NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అమరావతి రాజధాని పనులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై కీలక నిర్ణయం తీసుకుంది.. వచ్చే నెల అంటే ఏప్రిల్‌ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది.. ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం.. ఇక, అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, సచివాలయం వెనక వైపు ప్రాంతంలో రాజధాని పనులు ప్రారంభించాలని.. అదే ప్రాంతంలో సభ కూడా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాల్సిందిగా సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..

జూన్ నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు
మనమిత్ర యాప్ ప్రపంచంలోనే మెరుగ్గా తీర్చిదిద్దుతాం అన్నారు మంత్రి నారా లోకేష్.. జూన్ 30వ తేదీ నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వందరోజుల్లో ఏఐ ఆధారిత వాయిస్ ఎనేబుల్ సేవలు తెస్తాం అన్నారు.. కేవలం పది సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు లోకేష్.. అలాగే పౌరులకు సంబంధించిన సమాచారం కూడా పూర్తి భద్రంగా ఉంటుందన్నారు.. అసెంబ్లీలో వాట్సాప్ గవర్నెన్స్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది.. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదన్నారు లోకేష్. వ్యక్తిగత డేటాను ఎక్కడా ఎవరితోనూ పంచుకోవటం లేదన్నారు.. పూర్తిగా ఎన్ క్రిప్టెడ్ డేటా మాత్రమే నేరుగా వినియోగదారుకు వెళ్తుందన్నారు లోకేష్ . ఇక, ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా జారీ అయ్యే పత్రాలకు పూర్తి చట్టబద్ధత ఉందన్నారు లోకేష్. సాంకేతికత విషయంలో పొరుగు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయని.. వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలను ఏపీ ప్రారంభించగానే అటు మహారాష్ట్ర కూడా నెల తర్వాత దీన్ని మొదలు పెట్టిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకువచ్చాక గత ప్రభుత్వం మీ-సేవా కేంద్రాల నుంచి కొన్ని సేవలను తొలగించిందని.. ఇప్పుడు వాట్సాప్‌ గవర్నెన్స్‌ వచ్చినంత మాత్రాన మీసేవా కేంద్రాల నుంచి సేవలను తొలగించబోమన్నారు.. ప్రజలు కావాలనుకుంటే వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా లేదంటే మీసేవా ద్వారా ప్రభుత్వ సేవలు పొందొచ్చన్నారు లోకేష్.

పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు.. దివాన్ చెరువు సమీపంలో ఫారెస్ట్ అకాడమీ..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు పూనుకుంది.. అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించారు.. అయితే, దివాన్ చెరువు దగ్గర ఉన్న రక్షిత అటవీ ప్రాంతంలో అకాడమీ ఏర్పాటు కానుంది.. అవసరమైన శిక్షణ, అటవీ వాతావరణాన్ని కల్పించడంతోపాటు రవాణా, మౌలిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. రక్షిత అటవీ ప్రాంతాన్ని వినియోగించుకొనే విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోనుంది ప్రభుత్వం.. దీనిపై కేంద్రానికి లేఖ రాయగా.. దివాన్ చెరువులోని రక్షిత అటవీ ప్రాంతంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.. ఇక, కేంద్రం స్పష్టత ఇచ్చిన క్రమంలో రాష్ట్ర ఫారెస్ట్‌ అకాడమీ ఏర్పాటుపై ఉన్నతాధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిశా నిర్దేశం చేశారు..

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఢిల్లీ చేరుకున్నారు.. ఇద్దరు నేతలు విడివిడిగా హస్తినలో అడుగుపెట్టారు.. ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా వివాహ రిసెప్షన్ కు వెళ్లనున్నారు.. ఇక, ఈ రాత్రి ఢిల్లీలోనే బసచేయబోతున్నారు.. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఒబెరాయ్ హోటల్‌లో “గేట్స్ ఫౌండేషన్” వ్యవస్థాపకులు, దాత బిల్ గేట్స్ తో సమావేశం కాబోతున్నారు చంద్రబాబు.. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమై.. విజయవాడ బయల్దేరనున్నారు.. మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీ చేరుకున్నారు.. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు పవన్‌ కల్యాణ్‌.. అయితే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కు సంబంధించిన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను ఎవరినైనా కలుస్తారా? అనే సమాచారం తెలియాల్సి ఉంది..

