NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి భూములిచ్చిన రైతులకు గుడ్‌న్యూస్‌..
కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చినట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ కార్యాలయం ప్రకటించింది.. ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ప్లాట్లకు ఈ-లాటరీ నిర్వహించామని.. 2016లో విమానాశ్రయ విస్తరణ నిమిత్తం 12.5315 ఎకరాల భూములిచ్చిన 20 మంది రైతులకు.. 24 రెసిడెన్షియల్ ప్లాట్లు, 15 కమర్షియల్ ప్లాట్లు మొత్తంగా 39 ప్లాట్లు వారికి అందజేశామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) బీఎల్ఎన్ రాజకుమారిణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. రిటర్నబుల్ ప్లాట్లను రైతుల సమక్షంలో ఈ లాటరీ విధానంలో అందజేశాం.. రైతులకు భౌగోళికంగా వారి ప్లాట్లు ఎక్కడున్నాయో వివరించడానికి ప్రత్యేకంగా జీ.ఐ.ఎస్ సిబ్బందిని, గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు.. ప్లాట్లు పొందిన రైతులకు సౌకర్యంగా ఉండేందుకు అమరావతిలో తొమ్మిది రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు.. లాటరీలో ప్లాట్లు పొంది ప్రొవిజినల్ సర్టిఫికెట్లు అందుకున్న వారం రోజులలోపు సంబంధిత రిజిస్ట్రేషన్ కేంద్రాలకు వెళ్లి రైతులు రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొంది ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం.

మంత్రి వాసంశెట్టి సంచలన వ్యాఖ్యలు.. ఆధారాలు చూపకపోతే క్రిమినల్ కేసులు..!
తనపై ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతాను అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.. అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్స్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటూ మండిపడ్డారు.. అవినీతి కేసులో త్వరలో రాష్ట్ర మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్టు అవుతారు.. వారి అవినీతిని బయట పెడతామని పేర్కొన్నారు.. నేను భూకబ్జాకు పాల్పడ్డానని కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారు.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు అని సూచించారు.. అయితే, వైసీపీ నేత పిల్లి సూర్య ప్రకాష్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారు.. పిల్లి సూర్య ప్రకాష్ నాపై చేసిన ఆరోపణలకు లీగల్ నోటీసు ఇచ్చా.. ఆధారాలు చూపకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతాను అని హెచ్చరించారు.. ఉనికి కోసం అభియోగాలు మోపుతున్నారు అంటూ ధ్వజమెత్తారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.

టౌన్ ప్లానింగ్‌లో సమూల మార్పులు.. సీఎం చేతికి కీలక రిపోర్ట్..
మున్సిపల్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. అయితే టౌన్ ప్లానింగ్ లో సమూల మార్పులు చేయడానికి వేసిన కమిటీల రిపోర్టులు ఈ రోజు సీఎంకు అందజేశారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. టౌన్ ప్లానింగ్ లో సమూల మార్పులు చేయడానికి వేసిన కమిటీల రిపోర్టులు సీఎం చంద్రబాబుకు అందించామని తెలిపారు.. 7 టీమ్‌లు పది రాష్ట్రాల్లో తిరిగి అక్కడి లే ఔట్, బిల్డింగ్ అనుమతులు స్టడీ చేశారు.. 15 మీటర్లు లేదా ఐదంతస్తులు ఇల్లు కట్టే వారికి అనుమతుల్లో మార్పులు చేశాం.. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు.. వాళ్ల ప్లాన్ ను ఆన్ లైన్ లో పంపించి ఫీజు కడితే అనుమతిచ్చినట్టే భావించబడుతుంది.. ఒకవేళ ప్లాన్ డీవియేషన్లు వస్తే ఆ సర్వేయర్ లైసెన్స్ రద్దవుతుందని హెచ్చరించారు.

