Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. జలవివాదంపై కీలక నిర్ణయాలు..
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది.. జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి.. నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హాజరయ్యారు.. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ సాగింది.. గంటన్నరపాటు సాగిన ఈ భేటీ ముగిసిన తర్వాత ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.. ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు మంత్రి నిమ్మల.. తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే స్ఫూర్తితో ఈ రోజు చర్చలు జరిగాయి. మూడు అంశాలపై నిర్ణయాలు జరిగాయి.. రిజర్వాయర్ల ద్వారా బయటకు వెళ్లే నీటిని లెక్కలు వేసేందుకు టెలిమెట్రీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.. శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు ప్రజల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. శ్రీశైలం ప్రాజెక్ట్ కు మరమ్మత్తులు సత్వరమే చేపట్టాలని నిర్ణయించారు.. గోదావరి నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం హైదరాబాద్ లో, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు నిమ్మల రామానాయుడు..

జగన్‌ వర్క్ ఫ్రమ్ బెంగళూరు.. నెలకోసారి వచ్చి అల్లర్లు చేస్తారు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అధికారాన్ని ఐదేళ్లకు ఇస్తారు.. అది జగన్ మర్చిపోయారా? అని నాదెండ్ల ప్రశ్నించారు. ఇంతకాలం గుంతలు కూడా పూడ్చలేని నాయకుడు.. ఈ రోజు పాలన గురించిమాట్లాడుతున్నాడు అంటూ ఫైర్‌ అయ్యారు. మద్యపాన నిషేధం అంటారు.. కానీ, ఆ హామీ అమలు ఎందుకు కాలేదు అని నిలదీశారు. అయితే, ప్రజలు మాకు అధికారం అభివృద్ధి కోసం ఇచ్చారు.. బటన్‌లు ఎక్కువ నొక్కుతారని కాదు అంటూ ఎద్దేవా చేశారు.. ద్వీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ పంపిణీ వివరాలు వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. మొదటి విడతలో 97 లక్షల మందికి గ్యాస్ పంపిణీ చేశాం.. రూ.846 కోట్లు ఖర్చు చేశాం. .రెండో విడతలో 91.10 లక్షల మందికి పంపిణీ చేశాం.. రూ. 712 కోట్లు ఖర్చయ్యాయి అని వివరించారు. రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు మాట్లాడే జగన్.. రూ.1600 కోట్ల బకాయిలు ఎగ్గొట్టి ఎలా వెళ్లిపోయారు అంటూ ప్రశ్నించారు. జగన్ పాలనలో ధాన్యం రైతులకు నరకమే చూపించారు.. గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు అని తీవ్రంగా విమర్శించారు. పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు చేస్తూ.. నెలకోసారి వచ్చి అల్లర్లు చేస్తారు అని ఆరోపించారు.. పవిత్రమైన పంటను రోడ్డుపై వేసి.. ట్రాక్టర్లతో తొక్కించాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.. జగన్ పాలనపై ప్రజలే తీర్పు చెప్పారు.. అందుకే ఆయన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్.

లిక్కర్‌ స్కాం కేసులో సిట్‌ దూకుడు.. కీలక అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసుకు సంబంధించి ప్రైమరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఒకవైపున కసరత్తులు చేస్తున్న అధికారులు.. మరోవైపున సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను కూడా అరెస్టు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి 40 మందిని నిందితులుగా చేర్చిన సిట్ 11 మందిని అరెస్టు చేసింది.. ఇందులో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచర వర్గం రాజ్ కేశిరెడ్డి ఉన్నారు. వీరితో పాటు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను కూడా సిట్ నిందితులుగా చేర్చింది. కేసులో ఒకసారి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మరోసారి విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన తర్వాత వస్తానని గైర్హాజరయ్యారు. మరోవైపు, వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని ఏపీ హైకోర్టును మొదట ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.. సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో హైకోర్టుకు వచ్చిన ఆయనకు చుక్కెదురైంది. మిథున్‌ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన వెంటనే సిట్ అధికారులు అప్రమత్తమై విదేశాలకు మిథున్‌ రెడ్డి వెళ్లకుండా లుక్‌అవుట్ సర్క్యూలర్‌ నోటీసులు జారీ చేశారు.