ఆంధ్రాలో తిరుమల ఎలా ఉందో అలా యాదగిరిగుట్టను కేసీఆర్ నిర్మించారు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అలా యాదగిరిగుట్ట నిర్మాణం చేశారు కేసీఆర్ అని శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, గుడుల పట్ల ఆయనకు ఉన్న అభిలాషతోనే ఈ ఆలయ నిర్మాణం సాధ్యమయింది.. ప్రభుత్వ నిధులతో 1800 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్ట నిర్మించడం చాలా గొప్ప విషయం అన్నారు. యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన రహదారులు వేయించారు.. విమాన గోపురం బంగారు తాపడం కోసం ఎందరో ధాతలతో మాట్లాడారు.. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఎందరో దాతలు బంగారం సమర్పించారు అని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, యాదగిరి గుట్టలో అద్భుతమైన కాటేజీలను సైతం కేసీఆర్ ఏర్పాటు చేశారు అని గుత్తా శాసన మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి చెప్పారు. యాదగిరి గుట్ట బోర్డుకి నిబద్ధత గల అధికారిని నియమించాలి.. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కూడా యాదగిరిగుట్టకు అద్భుత పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అని ఆయన పేర్కొన్నారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మిస్ వరల్డ్ విజేత..
మిస్ యూనివర్స్ విక్టోరియా క్జేర్ థీల్విగ్ తెలంగాణ పర్యటనలో ఉంది. మిస్ వరల్డ్ 2025 ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమె ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంది. క్జేర్ థీల్విగ్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం కల్పించారు. హిందు సాంప్రదాయ దుస్తులు ధరించిన క్జేర్ థీల్విగ్‌ స్వామికి ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన చేసింది. అనంతరం పూజారుల ఆశీర్వచ‌నం తీసుకుంది. ఆలయ విశిష్టతను అధికారులు వివరించారు. ఆలయ అధికారులు విక్టోరియా క్జేర్ థీల్విగ్‌కు స్వామి చిత్రప‌టంతో పాటు ప్రసాదం అందించారు. సందర్శకుల పుస్తకంలో తన భావాలను వ్యక్తపరిచింది. “ఈ అనుభవం వర్ణించలేనిది” అని ఆమె పేర్కొంది.

హైడ్రా పేరిట అవ‌త‌వ‌క‌ల‌కు పాల్పడితే క‌ఠిన చర్యలు
హైడ్రా పేరు చెప్పి లావాదేవీల‌కు, అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఎవ‌రైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతేడాది సెప్టెంబ‌ర్ 3వ తేదీన స్పష్టమైన ప్రకటన కూడా చేశామని తెలిపారు. హైడ్రా పేరుతో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు ఆధారాలుంటే వెంట‌నే త‌న దృష్టికి తీసుకు రావాల‌ని ఆయన కోరారు. లేని ప‌క్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేష‌న్లో ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. ఇక, అవ‌క‌త‌వ‌క‌లు నిజ‌మైతే హైడ్రా ఉద్యోగులైతే స‌స్పెండ్ చేయ‌డంతో పాటు క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా లేదా ప‌రోక్షంగా కానీ హైడ్రా పేరును వినియోగించుకుని వసూళ్లకు పాల్పడే వారిపై క‌ఠిన శిక్ష పడేలా చేస్తామని రంగనాథ్ తెలిపారు.

దర్యాప్తులో షాకింగ్ విషయాలు.. స్నేహితుడితో దుబాయ్‌కు 26 ట్రిప్పులు
కన్నడ నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తాజా వివరాలను వెల్లడించింది. మంగళవారం కోర్టు విచారణ సందర్భంగా రన్యా రావు, ఆమె స్నేహితుడు తరుణ్ రాజు దుబాయ్‌కు 26 ట్రిప్పులు చేసి వారు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని డీఆర్ఐ కోర్టుకు తెలిపింది. ఈ పర్యటన సమయంలో రన్యా రావు, తరుణ్ రాజు ఉదయం బయలుదేరి.. సాయంత్రంత తిరిగి వచ్చే వారని.. ఇదే అనుమానాన్ని రేకెత్తించిందని అధికారులు వెల్లడించారు. ఇది అక్రమ కార్యకలాపాలకు సంబంధించిందని.. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు బెంగళూరు విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. రన్యా రావు, తరుణ్ రాజు మధ్య మరిన్ని ఆర్థిక లావాదేవీలను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. రాజు తన దుబాయ్-హైదరాబాద్ ప్రయాణ ఖర్చులను రన్యా రావు ఖాతా నుంచి తీసుకున్నట్లు ఆధారాలు లభించాయని.. ఇది స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో రాజు కూడా భాగమనే నిర్ధారణకు చేరుకున్నామని అధికారులు తెలిపారు. 2023 నుండి మార్చి 2025 మధ్యకాలంలో రన్యా రావు దుబాయ్‌కు 52 ట్రిప్పులు చేసింది. వాటిలో కనీసం 26 ట్రిప్పులలో తరుణ్ రాజు ఆమెతో పాటు వెళ్లాడు. ఈ ప్రయాణాలను బంగారు స్మగ్లింగ్ కోసం ఉపయోగించినట్లు అనుమానాలు కలుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో మార్పులు తీసుకురావాలి..
టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తడబడుతోంది. ఇటీవలే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, అంతకుముందు టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత్.. టెస్ట్ క్రికెట్‌లో విఫలమవుతుంది. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 3-1 తేడాతో ఓటమి చవిచూసింది. అంతకు ముందు.. భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో.. టీమిండియా 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది. ఈ క్రమంలో.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టెస్ట్ క్రికెట్‌లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మార్పులకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని గంగూలీ చెప్పారు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో ఇంకా మెరుగ్గా ఆడగలడని అన్నారు. “గత 4-5 సంవత్సరాలుగా రోహిత్ శర్మ రెడ్ బాల్‌తో ఆడిన ప్రదర్శన నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అతను ఇంకా బాగా ఆడగలడు. రోహిత్ శర్మ తన ఆలోచనలను మార్చుకుని.. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి” అని గంగూలీ చెప్పారు.