తిరుపతి జూ లో మరో బెంగాల్ టైగర్ మృతి..
తిరుపతి జూ లో బెంగాల్ టైగర్ మృతిచెందింది.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ‘మధు’ అనే బెంగాల్ టైగర్ మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు.. బెంగాల్‌ టైగర్‌ మధును 11 ఏళ్ల వయస్సులో 2018లో బెంగళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్ నుంచి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చారు అధికారులు.. ఇప్పుడు మధు వయస్సు 17 ఏళ్లకు పైగానే ఉంది.. బెంగాల్‌ టైగర్‌ మధు వృద్ధాప్యంతో చనిపోయినట్టు జూ అధికారులు వెల్లడించారు..

ఇక, పేపర్ లెస్ శాసన వ్యవస్థ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో ఒప్పందం..
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో “కాగిత రహిత” (పేపర్ లెస్) శాసన వ్యవస్థ అమలు చేయనున్నట్టు వెల్లడించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఈ మేరకు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడిషనల్ కార్యదర్శి సత్య ప్రకాశ్, ఏపీ శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు, శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఒప్పందంపై ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.. ఏపీలోని రెండు చట్ట సభల్లో ఇక నుంచి శాసన వ్యవహారాలు, కార్యక్రమాలన్నీ కాగితం లేకుండా నిర్వహించేందుకు సాంకేతికంగా ఆధునీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం “జాతీయ ఈ విధాన్ అప్లికేషన్” (“నేవా”-NeVA) కింద అన్ని రాష్ట్రాల చట్ట సభల్లో “పేపర్ లెస్” శాసన వ్యవస్థ అమలు చేయనున్నారు.. ఏపీలోని రెండు సభల్లో పేపర్ లెస్ శాసన వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి “ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసేందుకు గత నెలలో కేంద్ర ప్రభుత్వ బృందం రాష్ట్రానికి వచ్చింది. అయితే, మొత్తం ఖర్చు అంచనాల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.. మరోవైపు.. ప్రాజెక్ట్ మొత్తం ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.. ఈ మేరకు పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది..

ఖమ్మం నలుదిక్కులా మొక్కలు కనిపించేలా అధికారులు కృషి చేయాలి
ఖానాపురం హవేలీ నాల్గవ డివిజన్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ. 1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (జి+1 భవనం) పనులకు సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, “ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో అన్ని ప్రాంతాల ప్రజల అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రజలకు సేవలందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు. మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, “నాల్గవ డివిజన్‌లో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాపన చాలా అవసరమైనది. ఈ ప్రాంతంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు, వారికి ఈ ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది” అని అన్నారు.

అంబర్ – రెసోజెట్ పెట్టుబడులు రూ.250 కోట్లు.. వెయ్యి మందికి ఉద్యోగాలు
పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్ – రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సోమవారం నాడు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించారు. అంబర్ – రెసోజెట్ సంస్థకు ప్రభుత్వ పరంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సంస్థ దేశంలోని పలు కంపెనీల కోసం రూమ్ ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండిషనర్ల లాంటి పలు పరికరాలకు ఉత్పత్తి చేసి అందిస్తోందని ఆయన తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతుందని శ్రీధర్ బాబు చెప్పారు.

ఫడ్నవిస్‌ సీఎం అయ్యే ఛాన్స్.. కేంద్రమంత్రి వ్యాఖ్య
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ అవుతారని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ మద్దతుతో ఫడ్నవిస్ సీఎం కాబోతున్నారని చెప్పుకొచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచే ప్రకటన రావాల్సి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిపై మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. త్వరలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, ఆర్‌పీఐ-ఏకి కేబినెట్‌ బెర్త్‌ దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫడ్నవిస్‌తో జరిపిన చర్చల్లో కేబినెట్ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రమాణస్వీకారంపై క్లారిటీ రానుందని చెప్పారు. తమ పార్టీకి కేబినెట్ బెర్త్ ఖాయమని వెల్లడించారు. బీజేపీకి సొంతంగా 132 సీట్లు వచ్చాయని.. ఇక ఎన్సీపీ 41 సీట్ల మద్దతు అందించారని గుర్తుచేశారు. ఏక్‌నాథ్ షిండేతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే ఛాన్సుందని అథవాలే అన్నారు.

