NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పరిటాల రవి హత్య కేసు.. ముద్దాయిలకు బెయిల్‌ మంజూరు
సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ హత్య జరిగిన 18 ఏళ్లకు ముద్దాయిలకు బెయిల్‌ మంజూరు చేసింది ధర్మాసనం.. ఈ కేసులో A3గా ఉన్న పండుగ నారాయణరెడ్డి, A4గా ఉన్న రేఖమయ్య, A5గా ఉన్న బజన రంగనాయకులు, A6గా ఉన్న వడ్డే కొండ, A8గా ఉన్న ఓబిరెడ్డిలకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. అయితే, ఈ సందర్భంగా షరతులు విధించింది హైకోర్టు.. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని.. 25 వేల రూపాయలతో రెండు పూచీ కత్తులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అంతే కాదు.. జైలు నుంచి విడుదలయ్యాక నడవడిక బాగోలేనట్టుగా ఫిర్యాదు వస్తే బెయిల్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది..

వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలోకి క్యూ కట్టిన కార్పొరేటర్లు..!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు కొందరు.. సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు ఇలా వరుసగా ఆ పార్టీకి షాక్‌ ఇస్తూ.. కూటమి పార్టీలో చేరుతున్నారు.. ఇప్పటికే చాలా మంది టీడీపీ కండువా కప్పుకోగా.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీలో చేరిపోయారు.. అయితే, వైసీపీ కంచుకోటకు కూడా బీటలు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కడప కార్పొరేషన్ లో పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. మరికొందరు కూడా రెడీ ఉన్నారని తెలుస్తోంది.. కడప మున్సిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు మెల్లగా టీడీపీ గూటికి చేరుకుంటున్నారు. 50 డివిజన్లలో 49 వైసీపీ, ఒక్కస్థానంలో టీడీపీ దక్కించుకున్నాయి. అయితే, ప్రస్తుతం 47 స్థానాలు వైసీపీ చేతిలో ఉండగా ఇటీవల 25 డివిజన్ కార్పొరేటర్ సూర్య నారాయణ టిడిపిలో చేరారు. దీంతో టీడీపీ బలం రెండుకు చేరగా.. ఇప్పుడు దాదాపు 7 మందికి కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు. దీంతో టీడీపీ బలం తొమ్మిదికి చేరింది . అంతే కాదు.. దాదాపు 20 మంది వరకు చేరడానికి ముందుకు వచ్చినప్పటికీ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వారించినట్లు తెలుస్తోంది.. వీరిలో సగం మందిని మొదటి దశలో తీసుకుంటూ.. రెండో దశలో మిగిలిన వారిని తీసుకోవాలని భావిస్తున్నారట.. మొత్తంగా రెండో విడతలో చేరనున్న 11 మంది కార్పొరేటర్ల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చేరినట్టుగా ప్రచారం సాగుతోంది.. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను ఏడింటిని టిడిపి కైవసం చేసుకుంది. ఎన్నికల్లో పరాభవం అనంతరం మేల్కొంటూ పార్టీ బాధ్యతలు మేనమామ చేతిలో పెట్టారు వైసీపీ అధినేత. ఆ తర్వాత వచ్చిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను కూటమి బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. చివరకు పులివెందుల్లోనూ వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు కొత్తగా కడప కార్పొరేషన్ కూడా ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతొందట. ఇక్కడ కార్పొరేటర్ లు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతుండడం.. ఆ పార్టీకి మరింత ఇబ్బంది కరంగా మారిందంటున్నారు నేతలు..

