NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే.. ఈగల్‌గా మారిన ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్
నార్కోటిక్ కట్టడిపై సబ్ కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని హెచ్చరించారు.. గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే అని ప్రకటించిన మంత్రి లోకేష్.. నిర్మూలనకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపుతాం అన్నారు.. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్ గా మారుస్తున్నట్టు వెల్లడించారు.. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.. కాగా, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం మూడో సమావేశం హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈగల్ ఆకే రవికృష్ణ, ఇతర శాఖ‌ల‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఈగల్ గా(ELITE ANTI-NARCOTICS GROUP FOR LAW ENFORECEMENT-EAGLE) మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గంజాయి సాగు గుర్తించి ధ్వంసం చేయ‌డానికి డ్రోన్లను వినియోగించాలని సూచించాను. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాల‌ని కోరాను. డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠ్యాంశం రూపొందించి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంద‌ని పేర్కొన్నారు..

ప్రధానితో పవన్‌ కల్యాణ్‌ భేటీ.. మోడీకి డిప్యూటీ సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్‌ అంశాలపై చర్చించిన ఆయన.. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఇక, ఆ తర్వాత ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ (ఎక్స్‌లో పోస్టు) ట్వీట్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.. ‘మోడీ నా‌పై‌ చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది.. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు.. గాంధీనగర్‌లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్‌ చేశారు.. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

అమరావతికి రైల్వే లైన్.. రైతులకు మంత్రి హామీ
రాజధాని అమరావతికి రైల్వేలైన్‌ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు మంత్రి నారాయణ.. రైతుల డిమాండ్లు, విజ్ఞప్తులను విన్న ఆయన.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.. ఈ సమావేశానికి పెదకూరపాడు, తాడికొండ ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రావణ్ కుమార్, కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాల రైతులు హాజరయ్యారు.. అయితే, అమరావతి మీదుగా వెళ్లే కొత్త రైల్వే లైన్ పరిధిలో ఉన్న ఆయా గ్రామాల రైతులు.. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. రాజధానిని అనుకుని ఉన్న గ్రామాలు కావడంతో తమకూ పూలింగ్ అవకాశం ఇవ్వాలని కోరారు.. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంత్రి నారాయణ. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు..

ఏపీకి తుఫాన్‌ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర తుఫాన్‌ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.. ఐఎండీ సూచనల ప్రకారం తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పుగా 1100 కిమీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తదుపరి 2 రోజులలో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందని.. దీని ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో అంటే ఈ నెల 28, 29, 30 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ 3 రోజులు మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.. అయితే, ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ.. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ గరిష్టంగా 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిచింది.. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని పేర్కొన్నారు..

హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ మాదే..
హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లను.. నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. డిసెంబర్‌ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయని సర్కారు తెలిపింది. 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. నోటిఫికేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం 3 నెలల గడువు కోరింది. తెలంగాణ హైకోర్టు అందుకు నిరాకరించింది. తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రజలు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు..
తెలంగాణ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర పథకాలను సమగ్రంగా అమలు చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు పని చెయ్యాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగిందని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి వేగంగా విస్తరిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారని.. అంతేకాక బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారని ప్రధాని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందన్నారు. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

ఎంపీగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్‌సభ బైపోల్‌లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో రవీంద్ర వసంతరావు చవాన్‌ గెలిచారు. కేవలం 1,457 ఓట్ల తేడాతో గెలిచారు. గురువారం ప్రియాంక. వసంతరావు పార్లమెంట్‌లో ఎంపీలుగా ప్రమాణం చేయనున్నారు. దీంతో తొలిసారి ప్రియాంక పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి భారీ విజయంతో గెలుపొందారు. అయితే రాహుల్.. రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానాన్ని వదిలేశారు. దీంతో అక్కడ బైపోల్ అనివార్యమైంది. ఇక ఆ స్థానం నుంచి ప్రియాంక రంగంలోకి ఘన విజయాన్ని అందుకున్నారు. ఇక వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ మూడో స్థానంలో నిలిచారు.