దావూద్‌‌కు భయపడే భారత్‌ను వీడా.. లలిత్‌ మోడీ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా విడిచిపెట్టి వెళ్లిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నుంచి హత్య బెదిరింపులు రావడంతోనే దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా తాను దేశాన్ని వీడలేదని.. ప్రాణహానితోనే వీడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో దావూద్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని కల్పించేందుకు దావూద్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని వివరించారు. తనకు రక్షణ కల్పించలేమని పోలీసులే తనకు చెప్పారని తెలిపారు. కేవలం 12 గంటలు మాత్రమే రక్షణ కల్పించగలమని చెప్పుకొచ్చారని వివరించారు. ఆనాడు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ హిమాన్షు రాయ్ విమానాశ్రయంలో చెప్పిన మాటలను గుర్తుచేశారు. అక్కడ నుంచి ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌కు తీసుకెళ్లారన్నారు. అవినీతి లేకుండా నిబద్ధతతో కూడిన ఆటే తనకు ముఖ్యమని వివరించారు. ఇక భారత్‌కు ఎప్పుడైనా వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. చట్టపరంగా తాను పారిపోయిన వ్యక్తిని కాదని, తనపై ఒక్క కేసు కూడా లేదన్నాడు. 2010లో లలిత్‌ మోడీ భారత్‌ను వీడారు. ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్నారు. అంతేకాకుండా సుస్మితా సేన్‌తో ఆయన కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించారు.

అదానీకి మరో ఎదురు దెబ్బ.. భారీ ప్రకటన చేసిన ఫ్రెంచ్ దిగ్గజం
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని సోమవారం తెలిపింది. గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. అవినీతి విచారణ గురించి తమకు తెలియదని ఇంధన సంస్థ పేర్కొంది. బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో టోటల్ ఎనర్జీస్ ఒకటి. ఇది ఇంతకుముందు గ్రూప్ యొక్క పునరుత్పాదక ఇంధన వెంచర్ అదానీ గ్రీన్ ఎనర్జీ (AEGL), సిటీ గ్యాస్ యూనిట్ అదానీ టోటల్ గ్యాస్ (ATGL) లో వాటాలను కైవసం చేసుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీస్ 19.75 శాతం వాటాను కలిగి ఉంది. ఇది గౌతమ్ అదానీ నేతృత్వంలోని భారతీయ సమ్మేళనాకి చెందిన సహజ వనరుల ద్వారా  విద్యుత్తును తయారు చేసే విభాగం. ఏఈజీఎల్ (AEGL)తో కలిసి సౌర, పవన శక్తి నుంచి కరెంట్‌ను తయారు చేస్తాయి. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలలో 50 శాతం వాటాను కలిగి ఉంది. అదానీ టోటల్ గ్యాస్‌లో ఫ్రెంచ్ సంస్థ 37.4 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ఆటోమొబైల్స్‌కు సీఎన్‌జీ (CNG) విక్రయిస్తుంది. వంట కోసం ఇళ్లకు పైపుల ద్వారా సహజ వాయువును సరఫరా చేస్తుంది.

టీ20ల్లో సంచలనం.. 7 పరుగులకు ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే ఆలౌటైంది. టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్. తొలుత నైజీరియా 271/4 పరుగులు చేసింది. సెలిమ్ సలావ్ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులతో చెలరేగిపోయాడు. మరో బ్యాటర్ ఇసాక్ ఓక్పే 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. సులైమన్ రన్‌సేవే కూడా 50 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐవరీ కోస్ట్ 7.3 ఓవర్లలో 7 పరుగులకే కుప్పకూలింది. ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ముగ్గురు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మహ్మద్ 4 పరుగులు చేశాడు. నైజీరియా బౌలింగ్‌లో ఐజాక్ దన్లాడి, ప్రోస్పర్ ఉసేని తలో 3 వికెట్లు తీశారు. పీటర్ అహో 2 వికెట్లు పడగొట్టాడు. సిల్వెస్టర్ ఓక్పే ఒక వికెట్ సాధించాడు. గతంలో సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 10 పరుగులకే ఆలౌటైంది.