నల్లమల ఫారెస్ట్‌లో తప్పిపోయిన 15 మంది భక్తులు.. డయల్‌ 100కు కాల్‌..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో నల్లమల ఫారెస్ట్‌లో భక్తులు తప్పిపోవడం కలకలం సృష్టించింది.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలో శ్రీశైలం సమీపంలోని ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయానికి వెళ్తూ.. తప్పిపోయారు 15 మంది భక్తులు.. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి సురక్షితంగా రక్షించి అటవీప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు.. వీరందరూ బాపట్ల జిల్లా రేపల్లె మండలం మంత్రిపాలెంకు చెందిన భక్తులుగా గుర్తించారు అధికారులు.. అయితే, ముందుగా శ్రీశైలం వచ్చిన సదరు భక్తులు.. మల్లన్న స్వామిని దర్శించుకొని, అక్కడ నుండి ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయానికి కాలి నడకన అటవీప్రాంతంలో బయల్దేరారు.. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎటుపోవాలో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు.. కొంతదూరం నడిచినాక ఫోన్‌కు సిగ్నల్‌ రావడంతో డయల్‌ 100 కు కాల్ చేశారు.. ఫారెస్ట్‌లో దారితప్పిన తమను రక్షించాలని.. సహాయం చేయాలని పోలీసులను కోరారు భక్తులు.. ఆ కాల్‌లో అలర్ట్‌ అయిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు.. శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయం వద్ద అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.. చివరకు 15 మంది భక్తులను సురక్షితంగా రక్షించి పోలీసుల వాహనంలో అటవీప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు. దీంతో భక్తులు.. వారి కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రేపే ఏపీ కేబినెట్‌ భేటీ.. వాటిపైనే ఫోకస్‌..
ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. ముఖ్యంగా 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఇక, పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చ సాగనుంది.. మరోవైపు.. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు.. ఇక, రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు. గతంలో అనుమతులు ఇచ్చి తరువాత వాటిని రద్దు చేస్తే.. ఆ కట్టడాలు అక్రమ కట్టడాలుగా పరిగణిస్తూ.. వాటిని హైడ్రా కూల్చివేస్తుందన్నారు. పేదలను ముందు పెట్టి వెనుక నుండి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్స్‌ని హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. హైడ్రా ఆవిర్భావం తర్వాత అనుమతి ఇచ్చినా ఎఫ్టీఎల్‌లో వుంటే కూల్చడం జరుగుతుందన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేయటం జరుగుతుందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతి లేకుండా ఉన్న కన్వెన్షన్ సెంటర్ లాంటి కట్టడాలు హైడ్రా కూల్చి వేస్తుందన్నారు. హైదరాబాద్‌లో చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలు పెట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం.. త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కూల్చివేతలు చేసిన తరువాత, ఆ ప్రాంతం ప్రజావసరాల కోసం వినియోగంలోకి వచ్చేలా హైడ్రా ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. హైదరాబాద్‌లో 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామన్నారు. ఆ చెరువుల పునరుద్దరణకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించామన్నారు. ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతామన్నారు.

ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ దారుణాలకు సోషల్ మీడియా కారణం కావడం అత్యంత బాధాకరం. తాజాగా సోషల్‌ మీడియా ప్రేమ ఓ ఫోక్‌ సింగర్ ప్రాణం తీసింది. ఇన్ స్టాలో పరిచయమైన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో సింగర్ శృతి ప్రేమలో పడింది. శృతి స్వస్థలం నిజామాబాద్ జిల్లా కాగా.. జానపద పాటలతో శృతి ఫేమస్ అయింది. 20 రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకునే వరకు బాగానే ఉన్నా అనంతరం వేధింపులు షురూ అయ్యాయి. కట్న కానుకల కోసం ఫోక్ సింగర్ శృతిని భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేక పెళ్ళైన 20 రోజులకే శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో శృతి మృతదేహం ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అంబేద్కర్‌ను గౌరవించింది మోడీ సర్కారే
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అంబేద్కర్‌ను బీజేపీని అవమానపరుస్తోందని నినాదాలు చేశారు. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. అంబేద్కర్ పేరు పెట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అంటూ చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయిందని.. ఇన్ని సార్లు దేవుడి పేరు తలుచుకున్నా.. స్వర్గంలో చోటు దక్కేదని అమిత్ షా అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. బీజేపీ.. అంబేద్కర్‌ను అవమానిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఘోర విషాదం.. బోటు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
ఆహ్లాదం.. విషాదమైంది. ఆనందం.. ఊపిరి తీసింది. ఎంతో ఉల్లాసంగా సాగిపోతున్న ప్రయాణంలో ఒకే ఒక్క కుదుపు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ముంబై తీరంలో బుధవారం జరిగిన బోటు ప్రమాదంలో 13 మంది జలసమాధి అయ్యారు. ఈ దుర్ఘటనతో తీరం దు:ఖ సముద్రం అయింది. బుధవారం ముంబై తీరంలో పర్యాటకులు ఫెర్రీ బోటులో విహరిస్తున్నారు. ఎంతో ఉల్లాసంగా ప్రయాణం సాగిపోతుంది. కేరింతలు కొడుతూ.. కబుర్లు చెప్పుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా సాగిపోతుంది. అదే తీరంలో విహరిస్తున్న ఓ స్పీడు బోటు.. మృత్యువులా దూసుకొచ్చి ఢీకొట్టింది. సెక్షన్లలో బోటు మునిగిపోయింది. రక్షించే లైఫ్ జాకెట్లు.. హ్యాండిచ్చాయి. అలా 13 మంది ప్రయాణికులు తీరంలోనే జలసమాధి అయిపోయిరు. ఈ ప్రమాదంతో టూరిస్టులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోటు ప్రమాదంలో 13 మంది చనిపోయారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు.

