స్వచ్ఛ పల్లెలతోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యం.. డ్వాక్రా మహిళలకు బాధ్యత..
స్వచ్చాంధ్ర.. సర్క్యులర్ ఎకానమీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.. ప్రతి మండల హెడ్ క్వార్టర్‌లోనూ, అలాగే జిల్లాకు రెండు చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి.. చెత్తను గ్రేడింగ్ చేసి దానిని కావాల్సిన ఏజెన్సీలకు విక్రయించడమో, లేదా అక్కడ నుంచి చెత్తను తరలించడమో చేయాలన్నారు సీఎం చంద్రబాబు.. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకువచ్చి రోడ్డుపై వేయడానికి వీల్లేదని చెప్పారు. వ్యర్ధాల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని సూచించారు. 2026 అక్టోబర్ 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు. జీరో వేస్ట్ అనేది మన లక్ష్యంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు.. ప్రతి పంచాయతీలో అమలు చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చెయ్యాలని.. స్వచ్ఛాంధ్రప్రదేశ్, కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పంచాయతీరాజ్ శాఖ సమన్వయం చేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేసి చెత్తను కలెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు… వ్యవసాయ వ్యర్ధాలతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వ్యర్ధాలు సర్క్యులర్ ఎకానమీకి దోహదం చేసేలా అధ్యయనం జరగాలని సీఎం సూచించారు.. ‘సర్క్యులర్ ఎకానమీ పాలసీ’ రూపొందించాలని.. సర్క్యులర్ ఎకానమీలో ముందున్న రాజస్థాన్ మోడల్‌ను పరిశీలించాలన్నారు సీఎం చంద్రబాబు.. మరోవైపు, నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
రెడ్ బుక్ మరువను..! కేడర్‌ను ఇబ్బంది పెట్టినవారిని వదలను..
రెడ్ బుక్ మరువను… కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని వదలను అంటూ మరోసారి స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4వేల పెన్షన్ ఇవ్వడం లేదు. అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచాం, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. వాటిగురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని పిలుపునిచ్చారు.. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న లోకేష్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పనిచేయాలి. బాబు సూపర్ – 6, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పార్టీ తరపున పలు హామీలు ఇచ్చాం. ఒక్కొక్కటిగా వాటిని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 11 నెలల ప్రజాప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ 4వేలకు, వికలాంగ పెన్షన్ 6వేలకు పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలితీర్చే అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకంలో నిబంధనలు సడలించి లబ్ధిదారుల ఎకౌంట్ లో నేరుగా డబ్బులు చేయాలని నిర్ణయించాం. మత్స్రకారులకు ఆర్థికసాయం అందించాం, చేనేతలకు 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చాం. రోడ్లపై గుంతలన్నీ పూడ్చుకుంటూ వస్తున్నాం. జూన్ మాసంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ముందుకెళ్తున్నాం అని తెలిపారు.. ఇక, పార్టీ కేడర్ ఎర్ర బుక్ గురించి అడుగుతున్నారు. మన కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని వదలను.. నా అంతట నేనుగా ఎవరితో గొడవపెట్టుకోను, మన జోలికి వస్తే మాత్రం వదలను అంటూ హెచ్చరించారు నారా లోకేష్. గత ప్రభుత్వంలో మద్యంలో ఎంత కుంభకోణం జరిగిందో రాష్ట్రమంతా చూస్తున్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కొంచెం సమయం పట్టొచ్చు. కార్యకర్తలు అహంకారం లేకుండా ప్రజల్లోకి వెళ్లి వారి చుట్టూ తిరగాలన్నారు.. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కేడర్ కు చేరవేసేందుకు మహానాడు తర్వాత కొత్త యాప్ మై టీడీపీ పేరుతో కొత్త యాప్ విడుదల చేస్తాం. కెఎస్ఎస్, బూత్, క్లస్టర్, అందరికీ ఒకే యాప్ ద్వారా కార్యక్రమాలపై సందేశాలు పంపిస్తాం. ఈనెల 18,19,20 నియోజకవర్గ స్థాయిలో మినీ మహనాడు జరుగుతుంది. 27,28, 29 కడపలో మన పెద్దపండుగ మహనాడు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్..