గోదావరి జలాలు, పోలవరం-బనకచర్లపై జగన్‌ కీలక వ్యాఖ్యలు..
ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతోన్న జల వివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన చర్చించిన వేళ.. గోదావరి జలాలు, పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలవరం ప్రాజెక్టు మరియు గోదావరి జలాల సమస్యకు సంబంధించి స్పష్టంగా అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఉందన్న ఆయన.. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇందిరా సాగర్ ప్రాజెక్టు పురోగతిని అడ్డుకుంది.. గోదావరి నదికి చెందిన అనేక ప్రధాన ఉపనదులు ఛత్తీస్‌గఢ్‌ లోని ప్రాణహిత, ఇంద్రావతి మరియు శబరి వంటివి కేంద్ర సహకారంతో పొరుగు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల మిగులు నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు.. గోదావరికి అతిపెద్ద ఉపనది అయిన ప్రాణహిత నదిని ఎగువన ఉపయోగిస్తున్నారు.. ఇంద్రావతి-ప్రాణహితను ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌కు 50 వేల కోట్లు కేటాయించింది. ఇది పోలవరం వద్ద దిగువకు గూడవల్లి వద్ద గోదావరి మిగులు జలాల లభ్యతను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. ఇక, అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పోలవరం దారి మళ్లింపు కోసం ఏదైనా మిగులు జలాలు అందుబాటులో ఉంటాయా? అని ప్రశ్నించారు జగన్‌.. రెండోది పోలవరం ఆనకట్ట ఎత్తు విషయాల చంద్రబాబు రాజీ పడ్డారని విమర్శించారు.. మొదట ఆమోదించబడిన ఎత్తు 45.72 మీటర్లు అయితే, దానిని 41.15 మీటర్లకు పరిమితం చేయడానికి చంద్రబాబు అంగీకరించారు.. ఆనకట్ట ఎత్తును 45.72 మీటర్లకు పెంచకుండా.. ప్రాజెక్టులో తగినంత నీటిని నిల్వ చేయలేరన్నారు.. నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించడం కూడా సాధ్యం కాదన్నారు జగన్‌.

హిందీపై తేల్చేసిన జగన్‌.. భాష నేర్చుకోవడంలో తప్పు లేదు.. కానీ..
దక్షిణ భారతదేశంలో ఇప్పుడు అంతా హిందీ భాషపై చర్చ సాగుతోంది.. బలవంతంగా మాపై హిందీ రుద్దవద్దని ఎన్డీఏ యేతర పక్షాలు అంటుంటే.. ఎన్డీఏ నేతలు మాత్రం.. హిందీ నేర్చుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.. దీంతో, హిందీ భాషపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతూ వస్తోంది.. ఈ తరుణంలో దక్షిణ భారతదేశంలో హిందీ భాషపై జరుగుతున్న చర్చపై స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలకు పోటీతత్వాన్ని పెంపొందించటానికి హిందీని ఒక భాషగా బోధించవచ్చన్న ఆయన.. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా మాధ్యమం ఇంగ్లీష్ అయి ఉండాలని స్పష్టం చేశారు.. ఇంగ్లీష్ ఒక ప్రపంచ భాష.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దానిని అనర్గళంగా నేర్పిస్తే ఉద్యోగ అవకాశాల కల్పనను సులభతరం చేస్తుందన్నారు.. ఇక, పాఠశాలల్లో ప్రాంతీయ భాషలు తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు వైఎస్‌ జగన్‌.. హిందీ నేర్చుకోవడం అనేది ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంటే సరిపోతుందన్నారు.. భాషగా హిందీ నేర్చుకోవడం అవసరమే.. కానీ, విద్య మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలని పేర్కొన్నారు.. ఇంగ్లీష్ మీడియంలో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3, కింద మాతృభాషతో పాటు హిందీ నేర్చుకునే అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