డోక్లాం సమీపంలో గ్రామాలను నిర్మిస్తోన్న చైనా..
మరోసారి చైనా తన దొంగబుద్ధిని చాటుకుంది. గత 8 ఏళ్లుగా భూటాన్ భూభాగమైన డోక్లామ్ సమీపంలో 22 గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వీటిలో 8 గ్రామాలు 2020 నుంచి వ్యూహాత్మక డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉండగా ఈ పరిణామం జరిగింది. డోక్లామ్ పీఠభూమి భూటాన్ భూభాగం. ఈ ప్రాంతం భారత్‌కి అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ఈ పీఠభూమికి సమీపంలోనే అత్యంత కీలమైన ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’ ఉంది. ఈ కారిడార్ ఈశాన్య భారతాన్ని, మిగిలిన దేశంతో కలుపుతోంది. భూటాన్ పశ్చిమ ప్రాంతంలోని డోక్లామ్ సమీపంలో ఉన్న ఈ గ్రామాలను చైనా తన సొంత గ్రామాలుగా చెప్పుకుంటోంది. వాటిలో చాలా వరకు సైనిక ఔట్‌పోస్టులు ఉన్నాయి. ఈ 22 గ్రామాల్లో అతిపెద్దది ‘‘జివు’’. ఇది పశ్చిమ సెక్టార్‌లోని త్షేతాంగ్‌ఖా అని పిలువబడే సాంప్రదాయ భూటాన్ పచ్చికభూమిపై నిర్మించబడిందని నివేదికలు తెలుపుతున్నాయి.

మార్కెట్లోకి మరో మారుతీ 7-సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ప్రముఖ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 7-సీటర్ గ్రాండ్ విటారా వచ్చే ఏడాది అంటే 2025 మధ్యలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. వార్తా వెబ్‌సైట్ gaadiwaadi కథనం ప్రకారం.. వచ్చే ఏడాది కచ్చితంగా ఈ కారు భారత మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించిన పరీక్షలు నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్ కార్లకు మారుతి సుజుకి ఏడు సీటర్ల ప్రీమియం ఎస్‌యూవీ ‘గ్రాండ్ విటారా’.. గట్టి పోటీ ఇస్తుందని నిపుణుల అభిప్రాయం. స్పాటెడ్ 7-సీటర్ విటారా కారు ముందు భాగంలో కొత్త LED DRL, హెడ్‌ల్యాంప్‌లతో కూడిన స్ప్లిట్ లైటింగ్ యూనిట్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బంపర్ కూడా కొత్త ఎయిర్ టెక్‌తో రీడిజైన్ చేయనున్నారు. కారు బూట్ గేట్, వెనుక బంపర్ కూడా మారుస్తున్నారు. ఈ ఎస్‌యూవీలో కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ అమర్చనున్నారు. మరోవైపు క్యాబిన్ కొత్త డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. 7-సీటర్ గ్రాండ్ విటారాలోనూ ప్రస్తుత గ్రాండ్ విటారా మోడల్ కారులో వాడుతున్న ఇంజిన్‌నే వాడతారని తెలుస్తున్నది. మైల్డ్ హైబ్రీడ్ సెటప్‌తోపాటు 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని సమాచారం. ఈ ఇంజిన్ గరిష్టంగా 115 బీహెచ్పీ విద్యుత్ 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. నాన్ -హైబ్రీడ్ ఇంజిన్ కూడా ఇస్తారని తెలుస్తున్నది. మాన్యువల్ లేదా సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉంటుంది.

మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ సినిమాపై కీలక ప్రకటన
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా మొదలవ్వాల్సి ఉంది. రేపు ఉదయం ముహూర్తం అనగా ఆరోగ్యం బాలేదని చెబుతూ మోక్షజ్ఞ తేజ వెనకడుగు వేయడంతో ఆ సినిమా ఓపెనింగ్ ఆగిపోయింది. అయితే సినిమా ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ ఇంకా సినిమాలు చేసేందుకు రెడీగా లేడని తండ్రి బలవంతం మీద సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు కానీ చివరి నిమిషంలో ప్రెషర్ తట్టుకోలేక తప్పుకున్నాడు అంటూ ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఇదే విషయం మీద ప్రశాంత్ వర్మ టీమ్ స్పందించింది. సినిమా గురించి ఆధారం లేని రూమర్స్ ఎన్నో తిరుగుతున్నాయని, అయితే అవేవీ నిజం కాదు అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదైనా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అఫీషియల్ లేదా లెజెండ్ ప్రొడక్షన్స్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే వెల్లడిస్తామని, అప్పటి వరకు జనరల్ పబ్లిక్ కానీ మీడియా కానీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరింది.

