Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

చట్టపరంగా న్యూ ఇయర్‌ను ఎంజాయ్ చేయండి.. హద్దు మీరితే సెంట్రల్‌ జైలే గతి.. సీపీ మాస్‌ వార్నింగ్..
న్యూ ఇయర్‌ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.. 2025కి బైబై చెప్పేసి.. 2026కి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.. అయితే, చట్టపరంగా న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయండి, హద్దు మీరితే విశాఖ సెంట్రల్ జైలే గతి అని మాస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. న్యూ ఇయర్ ముసుగులో మత్తు సరఫరా చేసే ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు విశాఖ సీపీ.. న్యూ ఇయర్ వేడుకలను నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని.. ఈవెంట్ ఆర్గనైజర్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.. న్యూ ఇయర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.. పార్టీల్లో మత్తు కలిగించే పదార్ధాలు వాడకం నిషేధమని, కొత్త సంవత్సరం ముసుగులో నిబంధనలు అతిక్రమిస్తే జైల్లో ఊసలు లెక్కపెట్టాల్సిందేనన్నారు.. బస్సులు, రైళ్లు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల నుండి గంజాయి, డ్రగ్స్ రవాణా, సరఫరాపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు.. న్యూ ఇయర్ మాటునా ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయించిన, సేవించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి..

మెడికల్ కాలేజీల టెండర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. తగ్గేదేలే..!
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల వ్యవహారం కూటమి సర్కార్‌, వైసీపీ మధ్య తీవ్రమైన యుద్ధానికే తెరలేపింది.. పీపీపీ మోడ్‌ను వ్యతిరేకిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించి.. చివరకు కోటికి పైగా సంతకాలను గవర్నర్‌కు అందజేసిన విషయం విదితమే కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. టెండర్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, బిడ్డర్స్‌ (టెండర్‌లో పాల్గొనే సంస్థలు)తో నేరుగా సంప్రదింపులు జరపాలన్న సూచన కూడా చేశారు. ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాలేజీ నిర్మాణం త్వరగా ప్రారంభమయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పీపీపీ (Public–Private Partnership) విధానం విజయవంతంగా అమలులో ఉందని గుర్తుచేసిన చంద్రబాబు.. ఏపీలో కూడా మెడికల్ కాలేజీలను అదే విధానంలో నిర్మించి, ప్రజలకు భారంలేకుండా మెరుగైన వైద్య విద్య అందిస్తామని తెలిపారు.

అధ్యక్ష పదవిని మాత్రమే వదిలేసా.. పార్టీని కానీ.. రాజకీయాలను కానీ కాదు..
పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను స్వచ్ఛందంగా వదిలింది కేవలం పార్టీ అధ్యక్ష పదవినే తప్ప.. పార్టీని కానీ, రాజకీయాలను కానీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై గత ఎన్నికల సమయంలో జరిగిన కుట్ర తరహాలోనే మరో కుట్ర జరుగుతోందేమో అన్న అనుమానం కలుగుతోందని వెల్లడించారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు తన రాజకీయ ప్రయాణాన్ని ఆపలేవని ధీమా వ్యక్తం చేశారు. గత 60 ఏళ్లుగా పాతపట్నం రాజకీయాల్లో కలమట కుటుంబానికి ఒక ప్రత్యేక బ్రాండ్ ఉందని, ప్రజలతో తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని ఆయన గుర్తుచేశారు. ప్రజల కష్టసుఖాల్లో తాము, తమ కష్టసుఖాల్లో ప్రజలు భాగస్వాములుగా నిలుస్తూ పరస్పర విశ్వాసంతో ప్రయాణం కొనసాగిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో అనివార్య, అనూహ్య కారణాల వల్ల టికెట్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వెల్లడించిన వెంకటరమణ.. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని, నియోజకవర్గంలో తమ స్థానాన్ని ఎప్పటిలానే తిరిగి సాధించేందుకు స్పష్టమైన ఆలోచనలు, కార్యాచరణ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. త్వరలోనే పాతపట్నం ప్రజలకు గతంలో మాదిరిగానే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. రాజకీయాల్లో తన దూకుడును, సేవాభావాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. చివరిగా ఆయన తన రాజకీయ నిర్ణయంపై మరోసారి క్లారిటీ ఇస్తూ, “పార్టీ అధ్యక్ష పదవిని మాత్రమే వదిలా తప్ప.. పార్టీని కాదు, రాజకీయాలను అంతకన్నా కాదు. ఈ విషయం తెలుసుకోవాల్సిన వాళ్లు తెలుసుకోవాలి” అంటూ మాస్‌ టోన్‌లో హెచ్చరిక చేశారు.

గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా.. ఏపీ ఆరోగ్యశాఖ కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో వినూత్న ముందడుగు వేసింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేయాలని నిర్ణయించింది ఆరోగ్యశాఖ.. ఇందుకు సంబంధించిన కీలక ఒప్పందాన్ని ఓ ప్రైవేట్ సంస్థతో చేసుకుంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఈ డ్రోన్‌ మెడిసిన్‌ డెలివరీ సేవలను నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఒప్పందం ప్రకారం, వచ్చే నెలాఖరు నుంచి గిరిజన ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాడేరును హబ్‌గా చేసుకుని సేవలు ప్రారంభించినప్పటికీ, భవిష్యత్తులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) నుంచి పాడేరుకు ఈ డ్రోన్ సేవలను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉందని అధికారులు తెలిపారు. డ్రోన్ల ద్వారా మందుల సరఫరాతో.. దూర ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఆస్పత్రులకు అత్యవసర మందులు వేగంగా చేరే అవకాశం ఏర్పడనుంది. కొండ ప్రాంతాలు, రహదారి సౌకర్యం సరిగా లేని ప్రాంతాల్లో సైతం.. సమయానికి మందులు అందుబాటులోకి రావడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ఆరోగ్య వ్యవస్థలో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు.. సేవల వేగం, నాణ్యత పెరుగుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రజలకు సకాలంలో వైద్య సాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొంది.

పసికందుల దందాలో పేరున్న హాస్పిటల్స్.. షాకింగ్ రిపోర్ట్.!
సైబరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి పసికందులను అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ వేదికగా సాగిస్తున్న ఈ దందాలో అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా పుట్టిన రోజు కూడా నిండని పసికందులను తీసుకువచ్చి ఇక్కడ భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కిడ్నాప్ చేస్తున్నారా లేదా పేద తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే, ఈ అక్రమ రవాణా వెనుక హైదరాబాద్‌లోని దాదాపు 9 ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోవా IVF, అను ఫెర్టిలిటీ సెంటర్, అంకుర హాస్పిటల్, అక్షయ, హెగ్డే, ఒయాసిస్, పద్మజ , ఫెర్టి-9 వంటి ఆసుపత్రులతో ఈ ముఠా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పిల్లాడి ప్రాణం తీసిన పెన్సిల్..
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ చేసిన ఒక చిన్న పొరపాటు ఆరేళ్ల బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన ఆరేళ్ల విహార్ రోజూలాగే స్కూల్‌కు వెళ్తూ, తన పెన్సిల్‌ను చొక్కా జేబులో పెట్టుకున్నాడు. తోటి స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పట్టుతప్పి బోర్లా కిందపడిపోయాడు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో జేబులో ఉన్న పెన్సిల్ మొన పైకి ఉండటంతో, బాలుడు కింద పడిన వేగానికి ఆ పెన్సిల్ నేరుగా విహార్ ఛాతిలోకి బలంగా దూసుకుపోయింది.

ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..
ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆరావళి కొండలను పూర్తిగా రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయరాదని పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) సంబంధిత అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నిషేధం గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న మొత్తం ఆరావళి శ్రేణిలో ఒకే విధంగా వర్తిస్తుంది. అక్రమ మరియు క్రమబద్ధీకరించని మైనింగ్‌ను పూర్తిగా ఆపడం.. ఆరావళిని స్థిరమైన భూరూపంగా సంరక్షించడం దీని లక్ష్యం. ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లో గాలిని పరిశుభ్రంగా ఉంచడంలో, ఎడారీకరణను నిరోధించడంలో, భూగర్భ జలాలను తిరిగి నింపడంలో మరియు జీవవైవిధ్యాన్ని కాపాడడంలో ఆరావళి కొండలు కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్ర ప్రభుత్వం వాటి దీర్ఘకాలిక రక్షణకు బలమైన నిబద్ధతను ప్రదర్శించింది. ఆరావళి ప్రాంతం అంతటా కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయబడవు అని కేంద్రం స్పష్టం చేసింది… అక్రమ మైనింగ్ సమస్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇది ఆరావళి ప్రాంతం యొక్క సహజ నిర్మాణాన్ని కాపాడుతుంది.. పర్యావరణ నష్టాన్ని తగ్గిస్తుందని పేర్కొంది.. ఆరావళి ప్రాంతంలో మైనింగ్ పూర్తిగా నిషేధించబడిన అదనపు ప్రాంతాలను గుర్తించాలని కేంద్రం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE)ని ఆదేశించింది. పర్యావరణ, భౌగోళిక మరియు ప్రకృతి దృశ్యాలను పరిగణనలోకి తీసుకుని, ఇప్పటికే నిషేధించబడిన ప్రాంతాలకు ఇది అదనంగా ఉంటుంది.

