పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన.. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని.. అవసరం అయితే, మరోసారి పాదయాత్ర చేస్తాను అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు..అయితే, ఈ రోజు పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్.. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. ఆ తర్వాత చివర్లో పాదయాత్ర ఉంటుంది.. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయి అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్..
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు అయింది.. ఇప్పటికే 10 కేసుల్లో వంశీకి బెయిల్ ముందస్తు కండిషన్ బెయిల్ ను వేర్వేరు కోర్టులు మంజూరు చేశాయి.. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేయటంతో.. అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైనట్టు అయింది. దీంతో రేపు వంశీ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వంశీ అరెస్ట్ అయ్యారు.. అప్పటినుండి జైల్లో రిమాండ్ ఖైదీ గా వంశీ ఉన్నారు. వంశీ పై అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాలు, భూ ఆక్రమణలు.. వంటి పలు ఆరోపణలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో మరోసారి ఉగ్ర కలకలం.. ఇద్దరు మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఉగ్ర కలకలం సృష్టిస్తోంది.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు.. పలు బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదునలు.. రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని తమిళనాడుకు తరలించారు.. అయితే, చాలా కాలంగా రహస్యంగా రాయచోటిలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం..
మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..
గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వరుసగా మూడోసారి గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా నిర్వహించే బాధ్యత నాకేదెక్కిందని హర్షం వెలిబుచ్చారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం దేవుడు తనకే కల్పించాడని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ (పి 4) కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమం పి.4. సమాజం మీకు ఎంతో ఇచ్చింది.. అందులో కొంత తిరిగి ఇవ్వలసిన అవసరం ఇది మీ బాధ్యత.. అంటూ ఈ ఈ కార్యక్రమం చేపట్టారు.
జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్.. వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
గుంటూరు జిల్లా జైలు నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ విడుదలయ్యారు.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడికేసులో సోమవారం రోజు సురేష్‌కు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. అయితే, షూరిటీలు సమర్పించడంలో అలస్యం కావడంతో ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు నందిగం సురేష్.. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు.. పైన ఉన్న దేవుడు అన్ని చూస్తున్నాడన్న సురేష్.. నాకు ఉన్న ఏకైక కోరిక మరణం వరకు జగనన్నతోనే ఉంటానని పేర్కొన్నారు.. ఆయన (వైఎస్ జగన్) మనిషిగా మాత్రమే చనిపోతా.. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, నష్టాలు పెట్టినా.. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంటా అన్నారు. ఇక, కూటమి పాలనలో అరాచకాలు శృతిమించాయని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. పాలన పక్కనపెట్టి, కక్షలకే పరిమితమయ్యారు. దేవుడి భయం ఉన్న ఎవరు ఇలాంటి పనులు చేయరు. పైనున్న భగవంతుడు అన్నీ చూస్తున్నాడని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ నందిగం సురేష్..
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ బనకచర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని మొద్దు నిద్ర లేపింది బీఆర్ఎస్ అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ.. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంతుకు.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది తమ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. మళ్లీ పాత అబద్దాలను ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి.. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయవు? అని ప్రశ్నించారు. చంద్రబాబు పట్ల నువ్వు చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం కాదా? అని అడిగారు. GWDT అవార్డు ప్రకారం, CWC అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదు అని హరీష్ రావు పేర్కొన్నారు.
“పోలీసుల క్షమించరాని చర్య”.. లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ..
తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు.
తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఆరు నెలల్లో 126 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారులను కటకటాల పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు తీసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారే టార్గెట్ గా తనిఖీలు చేసిన అక్రమార్కులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా, తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. మారుమూల ప్రాంతాల నుంచి కంప్లైంట్ వస్తే.. అక్కడికి వెళ్లి లంచగొడ్డిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తగిన శిక్షలు విధిస్తున్నారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్ఎస్‌ఎస్‌ను నిషేధిస్తాం..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి వస్తే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను నిషేధిస్తామని అన్నారు. ఆర్ఎస్ఎస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తింపచేస్తోందని ఆరోపించారు.చట్టపరిధిలో ఆ సంస్థ పనిచేయడం లేదని అన్నారు.
సుప్రీంకోర్టు సిబ్బంది నియామకాల్లో తొలిసారి SC-ST రిజర్వేషన్..
చరిత్రలో మొదటిసారిగా, భారత సుప్రీంకోర్టు, తన సిబ్బంది నియామకాలు, ప్రమోషన్ల విషయంలో ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ విధానాన్ని అధికారికంగా అమలు చేసింది. జూన్ 24, 2025 నాటి ఇంటర్నల్ సర్క్యులర్ ద్వారా ఈ విధానాన్ని అమలు చేస్తు్న్నట్లు ప్రకటించింది. ఇది దేశ అత్యున్నత న్యాయ సంస్థలో నియామకాలు, ప్రాతినిధ్యానికి ఒక ముఖ్యమైన అడుగుగా చూస్తున్నారు. సర్క్యులర్ ప్రకారం, మోడల్ రిజర్వేషన్ రోస్టర్, రిజిస్టర్‌లు కోర్టు ఇంటర్నల్ నెట్వర్క్(సుప్‌నెట్)లో అప్‌లోడ్ చేశారు. జూన్ 23, 2025 నుంచి ఇది అమలులోకి వచ్చింది. రిజర్వేషన్ విధానంలో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 7.5 శాతం కోటా కేటాయిస్తారు. ఈ విధానం రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, ఛాంబర్ అటెండెంట్లుకు వర్తిస్తుంది.
గూస్ బంప్స్ తెప్పిస్తున్న మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ – మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) కోసం కలిసి సినిమా చేస్తున్నారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణు దశ అవతారాల పురాణ గాథను తెరమీదకు తీసుకురానుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా నిర్మిస్తున్న మహావతార్ నరసింహ, మొదటి భాగం జూలై 25, 2025న ఐదు ప్రధాన భారతీయ భాషలలో అత్యాధునిక 3D ఫార్మాట్‌లో విడుదల కానుంది.
ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ
హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో డీ అంటే డీ అనేలా ఈ సినిమాలో జూనియర్ పాత్ర ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కూలీ సినిమాతో ఈ సినిమా పోటీ పడబోతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు.