‘రాజాసాబ్’పై పుకార్లు.. స్పందించిన టీమ్
ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి కానీ గత కొన్ని రోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నా ఈరోజే అదే డేటును సిద్ధూ జొన్నలగడ్డ జాక్ కూడా ఫిక్ చేసుకుంది. కాబట్టి వాయిదా గురించి అధికారికంగా చెప్పకపోయినప్పటికీ దాదాపు వాయిదా పడ్డట్టే అని ప్రచారం జరుగుతుంది. రెండు రోజుల క్రితం ప్రభాస్‌కు ఈ మూవీ షూటింగ్‌లో కాలు బెణికిందని న్యూస్ వచ్చింది, కాబట్టి సినిమా ఏప్రిల్ 10కి రిలీజ్ కాదని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టీం స్పందించింది. ఇక రాజా సాబ్ షూటింగ్ నిరంతరాయంగా డే అండ్ నైట్ షెడ్యూల్స్‌తో శరవేగంగా జరుగుతోంది. దాదాపు 80% షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ విడుదల గురించి రకరకాల ఊహాగానాలు చెలామణి అవుతున్నాయని మేము గమనించాము. ఈ తప్పుడు పుకార్లను నమ్మవద్దని కోరుతున్నాము. సరైన సమయంలో మేము ఏవైనా అప్డేట్స్ ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. రెబెల్ సాబ్ రాక కోసం మీరు చూసే ఎదురు చూపులకు ఏమీ తక్కువ కాదు. మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసేలా టీజర్ త్వరలో రాబోతోంది అని చెప్పుకొచ్చారు. రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తారనుకుంటే టీజర్ అప్డేట్ ఇచ్చి సరిపెట్టారు మేకర్స్.

అల్లు అర్జున్ కిమ్స్ కు రాకపోవడంపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన హస్పటల్‌ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం.. ఇప్పుడే హస్పటల్‌లో ఉన్న శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను. డాక్టర్లందరితోనూ మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నాడు. గత 14 రోజుల్లో.. లాస్ట్‌ 10 డేస్‌ల్లో రికవరీ బాగా కనిపిస్తుంది. బట్‌ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. అయితే శ్రీతేజ్‌ కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. దీంతో పాటు ప్రభుత్వం కూడా మేము కూడా శ్రీతేజ్‌ను సంపూర్ణ ఆరోగ్యంగా చూడటానికి రెడీగా ఉన్నాం అని చెప్పడ అభినందనీయం. చాలా మంది అభిమానులు, బందువులు, మిత్రులు అల్లు అర్జున్‌ ఎందుకు హస్పటల్‌కు వెళ్లలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఉదయమే అర్జున్‌ హస్పటల్‌కు వెళ్లదామనుకున్నాడు. కానీ హస్పటల్‌ అధికారులు నిన్నే కదా ఈ సంఘటన జరిగింది. మీరు హస్పటల్‌కు వచ్చే కార్యక్రమం వాయిదా వేసుకోమని అన్నారు. కరెక్ట్‌ అనిపించింది. అందుకే రాలేదు. ఇక ఆ రోజే అర్జున్‌పై కేసు వచ్చింది. ఆ కేసులో లీగల్‌ టీమ్‌ హెడ్‌ నిరంజన్‌ రెడ్డి హస్పటల్‌కు వెళ్లకూడదు.. వారిని కలవకూడదు అని ఆయన స్ట్రాంగ్‌గా చెప్పారు. ఆ తరువాత మేము రావడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇక బన్నీ ఒక రోజు బాధపడుతూ నేను చూడలేకపోయాను.. మీరైనా వెళ్లండి.. డాడీ అన్నాడు. అందుకే నేను ఇక్కడికి రావడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకున్నాను. ఈ రోజు వచ్చాను. ఈ అనుమతి నాకు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీస్‌ శాఖ వారికి, హస్పటల్‌ యజమాన్యానికి, సీఇవో అభిమన్యు, మెడికల్‌ డైరెక్టర్‌ సంహిత్‌కు అందరికి నా కృతజ్క్షతలు తెలియజేస్తున్నాను’ అన్నారు

Show comments