బీజేపీ నుంచే మహారాష్ట్ర సీఎం.. షిండే, పవార్‌ పార్టీలకు డిప్యూటీలు..
మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. ఎవరు సీఎం అయిన శివసైనికులు మద్దతు ఇస్తారని, తాను బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మహారాష్ట్రకు కాబోయే సీఎం బీజేపీ నుంచే ఉంటారని తెలుస్తోంది. మహాయుతి కూటమిలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలకు రెండు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయని, ఈ మేరకు ఫార్ములా రెడీ అయినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ మహాయుతి కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. మహావికాస్ అఘాడీ(ఏంవీఏ) దారుణంగా ఓడిపోయింది. అయితే, ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 40 మంది వరకు క్యాబినెట్‌లో మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. ఇందులో సగం బీజేపీకి, మిగతావి రెండు భాగస్వామ్య పక్షాల మధ్య పంచుతారనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, రేపు అమిత్ షాతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఎవరనేదానిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

‘‘రిలేషన్‌షిప్ చెడిపోయిన తర్వాత రేప్ కేసులు’’.. సుప్రీం ఆందోళన..
ఏకాభిప్రాయంతో ‘‘రిలేషన్‌షిప్’’ నడిపి, అది కాస్త చెడిపోయిన తర్వాత అత్యాచార కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరువురు వివాహ సంబంధం లేకుండా, ఇష్టపూర్వకంగా సుదీర్ఘమైన శారీరక సంబంధం ఏకాభిప్రాయ సంబంధాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ సంబంధాల్లో వివాదాలు చెలరేగి జంట విడిపోతున్నారు. ఇలాంటి సమయంలో సదరు వ్యక్తిపై మహిళలు అత్యాచారం కేసులు పెడుతున్నారు. తాజాగా, రిలేషన్‌షిప్ చెడిపోయిన తర్వాత ఒక మహిళ వ్యక్తిపై అత్యాచారానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దీనిని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడి ధర్మాసనం విచారణ జరిపింది. ఇలాంటివి పెద్ద సంఖ్యలో కేసులు వస్తున్నాయని, న్యాయశాస్త్రాన్ని తప్పుగా, దురుద్దేశంతో ప్రయోగిస్తున్నారని, ఇది ఆందోళనకరమైన విషయమని ధర్మాసనం పేర్కొంది. వివాహం చేసుకుంటానని సంబధాన్ని ఏర్పరుచుకోవడం, ఏకాభిప్రాయ సంబంధాల మధ్య తేడాను కోరింది.

మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు.. BE 6e, XEV 9e డెలివరీ, ఫీచర్స్..
స్వదేశీ కార్ మేకర్ మహీంద్రా తన బ్యాండ్ న్యూ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. మహీంద్రా బ్రాండ్-న్యూ INGLO EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన BE 6e, XEV 9e ఎలక్ట్రిక్ కార్లు రిలీజ్ అయ్యాయి. BE 6e ధర రూ. 18.90 లక్షల నుంచి, XEV 9e ధర రూ. 21.90 లక్షల(ఎక్స్ షోరూం) ధర నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ధరల్లో చార్జర్ ధరల్ని చేర్చలేదు. ఈ రెండు ధరలు కూడా ఎంట్రీ లెవల్ ధరలే అని తెలుస్తోంది. ఈ రెండు కార్ల పూర్తి ధరలు 2025 జనవరిలో తెలియజేయనుంది. ప్రస్తుతానికి కార్లకు సంబంధించి పూర్తి వివరాలను మహీంద్రా వెల్లడించలేదు. జనవరి 2025 నుంచి ఈ రెండు ఈవీల బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీ ఫిబ్రవరి లేదా మార్చి 2025 నాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. రాబోయే భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ రెండు కార్లను ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ రెండు కార్లపై కస్టమర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రీలీజ్ అయిన ఈ కార్ల డిజైన్ అందర్ని ఆకట్టుకుంటోంది.

