ఇప్పుడొచ్చి సవాల్ విసురుతున్నావా..? నువ్వు ఏడ్చి ఎందుకు పారిపోయావు..?
దమ్ముంటే అసెంబ్లీకి రా అని చంద్రబాబు ఇప్పుడు సవాలు విసురుతున్నారు.. నువ్వు ఏడ్చి ఎందుకు పారిపోయావు.. ఇప్పుడొచ్చి సవాలు విసురుతున్నావా..? అంటూ మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. లిక్కర్ స్కాం కేసు అక్రమంగా పెట్టిన నిరాధారమైన కేసు.. బేతాళ కథలను తలపించేలా లిక్కర్ కేసు ఉంది.. మూడవ ఛార్జ్ షీట్ లో కూడా చెప్పిందే చెప్పినట్లుగా చెప్పారు.. దీని ఉద్దేశ్యం ఏంటో అందరికీ క్లియర్ గా అర్థం అవుతుందన్నారు.. ఈ కేసులో జగన్ కు దగ్గరగా ఉన్న వారిని అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ రోజులు జైళ్లో పెట్టే ఉద్దేశ్యంతో పెట్టిన కేసుగా ఆరోపించిన ఆయన.. ఏ వ్యక్తి అయినా నేరారోపణతో అరెస్టయితే 90 ఛార్జ్ షీట్ వేయకపోతే వారిని బెయిల్ ఇవ్వొచ్చని చట్టం చెప్తుంది. అరెస్టు చేసిన వారిని బయటకు రానీయకూడదని పొంతన కుదరకుండా చేస్తున్నారు.. చెవిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు.. జగన్ వెంట ఉన్నందుకే కక్ష్యతో ఇబ్బంది పెట్టి వేధిస్తున్నారు. చట్టబద్ధంగా పనిచేస్తున్న కంపెనీలను కూడా డొల్ల కంపెనీలు అంటున్నారు. కంపెనీ తరఫున భూములు కొని అమ్మటం తప్పా..? అని నిదీశారు.
అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? ఎమ్మెల్యేలకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా?
ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకపోతే జీతం కట్ చేస్తారు.. మరి, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. విజయవాడలో NTR సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగి.. ఈ కార్యక్రమానికి హాజరైన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇవ్వమా?.. వినకపోతే జీతం కట్ చేస్తాం కదా?.. అప్పటికీ వినకపోతే ఉద్యోగం తీసేస్తాం కదా..? అని ప్రశ్నించారు.. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి? ఎమ్మెల్యేలకు ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా? అని నిలదీశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడటమే ఎమ్మెల్యేల డ్యూటీ.. అసెంబ్లీకి రానప్పుడు జీతం తీసుకునే హక్కు ఎవరు ఇచ్చారు? అని మండిపడ్డారు.. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా.. పనిచేయని వాడికి నెలకు జీతం తీసుకునే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.. అయితే, ప్రజాభిప్రాయం తీసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
పెరిగిన క్రైమ్ రేట్..! శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కలెక్టర్లు.. ఎస్పీలతో కలిసి శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు.. యూరియా కొరతకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చింది.. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని.. తప్పుడు ప్రచారం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు.. అనవసర అసత్య ప్రచారం చేసారన్నారు… అమెరికా నుంచి కూడా వందల్లో పోస్టింగ్స్ పెట్టారన్నారు. ఇలాంటి వాటినే రియల్ టైమ్ గవర్నెన్సులో విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.. క్రైమ్ రేట్ 4 శాతం మేర, సైబర్ క్రైమ్ 16 శాతం పెరిగిందని చెబుతున్నారని.. శాంతిభద్రతల విషయంలో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు.. డ్రగ్స్ నివారణపై ఇంకా ప్రచారం పెరగాలన్నారు.. గంజాయి వినియోగం అరికట్టేలా మరింత ఫోకస్ పెట్టాలని.. గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేలా నిఘా పెంచాలన్నారు. డ్రగ్స్ ను ఓవర్ నైట్ నియంత్రించాలి అనుకోవటం సరికాదని… అదో నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు.. సీసీటీవీ కెమెరాలు భద్రతా పర్యవేక్షణకు ఉపయోగపడతాయన్నారు. నియంత్రణ లేకపోవటం వల్లే 90 శాతం మేర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు చంద్రబాబు. సైబర్ క్రైమ్ లో ప్రజలు నెలకు రూ.30 కోట్ల మేర కోల్పోతున్నారని.. క్రిమినల్స్ టెక్నాలజీ మాస్టర్లుగా ఉన్నారన్నారు.. వారికంటే అడ్వాన్స్‌గా మనవాళ్లు మారాలన్నారు సీఎం చంద్రబాబు.ఫోరెన్సిక్స్ కూడా మరింత సమర్ధవంతంగా ఉండాలన్నారు. క్రైమ్ జరిగిన తర్వాత ఎంత సమయంలోగా ఘటనా స్థలికి వెళ్లగలుగుతున్నారు, క్రైమ్ సీన్ ప్రోటెక్షన్ ఎలా జరుగుతోందన్నది కూడా ముఖ్యం అన్నారు సీఎం చంద్రబాబు.. పోలీసు డాగ్స్ శిక్షణ, ప్రతీ రెవెన్యూ డివిజన్ లో డాగ్ స్క్వాడ్ ఉండాలన్నారు. క్రైమ్ సీన్ సైట్ ను డెస్ట్రాయ్ చేయటం పెద్ద నేరమన్నారు.. వివేకా హత్యకేసు అతిపెద్ద ఘటన. ఒక సీఐ దగ్గరుండి రక్తం కడిగించటం ఏమిటని ప్రశ్నించారు.. అప్పట్లో ఆ వివరాలను ఎవరూ నా నోటీసుకు తేలేకపోయారన్నారు చంద్రబాబు..
సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులు పెడితే అంతే..! కేబినెట్‌సబ్ కమిటీ ఏర్పాటు..
సోషల్ మీడియాలో పనికివచ్చే సమాచారం ఉన్నా.. కొందరిని టార్గెట్ చేస్తూ.. వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పెట్టడం.. వాటిని వైరల్ చేయడంతో చాలా మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. ఇక, మహిళలు అని కూడా చూడకుండా.. అసభ్యపదజాలంతో పెట్టే కొన్ని పోస్టులు.. వారితో పాటు వారి కుటుంబాలను కూడా తీవ్రంగా కలచివేస్తున్నాయి.. ఇక, కొన్ని వీడియోలు పెట్టి వైరల్ చేయడంతో.. అది నిజమా? అబద్దమా? అని తెలుసుకోవానికి తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి.. దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే పోస్ట్ ల పై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.. మంత్రులు వంగలపూడి అనిత, నాదెళ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథిలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది కూటమి సర్కార్.. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, మహిళలను కించపరిచే ప్రచారలపై అధ్యయనం చేయనుంది మంత్రి వర్గ ఉప సంఘం.. ఇక, శీతాకాల అసెంబ్లీ సమావేశాలల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్..
ఎల్లుండి వైసీపీ శాసనసభా పక్ష సమావేశం.. జగన్ అసెంబ్లీకి వస్తారా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది.. సెప్టెంబర్ 18 నుంచి అంటే ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి.. 10 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.. అయితే, ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుఅవుతారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.. వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఎల్లుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో (శాసనసభా పక్ష ) సమావేశంకానున్నారు వైఎస్ జగన్.. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు వైఎస్ జగన్.. అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చగా మారింది.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే.. తమ పార్టీ అధినేత జగన్.. అసెంబ్లీకి వస్తారని వైసీపీ నేతలు చెబుతుండగా.. సీట్ల సంఖ్య సరిగా లేనిది? ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది..? అది నా చేతిలో లేదు.. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. ఎల్లుండి వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..
జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్.. స్వయం సమృద్ధికి క్రిటికల్ మినరల్స్ కీలకం!
కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని టీ-హబ్‌లో నిర్వహించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM) ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సెమినార్‌లో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు. పరిశోధనలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు హైదరాబాద్ అనువైన నగరమని.. ఇది సృజనాత్మకతకు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు హబ్ లాంటిదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, ఉత్పత్తుల సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యత పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. 2030 నాటికి EV బ్యాటరీలకు, పునరుత్పాదక శక్తి సాంకేతికతకు డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుందని, దీనితో క్రిటికల్ మినరల్స్ అవసరం కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయవద్దు.. ప్రైవేట్ ఆసుపత్రులకు విజ్ఞప్తి!
ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలనే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, గతంలో రూ. 5 లక్షలుగా ఉన్న ఉచిత వైద్య పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. అలాగే, ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలపై దృష్టి సారించి, గత 21 నెలల్లో రూ. 1779 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా, దశాబ్ద కాలంగా పెంచని వైద్య చికిత్సల ప్యాకేజీల చార్జీలను సగటున 22% పైగా పెంచింది. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఈ నిర్ణయం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. దీని కోసం ప్రభుత్వం అదనంగా రూ. 487.29 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు.
సింధూ నదిపై పాక్ ఆనకట్ట.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్
కోహిస్తాన్‌లోని హర్బన్ అనే గ్రామస్థులు డైమర్-భాషా ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆనకట్ట కోసం సేకరించిన భూమికి పరిహారం, స్థానిక ప్రజలకు పునరావాసంపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. గత వారం రోజులుగా హర్బన్ గ్రామస్థులు గిల్గిట్-బాల్టిస్థాన్‌ను ఖైబర్-పఖ్తుంఖ్వాకు అనుసంధానించే హర్బన్ నాలా వద్ద కారకోరం హైవేను దిగ్బంధించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. రహదారి దిగ్బంధంతో వందలాది ట్రక్కులు, ప్రయాణీకుల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాణిజ్యం, ప్రజల ప్రయాణం పూర్తిగా నిలిచిపోయాయి. ఈసందర్భంగా నిరసనకారుల నాయకుడు నియామత్ ఖాన్ మాట్లాడుతూ.. తమ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, పరిహారం చెల్లించడానికి ఆలస్యం చేశారని విమర్శించారు. చెల్లింపు హామీలను నెరవేర్చడంలో వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ (WAPDA), ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ విఫలమయ్యాయని నిరసనకారులు విమర్శించారు. పలు నివేదికల ప్రకారం.. భూ యజమానులకు దాదాపు PKR 3 బిలియన్లు బాకీ ఉన్నారు. ఇందులో దాదాపు PKR 2 బిలియన్లు ఇప్పటికే కోహిస్థాన్ డిప్యూటీ కమిషనర్ ఖాతాలో జమ చేశారు. మిగిలిన మొత్తం అవసరమైన చట్టపరమైన లాంఛనాల కారణంగా పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు. నిరసనకారులు ఈ వివరణలను తిరస్కరించారు. సంవత్సరాలుగా జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
పాకిస్తాన్‌కు కాంగ్రెస్, రాహుల్ గాంధీకి మిత్రులే.. షాహిద్ అఫ్రిది పొగడ్తలపై బీజేపీ ఫైర్..
ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్, దాయాది పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లను కనీసం పట్టించుకోలేదు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశ ప్లేయర్లకు ‘‘హ్యాండ్ షేక్’’ కూడా మన ప్లేయర్లు ఇవ్వలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని ‘‘పహల్గామ్’’ బాధితులకు, భారత సైన్యానికి అంకితమిచ్చారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తమకు జరిగిన అవమానానికి తీవ్రంగా రగిలిపోతోంది. ఆ దేశ మాజీ క్రికెటర్లు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ అంటేనే నిలువెళ్లా విషంకక్కే పాక్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా మోడీ సర్కార్‌ను విమర్శించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. భారత్-పాక్ మ్యాచ్ తర్వాత కరచాలనం చేయడానికి నిరాకరించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాహుల్ గాంధీకి చాలా సానుకూల మనస్తత్వం ఉంది. ఆయన చర్చల ద్వారా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనుకుంటున్నారు. మీకు ఒక ఇజ్రాయిల్ సరిపోదా..? మరొకటిగా తయారు కావడానికి ప్రయత్నిస్తున్నారా..? మోడీ ప్రభుత్వం హిందూ-ముస్లిం మతంకార్డును వాడుకుంటుంది’’ అని అన్నారు.
