26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్..
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటనకు బయలుదేరనున్నారు.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ లతో కూడిన 8 మంది బృందం సింగపూర్ లో పర్యటించించనున్నారు.. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించి.. దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం.. రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళ్తున్నారు.
80 వేల కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.. లక్షకు పైగా ఉద్యోగాలు..!
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఇవాళ కేబినెట్‌లో నిర్ణయం జరిగిందన్నారు.. సుమారు 80 వేల కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. దీని ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. పారిశ్రామిక వేత్తలకు డెస్టినేషన్ ఏపీ అయ్యే విధంగా ఆమోదం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కంపోనెట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఇప్పటి వరకు అన్ని కంపోనెంట్లు పూర్తిగా మన దగ్గర తయారయ్యే పరిస్థితి లేదు.. ఎలక్ట్రానిక్ పాలసీ వల్ల ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది.. ఈ పాలసీ వల్ల తమిళనాడు, గుజరాత్ లో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు..
పేర్ని నానికి హైకోర్టులో ఊరట..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి కోర్టులో ఊరట లభించింది.. ఈ నెల 31వ తేదీ వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు పొడిగించింది.. కాగా, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ముందస్తు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు నాని.. మరోవైపు, ఈ రోజు కేసు రీచ్ కాక పోవడంతో మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు పేర్ని నాని తరపు న్యాయవాదులు.. దీంతో, కేసు తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు పేర్కొంది.. దీంతో, హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి ఏపీ హైకోర్టులో ఊరట దక్కినట్టు అయ్యింది..
గండికోట రహస్యంగా మారిన బాలిక హత్య..! ఏం జరిగినట్టు..?
ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక హత్య గండికోట రహస్యంగా మారింది. అభం శుభం తెలియని ఆ మైనర్ బాలిక ప్రేమించడమే ఆమె చేసిన నేరం ? అయితే మైనర్ బాలికను అతి క్రూరంగా దారుణంగా హింసించి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? కుటుంబ సభ్యులా? లేక ప్రియుడా ? వీరెవరు కాకుండా మూడో వ్యక్తుల ప్రమేయం ఉందా ? ఇంతకీ మైనర్ బాలిక హత్య మిస్టరీ వెనుక ఉన్న నిజాలు ఏంటి ? మైనర్ బాలికపై రెఫ్ అటెంప్ట్ జరిగిందా..? అదేమీ లేదంటున్నారు పోలీసులు.. మరి ఆ బాలికను ఎందుకు అంత తీవ్రంగా హింసించి అతి దారుణంగా హత్య చేశారు ? నిర్మానుష్య ప్రదేశంలో నిర్జీవంగా పడి ఉన్న మైనర్ బాలిక మృతదేహాన్ని మొదట కనుగొన్నది ఎవరు? సాయంత్రం దాకా పోలీసులకు కుటుంబ సభ్యులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు.. పోస్టుమార్టం నివేదికలో పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూసాయి.. మైనర్ బాలిక పొట్ట భాగంలో పదేపదే బలమైన గుద్దులు గుద్దడంతో ఆమె లివర్ చితికిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు.. అంతేకాకుండా పేగులు సైతం పగిలిపోయాయి. దీంతో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ఆమె పొట్టలో దాదాపు ఒక్క లీటర్ మేర రక్తం పేరుకుపోయింది.. ఆ బాలిక లివర్ 8 ఇంచులు మేరా డామేజ్ అయింది.. అంటే ఎంత బలంగా కొట్టారో ఇట్టే అర్థమవుతుంది.
తెలంగాణ సచివాలయంలో ప్రమాద ఘంటికలా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని సచివాలయంలో మరోసారి పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. భారీ వర్షాలకు తడిసి పెచ్చులు ఊడిపడటంతో సచివాలయ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చే మార్గంలోనూ పెచ్చులు కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజుల నుంచి సచివాలయానికి మరమ్మతులు (రిపేర్లు) చేస్తున్నప్పటికీ, ఈ ఘటన చోటుచేసుకోవడం పనుల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సచివాలయ భవనం కొత్తగా నిర్మించినప్పటికీ, వర్షాలకు పెచ్చులు ఊడిపోవడం భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తోంది. సిబ్బంది భద్రతపై అధికారులు తక్షణమే దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వర్షాకాలంలో భవన నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
అగ్రవర్ణాలను కూర్చోబెట్టి మాట్లాడాం.. కాంగ్రెస్ ఉంటేనే అన్నీ ఉంటాయి
తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, విజయవంతంగా జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వేను ‘రేర్ మోడల్’ గా పేర్కొనవచ్చని, దీనిపై సోనియాగాంధీ తనకు అభినందనలు తెలుపుతూ లేఖ రాయడం తన జీవితంలో ఒక గొప్ప అచీవ్‌మెంట్ గా భావిస్తున్నానని అన్నారు. “సోనియా గాంధీ రాసిన లేఖ నాకు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు లాంటిది. అది నోబెల్, ఆస్కార్ అవార్డు లాంటిది,” అని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా అన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన రాష్ట్రంలో, రాహుల్ గాంధీ చెప్పిన హామీని అమలు చేసి చూపించామని, “రాహుల్ మనసులో ఉన్నది చేసి చూపించాను” అని ఆయన ప్రకటించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ వివరాలను సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని సీఎం వివరించారు.
అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. భారత్‌పై హక్కుల సంస్థ ఆరోపణలు..
అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని భారతదేశం గుర్తించి, వారిని సొంత దేశానికి పంపిస్తోంది. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు దేశంలోకి చొరబడుతున్నారు. వీరందరిపై భారత్ ఇప్పుడు పోరాడుతోంది. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వీరిని గుర్తించి సొంతదేశానికి తిప్పిపంపిస్తున్నారు. అయితే, ఇప్పుడు అంతర్జాతీయ హక్కుల సంస్థకు మాత్రం వీరిపై తెగ జాలి చూపిస్తోంది. భారత్ తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తోంది.
భారత్-యూకే మధ్య వాణిజ్య ఒప్పందం, రైతులకు ఎలా లాభం అంటే..
భారత్, యూకే మధ్య ‘‘స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)’’ కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు యుకె ప్రధాని కీర్ సమక్షంలో వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మరియు బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం భారతదేశ రైతులకు ప్రయోజనం చేకూర్చబోతోంది. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు ఇప్పుడు బ్రిటిష్ మార్కెట్‌లో సుంకాలు ప్రవేశించే వెసులుబాటు దొరికింది. భారత రైతులు, యూరప్ దేశాల రైతుల కన్నా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. పసుపు, మిరియాలు, యాలకుల వంటి భారతీయ ఉత్పత్తులు, మామిడి గుజ్జు, ఊరగాయలు, పప్పు ధాన్యాలు, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు కొత్త ఒప్పందం ప్రకారం సుంకాలు లేకుండా యూకే మార్కెట్‌లోకి వెళ్తాయి. ఇది రైతుల మార్కెట్ పరిధిని పెంచుతుంది. వారికి లాభాలను తీసుకువస్తుంది.
ఎస్బీఐ పాలసీ.. రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు.. రూ. 40 లక్షలు మీవే!
తక్కువ సంపాదించే వాళ్లు కాదు.. తక్కువ పొదుపు చేసే వాళ్లు పేదవాళ్లు అని నిపుణులు అంటుంటారు. నేడు మీరు మీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని సేవ్ చేస్తే రాబోయే రోజుల్లో ఆపదలు సంభవించినప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పొదుపు చేసిన డబ్బు ఆదుకుంటుంది. అదే సమయంలో ఇన్సూరెన్స్ పాలసీల్లో చేరితే దురదృష్టావశాత్తు ఏదైనా ప్రమాదం భారిన పడినప్పుడు ఇన్సూరెన్స్ సొమ్ము కుటుంబానికి అండగా ఉంటుంది. అప్పుల బాధ లేకుండా చేస్తుంది. మరి మీరు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ప్రమాద బీమా పథకాన్ని అందిస్తోంది. అదే SBI వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. ఇందులో చేరి రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు రూ. 40 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 ఆలౌట్.. గాయంతోనే హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్
భారత్- ఇంగ్లాండ్ మధ్య ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 44 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్‌లోనే భారత్ కుప్పకూలింది. భారత్ తరపున రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతోనే అర్ధ సెంచరీ (54 పరుగులు) సాధించాడు. సాయి సుదర్శన్-61, జైశ్వాల్-58 పరుగులతో రాణించారు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మాంచెస్టర్ టెస్ట్ తొలి రోజు, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 19 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ 19 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు. జైస్వాల్, సాయి సుదర్శన్ అర్ధ సెంచరీలు సాధించారు. రిషబ్ పంత్ 37 పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతని కాలికి గాయం అయింది. కెఎల్ రాహుల్ 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ బ్యాట్ ఝుళిపించలేకపోయాడు.
మైత్రీ మేకర్స్, విశ్వ ప్రసాద్ లేకపోతే వీరమల్లు రిలీజ్ కష్టమయ్యేది!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్ సమయానికి కూడా ఇంకా KDMs రిలీజ్ కాకపోవడం కలకలం లేపింది. అయితే చివరి విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు టీజీ విశ్వప్రసాద్ కొంత అమౌంట్‌కి అడ్డం ఉండి సినిమా రిలీజ్‌కి సహకరించారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. “అసలు సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఏం చేద్దాం అనేది నాకు పూర్తిగా ఐడియా లేదు. నేను పూర్తిగా పొలిటికల్ ప్రాసెస్‌లో ఉండి సినిమా రిలీజ్ గురించి నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది అలా పట్టించుకోకుండా. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవి, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ ముందుకొచ్చి సహకరించి రిలీజ్‌కి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
హరిహర వీరమల్లు 2 రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!
హరిహర వీరమల్లు సినిమా విడుదలై మిక్స్‌డ్ టాక్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని క్రిష్ డైరెక్షన్‌లో మొదలుపెట్టారు. అయితే సినిమా వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తలకెత్తుకొని సినిమా పూర్తి చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు రిజల్ట్ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్ చేయాలా వద్దా అనే ఉద్దేశంలో ఉన్నారని నిర్మాత రత్నం సహా పవన్ కళ్యాణ్ కూడా గతంలో ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడుతూ సినిమాలో జయసుధ కుమారుడు ఒక కీలక పాత్రలో నటించాడని, ఆ పాత్ర గురించి మాట్లాడుతూ ఆ పాత్రకు సంబంధించి సెకండ్ పార్ట్‌లో ఇంకా డీటెయిల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సెకండ్ పార్ట్‌కి సంబంధించి 30% షూటింగ్ పూర్తయిందని, మిగతా షూటింగ్ కూడా పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందా ఉండదా అనే ప్రచారాల నేపథ్యంలో వాటన్నింటికీ బ్రేకులు వేసినట్లు ఉంది.
