NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. పోలవరంపై కీలక నిర్ణయం
సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ముగిసింది.. పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగింది.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది కేబినెట్‌ భేటీ.. దీంతో.. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను కొత్తగా నిర్మించనుంది ప్రభుత్వం. ఇక, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ లో ప్రతిపాదించనుంది ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రం వాల్ నిర్మాణంపై ప్రతిపాదనలు పెట్టనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నీతి ఆయోగ్ లో ప్రతిపాదనలు పెట్టే ముందు ఏపీ కేబినెట్ ఆమోదం తప్పనిసరి అయిన నేపథ్యంలో.. ఈ మేరకు పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ఆమోదం తెలిపింది కేబినెట్‌ సమావేశం.. కాగా, పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.. గతంలో జరిగిన పనులు.. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితిపై ఆరా తీశారు.. ఇక, పోలవరంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన విషయం విదితమే. గత.. ప్రభుత్వ వైఫల్యాలు, నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా ఎండగట్టారు సీఎం చంద్రబాబు నాయుడు.

నేను సీఎం భార్యగా రాలేదు.. మీలో ఒక మహిళగా..
నేను ముఖ్యమంత్రి భార్యగా ఇక్కడికి రాలేదు.. మీలో ఒక మహిళగా ఇక్కడికి వచ్చాను అని వ్యాఖ్యానించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ రోజు రామకుప్పం గ్రామంలో పర్యటించిన భువనేశ్వరి.. గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రం చీకట్లో మగ్గిపోయిందని, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వంతో రాష్ట్రంలో వెలుగు వచ్చిందని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బొడుగుమాకులపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు.. నేను నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించినప్పుడు మీరు నాపై చూపిన ప్రేమ, గౌరవం నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చిందన్న ఆమె.. చంద్రబాబుపై మీరు గత 40 సంవత్సరాలుగా పెట్టుకున్న నమ్మకానికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ప్రజాప్రభుత్వంలో మహిళలు ధైర్యంగా ఉండొచ్చు.. గత పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.. రాష్ట్ర మహిళలకు ప్రజాప్రభుత్వంతో స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.. ఇక, ప్రతి మహిళకు నా కృతజ్ఞతలు అంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి..

ఏం జరిగిందని ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారు..!
ఏం జరిగిందని జగన్ ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారు? అంటూ మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు.. అందులో వాస్తవాలు చూస్తే దారుణంగా ఉన్నాయి.. గత పాలనలో మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో ఆ శ్వేత పత్రంలో ఉన్నాయన్నారు. లోకల్ బాడి ఎన్నికలలో చేసినట్లు 2024 ఎన్నికలలో కూడా చేద్దాం అని జగన్ పన్నాగం పన్నాడు.. కానీ, ఎన్డీయేకి మద్దతుగా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు.. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లా ఏపీలో ప్రజలు తీర్పు ఇచ్చారు.. అరాచకం, అకృత్యాలు చేస్తే ప్రజలు సహించరు.. పిల్లవాడికి ఆకలి ఐతే పాలబుడ్డి అడిగినట్లు జగన్ రాష్ట్ర పతి పాలన అడుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.

95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 95 శాతం మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు అని దుయ్యబట్టారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీయే ప్రభుత్వం చేయదన్న ఆయన.. అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయి అని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. దొంగ కేసులు పెట్టడం వల్ల పాస్ పోర్టు రెన్యువల్ కూడా అవ్వక చాలా మంది ఇబ్బంది పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, విశాఖను అక్రమాలకు అడ్డాగా గత ప్రభుత్వం మార్చిందని విమర్శించారు.. చంద్రబాబు విశాఖ వస్తే.. గుండాయిజం చేయించారు.. కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేయించారిన మండిపడ్డారు.

