సిట్ విచారణ.. సంచలన విషయాలు బయటపెట్టిన నారాయణస్వామి..!
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారింది.. విచారణలో మరింత దూకుడు పెంచింది సిట్.. ఇప్పటికే కీలక వ్యక్తులు అరెస్ట్ కాగా.. మరిన్ని అరెస్ట్‌లు తప్పవనే ప్రచారం జరుగుతోంది.. అయితే, ఈ రోజు లిక్కర్ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రశ్నించారు సిట్ అధికారులు.. అయితే, సిట్ విచారణలో సంచలనం విషయాలు బయటపెట్టారట నారాయణస్వామి.. ఏపీ బేవరేజ్ సంబంధించిన అధికారులను నియమించడంలో నా పాత్ర ఏమీ లేదన్నారు.. నాకు లిక్కర్ కేసుకు సంబంధం లేదన్న ఆయన.. సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు.. నా మాట అక్కడ వినే వారు ఎవరంటూ చెప్పుకొచ్చారట నారాయణస్వామి.. నా మాటలను అక్కడ ఏ అధికారి వినలేదన్న ఆయన.. సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను ముందుపెట్టి ప్రశ్నించడంతో నీళ్లు నమిలారట.. నారాయణస్వామి నుంచి మరిన్ని కీలకమైన విషయాలు రాబట్టిందట సిట్.. మరోసారి విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.. ఇక, నారాయణస్వామి ఇంటిలో విచారణ ముగించుకొని సిట్ టీమ్ బయల్దేరివెళ్లిపోయింది..
ఉప రాష్ట్రపతి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. మేం ఎలా మద్దతిస్తాం..?
ఉప రాష్ట్రపతి ఎన్నికలపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ సమిష్టిగా సీపీ రాధాకృష్ణన్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. సీపీ రాధాకృష్ణన్ ను కలిసి మా మామద్దతు ఉంటుందని, అభినందనలు తెలిపాం అన్నారు.. ఇక, దేశం గౌరవించదగ్గ వ్యక్తి సీపీ రాధాకృష్ణన్ అని వ్యాఖ్యానించారు.. దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తీసుకొస్తారని ఆకాక్షించారు.. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది.. ఎన్డీఏ అభ్యర్థికే మా మామద్దతు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.. తెలుగు వ్యక్తి అన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉంటేనే అభ్యర్థిని పెట్టాలని సలహా ఇచ్చారు.. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి “ఇండియా” కూటమి రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు.. అసలు మేం ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రతిపక్ష (ఇండియా కూటమి) అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం..? అని ప్రశ్నించారు.. ఆ రోజుల్లో పీవీ నరసింహారావు కోసం కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నా.. మేం త్యాగం చేశామని గుర్తుచేసుకున్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
నైపుణ్యం పోర్టల్‌పై లోకేష్ సమీక్ష.. కీలక ఆదేశాలు
ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా నైపుణ్యం పోర్టల్ ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.. సెప్టెంబర్‌లో నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. పీఎం ఇంటర్నషిప్ స్కీమ్‌తో నైపుణ్యం పోర్టల్ ను అనుసంధానించాలని సూచించారు. నైపుణ్యం పోర్టల్ డెమోను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పరిశీలించారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పోర్టల్ ను అభివృద్ధి చేయలేదన్నారు లోకేష్.. రాష్ట్రంలోని నైపుణ్య కేంద్రాలతో పాటు న్యాక్, సీడాప్ ను పోర్టల్ తో అనుసంధానించనున్నట్లు అధికారులు వివరించారు. ఏడాదికి 50 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 36 రంగాలకు సంబంధించి 3 వేలకు పైగా జాబ్ కేటగిరీలను పోర్టల్‌లో ఎన్ రోల్ చేసినట్లు అధికారులు వివరించారు.. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా యువతను సన్నద్ధం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇదే సమావేశంలో ఇంటర్ విద్యకు సంబంధించిన పలు అంశాల పై చర్చించారు. దృష్టి లోపం గల విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు అనుమతి మంజూరు చేసారు. వారికి మరిన్ని సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..
రేపు టీడీపీ కీలక సమావేశం.. తాజా పరిణామాలపై చంద్రబాబు ఏం చేస్తారు..?
