NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ.. సర్కార్‌ నిర్ణయం
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు కమిషన్ ను నియమించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యూడిషియల్ విచారణ జరగనుంది… తిరుపతి పద్మావతి పార్క్ దగ్గర ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు.. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు ఇచ్చే విషయంలో తొక్కిసలాట జరిగింది.. సీఎం చంద్రబాబు ఈ సంఘటనలో సీరియస్ అయ్యారు.. కొంతమంది అధికారుల బదిలీ కూడా జరిగింది. క్కిసలాట సంఘటనకు సంబంధించి ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు నిర్ణయం తీసుకుంది.. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఈ ఘటనకు కారణాలు ఏంటి..? బాధ్యతా రాహిత్యంగా ఎవరు ఉన్నారు..? అనేది విచారణలో తేలనుంది.. ఆరు నెలల కాలంలో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. తిరుమల తిరుపతి అంశంపై ఇప్పటికే అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. దీంతో తొక్కిసలాట తర్వాత మరింత చర్చనీయాంశంగా టీటీడీ మారింది.. జ్యూడిషియల్ విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌, ఫడ్నవీస్‌..
తమ రాష్ట్రాల్లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్నారు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్‌ వెళ్లి.. వివిధ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమై.. తమ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు.. తమ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలికసదుపాయాలు వివరిస్తూ.. పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు.. అయితే, దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు.. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పాల్గొన్నారు.. గ్రీన్‌ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చర్చకు రాగా.. గ్లోబల్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం.. రాష్ట్రాల ఆకాంక్ష ఏ విధంగా ఉంది అనే అంశాలపై చర్చించారు..

ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ ల్యాండ్స్ రద్దు..
సరస్వతి భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సరస్వతీ పవర్ ప్లాన్స్ కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.. పలనాడు ప్రాంతంలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన భూముల్లో 24.85 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్స్ ఉన్నట్లు గుర్తించింది అధికార యంత్రాంగం.. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అసైన్డ్ ల్యాండ్స్ కేటాయింపును రద్దు చేశారు.. ఆ భూములను వెనక్కి తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.. దీంతో సరస్వతి భూముల్లో నుండి 24.85 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ, ఆ భూముల రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు అధికారులు. ల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన 24.84 ఎకరాల అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది ప్రభుత్వం.. చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలను రైతు నుండి కొనుగోలు చేసింది సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం. అయితే, అప్పటినుండి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న ఆరోపణలు స్థానికుల నుండి వినిపించాయి. ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా ఉన్నాయన్న వివాదం ఉండటంతో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు.. ఆ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం సరస్వతి పవర్ ప్లాంట్స్ భూములపై సర్వే చేసింది.. అయితే, ఈ భూముల్లో అటవీ భూములు తేలలేదు.. కానీ, అసైన్డ్ ల్యాండ్స్ మాత్రం బయటపడ్డాయి.

మూడో రోజు కీలక సమావేశాలు.. బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ..
దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన కొనసాగుతోంది.. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్‌ను కోరారు సీఎం చంద్రబాబు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడోరోజు బిల్ గేట్స్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి.. పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని కొరారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్‌ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్‌బోర్డ్‌లు, సామాజిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. అంతర్జాతీయ ఆవిష్కరణలను స్థానికంగా వినియోగించుకునేలా సాయం అందించాలని కోరారు. బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ను ముఖద్వారంగా చేసుకునేలా సహకరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. చాలా రోజుల తర్వాత బిల్ గేట్స్‌ను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ, ఆవిష్కరణలపై దృష్టిపెట్టడంలో గేట్స్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆరోగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇన్నోవేషన్‌పై పరస్పరం సహకరించుకోవడానికి గల అవకాశాలను ఇరువురం చర్చించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పురోగతిలో బీఎంజీఎఫ్ భాగస్వామి కావాలని.. ఇందుకోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం.. ఖండించిన టీజీఎస్‌ఆర్టీసీ
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్‌ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఎలక్ట్రిక్ బస్సుల మెయిన్‌టనెన్స్‌, ఛార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రజలకు సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారం హైదరాబాద్‌తో సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రూట్లలో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ తిప్పుతోంది. కేంద్రప్రభుత్వ ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుపాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఫేమ్‌)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ప్రవేశపెట్టడం జరిగింది. పుష్ఫక్‌ పేరుతో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోంది. ఆ బస్సుల మెయిన్‌టనెన్స్‌, ఛార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోంది.