సీక్వెల్స్ తో బండి లాగిస్తున్న ‘బాలీవుడ్’
సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఓ సినిమాకు హిట్ టాక్ రాగానే.. వాటికి కంటిన్యూగా 2, 3 అంటూ ఇన్‌స్టాల్ మెంట్ చిత్రాలను దింపుతోంది. ఈ ఏడాది హయ్యర్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ2, సింగం ఎగైన్, భూల్ భూలయ్యా3 ఈ కేటగిరిలోవే. ఇవే కాదు బోలెడన్నీ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ భూలయ్యా 3, సింగం ఎగైన్ లాంటి సీక్వెల్స్ బాలీవుడ్ పరువును కొంత నిలబెట్టాయి. అందుకే వరుస పెట్టి ఇన్‌స్టాల్ మెంట్ మూవీస్ తీసేస్తున్నారు. కోట్లు కుమ్మరిస్తుండటంతో స్పెషల్ ఫోకస్ పెంచుతున్నారు మేకర్స్. హీరోస్ సైతం సీక్వెల్స్‌కు సై అనడంతో స్టోరీలు రెడీ చేస్తున్నారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. వచ్చే ఏడాది మరిన్ని ఫ్రాంచైజీ మూవీస్ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి. అందులో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా నిలుస్తోంది వార్ 2. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వార్‌కు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో తారక్ యాంటోగనిస్టుగా కనిపించబోతున్నాడన్నది టాక్. అందరికన్నా దోస్తులు అక్షయ్, అజయ్ చేతిలో హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ సీక్వెల్స్ ఉన్నాయి. రైడ్ 2, సన్నాఫ్ సర్దార్ 2, దేదే ప్యార్ దే2తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు అజయ్ దేవగన్ . జాలీ ఎల్ఎల్బీ 3, హౌస్ ఫుల్ 5, వెల్కమ్ టు ది జంగిల్ ఇన్ స్టామెంట్ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవే కాదు టైగర్ ష్రాఫ్ బాఘీ 4, హృతిక్ క్రిష్ 4 కూడా రెడీ అవుతున్నాయి. రాకేశ్ రోషన్ డైరెక్షన్‌కు రిటైర్ మెంట్ ప్రకటించడంతో.. క్రిష్ 4ను మరో డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నాడు . ఇవే కాదు.. మరిన్ని ఫ్రాంచైజీ మూవీలు రాబోతున్నాయి. మరీ వీటిల్లో ఆడియన్స్ ఏ సినిమాలపై కలెక్షన్లు కుమ్మరిస్తారో చూడాలి.

ఓవర్సీస్ లో మరో మైలురాయి చేరుకున్న’పుష్ప -2′
ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన పుష్ప 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ ఆదివారం చెన్నై లో జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ హిట్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా పుష్ప రిలీజ్ కోసం తెలుగు స్టేట్స్ లో పేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా అంతే ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆ క్రేజ్ బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. పుష్ప ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికె అత్యంత వేగంగా 1 మిలియన్ అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించగా తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని అందుకుంది. నార్త్ అమెరికాలో సోమవారం నాటికి ఈ సినిమా 2 మిలియన్ మార్క్ ను అందుకుంది. ఇక టికెట్స్ పరంగాను 50,000 టికెట్స్ బుకింగ్స్ తో ఆ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది పుష్ప. రిలీజ్ నాటికి ఈ సినిమా 4 మిలియన్ మార్క్ అందుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఈ సినిమాను ఓవర్సీస్ లో ప్రత్యంగిర సినిమాస్ అలాగే AA సినిమాస్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను భారీ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇటు తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ మరికొద్ది ఓపెన్ చేయనున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల వెల్లడించారు.