రాహుల్ గాంధీని కలిసిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు..
దేశవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన ‘‘ఉన్నావ్ అత్యాచారం’’ కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. సెంగార్ ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్ని, జైలు శిక్షను సవాల్ చేశాడు. హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఇప్పటికే 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పూర్తి చేయడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయనకు బెయిల్ ఇవ్వడంపై బాధితురాలు, ఆమె తల్లి ఢిల్లీలో ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించడం వివాదస్పమైంది. ఇదిలా ఉంటే, తమకు న్యాయం చేయాలని కోరుతూ, ఉన్నావ్ అత్యాచార కేసులో బాధితురాలు,ఆమె తల్లి ఈ సాయంత్రం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీ జర్మనీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఒక రోజు తర్వాత, సోనియాగాంధీ నివాసమైన 10జన్‌పథ్‌ రోడ్‌లో బాధితురాలితో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.

“గాజా” కోసం కన్నీరు కారుస్తారు, “బంగ్లాదేశ్ హిందువు” కోసం మాట్లాడరు…
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ సమావేశాల్లో నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసను లేవనెత్తారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ .. ‘‘బంగ్లాదేశ్‌లో ఒక దళిత యువకుడిని చంపారు. కానీ మీరు గాజా విషయంలో మాత్రమే కన్నీరు కారుస్తారు. మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ఎన్నికల కారణాల వల్ల ఈ విషయంపై ప్రతిపక్షాలు మౌనం వహించాయని ఆరోపించారు. ‘‘మీరు దళితులను ఓటు బ్యాంకుగా చూస్తారు, అందుకే మీరు మాట్లాడరు. బంగ్లాదేశ్‌లో ఒక యువ దళిత వ్యక్తిని ఎలా సజీవ దహనం చేశారో చూడండి. గాజా స్ట్రిప్‌లో జరిగే దేనికైనా మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు, దళిత వ్యక్తి విషయంలో మీ నోటి నుండి ఒక్క మాట కూడా రాదు, మీ నాలుకలు మూగబోయాయి. మీరు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగిస్తారు’’ అని యోగి అన్నారు. బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమైంది మీ బుజ్జగింపు విధానమే అని మండిపడ్డారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లో భాగం కాకుంటే హిందువులు ఈ విధంగా దహనం చేయబడేవారు కాదని ఆయన అన్నారు. గాజా కోసం కొవ్వత్తుల ప్రదర్శన, హిందువుల విషయంలో మౌనం వహిస్తారని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో హిందువుల్ని చంపినప్పుడు ప్రతిపక్షాలు స్పందించవని, బంగ్లాదేశ్‌లో మరణించిన వ్యక్తి హిందువు కాబట్టి మీరు మాట్లాడరని అన్నారు.