నిబంధనలు అతిక్రమించిన ఏ ఒక్క పోలీసును వదలం..!
కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.. వారిని విడిచి పెడితే ప్రసక్తే లేదు.. నిబంధనలు అతిక్రమించిన పోలీసు అధికారులను ఎవర్ని వదలం.. కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లో సంవత్సరం కావస్తుంది.. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, విశ్వసనీయత, ప్రజల కొనుగోళ్లు అన్ని బాగున్నాయి.. రాష్ట్రం అభివృద్ధి చెందింది.. కూటమి ఏడాది పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం తిరోగమనం దిశగా అడుగులు వేస్తుందని విమర్శించారు.. వైఎస్ జగన్ ను ఏ విధంగా ఇబ్బంది పెడదాం అనే ధ్యాస తప్ప ప్రభుత్వానికి ఏమీ లేదు.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప ఏమీ లేదు.. ప్రజలు సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు అన్నారు అంబటి..
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. షాకిచ్చిన నూజివీడు కోర్టు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ కు అనుమతి ఇచ్చింది నూజివీడు కోర్టు.. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీ మోహన్‌ను ఈ కేసులో హాజరు పరచాలని ఆదేశాలు ఇచ్చింది నూజివీడు కోర్టు.. అయితే, ఇప్పటికే వల్లభనేని వంశీపై ఆరు కేసులు ఉండగా.. ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది.. కానీ, రేపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువడనుంది.. దీంతో, రేపు వంశీకి బెయిల్ వచ్చినా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.. మరోవైపు.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు.. రేపే వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందంటున్నారు..
యాదాద్రి, పోచంపల్లి సందర్శించిన అందాల భామలు
మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని, పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించారు. స్థానిక ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇకత్ చీరలను పరిచయం చేశారు. అంతేకాకుండా తయారీ విధానాన్ని కూడా పరిశీలించి.. అనంతరం స్వయంగా చీరలను నేసి సంతోషపడ్డారు. సాంస్కృతిక వారసత్వం. ఇక్కత్ చీరల నేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అలాంటి భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్‌ను ఈసారి అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొందింది. ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు ఈ గ్రామాన్ని సందర్శించి.. స్థానిక సంస్కృతి, కళలు, మ్యూజిక్‌తో మమేకమయ్యారు. సిందూరం, సంగీతం, చేతి నేతల మధ్య కళాత్మకమైన ఈ సందర్శనం అతిథుల హృదయాలను రంజింపజేసింది.
యువకుడి ప్రాణం తీసిన వాటర్ క్యాన్..! అదేలా..?
వాటర్ క్యాన్ ఓ యువకుడి ప్రాణం తీసింది..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాటర్ క్యాన్ మూలంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బావిలో ఈత కొట్టేందుకు యువకుడు వాటర్ క్యాన్ డబ్బాను కట్టుకొని ఈతకు వెళ్లగా.. ఆ క్యాన్ కు హోల్ పడి నీళ్లు లోనికి వెళ్లి ఆ యువకుడు నీట మునిగి మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లి నీట మునిగి యువకుడు మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడు మండలం ముప్పిడితోట గ్రామంలో ఈ విషాదం జరిగింది.. గోదావరిఖనికి జై భీమ్ నగర్‌కు చెందిన రాజీవ్ గాంధీ అనే యువకుడు గోదావరిఖనిలో కిరాణం షాప్ నిర్వహిస్తూ సింగరేణి ప్రైవేట్ సంస్థలో కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. తన సొంత గ్రామమైన ముప్పిరితోటలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉండడంతో బ్రహ్మోత్సవాలకు వెళ్లి చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాకు ఈత కొట్టేందుకు వ్యవసాయ బావిలోకి వెళ్లారు.. రాజీవ్ కు ఈత రాకపోవడంతో ప్లాస్టిక్ క్యాన్ ను తాళ్లతో కట్టుకొని బావిలోకి దూకాడు.. అయితే, ఆ ప్లాస్టిక్ క్యాన్‌కు హోల్ పడడం.. అందులోకి నీళ్లు వెళ్లడంతో.. రాజీవ్ గాంధీ ఆ వ్యవసాయ బావిలో నీట మునిగి మరణించాడు.. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో వారి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.. ఘటనస్థలానికి పోలీస్ బృందం చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.. రాజీవ్ మృతదేహాన్ని వెలికితీయడంతో క్యాన్ పూర్తిగా మునిగి తాళ్లతో ఉండడంతో దానిని చూసిన స్థానికులు సైతం కన్నీరు మున్నీరయ్యారు..