రేపు ఉండవల్లిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కీలక సమావేశం జరగనుంది… టీడీపీలో ముఖ్య నేతలు.. పొలిట్‌బ్యూరో సభ్యులు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొననున్నారు.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగనుంది.. త్వరలో టీడీపీ రాష్ట్ర కమిటీ పొలిట్ బ్యూరోలో మార్పులు ఉండనున్నాయి. రాష్ట్ర కమిటీకి ముందు జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు.. ముగ్గురు సభ్యులతో జిల్లా కమిటీలు వేయనున్నారు.. ఈ అంశాలపై చర్చ జరగనుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల వైఖరిపై చర్చ జరుగుతోంది..కొంతమంది ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో ఇర్రుకుంటున్నారు. .సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయ్యారు… రేపు జరిగే సమావేశంలో కూడా మంత్రులు.. ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది… ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యేల వైఖరి రిపీటెడ్ గా ఇలా ఉంటే.. ఇటు ప్రభుత్వం అటు పార్టీకి చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉందనే చర్చ బాగా జరుగుతోంది.. ఇలాంటి సమయంలో కీలక సమావేశం జరగడంతో సీఎం చంద్రబాబు నేతలకు గట్టిగా చెప్పనున్నారు.. జిల్లా ఇంఛార్జి మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగించనున్నారు.. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే ఇబ్బంది పడే పరిస్థితి ఉండడంతో సీఎం చంద్రబాబు అలెర్ట్ అయ్యారు.
ఏపీ మంత్రులకు ర్యాంకులు.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పదేపదే డేటా మీద ఎక్కువ మాట్లాడుతుంటారు… ఎమ్మెల్యేల విషయంలో కానీ.. మంత్రుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటూ ఉంటారు.. అందులో భాగంగానే ప్రస్తుతం మంత్రులకు సంబంధించి ర్యాంకులు ఇస్తున్నారు… ఇందులో భాగంగా మొదట ఫైల్ క్లియరెన్స్ కు సంబంధించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో మంత్రి రామానాయుడు ఉన్నారు.. రెండో స్థానంలో నారా లోకేష్.. మూడవ స్థానంలో సత్య కుమార్ ఉన్నారు.. నాలుగు, ఐదు స్థానాల్లో అనిత, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.. ఇక, చివరి స్థానంలో కొల్లు రవీంద్ర.. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో మంత్రుల పెర్ఫార్మన్స్ కు సంబంధించి కూడా ర్యాంకులు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు… మంత్రుల పనితీరు ఏ రకంగా ఉంది.. శాఖల మీద ఎంతవరకు పట్టు సంపాదించారు… అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ర్యాంకింగ్స్ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు…
ఏసీబీకి వలలో వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్
వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం– తుర్కయాంజల్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఉన్న 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్‌రిజిస్ట్రార్ రాజేశ్‌ను సంప్రదించాడు. ఈ సందర్భంగా ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం రాజేశ్ రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. తర్వాత చర్చల అనంతరం రూ.70 వేల వద్ద ఒప్పందం కుదిరింది. దీంతో ఆ స్థల యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు రెడీ చేసిన ట్రాప్ ఆపరేషన్‌లో, రూ.70 వేల లంచం మొత్తాన్ని డాక్యుమెంట్ రైటర్ రమేశ్ తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. విచారణలో అతడు సబ్‌రిజిస్ట్రార్ సూచన మేరకే డబ్బులు స్వీకరించినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులు సబ్‌రిజిస్ట్రార్ రాజేశ్‌తో పాటు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్‌షా తీవ్ర ఆరోపణలు..
కొచ్చిలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ సుదర్శన్ రెడ్డి వామపక్ష తీవ్రవాదానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఒత్తిడితో సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిందని అన్నారు. ఆయన అభ్యర్థిగా ఎంపిక చేయడంతో కేరళలో కాంగ్రెస్ విజయానికి మిగిలి ఉన్న అవకాశం కూడా చేజారిపోయిందని విమర్శించారు. అమిత్ షా మాట్లాడుతూ.. వామపక్ష తీవ్రవాదానికి సహాయం చేయడానికి సల్వా జుడుం లాంటి తీర్పులు ఇచ్చిన వ్యక్తి ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అని అన్నారు. ఆ రోజు ఆయన అలాంటి నిర్ణయం తీసుకోకపోతే 2020 నాటికి వామపక్ష తీవ్రవాదం అంతమై ఉండేదని పేర్కొన్నారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఎంపిక చేసిందని ఆరోపించారు.