“అరుణాచల్‌”పై చైనా కన్ను, డ్రాగన్ ప్రధానాసక్తుల్లో ఒకటి: యూఎస్ రిపోర్ట్..
భారత అంతర్భాగమైన ‘‘అరుణాచల్ ప్రదేశ్’’ తమదే అని, అది దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు అరుణాచల్ తమ దేశం నుంచి విడదీయలేని అంతర్భాగమని భారత్ కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికన్ కాంగ్రెస్‌కు సమర్పించిన పెంటగాన్ నివేదికలో, అరుణాచల్ ప్రదేశ్ చైనా ‘ప్రధాన ఆసక్తుల్లో’ ఒకటిని చెప్పింది. అరుణాచల్‌పై చైనా రాజీకి, చర్చలకు సిద్ధంగా లేదని నివేదిక పేర్కొంది. చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని వివాదస్పద ప్రాంతాలు, జపాన్ సమీపంలోని సెన్‌కాకు దీవులతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ను తన ప్రధాన ఆసక్తుల్లో ఒకటిగా చేర్చిందని నివేదిక పేర్కొంది. చైనా అధికారుల ప్రకారం, వివాదాస్పద భూభాగాలతో సహా దేశ ఏకీకరణను 2049 నాటికి సాధించాలని, ‘‘చైనా జాతీయ మహా పునరుజ్జీవనం’’ అవసరమని చెబుతున్నారు. ఆ దశలో చైనా ప్రపంచ స్థాయిలో కొత్త శక్తిగా ఎదిగి, యుద్ధంలో గెలిచే సామర్థ్యం ఉన్న ప్రపంచస్థాయి సైన్యాన్ని కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది.

నగలు అమ్మి బ్యాట్‌ కొనిచ్చిన తల్లి.. 32 బంతుల్లో సెంచరీతో రికార్డు సృష్టించిన తనయుడు..
ఆటలపై ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది.. కానీ, దానిని ఓ యజ్ఞంగా భావించి రాణించే వారు కొందరే ఉంటారు.. కొందరు స్టార్‌ క్రికెటర్ల జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటుంది.. ఇప్పుడు బీహార్ కెప్టెన్ సకిబుల్ గని క్రికెట్ ప్రయాణం ఒక బ్లాక్ బస్టర్ సినిమా కంటే తక్కువ కాదు అని చెప్పాలి.. విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం భారత క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఘనతను సాధించాడు గని… రాంచీలోని JSCA ఓవల్ గ్రౌండ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, సకిబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. దీనితో, విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అయితే, సకిబుల్ గని పేరు వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గని ఇంతకు ముందు చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన రికార్డులు ఉన్నప్పటికీ, గనికి ఇంకా ఐపీఎల్‌లో అవకాశం రాలేదు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సకిబుల్ గని కేవలం 40 బంతుల్లోనే అజేయంగా 128 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఘనత సాధించడం ద్వారా, 26 ఏళ్ల గని అదే టోర్నమెంట్‌లో కర్ణాటకపై 33 బంతుల్లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. గని యొక్క అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రేక్షకులను మరియు క్రికెట్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. సకిబుల్ గని ప్రయాణం అంత సులభం కాదు.. ఒకప్పుడు అతని దగ్గర బ్యాట్ కొనడానికి కూడా డబ్బులు లేవు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో, అతని తల్లి తన నగలను తనఖా పెట్టి అతనికి కొత్త బ్యాట్ కొనిచ్చింది.. సకిబుల్ రంజీ ట్రోఫీ ఆడబోతున్నప్పుడు, అతని తల్లి అతనికి మూడు బ్యాట్లు ఇచ్చి, వెళ్లు కొడుకా.. మూడు సెంచరీలు సాధించు.. అని చెప్పిందని అతని అన్నయ్య మీడియాకు వివరించారు.. ఇక, మైదానంలోకి దిగడం ద్వారా సకిబుల్ తన కలను నిజంగా నెరవేర్చుకుంది. ఇప్పటివరకు సకిబుల్ గని 28 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలతో సహా 2,035 పరుగులు చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో 33 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా 867 పరుగులు చేశాడు.

16 ఫోర్లు, 15 సిక్సర్లు.. వైభవ్ సూర్యవంశీ ధనాధన్ ఇన్నింగ్.. బీహార్ 397 పరుగుల భారీ విజయం..!
విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టు అరుణాచల్ ప్రదేశ్‌పై రికార్డు విజయం సాధించింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో బీహార్ 397 పరుగుల తేడాతో గెలిచి విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది. ఇక బీహార్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకపడాడ్డు. వైభవ్ కేవలం 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్ల ధనాధన్ ఇన్నింగ్స్‌తో 190 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న వైభవ్.. మంగళ్ మహ్రూర్ (33)తో కలిసి తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించాడు. ఆ తర్వాత పియూష్ సింగ్ (77), అయూష్ లోహరుకా (116), కెప్టెన్ సకిబుల్ గనీ (128*) అరుణాచల్ ప్రదేశ్‌ బౌలర్లను ఓ ఆట ఆదుకున్నారు. అరుణాచల్ బౌలర్లలో టీఎన్‌ఆర్ మోహిత్ 2 వికెట్లు, టెచి నేరి 2 వికెట్లు తీశారు. మిబోమ్ మోసు కేవలం 9 ఓవర్లలో 116 పరుగులు ఇచ్చాడు.