ఊహల బడ్జెట్ కేసీఆర్ ది… వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్ ది
ఊహల బడ్జెట్ కేసీఆర్ ది… వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్ ది అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆలోచన అప్పుల మీద.. రేవంత్…భట్టి లది అభివృద్ధి ఆలోచన అని అన్నారు. వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుందని, 10 వేల కోట్లతో హైద్రాబాద్ దశ మారుతుంది… కేసీఆర్ కి ఎందుకు కుళ్ళు అని ఆయన మండిపడ్డారు. చీల్చుడు లో మేమే ఎక్స్పర్ట్.. కేసీఆర్ కాదని, మాదగ్గర రాజకీయాలు నేర్చుకున్న కేసీఆర్ కి ఛీల్చుడు ఏం తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్… భట్టి లు పెట్టింది మంచి బడ్జెట్ ఇది అని, కేసీఆర్ ఇస్ట్మాన్ కలర్ బడ్జెట్ అన్నారని, కేసీఆర్ ది హైప్ బడ్జెట్.. కాంగ్రెస్ బడ్జెట్ ప్రాక్టికల్ అని జగ్గారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ బడ్జెట్..ఊహల బడ్జెట్ అని, కాంగ్రెస్ ది వాస్తవ బడ్జెట్ అని, ఊహలకు… వాస్తవానికి తేడా ఉందన్నారు జగ్గారెడ్డి. భట్టి బడ్జెట్ బిందల్లో నీళ్లు ముంచుకుని తాగినట్టు ఉందని, కేసీఆర్ బడ్జెట్ చెరువులో నీళ్ళు తెచ్చుకుని తాగినట్టుగా.. మాటకు కట్టుబడి…వాస్తవానికి దగ్గరలో కాంగ్రెస్..కాంగ్రెస్ బడ్జెట్ ఉంటుందన్నారు. ఎవరైనా దావతి ఇస్తే…నాన్ వెజ్ కి ప్రయార్టి ఇస్తామని, కేసీఆర్ బడ్జెట్ ఎట్లా ఉంటది అంటే దావతికి పోతే మటన్ బిర్యాని తిని రావచ్చు అన్నట్టు ఉంటదన్నారు.

ఆత్మస్తుతి.. పర నిందలా.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్
ఆత్మ స్తుతి పర నింద లా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరు గ్యారంటీ లు నీరు గారిపోయాయని, అంకెల గారడీల రాష్ట్ర బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల ముందు గ్యారంటీలా గారడి అని, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో బడ్జెట్ ఉందన్నారు హరీష్‌ రావు. ఇచ్చిన హామీల ప్రస్తావన ఏ ఒక్కటి లేదని, అప్పులు తెస్తామని మళ్ళీ చెప్తుందన్నారు హరీష్‌ రావు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో మర్చిపోయిందని, 2,500 మహిళలకు ఇస్తామని చెప్పిందన్నారు హరీష్‌ రావు. కోటి మంది అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారని, 8నెలలుగా మహాలక్ష్మి కాస్త మహా నిరాశ గా మారిందన్నారు. ఆసరా పెన్షన్ పై యెన్నో చెప్పారు రేవంత్ రెడ్డి అని, 4వేల పెన్షన్ లు ఇప్పటిదాక ఇవ్వలేదన్నారు.

శుక్రవారం లడఖ్‌లో మోడీ పర్యటన.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభం
ప్రధాని మోడీ శుక్రవారం లడఖ్‌లో పర్యటించనున్నారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ప్రధాని లడఖ్‌లో పర్యటించనున్నారు. కార్గిల్ యుద్ధానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించనున్నారు. అనంతరం షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. షింకున్ లా టన్నెల్ 16,580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక భారీ పర్వత మార్గమైన షింకున్-లా పాస్ కిందకు వెళ్లే మోటరబుల్ సొరంగం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ వ్యాలీని లడఖ్‌లోని జంస్కర్ వ్యాలీని కలుపుతుంది. సొరంగం పొడవు దాదాపు 4.1 కిలోమీటర్లు ఉంటుంది.

బడ్జెట్ పై పార్లమెంట్ లో ఆసక్తికర చర్చ.. హాయిగా నిద్రపోయిన ఎంపీ
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ స‌మావేశాల స‌మ‌యంలో జాతీయ స్థాయిలో ప్రజ‌ల దృష్టిని ఆక‌ర్షించిన అనేక ఆస‌క్తిక‌ర‌మైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి. గురువారం జూలై 25, 2024 నాడు ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ తన అభిప్రాయాలను తెలుపుతున్నారు. ముఖ్యంగా సామాజిక రంగానికి తక్కువ నిధులు కేటాయించినందుకు ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. సౌగతా రాయ్ తన అభిప్రాయాలను తెలియజేస్తుండగా, టీఎంసీకి చెందిన మరో ఎంపీ తాహిర్ ఖాన్ నిద్రపోతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. సౌగత రాయ్ ప్రసంగం సమయంలో నిద్రిస్తున్న టీఎంసీ ఎంపీ పేరు తాహిర్ ఖాన్. ఆయన పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ. ముర్షిదాబాద్ నుంచి టీఎంసీ వరుసగా రెండోసారి తాహిర్ ఖాన్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నమ్మకాన్ని నిలబెట్టుకుని తాహిర్ ఖాన్ ఇక్కడ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. అన్ని రకాల రాజకీయ ఊహాగానాలను పట్టించుకోకుండా తాహిర్ ఖాన్ ముర్షిదాబాద్ స్థానం నుంచి గెలుపొందారు. ముర్షిదాబాద్ స్థానంలో పోలింగ్ సందర్భంగా అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయని మీకు తెలిసిందే.

