుమారుడని వెల్లడించాడు.

డ్రాగన్ సింహాసనంపై జిన్‌పింగ్ కుమార్తె?
చైనా రాజకీయాల్లో 2027 సంవత్సరం కీలకమైనదిగా చెబుతున్నారు. ఈ సంవత్సరం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) 21వ జాతీయ కాంగ్రెస్ జరుగబోతుంది. ఈ సమావేశంలో కొత్త కేంద్ర కమిటీ ఎన్నికవుతుంది. ఈ కొత్త కేంద్ర కమిటీ కేంద్ర సైనిక కమిషన్ సభ్యులను కూడా నియమిస్తుంది. దీంతో చైనాలో నాయకత్వ మార్పు జరగబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో డ్రాగన్ సింహాసనంపై తన కుమార్తె కూర్చో పెట్టడానికి జిన్‌పింగ్ రోడ్ క్లియర్ చేస్తున్నారని సమాచారం. పలు నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం స్థానిక స్థాయిలో నాయకత్వ మార్పులు ప్రారంభమవుతాయని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ CCDI (సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్) సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. పార్టీకి పూర్తిగా విశ్వాసపాత్రులు, విశ్వసనీయులు, బాధ్యతాయుతమైన, పట్టుదలగల అధికారులు అవసరం అని ఆయన ఈ సమావేశంలో వెల్లడించినట్లు ఈ నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు జి జిన్‌పింగ్ తన కుమార్తె జి మింగ్జేను అధికారంలోకి తీసుకురావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మింగ్జే జిన్‌పింగ్ ఏకైక సంతానం.

పాక్‌ కొత్త డ్రామా.. టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌లో జరిగే మ్యాచ్‌ల బహిష్కరణ.. కానీ..!
టీ20 వరల్డ్ కప్ 2026 ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి రాజకీయాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్ జట్టును టోర్నమెంట్ నుంచి తొలగించిన ఐసీసీ నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త డ్రామాకు తెరలేపింది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించే అంశాన్ని పాకిస్తాన్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వెళ్లేందుకు నిరాకరించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేయగా, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. 24 గంటల అల్టిమేటం జారీ చేసినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి స్పందన రాకపోవడంతో, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం కల్పించింది. బంగ్లాదేశ్ తొలగింపుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనే టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరించిన విషయం తెలిసిందే. ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తగ్గిన పాకిస్తాన్, నిశ్శబ్దంగా టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది.

బంగ్లాదేశ్‌ను పాకిస్తానే తప్పుదారి పట్టించింది.. బీసీసీఐ కీలక ప్రకటన
టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు చోటుచేసుకున్న వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో ఆడాలని భారతదేశం కోరుకుందని, పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, పాకిస్తాన్ ప్రభావంతోనే బంగ్లాదేశ్ తప్పుదారి పట్టిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడాల్సి ఉంది. వీటిలో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో, ఒక మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భారత్‌కు జట్టును పంపేందుకు నిరాకరించింది. మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేయగా, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. బంగ్లాదేశ్ తన నిర్ణయంపై మొండిగా ఉండటంతో చివరకు ఐసిసి కఠిన చర్యలకు దిగింది. ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ, “మేం బంగ్లాదేశ్ ఆడాలని కోరుకున్నాం. పూర్తి భద్రత కల్పిస్తామని, ఎలాంటి సమస్యలు ఉండవని హామీ ఇచ్చాం. అయినా వారు భారత్‌లో ఆడబోమని తేల్చిచెప్పారు. చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదు. అది వారి నిర్ణయం. అందుకే ఐసిసి స్కాట్లాండ్‌ను తీసుకువచ్చింది” అని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ పాత్రను రాజీవ్ శుక్లా తీవ్రంగా ప్రశ్నించారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టింది. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటోంది. బంగ్లాదేశ్‌ను తప్పుదారి పట్టించడంలో పాకిస్తాన్ ప్రధాన పాత్ర పోషించింది. ఇది తప్పు అని విమర్శించారు.

విజయ్ – రశ్మిక హ్యాట్రిక్ సినిమా షురూ.. ‘రణబాలి’ గ్లింప్స్ చూశారా!
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్‌తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. ఈ సినిమాకు “రణబాలి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా గ్లింప్స్‌లో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. తన మాతృభూమి కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడే రణబాలి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. హీరోయిన్ రశ్మిక మందన్న జయమ్మగా కనిపించింది. ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో ‘మమ్మీ’ సినిమా ఫేమ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నటించారు. పచ్చటి పైరులతో అలరారే మన గ్రామసీమలను బ్రిటీష్ క్రూర పాలకులు కరువు ప్రాంతాలుగా ఎలా మార్చారో ఈ గ్లింప్స్ లో బాధాకరంగా చూపించారు. ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తూ మన సమాజంలో హిట్లర్ ఊచకోతను మించిన మారణహోమాన్ని బ్రిటీషర్స్ ఎలా సృష్టించారో గ్లింప్స్ రిఫ్లెక్ట్ చేసింది. బ్రిటీష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్‌పై రణబాలి ఈడ్చుకుంటూ వెళ్లే సీన్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలుస్తోంది.

పద్మశ్రీ విజేతలను ఇంటికెళ్ళి సన్మానించిన చిరంజీవి
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు. అయితే ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపి తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు, దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించాయి. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియా ద్వారా కూడా చిరంజీవి పద్మ అవార్డు పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టీ, మాధవన్‌తో పాటు క్రీడారంగం నుంచి రోహిత్ శర్మ, వరల్డ్‌కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, అలాగే డాక్టర్ దత్తాత్రేయుడు నోరికి అభినందనలు తెలియజేశారు.

Exit mobile version