లక్షల్లో వసూలు చేసి, బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..
మన సమాజంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఓ మోజు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంటేనే ఊళ్లలో, బంధువుల్లో గౌరవం. చివరకు వివాహం సంబంధాల్లో కూడా ఐటీ ఎంప్లాయ్ అంటేనే ముద్దు. ఇలాంటి పరిస్థితుల్లో, యువత ఐటీ జాబ్ సంపాదించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కొడుకు హైదరాబాద్, బెంగళూర్ లేదా వీలైతే విదేశాల్లో ఐటీ జాబ్ చేయాలనే కలలు కంటున్నారు. ఈ ఆశల్ని కొందరు మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఉద్యోగాల పేరిట చాలా ఫేక్ ఐటీ కంపెనీలు ఉద్యోగం ఆశిస్తున్న వారి నుంచి లక్షల్లో దండుకుని బోర్డు తిప్పేస్తున్నాయి. తాజాగా, మరోసారి ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. తమ వద్ద ట్రైనింగ్ తీసుకున్న వారికి జాబ్స్ ఇప్పిస్తామని ప్యూరోపేల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ పలువురిని మోసం చేసింది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు ఉంటాయని చెబుతూ, చాలా మంది వద్ద నుంచి విడతల వారీగా రూ. 2 లక్షలకు పైగా వసూలు చేసింది. జాబ్స్ లేకపోవడంతో గచ్చిబౌలిలోని ఆఫీస్‌కి వెళ్లగా, అక్కడ బోర్డు లేకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో సుమారు 200 మంది మోసపోయారు. తమ వద్ద నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జేఎన్‌యూ తర్వాత, టర్కీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న 2 యూనివర్సిటీలు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌పై దాడికి పాకిస్తాన్‌కి టర్కీ సహాయం చేసింది. పెద్ద ఎత్తున డ్రోన్లను పంపించింది. దీంతో పాటు వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పంపించినట్లు సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యాప్తంగా టర్కీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే, పూణేకి చెందిన ఆపిల్ వ్యాపారులు టర్కీ ఆపిల్స్‌పై బ్యాన్ విధించారు. మరోవైపు, భారత్ నుంచి టర్కీకి పర్యాటకం కోసం వెళ్లే వారు తమ ట్రిప్ రద్దు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, టర్కీ యూనివర్సిటీలు, విద్యాసంస్థలతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్న భారతీయ యూనివర్సిటీలు ఇప్పుడు వాటిని రద్దు చేసుకుంటున్నాయి. జామియా మిలియా ఇస్లామియా టర్కీ విద్యా సంస్థలతో అన్ని అవగాహన ఒప్పందాలను (MoU) నిలిపివేసింది. ‘‘టర్కీతో అనుబంధంగా ఉన్న సంస్థలతో మేము అన్ని అవగాహన ఒప్పందాలను నిలిపేస్తున్నాము. జామిమా దేశం, భారత ప్రభుత్వంతో నిలుస్తుంది’’అని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
టర్కీకి షాక్ ఇచ్చిన భారత్..