గాలి తీసేసిన టైర్ నుంచి.. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ వరకు.. ఏం జర్నీ బాస్
ప్రపంచంలో క్రికెట్ అనే మతం ఉంటే.. ఆ మతాన్ని భారత్‌లోనే ఎక్కువ మంది ఆచరించే వారు. ఎందుకంటే భారత్‌లో క్రికెట్ అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆదరించే ఆట. దీని కారణంగా ప్రస్తుతం భారత్‌లో అపోలో టైర్స్ అనే పేరు తెగ ట్రెండ్ అవుతోంది. ఎందుకు అనుకుంటున్నారు.. టీం ఇండియా నయా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ మారింది కాబట్టి. ఒకప్పుడు గాలి తీసేసిన టైర్ నుంచి.. నేడు టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ స్థాయికి ఎదిగిన ఈ కంపెనీ ప్రస్థానం మామూలుది కాదు. అపోలో టైర్స్ BCCIతో 3 ఏళ్ల ఒప్పందంపై రూ.579 కోట్లకు సంతకం చేసింది. దీంతో 2027 నాటికి భారత క్రికెట్ జట్టు అపోలో టైర్స్ జెర్సీతో ఆడటం అభిమానులు చూడనున్నారు. మీకు తెలుసా.. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ చేయనున్న కంపెనీ పరిస్థితి ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేదని. ఆ తండ్రి తన సొంత కొడుకుకు కంపెనీని రూ.1 సింబాలిక్ ధరకు అమ్మడానికి ముందుకొచ్చాడాని. ఆ పరిస్థితులకు తట్టుకొని నిలబడిన ఆ కంపెనీ నేడు BSEలో రూ.31 వేల కోట్లకు దగ్గరగా ఉంది. ఇది కదా సక్సెస్ అంటే. 1975 ఎమర్జెన్సీ కాలంలో కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. తీవ్ర సమస్యలను ఎదుర్కొన్న కంపెనీ అధినేత రౌనక్ సింగ్ తన సంస్థను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కంపెనీని తన కుమారుడు ఓంకార్ కన్వర్‌కు రూ.1 లాంఛనప్రాయ ధరకు విక్రయించడానికి ముందుకొచ్చాడు. పలు నివేదికల ప్రకారం.. ఓంకార్ కన్వర్ తన తండ్రి నుంచి అపోలో టైర్స్‌ను అత్యంత క్లిష్ట దశ నుంచి తీసుకొని అత్యున్నత బిలియన్ కంపెనీ స్థాయికి తీసుకురావడంలో విశేషంగా కృషి చేశారు.
ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది’ అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్‌ని అభినందించారు. టీజర్‌ను గమనిస్తే.. ‘ఇదేన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.
అమెరికాలో షూటింగ్..కాన్సులేట్‌కు ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఏమాత్రం మారలేదు. సన్నబడి ఫేస్‌లో కళ పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్ వచ్చినా.. అదే లుక్ మెయిన్‌టేన్ చేస్తున్నాడు తారక్. ఈలుక్‌తోనే ప్రశాంత్‌నీల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ షూటింగ్ దగ్గరపడడంతో మళ్లీ వర్కవుట్స్ స్టార్ట్ చేశాడు తారక్. వార్2 రిలీజ్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ మళ్లీ ఫిట్‌నెస్‌పై శ్రద్దపెట్టాడు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అతని పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశాడు. ప్రశాంత్‌నీల్ సినిమాను అమెరికా షూట్ చేయనున్నట్టు తెలిసింది. దీనికోసమే తారక్ అమెరికా కాన్సులేట్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటోలను యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలిమయ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాన్సులేట్‌లోకి ఎన్టీఆర్‌ను స్వాగతించడం ఆనందంగా వుందని రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు బాగా తగ్గాడు. అయితే సినిమా మొత్తం ఇదే గెటప్‌లో కనిపించడని, వెయిట్ పెరిగిన కొన్ని సీన్స్ తర్వాత తీస్తారని అంటున్నారు. ఎలివేషన్స్ కి పెట్టింది పేరైన దర్శకుడు ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తాడన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఫ్యామిలీతో మిరాయ్ చూసిన బాలయ్య!
తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కలెక్షన్స్ వర్షం కూడా కురుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల చేరువలోకి వచ్చేసింది. హిందీలో కూడా కలెక్షన్స్ జోరుగా సాగుతూ ఉండడంతో, మరిన్ని వసూళ్లు చేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని తాజాగా నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. హైదరాబాదు ప్రసాద్ లాబ్ లో నందమూరి బాలకృష్ణ కుటుంబం కోసం ఒక ప్రత్యేక ఏర్పాటు చేసింది సినిమా టీం. ఈ సందర్భంగా బాలకృష్ణ తో పాటు ఆయన భార్య, కుమార్తెలు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కి హాజరయ్యారు. తేజ హీరోగా నటించిన ఈ సినిమాలో రితిక నాయక్ కీలక పాత్రలో నటించింది. జగపతి బాబు, శ్రీయ జయరాం వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉన్నట్లుగానే సినిమా ఎండింగ్‌లో ప్రకటించాడు దర్శకుడు. మిరాయ్ పార్ట్ 2 టైటిల్ కూడా అప్పుడే అనౌన్స్ చేశారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.