18 మంది చనిపోయినా, పైలెట్ మాత్రం అద్భుతంగా బయటపడ్డాడు.. ఎలా సాధ్యమైంది..
నేపాల్‌లో నిన్న జరిగిన భయంకర విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయారు. ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. అయితే, అనూహ్యంగా ఈ ప్రమాదంలో ఒక్క పైలెట్ మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కెప్టెన్ మనీష్ రాజ్ షాక్యా ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా మిగిలాడు. అంతటి ఘోర విమాన ప్రమాదంలో పైలెట్ ప్రాణాలతో ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సౌర్య ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోంబార్డియన్ CRJ-200 విమానం, 19 మంది సిబ్బందితో సహా, ఇద్దరు సిబ్బంది, ఎయిర్‌లైన్‌లోని సాంకేతిక సిబ్బందితో బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. మృతుల్లో 15 మంది అక్కడిక్కడే మరణించగా, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో పైలెట్ ఉన్న కాక్‌పిట్ భాగం ఓ కంటైనర్‌ని ఢీ కొట్టింది. కాక్ పిట్ కంటైన్‌లో చిక్కుకుని, మిగతా విమానభాగాలు వేరై నేలపై పడి మంటలు అంటుకున్నాయి. 37 ఏళ్ల షాక్యాని కంటైనర్ లోపల గుర్తించారు. ఇదే అతడి ప్రాణాలను కాపాడింది.

కెనడా చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.. ట్రూడో తీరుపై భారత్ ఆగ్రహం..
భారత వ్యతిరేక, ఖలిస్తానీ మద్దతుదారులపై కెనడా మెతక వైఖరి అవలంభిస్తోంది. పలుమార్లు ఈ విషయాన్ని భారత్, కెనడా దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పలు సందర్భాల్లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పోస్టర్ల అంటించడంతో పాటు కెనడాలోని పలు ప్రాంతాల్లో ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎలాంటి భయం లేకుండా కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో‌పై ఇటీవల ఆన్లైన్‌లో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని అక్కడి ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసింది. అయితే, దీనిని కెనడా ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’అని భారత్ ఆరోపించింది. గురువారం మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. భారతీయ నాయకులు, దౌత్యవేత్తలను పదేపదే బెదిరించే భారత వ్యతిరేక శక్తులపై కెనడా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో అలసత్వం వహిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ఇంకా బోణీ అవలేదు.. అప్పుడే మరో స్టార్ హీరో సినిమా
విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమా చేస్తున్నాడు. చివరిగా పరశురామ్ దర్శకత్వంలో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ ఆ సినిమాతో అనుకున్న విజయాన్ని అయితే సాధించలేకపోయాడు. ప్రస్తుతానికి విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ్రీలంకలో జరుగుతుండగా విజయ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం మీద క్లారిటీ లేదు. భాగ్యశ్రీ బోర్సే అనే భామను ఈ సినిమాలో తీసుకున్నట్లు ప్రచారం జరిగింది కానీ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ భామ హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక రకంగా తెలుగులో మొదటి సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఆమె ఏకంగా విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా లీక్ చేసినట్లయింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాయి కొలంబోలో ఉన్నట్టు వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె ఈ విజయ్ దేవరకొండ 12వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి?

దేవర ముంగిట మరో ‘యానిమల్’
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా ఆ హీరోకి డిజాస్టర్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి కొరటాల శివతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో చాలామంది స్టార్ కాస్ట్ ని సిద్ధం చేశారు. హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుండగా విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అలాగే చాలామంది టాలెంటెడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. అదేంటంటే మరో విలన్నీ కూడా ఈ సినిమాలో భాగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల యానిమల్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బాబీ డియోల్ ని ఈ సినిమాలో విలన్ గా దింపుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి బాబీ డియోల్ ఇప్పటికే పలు తెలుగు ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. హరిహర వీరమల్ల సినిమాతో పాటు బాలకృష్ణ బాబీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆయన్ని సెకండ్ పార్ట్ కి మెయిన్ విలన్ గా తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.