కిరాతకం.. భార్యని చంపి, కుక్కర్‌లో ఉడికించిన, పొడి చేసిన భర్త..
కలకాలం తోడుండాల్సిన భర్తే కసాయి మారాడు. భార్యని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనను పూర్తిగా విచారించిన పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను ముక్కలుముక్కలు నరికి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్‌బాడీని కుక్కర్‌లో ఉడికించాడు. మిగతా శరీర భాగాలను జిల్లెల్లగూడ చందన చెరువులో పారేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి మాజీ సైనికుడు. వృత్తి రీత్యా డీఆర్డీవోలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ పని చేస్తున్నాడు. జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంటక మాధవి(35)తో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నెల 13న మాధవి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేస్తున్న సమయంలో తనకు ఏ విషయం తెలియనట్లుగా గురుమూర్తి అత్తామామలతో కలిసి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. అయితే, విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసినట్లు సమాచారం. గురుమూర్తి తన భార్యను చంపిన విషయం తెలిసింది. తన భార్యని చంపడానికి ముందు కుక్కను చంపినట్లు తేలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి..
దావోస్​‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం.. తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం.. పర్యావరణహితంగా హైదరాబాద్‌ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దాలనేది తమ అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైదరాబాద్‌లో ఉండాలని కోరుకుంటున్నాం.. ఎలక్టిక్ వెహికిల్స్‌పై తాము ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేశామని తెలిపారు. భారత దేశంలోనే ఈవీ వాహనాలు అత్యధికంగా అమ్ముడుపోయే రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొబిలిటీ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదు.. ఇప్పుడున్న పరిస్థితులను పర్యావరణ అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా వ్యవస్థలో 3 వేల ఎలక్ర్టిక్ బస్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు.

లక్షాధికారిని చేసే స్కీమ్.. రోజుకు రూ.50 పెట్టుబడితో.. రూ.35 లక్షల లాభం!
ఈ రోజు మీరు చేసే పొదుపు రేపు మిమ్మల్ని రక్షిస్తుంది. డబ్బులు చేతిలో ఉంటే నలుగురికి సాయం చేయొచ్చు. అందుకే డబ్బును అవసరానికి మాత్రమే ఉపయోగించాలని సూచిస్తుంటారు. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతుంటారు. మరి మీరు కూడా తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్ ఉంది. అదే గ్రామ సురక్ష యోజన. ఇందులో రోజుకు రూ. 50 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటి నాటికి ఏకంగా రూ. 35 లక్షలు అందుకోవచ్చు. పోస్టాఫీసు గ్రామ సురక్ష యోజన గ్రామీణ పౌరులకు ఆర్థిక భద్రత, మంచి రాబడిని అందిస్తుంది. స్టాఫీస్ స్కీమ్స్ కు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. గ్రామ్ సురక్ష యోజన గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక భాగం. ఈ గ్రామ సురక్ష యోజనలో 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో రూ. 10 వేల నుంచి రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా కూడా చెల్లించొచ్చు. లోన్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. రు రూ. 10 లక్షల ప్రీమియం ఎంచుకుంటే.. 19 ఏళ్ల వయసులో ఈ స్కీంలో చేరితే 55 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు రూ. 1515 చొప్పున చెల్లించాలి. 58 ఏళ్ల వరకు ఈ స్కీంలో నమోదు చేసుకుంటే అప్పుడు రూ. 1463, 60 ఏళ్లకు అయితే రూ. 1411 డిపాజిట్ చేయాలి. ఈ పథకంలో మీరు 55 ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి రూ. 31.60 లక్షల కార్పస్ పొందుతారు. 58 సంవత్సరాల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి రూ. 33.40 లక్షల కార్పస్ పొందుతారు. 60 సంవత్సరాల ప్రీమియం ద్వారా రూ. 34.40 లక్షలు అందుకుంటారు. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడిదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి మొత్తం ఫండ్ అందుతుంది. తద్వారా పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.

టీమిండియా అదరహో.. 132కి కుప్పకూలిన ఇంగ్లాండ్..
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు 2025లో తన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతోంది. కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టు 132 పరుగులకే కుప్పకూలింది. బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత్‌కు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ జోస్ బట్లర్ అత్యధిక స్కోరు 68 పరుగులు చేశాడు. భారత్ తరఫున స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గరిష్టంగా 3 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీశారు. కాగా.. గత ఆరేళ్లుగా స్వదేశంలో భారత జట్టు టీ20 సిరీస్‌ను కోల్పోలేదు. టీం ఇండియా చివరిసారిగా 2019లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఓడిపోయింది. అప్పటి నుంచి భారత్‌ సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో అజేయంగా ఉంది. స్వదేశంలో భారత జట్టును అజేయంగా ఉంచే సవాల్ సూర్య భుజస్కంధాలపై ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడేళ్ల తర్వాత టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది.