జగన్‌ కామెంట్లకు జేసీ కౌంటర్‌.. తగ్గేదేలే..!
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదంటూ ప్రెస్ మీట్‌లో వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో టీడీపీ నాయకులు చేసిన అరాచకాలు మరువ లేకుండా ఉన్నారని, పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే సమస్యే లేదన్నారు. పెద్దారెడ్డి విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని, తనతో ప్యాక్షన్ చేస్తానని సవాలు విసిరిన వ్యక్తిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే ప్రజలే కొడతారని, మహిళలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి జైల్ కు పంపిన చరిత్ర పెద్దారెడ్డిది అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడిన పెద్దారెడ్డి తాము అధికారంలో ఉన్నంతవరకు తాడిపత్రిలో అడుగు పెట్టనీయమని పేర్కొన్నారు. ఏది ఏమైనా.. పెద్దారెడ్డి విషయంలో నేను తగ్గను అన్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి..

నిధులు రాహుల్ కు.. నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్ కామెంట్స్
ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నేటితే అసలు గుట్టు బయట పడింది. తెలంగాణ నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రోజు జరిగిన మీటింగ్ లో అసలు బనకచర్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఏపీ మొదటి ప్రతిపాదనే బనకచర్ల ప్రాజెక్ట్. కానీ రేవంత్ మీడియా ముందు అబద్ధం చెప్పాడు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమే రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు.

తెలంగాణలో తగ్గిన ఎంపీటీసీల సంఖ్య
తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల సామగ్రిని రెడీ చేసుకోవాలని చెప్పింది. ఇదే క్రమంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల సంఖ్యను నిర్ణయించింది. జడ్పీపీలు – 31, జడ్పీటీసీలు – 566, ఎంపీపీలు – 566, ఎంపీటీసీ స్థానాలు – 5773 గా తేల్చింది. వీటి ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సామగ్రిని రెడీ చేసుకోవాలని సూచించింది. ఎంపీటీసీల సంఖ్యను కుదించింది. ఇంతకు ముందు కంటే 44 స్థానాలను తగ్గిస్తూ 5773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని.

సీఐడి విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆరు రోజుల కస్టడీకి అనుమతి..!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు, సీఐడీ అధికారులు కస్టడీ కోరింది. దీనితో మల్కాజ్‌గిరి కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను జూలై 21 వరకు సీఐడీ కస్టడీలో ఉంచేందుకు అనుమతిచ్చిన కోర్టు, విచారణ దర్యాప్తు వేగవంతం కావాలని పేర్కొంది. ఇందులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. నిందితులను రేపు ఉదయం చర్లపల్లి జైలు నుంచి తీసుకొని సీఐడీ విచారణ ప్రారంభించనుంది. హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై విచారణ మరింత లోతుగా జరగనుంది. కోర్టు అనుమతితో సీఐడీ అధికారులు ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలు సేకరించనున్నారు. మొత్తంగా, హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు మరింత ఊపందుకోనుండగా.. నిందితులపై మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

నరమేధం.. సిరియాపై విరుచకపడ్డ ఇజ్రాయెల్.. రక్షణ శాఖ ఆఫీస్ పై బాంబుల వర్షం.. వీడియో వైరల్
ఇజ్రాయెల్‌–సిరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ, సిరియా రాజధాని దమాస్కస్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ గేటు వద్ద గల సైనిక ప్రధాన కార్యాలయం వద్ద దాడులు చేసింది. ఇంతకముందు, దక్షిణ సిరియా నగరమైన స్వైదాలో ప్రభుత్వ, ద్రూజ్ ఆర్మ్‌డ్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలపై మధ్యంతరంగా ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్, ద్రూజ్ మైనారిటీకి మద్దతుగా నిలుస్తూ.. సిరియాలో మిలిటరీ చర్యలపై ఇంకా కఠినంగా స్పందించవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సిరియా ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు మేం దాడులు కొనసాగిస్తాం. అవసరమైతే మరింత తీవ్రంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ కూడా మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. సిరియా సరిహద్దుల్లో మిలిటరీ లేని ప్రాంతాన్ని పరిరక్షించడం, అక్కడి ద్రూజ్ సముదాయాన్ని కాపాడటం ఇజ్రాయెల్ బాధ్యత అని స్పష్టం చేశారు.