నేనేం సిగ్గు ప‌డ‌ను.. నేను మాట్లాడిన ఇంటెన్ష‌న్ వేరు..!
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై విభిన్న శైలిలో చర్చలు ఊపందుకున్నాయి. దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పొరపాటున శివాజీ మాట్లాడిన రెండు మాటల వల్ల ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలు పెద్ద ఎత్తున మండిపడుతూ సోషల్ మీడియాలో వారి మనోభావాలను తెలుపుతున్నారు. ఈ దెబ్బతో నటుడు శివాజీ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ముందుగా తాను అన్న మాటలకు క్షమాపణలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జ‌రిగిన త‌ప్పుకి వివ‌రణ ఇవ్వాల్సిన బాధ్య‌త నాపై ఉంది. నేను మాట్లాడిన ఇంటెన్ష‌న్ వేరు. జ‌డ్జ్ అయినా.. ఎవ‌రైనా ఇంటెన్ష్ చూస్తారు. నాకంటే పెద్ద ప‌దాల‌ను ఎవ‌రూ వాడ‌లేదు. న‌న్నే ఎందుకు మీరు. అమ‌రావ‌తి రైతుల‌పై బూటు కాలు వేసి తొక్కిన‌ప్పుడు నేను మాట్లాడాను. నేను నిల‌బ‌డ్డాను. ఎన్నో సంద‌ర్భాలో నిల‌బడ్డాను. జెన్ జీ కోసం నాయ‌కుల‌తో ఫైట్ చేశాను. నేను క్ష‌మాప‌ణ చెప్పాన‌ని అన్న‌ప్ప‌టికీ ఉమెన్ క‌మీష‌న్ వాళ్లు డిసెంబర్ 27న ర‌మ్మ‌ని చెప్పారు. ప‌ర్లేదు.. నేను వెళ్లి క్ష‌మాప‌ణ లేఖ ఇస్తాను. నేనేం సిగ్గు ప‌డ‌నని ఆయన అన్నారు.

“ఆ మాటలు నన్ను వెంటాడాయి… 36 గంటలు నిద్ర పట్టలేదు”.. ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పిన శివాజీ..!
దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగంగా క్షమాపణ చెప్పారు. వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని తెలిపారు. స్టేజ్‌పై నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీక‌రించారు. న‌టుడు శివాజీ మాట్లాడుతూ.. ‘‘నేను ఆరోజు స్టేజీ మీద ఉన్న నా తోటి న‌టీన‌టుల‌కు, ఆడ‌బిడ్డ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. ఆ రెండు ప‌దాల‌ను మాట్లాడకుండా ఉండాల్సింది. జీవితంలో అలా ప‌దాల‌ను ఎప్పుడూ దొర్ల‌లేదు. నేను ఇక్క‌డ‌కు వ‌చ్చి 30 సంత్స‌రాల‌వుతుంది. అన్నేళ్లు పాలిటిక్స్‌లో ఉన్న‌ప్ప‌టికీ ఏరోజు కూడా ఏ మ‌హిళ‌నైనా, పార్టీనైనా హ‌ద్దు దాటి మాట్లాడ‌లేదు. అలాంటిది భ‌గ‌వంతుడు ఎందుకో అలా చేశాడు. ప‌దాలు అలా దొర్లిపోయాయి. ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డాను. కార్య‌క్ర‌మం నుంచి బ‌య‌ట‌కు రాగానే గెస్ట్‌తో అన్నాను. అబ్బాయ్‌.. దొర్లేశాన‌ని అన్నాను. ఆ రెండు ప‌దాల‌కు మీ అంద‌రికీ సిన్సియ‌ర్‌గా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు క‌ట్టుబ‌డే ఉన్నాను. దాంట్లో ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేదు. ఆ రెండు పదాలు మాత్రం అన్‌పార్ల‌మెంట‌రీ వర్డ్స్‌. కాబ‌ట్టి నా గుండె సాక్షిగా చెబుతున్నాను. చాలా బాధ‌ప‌డుతున్నాను. అలా మాట్లాడ‌టం త‌ప్పు.

Exit mobile version