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌ని సహకరించిన టర్కీకి భారత్, భారత ప్రజలు షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే, టర్కీ ఆపిల్స్‌కి అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్, ఇప్పుడు భారత వ్యాపారులు ఆ దేశ ఆపిల్స్‌ని బ్యాన్ చేశారు. మరోవైపు, టర్కీ టూర్లను ప్రజలు రద్దు చేసుకుంటున్నారు. దీనికి తోడు టర్కీ యూనివర్సిటీలతో భారత యూనివర్సిటీలు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా భారత విమానాశ్రయాల్లో ప్రయాణికుల, కార్గో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందించడంలో పాల్గొంటున్న టర్కీష్ కంపెనీ భద్రతా అనుమతుల్ని భారత్ గురువారం రద్దు చేసింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మే 15న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క భద్రతా అనుమతిని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) తక్షణమే రద్దు చేసింది. ఈ సంస్థ నవంబర్ 21, 2022న గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరి కింద అనుమతి పొందింది. ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా 9 ప్రధాన విమానాశ్రయాల్లో కీలకమైన హై-సెక్యూరిటీ కార్యకలాపాలను సెలెబి ఏవియేషన్ నిర్వహిస్తోంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలు, ఎయిర్ సైడ్ ఆపరేషన్ల వంటి కీలక విధులను కంపెనీ నిర్వహిస్తోంది.
టర్కీలో భారీ భూకంపం.. 5.2 తీవ్రత నమోదు..
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. గతంలో వచ్చిన భూకంపం తాలూకూ భయాలు మరవక ముందే, గురువారం రోజు 5.2 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది. టర్కీలోని కోన్యాలో ఈ భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం రాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ప్రస్తుతం పర్యటిస్తున్న దేశ రాజధాని అంకారాలో కూడా భూకంపం వచ్చింది. టర్కీ సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్సులోల భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఇస్తాంబుల్, అంకారా లతో పాటు ఇతర ప్రాంతాలను కుదిపేసింది. 16 మిలియన్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్ నగరంలోని పలు ప్రాంతాల్లో జనాలు భయాందోళనతో పరుగులు తీశారు. అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే..
లండన్ టూర్ కు వుమెన్స్ క్రికెట్ టీమ్ రెడీ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమ్ ను పవర్ ఫుల్ గా సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఈ సారి మరింత గట్టిగా కొట్టేందుకు టీమ్ ను సెలెక్ట్ చేశామని బీసీసీఐ పోస్ట్ చేసింది. లండన్ తో టీ20, వన్డే క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు ఈ టీమ్ వెళ్లబోతోంది. వన్డే మ్యాచ్ ల కోసం హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్, స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్(వికెట్ కీపర్) యస్తికా భాటియా(వికెట్ కీపర్), తేజల్ హసబ్ నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే ఉన్నారు. ఇక టీ20 జట్టు విషయానికి వస్తే.. హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్, స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్(వికెట్ కీపర్) యస్తికా భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే ఉన్నారు. సీనియర్ మహిళల జట్టు విభాగంలో వీరు లండన్ టూర్ కు వెళ్తున్నారు.
ఓటీటీలో రాబిన్ హుడ్ హవా.. 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్
యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అక్కడ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సంస్థలో మే 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ZEE5లో ఈ మూవీ దూసుకుపోతోంది. తాజాగా ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ సంపాదించింది ఈ మూవీ. ఈ మూవీ ఇంతటి ఘనత అందుకోవడంపై మూవీ టీమ్ తో పాటు ఓటీటీ స్పెషల్ అనౌన్స్ చేశారు. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉండటంతో ఈ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటూ ఓటీటీ సంస్థ జీ5 సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన స్పెషల్ ట్వీట్ వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాబిన్ హుడ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోందని సంస్థ తెలిపింది. ఈ మూవీ ఇదే స్పీడుతో కొనసాగుతోందని వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు జీవి ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ధనవంతులను దోచుకుని పేదలకు పంచిపెట్టడం అనే కాన్సెప్టుతో మొదలై.. ఆ తర్వాత డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం జీ5లో ఇంకా స్ట్రీమింగ్ అవుతోంది.
ధర్మరక్షణ కోసం… వచ్చినవాడు గౌతమ్
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సైటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’ రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్. ఇప్పటికే విడుదలైన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో పాల్గొని పాక్-ఆక్రమిత కాశ్మీరులో శత్రువులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి నిర్మాత చెక్ అందించారు. “ధర్మం దారి తప్పినప్పుడు… ఏ అవతారం రానప్పుడు… వచ్చినవాడు గౌతమ్”అంటూ హీరో మనోజ్ మంచు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఓ యాక్ష్ మూడ్‌ను సెట్ చేస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచే టీజర్ కట్టిపడేస్తుంది.