తెలుగులోకి విశాల్ “మద గజ రాజా”..రిలీజ్ ఎప్పుడంటే?
హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మద గజ రాజా. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుని , 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతి కి విడుదలైన తమిళ సినిమాలన్నిటిలో నంబర్ వన్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకు వెళుతున్న యాక్షన్ కామెడీ జానర్ లో రూపొందిన ‘మద గజ రాజా’ ఆడియన్స్ కి మెమరబుల్ ఎక్స పీరియన్స్ ని అందించే ఎంటర్ ట్రైనర్. హీరో విశాల్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో అదరగొట్టారు. సంతానం కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. డైరెక్టర్ సుందర్.సి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ అందించారు. విజయ్ ఆంటోని పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తమిళ్ లో ఘన విజయం సాధించి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని కూడా అద్భుతంగా అలరిస్తుందని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంలో సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాథన్ డీవోపీగా పని చేశారు. విజయ్ ఆంటోని సంగీతం అందించారు. శ్రీకాంత్ ఎన్ బి ఎడిటర్. మాటలు శశాంక్ వెన్నెలకంటి రాశారు. నటీనటులు: విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాల (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్, లొల్లు సభ మనోహర్, K.S జయలక్ష్మి, అజయ్ రత్నం, సుబ్బరాజు, ముత్తుకలై, అజగు మాస్టారు.

ఏఐ టెక్నాలజీతో ది డెవిల్స్ చైర్
జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ పాత్రలలో ఒక సినిమా తెరకెక్కుతోంది. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకం పై యంగ్ టాలెంటెడ్ దర్శకుడు గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. తాజాగా ఈ సినిమా మొదటి పోస్టర్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ “సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు మా ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్ తో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి” అని కోరుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ “మా ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏఐ టెక్నాలజీతో సరికొత్త కథ తో నిర్మిస్తున్నాము. ప్రతి సీన్ ను అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తి అయింది. మా చిత్రాన్ని 2025 ఫిబ్రవరి చివరి వరం లో విడుదల చేస్తాము” అని తెలిపారు.

సైఫ్ అలీ ఖాన్ రూ. 15,000 కోట్ల ఆస్తి కోల్పోయే అవకాశం.. ‘‘ఎనిమి ప్రాపర్టీ’ అంటే ఏమిటి..?
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఇటీవల ఆయన ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇదిలా ఉంటే, మరో వార్తలో ఆయన సంచలనంగా మారారు. సైఫ్ కుటుంబానికి చెందిన రూ. 15,000 కోట్ల ఆస్తిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ‘‘ఎనిమీ యాక్ట్’’ కింద ఈ ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. గతంలో ఈ ఆస్తుల్ని ‘‘ఎనిమి ప్రాపర్టీ’’గా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనిని ఛాలెంజ్ చేస్తూ సైఫ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని గతేడాది డిసెంబర్‌లో హైకోర్టు కొట్టేసింది. డిసెంబర్ 13, 2024న జరిగిన విచారణలో, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ అగర్వాల్ సింగిల్ బెంచ్ నటుడి పిటిషన్‌ను కొట్టివేసింది. తీర్పుపై అప్పీలేట్ ట్రిబ్యునల్‌ ముందు అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది.ఈ మొత్తం కేసులో కేంద్రం, సైఫ్ అలీ ఖాన్, సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్, అతని సోదరిమణులు సోహా అలీఖాన్, సబా అలీ ఖాన్, అతని తండ్రి సోదరి సబిహా సుల్తాన్‌లు పార్టీలుగా ఉన్నారు. చట్టం ప్రకారం, శత్రువుల ఆస్తుల్ని కేంద్రం ప్రభుత్వం నియంత్రించవచ్చు. విభజన సమయంలో, ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లి, అక్కడే పౌరులుగా స్థిరపడిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల్ని ‘‘ఎనిమీ ప్రాపర్టీ’’గా పరిగణిస్తారు. ముఖ్యంగా 1965, 1971 పాకిస్తాన్‌తో యుద్ధాల తర్వాత, చాలా మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని పాకిస్తాన్ వెళ్లారు. ఇదే విధంగా 1962 ఇండో-చైనా యుద్ధం తర్వాత చైనాకు వెళ్లిన వ్యక్తుల ఆస్తుల్ని కూడా ‘‘శత్రువు ఆస్తులు’’గా పరిగణిస్తారు.