అషురెడ్డి గ్లామర్ ట్రీట్ అదిరిందిగా..
బుల్లితెర బ్యూటీ అషురెడ్డి హంగామా మామూలుగా ఉండట్లేదు. సినిమాల్లో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా రెచ్చిపోతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. రీల్స్ చేస్తూ జూనియర్ సమంత అనే ట్యాగ్ లైన్ తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి అక్కడ కూడా బాగానే ఫేమస్ అయిపోయింది. దాని తర్వాత బుల్లితెర ప్రోగ్రామ్స్ తో అలరించింది. కానీ ఎంత చేసినా ఆమెకు అనుకున్నంత ఫేమ్ రాలేదు. దాంతో మధ్యలో షో ఆఫర్లు రాక ఇబ్బందులు పడింది. ఆ తర్వాత కొన్ని షోలల్లో చేసినా పెద్దగా కలిసి రాలేదు. మధ్యలో విదేశీ టూర్ల పేరుతో టైమ్ పాస్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఓటీటీ షోలతో బిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఎంత షూటింగుల బిజీలో ఉన్నా సరే తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోయడంలో మాత్రం అస్సలు వెనకడుగు వేయదు. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ భామ. ఇందులో ఆమె ముందరి అందాలతో తెగ కవ్విస్తోంది. ఇందులో చూసుకుంటే ఆమె మెడలో ఏదో నెక్లెస్ వేసుకుని ఫోజులు ఇస్తోంది. ఇంత హాట్ హాట్ గా ఉండటంతో ఆమె ఫొటోలు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి చేరింది. ఈ యాప్స్‌ను ప్రచారం చేసిన యూట్యూబర్లు, వారికి జరిగిన చెల్లింపులు మరియు ఆర్థిక లావాదేవీలపై ఈడీ తీవ్రంగా విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ మరియు హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన వివరాలను ఈడీ తెప్పించుకుని దర్యాప్తును ముమ్మరం చేసింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేందుకు పలువురు యూట్యూబర్లు తమ ఛానల్స్ వినియోగించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. తమ వీడియోలతో వినియోగదారులను ఆకర్షించి, వారి నుంచి డబ్బులు సేకరించే ప్రక్రియలో ఈ యూట్యూబర్లు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. వీరు బెట్టింగ్ యాప్స్ ప్రచారం ద్వారా పొందిన ఆదాయం, దాని మూలాలు మరియు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందనే అంశాలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సేకరించిన డబ్బు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా బదిలీ అయినట్లు ఈడీ అనుమానిస్తోంది. మనీ లాండరింగ్‌తో పాటు హవాలా వ్యవస్థ ద్వారా ఈ నిధులు విదేశాలకు బదిలీ అయ్యాయని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ ఆర్థిక లావాదేవీలు అనేక షెల్ కంపెనీలు, డమ్మీ బ్యాంకు ఖాతాల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. ఈ నిధులను క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టడం లేదా నగదుగా ఉపసంహరించడం వంటి పద్ధతులు కూడా ఉపయోగించినట్లు అధికారులు గమనించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం దేశంలో చట్టవిరుద్ధ ఆర్థిక కార్యకలాపాలకు ఒక ప్రధాన ఉదాహరణగా మారింది. ఈ కేసులో యూట్యూబర్ల పాత్ర, మనీ లాండరింగ్, హవాలా చెల్లింపుల అనుమానాలు ఈ వ్యవహారం యొక్క తీవ్రతను సూచిస్తున్నాయి. ఈడీ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసు వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.