రాహుల్, డుప్లెసిస్ కాదు.. ఇతనే కెప్టెన్..!
తాజాగా జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో కేఎల్ రాహుల్, డుప్లెసిస్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించేంది. అయితే.. జట్టు అతన్ని వదులుకుంది. ఈ క్రమంలో.. జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా.. మెగా వేలంలో లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను డీసీ తమ జట్టులో చేర్చుకుంది. అయితే వీరిద్దరిలో ఒకరికి కెప్టెన్ బాధ్యతలు ఇస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్త్ జిందాల్ రాబోయే సీజన్‌కు కెప్టెన్ ఎవరో ఒక సూచన ఇచ్చారు. కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్‌ను కాకుండా.. అక్సర్ పటేల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ESPN Cricinfoతో జిందాల్ మాట్లాడుతూ.. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే ఆటగాడిగా పేర్కొన్నారు. కేఎల్ రాహుల్‌తో కూడా చర్చలు జరిగాయని, కెప్టెన్సీ గురించి మాట్లాడటం కాస్త అకాలమని అన్నారు. అక్షర్ పటేల్ ఫ్రాంచైజీతో చాలా కాలం పాటు ఉన్నాడు. అంతేకాకుండా.. అతను గత సీజన్‌లో వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

తమిళ ఇండస్ట్రీని ఆదుకున్న చిన్న హీరోలు
బాహుబలి రేంజ్ ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన కంగువా  బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. 400 కోట్లు పెట్టి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తీస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇండియన్ 2, వెట్టియాన్ రిజల్ట్స్ ఏంటో తెలుసు. కానీ ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చిన తక్కువ బడ్జెట్ చిత్రాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. కర్ణన్, మామన్నన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మారి సెల్వరాజ్ వాజై  జస్ట్ 5 అంటే 5 కోట్లు పెట్టి మూవీ తీస్తే రూ. 40 కోట్లను కొల్లగొట్టింది.  ఇదే కోవలోకి వస్తుంది లబ్బర్ పందు. జెర్సీలో నాని కొడుకుగా కనిపించిన హరీష్ కళ్యాణ్ హీరో. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 5 కోట్లతో నిర్మిస్తే.. రూ. 44.36 కోట్లు తెచ్చి రాబట్టింది.. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో మూవీ ఉన్నా.. రిస్క్ చేసి హిట్టు అందుకుంది లవర్.  లాల్ సలాంకు గుడ్ బై చెప్పి  లవర్‌కు వసూళ్లు కుమ్మరించారు ఆడియన్స్.  విజయ్ సేతుపతి నటించిన మహారాజా ఈ ఏడాది స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. రూ. 20 కోట్లతో మహారాజా తీస్తే రూ.110 కోట్లను రాబట్టింది. ఇప్పుడు చైనాలో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. డీమాంటీ కాలనీ2. జస్ట్ 15 నుండి 20 కోట్లలోపే దీని బడ్జెట్.. కానీ 85 కోట్ల వరకు రాబట్టగలిగింది. 40 కోట్లతో తీసిన అరణ్మనై 4 కూడా సుమారు వంద కోట్లను వసూలు చేసింది.  ఇవన్నీ కూడా మినిమం బడ్జెట్ సినిమాలే.  అమరన్  కాస్త బిగ్ బడ్జెట్ చిత్రమైనప్పటికీ  ఇప్పటికే రూ. 300 కోట్లు దాటేసింది. స్టార్ హీరోల కంటే కుర్ర హీరోల సినిమాలే కోట్లు కుమ్మరించి తమిళ ఇండస్ట్రీని నిలబెట్టిన చిత్రాలుగా మారాయి.

పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే.. ఇక థియేటర్స్ లో జాతరే.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ బుధవారంతో షూటింగ్ ముగించాడు దర్శకుడు సుకుమార్. ఈ రోజు ఈ సినిమాను సెన్సార్ పనులు ఫినిష్ చేసారు. నేడు ఈ సినిమా చుసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ను జారీ చేసారు. సినిమాలో అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేస్తూ మరి కొన్ని కట్స్ చేయాలిని సూచించారు సెన్సర్ టీమ్. సినిమాలో కాస్త వైలెన్స్, హింస పాళ్ళు ఎక్కవుగా ఉండడంతో యూ ఏ ను జారీచేశారు. దింతో 18 సంవత్సరాలు దాటని పిల్లలకు పుష్ప -2 ను థియేటర్స్ లో చూసేందుకు అనుమతి లేదు. మొత్తం 3గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది పుష్ప. సినిమాలోని జాతర ఎపిసోడ్ దాదాపు 25 నిముషాలు ఉంటుందట. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. సినిమా చుసిన అనంతరం పుష్ప టీమ్ కు విషెష్ తెలిపారు సెన్సార్ టీమ్. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.