లార్డ్స్‌లో టీమిండియా క్రికెటర్‌కు ఘోర అవమానం.. వీడియో వైరల్
ఇంగ్లాండ్‌, భారత్ మద్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఓ ఘటన చోటుచేసుకుంది. భారత క్రికెటర్ జితేష్ శర్మను లార్డ్స్ స్టేడియంలోకి అనుమతించకుండా సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. టెస్ట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన జితేష్ శర్మను లార్డ్స్ స్టేడియం గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. తనను తాను భారత క్రికెటర్‌గా పరిచయం చేసుకున్నా, అక్కడి సిబ్బంది ఆయనను గుర్తించకపోవడంతో లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో జితేష్ కొంతసేపు బయటే వేచి చూడాల్సి వచ్చింది. ఇకపోతే, ఆ మ్యాచ్ కు అదే మైదానంలో వ్యాఖ్యాతగా ఉన్న భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్టేడియం బయటకు వచ్చాడు. దానితో జితేష్ శర్మ కార్తీక్‌ ను గుర్తించి పలుమార్లు పిలవగా, మొదట్లో కార్తీక్ ఫోన్‌లో ఉండటంతో స్పందించలేదు. కానీ, జితేష్‌ పదేపదే పిలిచిన అనంతరం కార్తీక్ స్పందించి జితేష్‌ ను లోపలికి తీసుకెళ్లేలా సెక్యూరిటీతో మాట్లాడాడు. ఈ ఘటనను ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. లార్డ్స్ మైదానం వంటి ప్రఖ్యాత స్థలంలో భారత క్రికెటర్‌ను గుర్తించకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, దినేష్ కార్తీక్ తక్షణ స్పందనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన బూమ్రా..
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టుల్లో 7 వికెట్లు తీసుకుని భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు. ఇక, సెకండ్ ప్లేస్ లో ఉన్న కగిసో రబాడ బుమ్రాకు మధ్య కేవలం 50 రేటింగ్ పాయింట్ల తేడానే ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన పింక్ బాల్‌ టెస్టులో హ్యాట్రిక్ సహా 6 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 6వ స్థానంలో నిలిచి తన కెరీర్‌లో బెస్ట్ ర్యాంకు అందుకున్నాడు. అలాగే, ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్ (3వ), హేజిల్‌వుడ్ (4వ), నాథన్ లియాన్ (8వ), మిచెల్ స్టార్క్ (10వ) స్థానాల్లో కొనసాగుతుండగా.. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఐదుగురు ఆస్ట్రేలియా బౌలర్లే ఉన్నారు.

రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప మూవీ ప్రదర్శన..
మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప మూవీ థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు ఉన్నా.. ఆ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టలేదు. కానీ చాలా మంది ఈ మూవీని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల అధికారులు చూశారు. ఈ సందర్భంగా విష్ణు నటనను ప్రశంసించారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇది తమ మూవీకి గర్వకారణం అంటూ తెలిపింది. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భక్తి కథగా వచ్చిన కన్నప్ప ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శించారు.

అమెరికాలో సత్తా చాటుతున్న విజయ్.. “కింగ్డమ్” కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాను తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాకముందే, అదికూడా ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాకముందే.. ‘కింగ్డమ్’ సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లేందుకు సిద్దమవుతుంది. రిలీజ్‌కు రెండు వారాల ముందుగానే, అమెరికాలోని 64 లొకేషన్స్‌లో 135 షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

Exit mobile version