భారతీయ అంతరిక్ష స్టేషన్ మోడల్‌ను ఆవిష్కరించిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా తన అంతరిక్ష కార్యక్రమంలో మరో ప్రధాన మైలురాయిని చేరుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల సందర్భంగా ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS) మాడ్యూల్ నమూనాను ఆవిష్కరించింది. భారత్ 2028 నాటికి BAS మొదటి మాడ్యూల్‌ను, దాని స్వంత స్వదేశీ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం, రెండు ఆర్బిటల్ ల్యాబోరేటరీస్ ఉన్నాయి – అందులో ఒకటి ఐదు అంతరిక్ష సంస్థలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, రెండోది చైనాకు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం. భారతదేశం అంతరిక్ష రంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రణాళికలలో భాగంగా 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఐదు మాడ్యూళ్లను కలిగి ఉండాలని యోచిస్తోంది.
అప్పుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు చిరంజీవి.. అదే సీన్ రిపీట్..
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నేడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు అనే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మనకు చివర్లో ఓ షాట్ కనిపిస్తోంది. గుర్రాన్ని పట్టుకుని చిరంజీవి స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. పైగా అందులో సిగరెట్ తాగుతుంటాడు. ఈ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాట్ చూస్తే గతంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ తప్పకుండా గుర్తుకు వస్తుంది. సర్ధార్ గబ్బర్ సింగ్ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లోనూ పవన్ కల్యాణ్ ఇలాగే గుర్రాన్ని చేతిలో పట్టుకుని ఖాకీ బట్టల్లో నడుచుకుంటూ వస్తాడు. ఆ సీన్ అప్పట్లో ఓ సెన్సేషన్. ఇప్పుడు చిరంజీవి కూడా సేమ టైటిల్ గ్లింప్స్ లోనే ఇలా గుర్రాన్ని పట్టుకుని వస్తున్నాడు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్.. ఇరువురిని పోల్చుకుంటున్నారు. తమ్ముడిని చూసే అన్న ఇలా కావాలని షాట్ పెట్టించుకున్నాడేమో అంటున్నారు. కాకపోతే రెండు సినిమాల జానర్లు వేరే. సర్దార్ గబ్బర్ సింగ్ ఫుల్ యాక్షన్ మోడ్ మూవీ. చిరంజీవి సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ జానర్ లో వస్తోంది. రెండింటినీ పోల్చి చూడలేం. కానీ తాజా గ్లింప్స్ లో చిరు వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా చాలా స్టైలిష్ గా ఉన్నాడు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
సమంత కొత్త ప్రయాణం..
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో.. స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన సమంత, ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. ఇటీవల ఆమె నటన తోనే కాక, నిర్మాతగా కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘శుభం’ హారర్-కామెడీ సినిమాతో ప్రొడ్యూసర్‌గా తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సమంత, తాజాగా డైరెక్షన్ వైపు అడుగులు వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సమంత ఓ క్యూట్ లవ్ స్టోరీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిందని, అదే కథను ఆమె స్వయంగా డైరెక్ట్ చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
త్రిబుల్ ఆర్ ను మించిన ఇంటర్వెల్ సీన్.. జక్కన్న భారీ స్కెచ్..
రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 మూవీపై భారీ అంచనాలున్నాయి. మొన్న మహేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఓ రేంజ్ లో సెన్సేషన్ అయింది. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒడిశా అడవుల్లో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడే భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ దట్టమైన అడవుల్లో క్రూరమైన హీగాల మధ్య ఒక ఛేజ్ సీన్ ఉంటుందంట. ఇది ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటుందని తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ను మించి ఇందులో ఇంటర్వెల్ సీన్ ను ప్లాన్ చేస్తున్నాడంట జక్కన్న
